మాననీయ మహోదయులు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు శ్రీ జాకబ్ జుమా,
మిత్రులారా,
మాననీయ అధ్యక్షా, ధన్యవాదాలు. మీ సాదర స్వాగతానికి, ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. మహోజ్జ్వల చరిత గల ఈ దేశంలో ఇది నా తొలి పర్యటన అయినప్పటికీ, ఇంత అందమైన ప్రదేశం మా సొంత ప్రదేశం లాగానే నేను, నా ప్రతినిధివర్గం వారు భావిస్తున్నాం. ఇందుకు మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ భూమిపై నడయాడిన మహోన్నత మానవతా మూర్తులు మహాత్మ గాంధీ గారు, నెల్సన్ మండేలా గారు.. ఈ ఇద్దరికీ ఘన నివాళి అర్పించేందుకు లభించిన చక్కని అవకాశంగా ఈ పర్యటనను వ్యక్తిగతంగా నేను పరిగణిస్తున్నాను.
శతాబ్దాలుగా దక్షిణాఫ్రికాకు, భారతదేశానికి మధ్య సన్నిహిత ప్రజాసంబంధాలు నెలకొన్నాయి. జాత్యహంకారం, వలసవాదం పట్ల మనం ఉమ్మడిగా పోరాడాం. ఈ భూమి మీది నుండే మహాత్మ గాంధీ జీ సత్యాగ్రహాన్ని మొదలుపెట్టారు. భారతీయులకు మహాత్ముడు ఎంతటి ఆరాధనీయ మూర్తో దక్షిణాఫ్రికాకు కూడా ఆయన అంతగా ఆరాధనీయుడు.
మనం ఆచరించే ఉమ్మడి విలువలు, మనం చేసిన ఉమ్మడి పోరాటాలు మన వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన పునాదులు వేశాయి. భిన్న విభాగాల్లో మనం సాధించిన విజయాలు అందుకు సజీవ తార్కాణాలు. ఈ రోజు జరిగిన సమావేశంలో అధ్యక్షుల వారు, నేను భిన్న రంగాల్లో మన సహకారాన్ని సమూలంగా సమీక్షించాం. గత రెండు దశాబ్దాల కాలంలో ఈ బంధం మరింత బలపడిందని, ఎన్నో విజయాలు నమోదయ్యాయని ఉభయులం అంగీకారానికి వచ్చాం. గత పది సంవత్సరాల కాలంలో ఉభయ దిశల నుంచి వ్యాపారం 300 శాతం పెరిగింది. భారతీయ వ్యాపార సంస్థలకు దక్షిణాఫ్రికాలో బలీయమైన వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయి. ఆఫ్రికాలో మా పెట్టుబడుల్లో నాలుగో వంతు దక్షిణాఫ్రికాలోనే ఉన్నాయి.
ఈ వ్యాపార, పెట్టుబడి బంధాన్ని మరింతగా విస్తరించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ రంగాలు ఏవేవంటే..:
– ఖనిజాలు,ఖనిజ తవ్వకాలు;
– రసాయనాలు, ఫార్మాస్యూటికల్స్;
– అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తయారీ;
– సమాచార, కమ్యూనికేషన్ సాంకేతిక పరిజ్ఞానాలు.
పరిశ్రమల మధ్య బంధం ఉభయ సమాజాలను ఆర్థికంగా సుసంపన్నం చేయడమే కాదు, మన భాగస్వామ్యానికి కొత్త దిశను నిర్దేశిస్తుంది కూడా. ఈ సహకారం కొత్త శిఖరాలను అధిరోహిస్తుంది. ఉభయ దేశాలు ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా మరింత శక్తివంతమైన పాత్రను పోషించేందుకు మార్గం ఏర్పడుతుంది. ఈ రోజు సాయంత్రం అధ్యక్షులవారు, నేను ఉభయ దేశాల వ్యాపారవర్గాలతో సమావేశమై సహకారానికి అనువైన రంగాలను గుర్తించబోతున్నాం.
