ఒత్తిడితో కూడిన 10 భారజల రియాక్టర్ యూనిట్ ల ( ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ పిహెచ్ డబ్ల్యు ఆర్)ను దేశీయంగా నిర్మాణం చేసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
దేశీయ పరమాణు ఇంధన కార్యక్రమం శీఘ్రంగా ప్రగతి సాధించడానికి వీలుగా కేంద్రం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. తద్వారా దేశ పరమాణు పరిశ్రమకు మరింత ప్రోత్సాహం లభించినట్టయింది. ఒత్తిడితో కూడిన 10 భారజల రియాక్టర్లను ( ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్.. పిహెచ్ డబ్ల్యు ఆర్) దేశీయంగా నిర్మాణం చేసుకునేందుకు వీలుగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అద్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రారంభించబోయే ప్లాంటుల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు 7000 మెగావాట్లు. 10 పిహెచ్ డబ్ల్యు ఆర్ ప్రాజెక్టు వల్ల దేశంలోని పరమాణు ఇంధన ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది.
ప్రస్తుతం పని చేస్తున్న 22 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలద్వారా భారతదేశం 6780 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని కలిగివుంది. నిర్మాణంలో ఉన్న పరమాణు విద్యుత్ కేంద్రాలు 2021-22 నాటికి మరో 6700 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తాయి.
మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టి ప్రజలే కేంద్రంగా సాగుతున్న పాలనకు మూడు సంవత్సరాలు పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా దేశ పరమాణు శక్తి రంగంలోనే మొదటిసారిగా ఒకేసారి పది కొత్త యూనిట్లను ప్లీట్ మోడ్ కింద ప్రారంభించబోవడం జరుగుతోంది. ఇది పూర్తిగా దేశీయంగా రూపొందిన కార్యక్రమం. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పరమాణు విద్యుత్తు ఉత్పాదన రంగంలో ఈ ముందడుగు వేయడం జరిగింది.
పది యూనిట్ల తయారీ కోసం ఇచ్చే ఆర్డర్ల విలువ దాదాపు రూ.70 వేల కోట్లు. ఈ ప్రాజెక్టు భారతీయ పరమాణు విద్యుత్తు రంగంలో భారీ మార్పును తీసుకురానుంది. అత్యుత్తమ సాంకేతికతల సాయంతో దేశీయంగా గల పారిశ్రామిక సామర్థ్యాలను ఉపయోగంచుకొని బలమైన పరమాణు విద్యుత్తు రంగాన్ని నిర్మించుకోవాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుంది.
ఈ ప్రాజెక్టును ప్లీట్ మోడ్‌లో నిర్మించడం జరుగుతోంది కాబట్టి ఆర్ధికంగా చెప్పుకోదగ్గ స్థాయిలో మేలు జరుగుతుంది. వ్యయాన్ని, సమయాన్ని సమర్థవంతంగా వాడుకోవడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 33, 400 ఉద్యోగాల కల్పన జరుగుతుంది. దేశీయ పారిశ్రామిక పరిశ్రమకు తయారీ ఆర్డర్లు అందుతాయి. ప్రపంచంలోనే ప్రధానమైన పరమాణు ఇంధన తయారీ దేశంగా భారతదేశానికిగల గుర్తింపు మరింత పటిష్టమవుతుంది.
అత్యుత్తమ నాణ్యత, భద్రతా ప్రమాణాల ప్రకారం 7000 మెగావాట్ల పిహెచ్ డబ్ల్యు ఆర్ ప్లీట్ తయారు కాబోతున్నది. అత్యాధునిక డిజైన్ ల ప్రకారం నిర్మితమవుతుంది.
భారతదేశ శాస్త్రవేత్తలు దేశానికి అవసరమయ్యే సాంకేతిక సామర్థ్యాలను నిర్మించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారనడానికి మంత్రివర్గ నిర్ణయం నిదర్శనంగా నిలుస్తోంది. భారతదేశ పరమాణు శాస్త్రవేత్తలు, పరిశ్రమలు ఈ రంగంలో సాధించిన శీఘ్ర ప్రగతికి ఈ ప్రాజెక్టు డిజైన్, అభివృద్ధియే తార్కాణంగా నిలుస్తుంది. దేశీయ పిహెచ్ డబ్ల్యుఆర్ సాంకేతికతకు సంబంధించిన అన్ని అంశాలలో మన పరమాణు శాస్త్రవేత్తలు పట్టు సాధించారనడానికి ఈ ప్రాజెక్టు ఉదాహరణగా నిలుస్తుంది. గత నాలుగు దశాబ్దాలుగా పిహెచ్‌డబ్ల్యుఆర్ రియాక్టర్ల నిర్మాణం, నిర్వహణలలో భారతదేశం సాధించిన ప్రగతి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది.
భారతదేశ ఇంధన అవసరాల దృష్ట్యా చూసినప్పుడు స్వచ్ఛమైన ఇంధనాలను ఉపయోగించడానికి వీలుగా ప్రభుత్వం కనబరుస్తున్న నిబద్దతకు తాజాగా తీసుకున్న మంత్రివర్గ నిర్ణయమే నిదర్శనం. తక్కువ కర్బనాన్ని ఉపయోగించడం ద్వారా వృద్ధి సాధించాలనే వ్యూహానికి, దేశ పారిశ్రామికీకరణలో దీర్ఘకాలం ఉపయోగపడేలా ఇంధన అవసరాలను తీర్చాలనే లక్ష్యానికి మంత్రివర్గ నిర్ణయం దోహదం చేస్తుంది.
సుస్థిర అభివృద్ధి సాధించాలనే భారతదేశ నిబద్ధతకు, ఇంధన రంగంలో స్వావలంబన సాధించడానికి, వాతావరణ మార్పులపైన అంతర్జాతీయ పోరాటానికి కేంద్ర మంత్రివర్గ నిర్ణయం ఉపయోగపడుతుంది.
A vital decision of the Cabinet that pertains to transformation of the domestic nuclear industry. https://t.co/YupSIpL0Rv
— Narendra Modi (@narendramodi) May 17, 2017