Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

“ది క్వెస్ట్ ఫర్ ఎ వరల్డ్ విత్ అవుట్ హంగర్” పేరుతో శ్రీ ఎం.ఎస్. స్వామినాథన్ గురించి వెలువడిన రెండు భాగాల పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాన మంత్రి

“ది క్వెస్ట్ ఫర్ ఎ వరల్డ్ విత్ అవుట్ హంగర్” పేరుతో శ్రీ ఎం.ఎస్. స్వామినాథన్ గురించి వెలువడిన రెండు భాగాల పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాన మంత్రి


ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీ ఎమ్.ఎస్. స్వామినాథన్ గురించి రెండు భాగాలుగా వెలువడిన ఒక పుస్తకాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆవిష్కరించారు. ఈ పుస్తకానికి ఎమ్.ఎస్. స్వామినాథన్; “ది క్వెస్ట్ ఫర్ ఎ వరల్డ్ విత్ అవుట్ హంగర్” అని పేరు పెట్టారు. ఈ కార్యక్రమానికి పలువురు కేంద్ర మంత్రులు, ఇంకా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రొఫెసర్ స్వామినాథన్ ను సంప్రతించి భూమి స్వస్థత కార్డు కార్యక్రమాన్ని ఎలా ప్రారంభించింది గుర్తుకు తెచ్చుకొన్నారు.

ప్రొఫెసర్ స్వామినాథన్ అంకిత భావాన్ని, నిబద్ధతను ప్రధాన మంత్రి ప్రశంసిస్తూ, ఆయనను కేవలం ఒక “కృషి వైజ్ఞానిక్”గా కన్నా “కిసాన్ వైజ్ఞానిక్” గా అభివర్ణించారు. ప్రొఫెసర్ స్వామినాథన్ ప్రత్యేకత ఏమిటంటే ఆయన చేసిన కృషి అనుభవ సిద్ధ వాస్తవికతను అంటిపెట్టుకొని ఉండేదని ప్రధాన మంత్రి అన్నారు. అలాగే ప్రొఫెసర్ స్వామినాథన్ నిరాడంబరత్వాన్ని కూడా ఆయన అభినందించారు.

ప్రస్తుతం వ్యవసాయరంగంలోని సవాళ్ళను గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, వ్యవసాయ రంగంలో సాధించిన విజయాన్ని భారతదేశంలోని తూర్పు ప్రాంతానికి విస్తరింప చేయవలసిన అవసరం ఉందన్నారు. అంతే కాకుండా దీనిని ఒక యాదర్థంగా మలచేందుకు శాస్త్ర విజ్ఞాన సంబంధమైన మరియు సాంకేతిక విజ్ఞాన సంబంధమైన కార్యక్రమాలను కూడా చేపట్టవలసి ఉందన్నారు.

ఆధునిక శాస్త్ర విజ్ఞాన పద్ధతులు మరియు సాంప్రదాయక వ్యవసాయ విజ్ఞానం.. వీటిని మేళవించడం వల్ల ఉత్తమమైన ఫలితాలను సాధించవచ్చని ప్రధాన మంత్రి అన్నారు. కొన్ని రాష్ట్రాలలో జరుగుతున్న ప్రయోగాలను గురించి ఉదాహరిస్తూ, భారతదేశంలోని ప్రతి జిల్లా తనదైన వ్యవసాయ సంబంధమైన గుర్తింపును కలిగివుండాలని ఆయన చెప్పారు. ఇది జరిగినప్పుడు మార్కెటింగ్ ప్రక్రియ జోరందుకొంటుందని, మరియు పారిశ్రామిక సముదాయాల తరహాలోనే వ్యావసాయిక సముదాయాలను అభివృద్ధిపరచడంలో సహాయకారి కాగలదన్నారు.

2022 కల్లా వ్యవసాయ క్షేత్రాల నుండి లభించే ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యాన్ని గురించి ప్రధాన మంత్రి వివరించారు. దీనిని సాధించాలంటే అనేక కీలకమైన అంశాలలో నిర్దిష్ట లక్ష్యాలను ఏర్పరచుకొని ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’ కు ఇదివరకటి వ్యవసాయ బీమా పథకాలతో పోలిస్తే వ్యవసాయదారులలో ఆశించిన దాని కన్నా మించిన ఆదరణ లభిస్తుండడం పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ పథకం వ్యవసాయదారులలో నష్ట భయాన్ని స్వీకరించే సామర్థ్యాన్ని పెంచేందుకు తోడ్పడుతుందని, నవకల్పనను “ప్రయోగశాల నుండి పొలానికి” తీసుకువెళ్ళే ప్రక్రియకు మార్గాన్ని సుగమం చేస్తుందని ఆయన అన్నారు.

ప్రధాన మంత్రి ప్రసంగానికి డాక్టర్ శ్రీ ఎమ్.ఎస్. స్వామినాథన్ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధాన మంత్రి దార్శనికతను అభినందించారు. సాంకేతిక విజ్ఞానం మరియు ప్రభుత్వ విధానం.. ఈ రెంటికి మధ్య సమన్వయం ఏర్పడడానికి ఎంతో ప్రాముఖ్యం ఇవ్వాల్సి ఉందని ఆయన నొక్కి చెప్పారు.