మాననీయ ప్రధాని జనరల్ ప్రయుత్ చాన్ ఒ చా,
సోదర సోదరీమణులారా
మిమ్మల్ని భారత్ కు ఆహ్వానించడం ఆనందంగా ఉంది.
అత్యున్నత స్థాయి రాజకీయ సంప్రదింపుల ప్రక్రియలో భాగంగా మీ పర్యటన అత్యధిక ప్రాధాన్యం సంతరించుకుంది.
మాకు ఎంతో సుపరిచితమైన భూమి నుంచి వచ్చిన అతిథులు మీరు.
పురాణ పురుషుడు శ్రీరాముని నుంచి జ్ఞానానికి ప్రతీక అయిన బుద్ధుని వరకు భిన్నయుగాల్లో మన మధ్య బలమైన సాంస్కృతిక బంధం ఉంది. చారిత్రకంగా ఉభయ దేశాల ప్రజల మధ్య బాంధవ్యం కూడా మన బలీయమైన భాగస్వామ్యానికి పునాది.
థాయ్ లాండ్ మాకు విశ్వసనీయమైన, విలువైన మిత్రదేశం. ఆగ్నేయాసియాలో సన్నిహిత భాగస్వాముల్లో ఒకటి.
మిత్రులారా
ఈ రోజు నేను, మాననీయ థాయ్ ప్రదాని ఇద్దరం మన ద్వైపాక్షిక సంబంధాలను పూర్తిగా సమీక్షించాం.
సంస్కృతి నుంచి వాణిజ్యం వరకు
మన ప్రజల మధ్య బాంధవ్యం నుంచి మన మధ్య గల బలీయమైన అనుసంధానం వరకు
ఉగ్రవాద వ్యతిరేక పోరాటం నుంచి రక్షణ, భద్రతా వ్యవహారాల వరకు
ఉగ్రవాదం, తీవ్రవాద సిద్దాంతాల విస్తరణ మన రెండు సమాజాలకు ఉమ్మడి సవాలు విసురుతున్న విషయం మనందరికీ తెలిసిందే. మన ఉభయుల మధ్య సన్నిహితమైన భద్రతా సహకారం ఒక్కటే ఈ ముప్పు నుంచి మన ప్రజలకు రక్షణ కల్పించే సాధనమని మేం గుర్తించాం. ఈ సవాళ్ళను ఉమ్మడిగా ఎదుర్కొనే క్రమంలో థాయ్ లాండ్ అందిస్తున్న సహకారానికి భారత్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తోంది.
భద్రతా సహకారం సైబర్ భద్రత, మాదక ద్రవ్యాలు, సరిహద్దులు దాటి జరిగే ఆర్థిక నేరాలు, మానవుల అక్రమ రవాణా విబాగాలకు కూడా లోతుగా విస్తరించుకోవాలని ఉభయులం అంగీకారానికి వచ్చాం.
మిత్రులారా
ఉభయ దేశాల భూ సరిహద్దులు సుదూరంగా లేవు. సముద్రతీరంలో కూడా మనం పొరుగువారమే. అందుకే రక్షణ, సముద్రతీర భద్రతలో కూడా సహకరించుకోవాలని మే ఇద్దరం అంగీకారానికి వచ్చాం.
మన ద్వైపాక్షిక ప్రయోజనాలకు అనుగుణమైన, ఉమ్మడి ప్రాంతీయ లక్ష్యాలకు దీటైన భాగస్వామ్యం…
మన భాగస్వామ్యానికి మూలస్తంభాలు…
– నైపుణ్యాలు, అనుభవాలు పరస్పరం పంచుకోవడం
– ఉభయ దేశాల మధ్య సిబ్బంది మార్పిడి, మరిన్ని విన్యాసాలు
– సముద్రాల మీదుగా జరిగే పైరసీ నిరోధంలో సహకారం
– నౌకాదళ గస్తీలో మరింత సన్నిహిత భాగస్వామ్యం
– రక్షణ రంగానికి చెందిన పరిశోధన/అభివృద్ధి కార్యకలాపాలు, ఉత్పత్తుల కోసం మరింత సన్నిహిత అనుసంధానం
మిత్రులారా
పరస్పర ఆధారనీయమైన ప్రస్తుత ప్రపంచానికి వ్యాపార, వాణిజ్యాలు అత్యంత కీలకం. అందుకే మాననీయ ప్రధాని, నేను మరింత భిన్నత్వానికి అవకాశం ఉన్న వాణిజ్య బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించాం. ఇది మన రెండు ఆర్థిక వ్యవస్థలకు లాభదాయకం మాత్రమే కాదు ప్రాంతీయంగా కూడా మరింత ఆర్థిక సుసంపన్నతకు దోహదపడుతుంది. ఇందులో భాగంగా ఈ రోజు జరగబోతున్న భారత్-థాయ్ లాండ్ ఉమ్మడి వ్యాపార మండలి సమావేశాన్ని మేం ఆహ్వానిస్తున్నాం. వారిని ప్రోత్సహించడంతో పాటు ఉభయ దేశాల మధ్య గల వ్యపారావకాశాలు పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవడానికి కృషి చేయాలని వ్యాపారవర్గాలను కోరుతున్నాం.
