Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

త్వరలో శ్రీ లంక లో ప్రధాన మంత్రి పర్యటన


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2017 మే 11 మరియు మే 12 తేదీలలో శ్రీ లంక లో పర్యటించనున్నారు.

ప్రధాన మంత్రి తన ఫేస్ బుక్ అకౌంట్ లో ఈ కింది విధంగా తెలియజేశారు:

‘‘నేను ఈ రోజు, మే 11 వ తేదీ, మొదలుకొని రెండు రోజుల పాటు శ్రీ లంక లో ఉంటాను. ఇది రెండు సంవత్సరాల వ్యవధిలో నేను అక్కడ రెండవ సారి జరిపే ద్వైపాక్షిక పర్యటన. మన మధ్య నెలకొన్న బలమైన సంబంధాలకు ఈ పర్యటన ఒక సూచిక.

నా పర్యటనలో భాగంగా, నేను మే 12వ తేదీ నాడు కొలంబోలో జరిగే ఇంటర్ నేషనల్ వేసాక్ డే ఉత్సవాలలో పాల్గొంటాను. ఆ సందర్భంగా బౌద్ధ ఆధ్యాత్మిక నాయకులు, పండితులు మరియు వేదాంతులతో సంభాషణ జరుపుతాను. ప్రెసిడెంట్ శ్రీ మైత్రిపాల సిరిసేన, ప్రధాని శ్రీ రాణిల్ విక్రమసింఘె లతో పాటు ఈ ఉత్సవాలలో పాలుపంచుకోవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.

భారతదేశం మరియు శ్రీ లంక ల మధ్య బౌద్ధ వారసత్వం విషయంలో నెలకొన్నటువంటి అత్యంత దృఢమైన బంధాలలో ఒక బంధాన్ని నా పర్యటన ముందుకు తీసుకురానుంది.

2015 లో నేను జరిపిన శ్రీ లంక పర్యటనలో, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం, శతాబ్దాల తరబడి ప్రముఖ బౌద్ధ కేంద్రంగా అలరారుతున్నటువంటి అనురాధపుర ను సందర్శించే అవకాశం నాకు లభించింది. ఈ సారి, కందీ లో టెంపుల్ ఆఫ్ సాక్రెడ్ టూత్ రెలిక్ గా ప్రసిద్ధిగాంచిన పూజ్య శ్రీ దలాద మలిగవా ను దర్శించుకొనే విశేషమైన అవకాశాన్ని కూడా అందుకోబోతున్నాను.

కొలంబోలో నా యాత్ర గంగరామయ్య దేవాలయంలోని సీమ మలకా ను సందర్శించడంతో ఆరంభం అవుతుంది. అక్కడ నేను సంప్రదాయ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాలుపంచుకొంటాను.

నేను ప్రెసిడెంట్ మైత్రిపాల సిరిసేన తోను, ప్రధాని శ్రీ రాణిల్ విక్రమసింఘె తోను, ఇంకా ఇతర ప్రసిద్ధ మాననీయ వ్యక్తులతోను భేటీ అవుతాను.

శ్రీ లంక లోని డికోయా ఆసుపత్రిని నేను ప్రారంభించబోతున్నాను. ఈ ఆసుపత్రిని భారతదేశం అందించిన ఆర్థిక సహాయంతో నిర్మించడమైంది. అక్కడ భారత సంతతికి చెందిన తమిళ సముదాయంతో నేను ముచ్చటిస్తాను.

శ్రీ లంక నుండి సోషల్ మీడియా లో నేను మరిన్ని సంగతులు పంచుకొంటాను. శ్రీ లంకలో నా కార్యక్రమాలన్నీ ‘Narendra Modi Mobile App’ లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. ఆ యాప్ కు మీరు అనుసంధానమై, వాటిని చూడవచ్చు.’’

***