తమిళ నాడు లోని కోలాచెల్ దగ్గర ఇనాయమ్ వద్ద భారీ నౌకాశ్రయాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు మంత్రిమండలి సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఈ నౌకాశ్రయాన్ని అభివృద్ధికి చేయడానికిగాను తమిళ నాడు లోని మూడు ప్రధాన నౌకాశ్రయాలు.. వి. ఒ. చిదంబరనార్ పోర్ట్ ట్రస్టు, చెన్నై పోర్ట్ ట్రస్టు, కామరాజర్ పోర్ట్ లిమిటెడ్.. ల నుండి సమాన ఈక్విటీ పెట్టుబడితో ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్ పి వి)ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎస్ పి వి నౌకాశ్రయానికి అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుంది. ఈ మౌలిక సదుపాయాలలో భాగంగా ఇసుక పూడికతీత, పునరుద్ధరణ పనులు, సేతు బంధం (బ్రేక్ వాటర్) నిర్మాణం, కనెక్టివిటీ లింకుల ఏర్పాటు వంటివి ఉంటాయి.
ప్రపంచ శ్రేణి సరకు రవాణా సామర్థ్యం గల నౌకాశ్రయాలు ప్రస్తుతం భారతదేశంలో చాలా పరిమితంగా మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశానికి సంబంధించి నౌకలకు- నౌకలకు మధ్య వస్తువుల తరలింపు అనేది కొలంబోలోను, సింగపూర్ లోను, ఇంకా ఇతర అంతర్జాతీయ నౌకాశ్రయాలలోను చేపడుతున్నారు. దీనివల్ల భారతదేశ నౌకాశ్రయ పరిశ్రమ ప్రతి సంవత్సరం రూ.1,500 కోట్ల దాకా కోల్పోవలసి వస్తోంది.
భారతదేశానికి రావలసిన వస్తువుల్ని ఒక నౌకలో నుండి మరో నౌకకు తరలించే కార్యక్రమం ప్రస్తుతం బయట జరుగుతున్నది కాస్తా ఇనాయమ్ దగ్గర ఈ భారీ నౌకాశ్రయాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఇది భారతీయ సరకు రవాణా నిర్వహణ కోసం ప్రధానమైన గేట్ వే కంటెయినర్ పోర్టుగా పని చేయగలదు. దీనితో పాటు, అంతర్జాతీయంగా చూసినప్పుడు తూర్పు- పశ్చిమ వాణిజ్య మార్గంలో ఇనాయమ్ భారీ నౌకాశ్రయం ట్రాన్స్- షిప్ మెంట్ హబ్ కాగలదు కూడా.
దక్షిణ భారతదేశంలో ఎగుమతి సంస్థలు, దిగుమతి సంస్థలకు అయ్యే రవాణా సంబంధిత వ్యయాలను కూడా ఇనాయమ్ తగ్గించగలదు. ప్రస్తుతం ఈ సంస్థలు వాటి ట్రాన్స్- షిప్మెంట్ అవసరాల కోసం కొలంబో మీదో, లేదా ఇతర నౌకాశ్రయాల మీదో ఆధారపడుతున్నాయి. తత్ఫలితంగా అవి అదనంగా నౌకాశ్రయ నిర్వహణ ఛార్జిలను భరించవలసి వస్తున్నది.