Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దేశంలో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితులు.. టీకాకరణపై ప్రధాని సమీక్ష

దేశంలో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితులు.. టీకాకరణపై ప్రధాని సమీక్ష


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ తన అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి దేశంలో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితులు, టీకాకరణపై సమీక్షించారు. దేశంలో కోవిడ్-19 పరిస్థితుల నిర్వహణ, సామాజిక అవగాహన, భాగస్వామ్య కార్యక్రమాలను సుస్థిర రీతిలో కొనసాగించాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. అదేవిధంగా కోవిడ్-19 మహమ్మారి నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం, ప్రజా ఉద్యమం అత్యంత అవశ్యమని ఆయన స్పష్టం చేశారు. ‘‘పరీక్ష, అన్వేషణ, చికిత్స, కోవిడ్ అనుగుణ ప్రవర్తన, టీకాకరణ’’లతో కూడిన ఐదు అంచెల వ్యూహాన్ని చిత్తశుద్ధితో, పకడ్బందీగా అమలు చేయడంద్వారా మహమ్మారి వ్యాప్తిన సమర్థంగా అరికట్టవచ్చునని ఆయన సూచించారు.

   కోవిడ్ అనుగుణ ప్రవర్తనకు సంబంధించి 2021 ఏప్రిల్ 14 నుంచి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. మాస్కు ధారణ, వ్యక్తిగత పరిశుభ్రత, బహిరంగ/పని ప్రదేశాలు/ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో పారిశుధ్యం తదితరాలకు 100 శాతం ప్రాధాన్యంతో ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో కోవిడ్ అనుగుణ ప్రవర్తన అమలు అవసరాన్ని తగినన్ని పడకలు, పరీక్ష సదుపాయాల లభ్యతసహా సకాలంలో ఆస్పత్రులకు తరలించడం తదితరాలపై అత్యంత శ్రద్ధ వహించాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల పెంపు, ప్రాణావాయువు లభ్యత, వెంటిలేటర్లు, ఇతర సౌకర్యాల కల్పన వగైరా మార్గానుసరణ ద్వారా మరణాలను వీలైనంత తగ్గించాలని ప్రధాని కోరారు. అంతేగాక అన్ని ఆస్పత్రులతోపాటు గృహాల్లో రోగుల సంరక్షణలోనూ వైద్యపరమైన నిర్వహణ విధివిధానాలను తూచా తప్పకుండా పాటించాలని కోరారు.

   మహారాష్ట్రలో అత్యధిక కేసుల నమోదుతోపాటు మరణాలు సంభవిస్తున్నందున ఆ రాష్ట్రానికి ప్రజారోగ్య, వైద్యచికిత్స నిపుణులతో కూడిన కేంద్ర బృందాలను పంపాల్సిందిగా ప్రధానమంత్రి ఆదేశించారు. అదేతరహాలో పంజాబ్, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ల‌లోనూ కేసులతో పోలిస్తే మరణాలు అధికంగా ఉన్న దృష్ట్యా ఆ రాష్ట్రాల విషయంలో ఇదేరకంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నియంత్రణ చర్యలు సమర్థంగా అమలయ్యేవిధంగా చూడాలని ప్రధానమంత్రి ప్రత్యేకంగా ఆదేశించారు. ఇందులో భాగంగా నియంత్రణ మండళ్లలో చురుకైన కేసుల అన్వేషణ, నిర్వహణలో సామాజిక స్వచ్ఛంద కార్యకర్తల భాగస్వామ్యం ఉండేవిధంగా చూడాలని కోరారు. అత్యధికంగా కేసుల నమోదువుతున్న ప్రాంతాలపై దృష్టిసారించి, వ్యాధి వ్యాప్తిని అరికట్టే దిశగా సమగ్ర ఆంక్షలుసహా అవసరమైన మేరకు కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అన్ని రాష్ట్రాలకూ ఆయన సూచించారు.

   దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల ఆందోళనకర స్థాయికి చేరినట్లుగా అధికారులు సవివరంగా నివేదించారు. ఇప్పటిదాకా నిర్ధారిత కేసులు, మరణాల్లో 91 శాతం కేవలం 10 రాష్ట్రాల్లోనే నమోదైనట్లు వివరించారు. ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ల‌లో పరిస్థితి మరింత విషమంగా ఉన్నదని సమావేశం గుర్తించింది. దేశంలో గడచిన 14 రోజులుగా నమోదైన మొత్తం కేసులలో 57 శాతం, మరణాల్లో 47 శాతం ఒక్క మహారాష్ట్రలోనే సంభవించాయని స్పష్టమైంది. మహారాష్ట్రలో రోజువారీ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య 47,913 స్థాయికి చేరిందని, తొలిదశలో కేసులతో పోలిస్తే ఇది రెట్టింపునకుపైగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా గత 14 రోజులలో నమోదైన కేసులలో పంజాబ్‌ వాటా 4.5 శాతమే అయినా, మొత్తం మరణాల్లో 16.3 శాతం ఈ రాష్ట్రంలోనివే కావడం తీవ్ర ఆందోళనకరమని పేర్కొన్నారు. అలాగే కేసుల సంఖ్య రీత్యా గత 14 రోజుల జాతీయస్థాయి కేసులలో ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో నమోదైనవి 4.3 శాతమే అయినప్పటికీ ఇదే వ్యవధిలో మరణాలు 7 శాతానికిపైగా నమోదవడం గమనార్హం. మొత్తంమీద గడచిన 14 రోజులలో దేశవ్యాప్తంగా నమోదైన కేసులలో 91.4 శాతం, మరణాల్లో 90.9 శాతం కేవలం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవే.

