ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఇవాళ మహారాష్ట్రలోని ‘థానే ఇంటెగ్రల్ రింగ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కారిడార్’ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. నగరానికి పశ్చిమాన 29 కిలోమీటర్ల పొడవున నిర్మితమయ్యే ఈ కారిడార్‌లో 22 స్టేషన్లు ఉంటాయి. ఈ కారిడార్‌కు ఒకవైపు ఉల్హాస్ నది, మరోవైపు సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ ఉంటాయి.
ఈ అనుసంధాన ప్రాజెక్టుతో సుస్థిర, సమర్థ రవాణా సదుపాయం అందుబాటులోకి వస్తుంది. దీంతో థానే నగర ఆర్థిక సామర్థ్య సద్వినియోగంతోపాటు రహదారులపై రద్దీ తగ్గే వీలుంటుంది. వాహన రద్దీ తగ్గితే హరితవాయు ఉద్గారాలు తగ్గడానికీ అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
ప్రాజెక్టు వ్యయం-నిధుల సమీకరణ:
ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.12,200.10 కోట్లు కాగా, ఇందులో కొంత భాగాన్ని కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాకింద సమాన నిష్పత్తిలో సమకూరుస్తాయి. దీంతోపాటు ద్వైపాక్షిక సంస్థల ద్వారా పాక్షికంగా నిధులు సమీకరిస్తారు.
అంతేకాకుండా స్టేషన్ పేరు, కార్పొరేట్ సౌలభ్య హక్కుల విక్రయం, ఆస్తుల నగదీకరణ, ఆర్థిక విలువ సంగ్రహణ వంటి వినూత్న పద్ధతులలోనూ నిధులు సమీకరిస్తారు.
ప్రధాన వ్యాపార కూడళ్లను కలుపుతూ నిర్మితమయ్యే ఈ కారిడార్ 2029 నాటికి పూర్తవుతుంది. దీనివల్ల భారీ సంఖ్యలో ప్రయాణించే ఉద్యోగులకు సానుకూల రవాణా సదుపాయం సమకూరుతుంది.
ఈ మార్గంలో నిత్యం ప్రయాణించే వేలాది ప్రజలకు… ముఖ్యంగా విద్యార్థులకు, కార్యాలయాల సిబ్బందికి వేగంగా ప్రయాణించడంతోపాటు చౌకరవాణా సౌలభ్యం కలుగుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే 2029, 2035, 2045 సంవత్సరాల నాటికి మెట్రో కారిడార్లలో మొత్తం రోజువారీ ప్రయాణికుల సంఖ్య వరుసగా 6.47 లక్షలు, 7.61 లక్షలు, 8.72 లక్షలుగా ఉంటుందని అంచనా.
ఈ ప్రాజెక్టును సివిల్, ఎలక్ట్రో-మెకానికల్, ఇతర అనుబంధ సౌకర్యాలు, పనులు సంబంధిత ఆస్తుల వినియోగం ద్వారా ‘మహా-మెట్రో’ సంస్థ నిర్మిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే టెండర్లు పిలవడానికి అవసరమైన సన్నాహాలు ప్రారంభించింది. ఈ ప్రక్రియ పూర్తికాగానే ఎంపిక చేసిన కాంట్రాక్టర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది.
***
It is our constant endeavour to ensure Maharashtra gets modern infrastructure. Today, the Union Cabinet has cleared the Thane integral Ring Metro Rail Project. This is a landmark infrastructure project which will link key areas in and around Thane, as well as enhance comfort and… pic.twitter.com/WTU7Ei145P
— Narendra Modi (@narendramodi) August 16, 2024