Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

త్వరలో ఇజ్రాయల్ , జర్మనీ లలో పర్యటించనున్న ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2017 జులై 4 వ తేదీ నుండి జులై 6వ తేదీ వరకు ఇజ్రాయల్ లో పర్యటించనున్నారు. ప్రధాన మంత్రి 2017 జులై 6వ తేదీ నుండి 8వ తేదీ మధ్య జరిగే జి-20 12వ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడం కోసం జర్మనీ లోని హాంబర్గ్ లో కూడా పర్యటించనున్నారు.

ప్రధాన మంత్రి తన ఫేస్ బుక్ ఖాతా లో వరుసగా రాసిన అంశాలలో ఇలా పేర్కొన్నారు:

‘‘ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ ఆహ్వానించిన మీదట 2017 జులై 4-6 తేదీల మధ్య నేను ఇజ్రాయల్ లో పర్యటించబోతున్నాను.

ఈ విధంగా చేయబోతున్న మొట్టమొదటి భారతదేశ ప్రధాన మంత్రిగా, నేను ఈ అపూర్వ పర్యటన కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాను. ఈ పర్యటన రెండు దేశాల ప్రజలను మరింత చేరువ చేస్తుంది. ఈ సంవత్సరంతో, భారతదేశం మరియు ఇజ్రాయల్ ల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి.

వివిధ రంగాలలోని మన పూర్తి శ్రేణి భాగస్వామ్యాన్ని పరస్పర హితం కోసం మరింతగా బలపరచుకోవడంపైన ప్రధాని శ్రీ నెతన్యాహూ తో నేను కూలంకషంగా చర్చించనున్నాను. ఉగ్రవాదం వంటి ప్రధానమైన ఉమ్మడి సవాళ్లను గురించి కూడా మేము చర్చించే అవకాశం ఉంది.

ప్రెసిడెంట్ శ్రీ ర్యూవెన్ రూవీ రివ్ లిన్ తోనూ నేను భేటీ అవుతాను. ఆయనకు, ఇతర సీనియర్ నాయకులకు గత సంవత్సరం నవంబరులో న్యూ ఢిల్లీ లో స్వాగతం పలికానన్న సంతృప్తి నాకు దక్కింది.

నా పర్యటన కార్యక్రమాలలో భాగంగా, ఇజ్రాయల్ సమాజంలోని భిన్న వర్గాల వారితో ముచ్చటించే అవకాశం నాకు లభించనున్నది. మరీ ముఖ్యంగా మన రెండు దేశాల ప్రజలకు మధ్య బంధంగా నిలుస్తున్న పెద్ద సంఖ్య లోని హుషారైన ప్రవాసీ భారతీయులతో సమావేశం కావడం కోసం నేను ఎదురుచూస్తూ ఉన్నాను.

ఆర్థిక కోణం వైపు నుంచి పరిశీలిస్తే- నేను భారతీయ సిఇఒ లతోను, ఇజ్రాయలీ సిఇఒ లతోను, స్టార్ట్- అప్ ల తోను వ్యాపారం, పెట్టుబడులలో నెలకొన్న సహకారాన్ని విస్తరించుకొనేందుకు ప్రాధాన్యమిస్తూ చర్చలు జరుపుతాను. దీనికి తోడు, సాంకేతిక విజ్ఞ‌ానం మరియు నూతన ఆవిష్కరణల రంగాలలో ఇజ్రాయల్ సాధించిన విజయాలను- క్షేత్ర స్థాయి పర్యటనల ద్వారా- ఆకళింపు చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను.

నా పర్యటన సమయంలో, నేను మానవ జాతి చరిత్రలోకెల్లా అతి ఘోర దుర్ఘటనలలో ఒకటిగా లెక్కకు వస్తున్న మారణహోమ బాధితులకు స్మృతి చిహ్నంగా ఉన్న యాద్ వాశెమ్ స్మారక సంగ్రహాలయాన్ని సందర్శిస్తాను. ఆ తరువాత, 1918లో హైఫా విముక్తి వేళ ప్రాణాలు అర్పించిన సాహసవంతులైన భారతీయ సైనికులకు నేను వందనాన్ని సమర్పిస్తాను.

జర్మనీ ఆతిథేయిగా వ్యవహరిస్తున్న జి-20 పన్నెండో శిఖరాగ్ర సభలో పాలుపంచుకోవడం కోసం జులై 6వ తేదీ సాయత్రం పూట నేను హాంబర్గ్ కు వెళ్తాను. ఇవాళ మన ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న అంశాలు- ఏవయితే ఆర్థిక వృద్ధి, స్థిరమైన అభివృద్ధి సాధన, శాంతి మరియు స్థిరత్వాలపైన వాటి ముద్రను వేస్తున్నాయో- వాటిపై ఇతర జి-20 సభ్యత్వ దేశాలకు చెందిన నాయకులతో రెండు రోజుల పాటు, జులై 7వ, 8వ తేదీలలో చర్చించాలనుకొంటున్నాను.

గత ఏడాదిలో హాంగ్ ఝోవూ శిఖరాగ్ర సభ జరిగిన తరువాత నుండి అప్పటి నిర్ణయాలలోని పురోగతిని మేము సమీక్షించనున్నాము. అలాగే ఉగ్రవాదం, జల వాయు పరివర్తన, స్థిరమైన అభివృద్ధి సాధన, వృద్ధి మరియు వ్యాపారం, డిజిటలైజేశన్, ఆరోగ్యం, ఉపాధికల్పన, వలసలు, మహిళల సాధికారిత, ఇంకా ఆఫ్రికాతో భాగస్వామ్యం వంటి అంశాలపైనా సంప్రదింపులు జరుపుతాము. ‘‘పరస్పరం ఆశ్రితమై వుండే ప్రపంచానికి రూపుదిద్దడం’’ అనే అంశాన్నిఈ సంవత్సరపు ఇతివృత్తంగా ఎంపిక చేయడమైంది.

గతంలో మాదిరిగానే పరస్పర హితం ముడిపడివున్న ద్వైపాక్షిక అంశాలపై అభిప్రాయాలను ఒకరితో మరొకరు తెలియజెప్పుకోవడానికిగాను శిఖరాగ్ర సభ సందర్భంగా నేతలను కలుసుకొనే తరుణం కోసం నేను వేచివున్నాను’’.