మానవ వనరుల అభివృద్ధిపై కూడా మనం దృష్టి సారించాలని మన వర్థమాన ఆర్థిక వ్యవస్థల స్వభావం మనకు సూచిస్తోంది. వృత్తి విద్య, సాంకేతిక విద్య, వృత్తిపరమైన నైపుణ్యాలకు ఆస్కారం గల విద్యా రంగాల్లో మనకు గల సామర్థ్యాలు, మన అవసరాలు పరస్పర సహకారానికి గల అవకాశాలను చాటి చెబతున్నాయి. ఈ తరహా సహకారం ఉభయదేశాల ప్రజలకు లాభదాయకం అవుతుంది.దక్షిణాఫ్రికాలో చిన్న, మధ్యతరహా వ్యాపారాల అభివృద్ధికి సహకరించడానికి, మా నైపుణ్యాలు, సామర్థ్యాలు అందుబాటులో ఉంచేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఆర్థిక బంధం ఒక్కటే కాదు.. వ్యాపార, వాణిజ్యాలు, పెట్టుబడులు, రక్షణ, భద్రత రంగాల్లో కూడా మనం భాగస్వాములమవుదాం. పరిశ్రమ స్థాయిలోనే కాకుండా వ్యూహాత్మకంగా కూడా ఈ భాగస్వామ్యాన్ని విస్తరించుకుందాం. భారతదేశంలో పరివర్తన పూర్తి స్థాయిలో జరుగుతున్నరంగాల్లో ఇది కూడా ఒకటి. రక్షణ సంబంధ వాణిజ్యంలో అపార అవకాశాలను ఇది అందుబాటులోకి తెస్తోంది. రక్షణ పరికరాలు, వ్యవస్థల తయారీలో కూడా మన సామర్థ్యాలను క్రోడీకరించుకునేందుకు ఉభయ దేశాల కంపెనీలు కృషి చేయవచ్చు. ఇది వ్యక్తిగత రక్షణ అవసరాల రీత్యానే కాదు..ప్రాంతీయ, అంతర్జాతీయ డిమాండు పరంగా కూడా కీలకమే.
పలు అంతర్జాతీయసమస్యల విషయంలో, వర్థమాన ప్రపంరం ఎదుర్కొంటున్న సవాళ్ళ పరిష్కారం విషయంలో మరింత సన్నిహితంగా కలసి పని చేయాలని అధ్యక్షుడు శ్రీ జుమా, నేను అనుకున్నాం. పరమాణు సరఫరాదారు దేశాల బృందం ( ఎన్ ఎస్ జి) లో సభ్యత్వం కోసం భారతదేశానికి మద్దతు పలికినందుకు శ్రీ జుమాకు ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను. దక్షిణాఫ్రికా వంటి సన్నిహిత మిత్రుల సహకారంపై ఎంతగా ఆధారపడవచ్చో మాకు తెలుసు. వాతావరణ మార్పులు, ప్రపంచంపై దాని ప్రభావం కూడా ఉభయులు ఆందోళన ప్రకటిస్తున్న ఉమ్మడి అంశం. పునరుత్పాదక ఇంధన వనరుల మీద దృష్టి ని కేంద్రీకరించడం ద్వారా మాత్రమే ఈ సవాలును దీటుగా ఎదుర్కొనగలమన్న విషయం మేం అంగీకరిస్తున్నాం.
ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే పారిస్ లో జరిగిన సిఒపి- 21 సదస్సులో ఇంటర్ నేషనల్ సోలార్ అలయన్స్ ఏర్పాటుకు భారతదేశం కృషి చేసింది. సౌర ఇంధన ప్రాజెక్టులకు అవసరమైన పరిజ్ఞానం సాధించేందుకు, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి, ఆర్థిక సహకారానికి చక్కని వేదికగా అది నిలుస్తుందని నేను విశ్వసిస్తున్నాను. 120 దేశాలకు భాగస్వామ్యం గల ఆ అలయన్స్ లో దక్షిణాఫ్రికాను భాగస్వామిని చేసినందుకు అధ్యక్షుడు శ్రీ జుమాకు నా ధన్యవాదాలు. ఉభయలం ఆందోళనను పంచుకొంటున్న మరో ప్రధానాంశం ఏదీ అంటే అది ఉగ్రవాదం. ఉభయ దేశాల ప్రజలకు ఉగ్రవాదం భద్రతాపరంగా, రక్షణపరంగా పెద్ద ముప్పుగా పరిణమిస్తోంది. మన సమాజం మూలాలపై అది దాడి చేస్తోంది. ప్రాంతీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఉగ్రవాదాన్ని తుదముట్టించే విషయంలో రెండు దేశాలు సదా అప్రమత్తంగా ఉండాలని, క్రియాశీలంగా సహకరించుకోవాలని అధ్యక్షుడు శ్రీ జుమా, నేను అంగీకరించాం.
