Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ద ట్రాన్స్ జెండర్ పర్సన్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) బిల్లు, 2016 కు మంత్రిమండలి ఆమోదం


ద ట్రాన్స్ జెండర్ పర్సన్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) బిల్లు, 2016 కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు.

ఈ బిల్లు ద్వారా అటువంటి వ్యక్తుల సాంఘిక, ఆర్థిక, విద్యా సాధికారితకు ఒక యంత్రాంగాన్ని ప్రభుత్వం కల్పించింది. పెద్ద సంఖ్యలో ఉన్న ట్రాన్స్ జెండర్ పర్సన్ లకు ఈ బిల్లు మేలు చేకూర్చగలదు. వారిపై పడ్డ అపవాదును ఉపశమింపచేయగలదు; వారి పట్ల వివక్షను తగ్గించగలదు; సమాజంలోని ఈ వర్గం వారి హక్కులను దుర్వినియోగం చేయకుండా చూస్తూ, వారిని సమాజంలోని ప్రధాన స్రవంతిలోకి తీసుకురాగలదు. అంతే కాక, ఈ బిల్లు వారికి తోటి సమాజంలో ఆదరణ లభించేటట్లుగా చేస్తూ, సంఘంలో వారు నిర్మాణాత్మక సభ్యులుగా మసలేటట్లు చూడగలదు.

దేశంలో ట్రాన్స్ జెండర్ వర్గం అట్టడుగు స్థాయికి నెట్టివేయబడిన వర్గంగా ఉన్నారు. వారు పురుషులు, లేదా మహిళలు అనే మూసపోసిన కేటగిరీలలో ఇమడకపోవడమే ఈ చిన్నచూపునకు కారణం. పర్యవసానంగా వారు సాంఘిక బహిష్కారం దగ్గర నుండి వివక్షకు గురి కావడం నుండి విద్యకు నోచుకోకపోవడం నుండి ఉపాధి హీనత, వైద్య సదుపాయాల లేమి, ఇంకా ఇతరత్రా అసౌకర్యాల వరకు అనేక విధాలుగా కష్టనష్టాల పాలు కావలసి వస్తున్నది.

ప్రస్తుత బిల్లు సంబంధిత వర్గాల వారందరూ బిల్లులో ప్రస్తావించిన సూత్రాలను నిలబెట్టేటందుకు ప్రతిస్పందించేటట్లుగాను, జవాబుదారులుగా నడచుకొనేటట్లుగాను చేయగలదు. మరీ ముఖ్యంగా, ట్రాన్స్ జెండర్ పర్సన్స్ కు సంబంధించిన సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వమూ, రాష్ట్రాల ప్రభుత్వాలూ/కేంద్ర పాలిత ప్రాంతాల పాలన యంత్రంగాలూ వాటి వంతుగా ఇతోధిక బాధ్యతను స్వీకరించేటట్లు చేయగలదు.