దేశంలో సహాయక న్యాయమూర్తుల వర్గం కోసం రెండో నేషనల్ జ్యుడీషియల్ పే కమిషన్ (ఎస్ఎన్జెపిసి) నియామకాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
భారత సర్వోన్నత న్యాయస్థానం పూర్వ న్యాయమూర్తి శ్రీ జస్టిస్ (రిటైర్డ్) పి. వెంకట్రామ రెడ్డి ఈ కమిషన్కు అధ్యక్షత వహిస్తున్నారు. కేరళ ఉన్నత న్యాయస్థానం పూర్వ న్యాయమూర్తి శ్రీ ఆర్. బసంత్ కమిషన్ సభ్యునిగా ఉన్నారు.
ఈ కమిషన్ 18 నెలల కాలం లోపల తన సిఫారసులను రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదించనుంది.
ఇది రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో జ్యుడీషియల్ ఆఫీసర్ల ప్రస్తుత పారితోషికం స్వరూపాన్ని మరియు సర్వీసు కండీషన్లను పరిశీలిస్తుంది. దేశం లోని సబార్డినేట్ జ్యుడీషియరీ కి చెందిన జ్యుడీషియల్ ఆఫీసర్ల వేతన స్వరూపం మరియు ఇతర ప్రతిఫలాలను నిర్దేశించే సూత్రాలను రూపొందించడం ఈ కమిషన్ ధ్యేయం. అంతేకాకుండా, జ్యుడీషియల్ ఆఫీసర్లకు వేతనానికి అదనంగా లభిస్తున్న వేరు వేరు భత్యాలు మరియు ప్రయోజనాలతో పాటు, పని పద్ధతులు, పని పరిస్థితులను కూడా ఇది పరిశీలిస్తుంది. అలాగే, ఈ విషయాలలో సరళీకరణ మరియు హేతుబద్దీకరణ లను కూడా సూచిస్తుంది.
ఈ పనిని పూర్తి చేయడానికి అవసరమైన విధి విధానాలను, ప్రక్రియలను కమిషన్ తనంత తానే రూపొందించుకొంటుంది. జ్యుడీషియల్ ఆఫీసర్ల పేన స్కేళ్ళు మరియు సర్వీస్ కండిషన్ లు దేశమంతటా ఒకే విధంగా ఉండేటట్లు కూడా కమిషన్ చూస్తుంది.
కమిషన్ చేసే సిఫార్సులు న్యాయ వ్యవస్థ పరిపాలనలో సామర్థ్యాన్ని పెంపొందించడంలోను, న్యాయ వ్యవస్థ పరిమాణాన్ని అభిలషణీయ స్థాయిలో ఉంచడంలోను తోడ్పడగలవు. ఇదివరకటి సిఫారసుల అమలులో తలెత్తిన వ్యత్యాసాలను తొలగించడానికి ఈ సిఫారసులు దోహదం చేస్తాయి.
***