మిత్రులారా,
హిందూ మహాసముద్ర జలాలు మన ఉమ్మడి సముద్ర సరిహద్దులు. హిందూ మహాసముద్రం ద్వారా అనుసంధానం కలిగిన పొరుగు దేశాల సహకారంలో ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ కీలక వ్యవస్థగా అవతరించింది. 2017-19 సంవత్సరాల మధ్య కాలానికి ఈ సంఘానికి నాయకత్వం చేపట్టాలని దక్షిణాఫ్రికాను నేను ఆహ్వానిస్తున్నాను. ఐ బి ఎస్ ఎ (ఇండియా, బ్రెజిల్ మరియు సౌత్ ఆఫ్రికా), బ్రిక్స్ దేశాల వేదికల మీదుగా అంతర్జాతీయ ప్రాధాన్యతలను నిర్ణయించేందుకు భారతదేశం, దక్షిణాఫ్రికా లు కలసి కృషి చేయాల్సివుంది. ఈ ఏడాది అక్టోబర్ లో గోవాలో జరిగే బ్రిక్స్ దేశాల సదస్సుకు అధ్యక్షుడు శ్రీ జుమా ను ఆహ్వానించేందుకు నేను ఎదురుచూస్తున్నాను.
మిత్రులారా,
చివరగా నేను చెప్పేదేమిటంటే..
– గాంధీజీ సత్యాగ్రహం నుండి మదీబా క్షమాగుణం వరకు;
– గుజరాత్ లోని నౌకాశ్రయాల నుండి డర్ బన్ లోని సముద్ర తీరాల వరకు;
– పరస్పరం పంచుకుంటున్న మన విలువలు, ఉమ్మడి పోరాటాల ఐకమత్యంతో;
– మన సాగరాలు, ఆర్థిక వ్యవస్థలు అందిస్తున్న అపార అవకాశాలలో;
– వసుధైవ కుటుంబకం, ఉబుంటూ సూత్రాల స్ఫూర్తితో..
మన బంధానికి దృఢమైన కట్టుబాటు, సమన్యాయం, అసాధారణమైన మానవ ప్రయత్నాలు మూలాలుగా నిలచాయి. ఇది ఏ ఇతర బంధం కన్నా భిన్నమైనది, నిజంగానే అసాధారణమైనదీనూ.
మీకందరికీ నా ధన్యవాదాలు,
పలు మార్లు కృతజ్ఞతలు.
This visit is an opportunity to pay homage to two greatest human souls- Mahatma Gandhi & Nelson Mandela: PM @narendramodi @NelsonMandela
— PMO India (@PMOIndia) July 8, 2016
Stood together in our common fight against colonialism and racial subjugation: PM @narendramodi on India-SA ties @PresidencyZA @SAPresident
— PMO India (@PMOIndia) July 8, 2016
In last the two decades our ties are a story of strong advances and concrete achievements: PM @narendramodi at the joint press meet
— PMO India (@PMOIndia) July 8, 2016
The Prime Minister is talking about increasing economic and trade ties between India and South Africa. Watch. https://t.co/J4IwYA96cJ
— PMO India (@PMOIndia) July 8, 2016
Thank President Zuma for South Africa's support to India's membership in the Nuclear Suppliers Group: PM @narendramodi @PresidencyZA
— PMO India (@PMOIndia) July 8, 2016