   కేసుల సంఖ్య ఇంత విస్తృతంగా పెరగడానికి కోవిడ్ అనుగుణ ప్రవర్తన అనుసరణలో తీవ్ర నిర్లక్ష్యమే కారణమని సమావేశం స్పష్టంగా అభిప్రాయపడింది. ఆ మేరకు మాస్కు ధారణ, 2 గజాల భౌతిక దూరం పాటింపు నియమాలను పట్టించుకోకపోవడం, మహమ్మారి విషయంలో ఉదాసీనత, క్షేత్రస్థాయిలో నియంత్రణ చర్యలు సమర్థంగా అమలు చేయకపోవడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలని పేర్కొంది. రూపుమార్చుకున్న వైరస్ కారణంగా కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరిగినట్లు అంచనాలు ఉన్నప్పటికీ మహమ్మారి నియంత్రణ చర్యల్లో ఎలాంటి వ్యత్యాసం లేదు. కాబట్టి కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో కోవిడ్-19 నిర్వహణ, వ్యాప్తి నియంత్రణకు సంబంధించిన అనేక విధివిధానాలను కచ్చితంగా అమలు చేయడం తప్పనిసరి.

   కోవిడ్-19 టీకా కార్యక్రమం పనితీరుపైనా అధికారులు సోదాహరణంగా సంక్షిప్త వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా వివిధ సముదాయాలకు టీకాకరణ, ఇతర దేశాలతో పోలిస్తే జాతీయంగా టీకాకరణ అమలుతీరు, రాష్ట్రాల పనితీరుపై విశ్లేషణ తదితరాలకు సంబంధించి అందిన వివరాలపై సమావేశం చర్చించింది. అవసరమైన చోట దిద్దుబాటు చర్యలకు వీలుగా పనితీరుపై రోజువారీ విశ్లేషణలను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రభుత్వాలతో పంచుకోవాలని సూచించింది.

మరోవైపు టీకాలపై పరిశోధన-అభివృద్ధితోపాటు ప్రస్తుత తయారీదారుల ఉత్పాదక సామర్థ్యం, ప్రయోగ పరీక్షల దశలోగల టీకాల సామర్థ్యం తదితరాలపై సమావేశం చర్చించింది. కాగా, తయారీదారులు టీకా ఉత్పాదక సామర్థ్యాన్ని మరింత పెంచుతున్నారని, దీంతోపాటు దేశవిదేశాల్లోని ఇతర సంస్థలతో ఈ అంశంపై చర్చిస్తున్నట్లు అధికారులు సమాచారం ఇచ్చారు.  దేశీయంగా పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా టీకాల ఉత్పత్తి, సేకరణకు అన్ని ప్రయత్నాలూ సాగుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా ‘‘వసుధైవ కుటుంబకమ్’’ సంప్రదాయ స్ఫూర్తితో ఇతర దేశాల వాస్తవ అవసరాలు తీర్చేదిశగానూ కృషి సాగుతున్నదని వివరించారు.

   కేసుల సంఖ్య అధికంగా ఉన్న రాష్ట్రాలు, జిల్లాల్లో ఉద్యమ తరహా విధానాన్ని కొనసాగించాలని ప్రధానమంత్రి ఆదేశించారు. ఆ మేరకు గడచిన 15 నెలలుగా కోవిడ్-19 నిర్వహణలో సాధించిన సమష్టి విజయం నీరుగారిపోకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి, మంత్రిమండలి కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, (టీకాకరణ కార్యక్రమ సాధికార బృందం) అధ్యక్షుడు, ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఔషధ శాఖ కార్యదర్శి, బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి, ఆయుష్, కార్యదర్శి, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్, కేంద్రప్రభుత్వ ముఖ్య విజ్ఞాన‌శాస్త్ర సలహాదారు, నీతి ఆయోగ్ సభ్యుడుసహా పలువురు ఉన్నతాధికారులు ఈ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

***