వాణిజ్యం మాత్రమే కాదు…దానితో పాటుగా తయారీ, పెట్టుబడి విభాగాల్లో కూడా మరింత సన్నిహిత బంధానికి అవకాశం ఉంది.
మౌలిక వసతులు ప్రత్యేకించి టూరిజం రంగానికి చెందిన మౌలిక వసతుల్లో థాయ్ కు గల బలానికి, భారత ప్రాధాన్యతలకు మధ్య సారూప్యతను మేం గమనించాం. సహకారాన్ని విస్తరించుకోదగిన ఇతర రంగాల్లో ఐటి, ఫార్మాస్యూటికల్స్, ఆటో విడిభాగాలు, యంత్రపరికరాలు ఉన్నాయి. ఉమ్మడి ప్రాధాన్యతల్లో భాగంగా సమతూకమైన సమగ్ర ఆర్థిక, భాగస్వామ్య ఒప్పందాన్ని త్వరగా పూర్తి చేసుకోవాలని కూడా మేం నిర్ణయించాం.
మిత్రులారా
ఉభయదేశాల మధ్య వస్తువులు, సేవలు, పెట్టుబడులు, మానవవనరులు స్వేచ్ఛగా కదలాలంటే చక్కని గగనతల, సముద్ర, భూమార్గాలు అవసరమని మా ఇద్దరికీ తెలుసు. ఈ లక్ష్యంతోనే భారత-మయన్మార్-థాయ్ లాండ్ ల మధ్య నిర్మాణంలో ఉన్న త్రైపాక్షిక రహదారి పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని మేం నిర్ణయించాం. అలాగే మన మూడు దేశాల మధ్య మోటారు వాహనాల ఒప్పందంపై కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కూడా నిర్ణయించాం.
భారత అభివృద్ధిలో అనుసంధానానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. మా ఈశాన్య ప్రాంత రాష్ర్టాల నుంచి ఆగ్నేయాసియా దేశాలకు అనుసంధానాన్ని పెంచడం మన రెండు దేశాల ప్రజలకు లాభదాయకం అవుతుంది.
మిత్రులారా
ద్వైపాక్షిక వాణిజ్యం విస్తరించడానికే కాదు…ప్రజలను మరింత సన్నిహితం చేయడానికి, సైన్స్, విద్యా, సాంస్కృతిక, పర్యాటక రంగాల్లో సహకారం విస్తరించుకోవడానికి కూడా బలీయమైన అనుసంధానం అత్యంత కీలకం.
వచ్చే ఏడాది థాయ్ లాండ్ తో 70 సంవత్సరాల దౌత్యబంధం పూర్తి చేసుకుంటున్న వేడుకలకు గుర్తుగా మేం థాయ్ లో భారత్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం. భారత్ లో థాయ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు.
ఈ ఏడాది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జన్మదినోత్సవం కూడా నిర్వహించుకుంటున్నాం. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగాన్ని థాయ్ భాషలో తర్జుమా చేయనున్నారని తెలియచేయడానికి నేను సంతోషిస్తున్నాను.
మరింత అధికంగా థాయ్ పర్యాటకులను ఆకర్షించేందుకు, దేశంలోని బౌద్ధ క్షేత్రాలను వారు తేలిగ్గా సందర్శించే అవకాశం కల్పించేందుకు థాయ్ పౌరులకు త్వరలో డబల్ ఎంట్రీ ఇ టూరిస్ట్ వీసాలు జారీ చేయనున్నామని తెలియచేసేందుకు నేను సంతోషిస్తున్నాను.
మాననీయా
భారత్ పట్ల థాయ్ రాజకుటుంబం చూపించే ఆదరాభిమానాలు మాకు ఎప్పుడూ సంతోషదాయకమే. గౌరవనీయ ప్రిన్సెస్ మహాచక్రి సిరింధోర్న్ మాకు నిత్య అతిథి. ఆమె తరచుగా భారత్ సందర్శిస్తూ ఉంటారు. ఈ ఏడాది చివరిలో ఆమెను మరోసారి ఆహ్వానించడానికి మేం ఎదురు చూస్తున్నాం.
వీలైనంత త్వరగా భారత్ ను సందర్శించాలని యువరాజు మాననీయ వజీరాలాంగ్ కోర్న్ ను ఆహ్వానిస్తున్నాం. ఆయనకు సాదర స్వాగతం పలికేందుకు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాం.
చివరిలో ఒక మాట. థాయ్ అనుసరిస్తున్న లుక్ వెస్ట్, భారత్ అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలసీలు మన భవిష్యత్ భాగస్వామ్యానికి మార్గదర్శకంగా నిలుస్తాయి.
మాననీయా, మీకు, మీ ప్రతినిథి వర్గానికి నేను మరోసారి స్వాగతం పలుకుతున్నాను.