ది ఇండియన్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ ఫర్ మేషన్ టెక్నాలజీ (అమెండ్ మెంట్) బిల్, 2017 ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఈ సవరణ బిల్లు కర్నూలు లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ ఫర్ మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ (ఐఐటిడిఎమ్)ను ది ప్రిన్సిపల్ యాక్టు లోని ఇతర ఐఐటి ల సరసన చేర్చడానికి వీలు కల్పిస్తుంది. తదనంతరం, కర్నూలు లోని ఐఐటిడిఎమ్ ను జాతీయ ప్రాముఖ్యం కలిగిన సంస్థ గా ప్రకటించనున్నారు. ఈ సంస్థకు విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేసే అధికారం దఖలుపడుతుంది.
కర్నూలు లోని ఐఐటిడిఎమ్ యొక్క నిర్వహణ కార్యకలాపాల వ్యయాన్ని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క ప్రణాళిక నిధుల నుండి భరిస్తారు.
సాంకేతిక నైపుణ్యం కలిగిన మానవ శక్తి వనరులకు సంబంధించి పరిశ్రమ యొక్క అవసరాలతో పాటు, ఆర్థిక వ్యవస్థ యొక్క అవసరాలు ఈ సంస్థలో శిక్షణ పొందే సిబ్బంది ద్వారా పాక్షికంగా తీరగలవని భావిస్తున్నారు. లింగభేదం, కులం, మత విశ్వాసం, అశక్తత, స్థిర నివాసం, నిర్దిష్ట జాతి, సాంఘిక నేపథ్యం లేదా ఆర్థిక నేపథ్యాలకు అతీతంగా వ్యక్తులందరికీ ఈ సంస్థలో ప్రవేశం లభిస్తుంది.
పూర్వ రంగం
ది ఇండియన్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ ఫర్ మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2014 ఐఐఐటి లకు జాతీయ ప్రాముఖ్యం కలిగిన సంస్థల ప్రతిపత్తిని కట్టబెడుతుంది. అంతే కాకుండా, ఈ ఐఐఐటి ల పరిపాలనకు సంబంధించిన అంశాలను కూడా అందజేస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం, 2014 కు అనువర్తిగా, ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు లో ఒక కొత్త ఎన్ఐటి ని ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఒక కొత్త ఐఐఐటి ని చేర్చినందువల్ల, ఐఐఐటి చట్టం, 2014లో సవరణను చేయవలసివచ్చింది. దీనితో, కర్నూలు లోని ఐఐటిడిఎమ్ కేంద్ర నిధులతో పనిచేసే ఐఐఐటిలలో ఐదోది అవుతుంది.
2015-16 విద్యాసంవత్సరం లో కర్నూలు లోని ఐఐటిడిఎమ్ మొదలైంది. రెండు బ్రాంచులలో దీనిని ప్రారంభించడమైంది.
***