Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

తొలి ‘జాతీయ సృష్టికర్తల పురస్కారం’ ప్రదానం చేసిన ప్రధాని

తొలి ‘జాతీయ సృష్టికర్తల పురస్కారం’ ప్రదానం చేసిన ప్రధాని


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలోని భార‌త్ మండ‌పంలో తొలి జాతీయ సృష్టికర్తల పురస్కారాలను ప్ర‌దానం చేశారు. అనంతరం పురస్కార గ్రహీతలతో కొద్దిసేపు ముచ్చటించారు. కథలు చెప్పడం, సామాజిక పరివర్తన కృషి, పర్యావరణ సుస్థిరత, విద్య, గేమింగ్ తదితర అంశాల్లో నైపుణ్యం, ప్రభావాలకు గుర్తింపుగా ‘‘జాతీయ సృష్టికర్తల పురస్కారం’’ ప్రవేశపెట్టబడింది. సానుకూల సామాజిక మార్పు దిశగా సృజనాత్మకతను ఒక ఉపకరణంగా వాడుకునే వేదికగా ఈ అవార్డు రూపుదిద్దబడింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి స‌భ‌నుద్దేశించి ప్ర‌సంగిస్తూ- ఈ కార్యక్రమం నిర్వహణకు భార‌త్ మండ‌పాన్ని వేదిక‌గా ఎంపిక చేయడంలోని విశిష్టతను వివరించారు. జి-20 శిఖరాగ్ర సదస్సులో వివిధ దేశాల అధినేత‌లు ప్రపంచ భ‌వితకు దిశానిర్దేశం చేసిన ఈ వేదికపై ఇవాళ జాతీయ సృష్టికర్తలు మమేకం కావడం విశేషమని ఆయన అభివర్ణించారు.

   మారుతున్న కాలం, నవ శకారంభంతో సమాంతరంగా నడవడం దేశం బాధ్యతని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఆ మేరకు నేడు తొలి జాతీయ సృష్టికర్తల పురస్కార ప్రదానం ద్వారా ఆ బాధ్యతను నెరవేరుస్తున్నదని చెప్పారు. ‘‘ఈ జాతీయ సృష్టికర్తల పురస్కారాలు నవశకం ఆరంభానికి ముందే దానికి గుర్తింపునిస్తున్నాయి’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. భవిష్యత్తును ముందుగానే విశ్లేషించగల ప్రతిభకు ఇది నిదర్శనమని ఆయన వివరించారు. రాబోయే కాలంలో ఈ జాతీయ సృష్టికర్తల పురస్కారాలు నవ యుగాన్ని బలోపేతం చేస్తూ, యువత సృజనాత్మకతసహా దైనందిన జీవనాంశాలపై వారి అవగాహనను గౌరవిస్తూ బలమైన ప్రభావం చూపగలవని ప్రధాని విశ్వాసం వెలిబుచ్చారు. అంతేకాకుండా భవిష్యత్తులో సారాంశ సృష్టికర్తలకు ఈ పురస్కారాలు స్ఫూర్తిదాయకం కాగలవని, వారి కృషికి ఒక గుర్తింపునిస్తాయని ప్రధానమంత్రి అన్నారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలను ఆయన అభినందించారు. అతి తక్కువ సమయంలోనే పోటీదారులంతా చురుకుగా పాల్గొనడంపైనా ప్రశంసించారు. ‘‘ఈ కార్యక్రమంలో 2 లక్షల మందికిపైగా సృజనాత్మక మేధావుల సమాజం పాల్గొనడం దేశానికే ఒక విశిష్ట గుర్తింపును తెచ్చిపెట్టింది’’ అని ఆయన పేర్కొన్నారు.

   మహా శివరాత్రి పర్వదినం నేపథ్యంలో తొలి ‘జాతీయ సృష్టికర్తల పురస్కార’ ప్రదానోత్సవం నిర్వహించడాన్ని ఒక విశేషంగా ప్రధానమంత్రి పేర్కొన్నారు. భాష, కళ, సృజనాత్మకతలకు సృష్టికర్తగా మహాశివుడు ఆరాధ్యుడని ఆయన గుర్తుచేశారు. ‘‘మన శివుడు నటరాజు… ఆయన డమరుక నాదంతో మహేశ్వర సూత్రం ఉద్భవిస్తే, ఆయన తాండవం సృష్టి, లయలకు పునాది వేస్తుంది’’ అని వ్యాఖ్యానిస్తూ- మహా శివరాత్రి సందర్భంగా ప్రజలందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో పురస్కారం పొందిన మహిళలను ప్రధాని అభినందించారు. భారత సృజనాత్మక రంగంలో మహిళల భాగస్వామ్యంపై గర్వకారణమని పేర్కొన్నారు. ఈ శుభ సందర్భంలో మహిళలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.100 తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి ప్రజల హర్షధ్వానాల నడుమ ప్రకటించారు.

   దేశ ప్రగతి ప్రయాణంపై ఒక పథకం లేదా విధానం చూపగల బహుముఖ ప్రభావాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- గత 10 సంవత్సరాల్లో డేటా విప్లవం, చౌక డేటా లభ్యతను ప్రధాని గుర్తుచేశారు. అలాగే సారాంశ సృష్టికర్తల కోసం కొత్త ప్రపంచం రూపొందించడంలో డిజిటల్ ఇండియా కార్యక్రమం తోడ్పాటును ప్రశంసిస్తూ, తదనుగుణంగా యువత చేస్తున్న కృషిని కొనియాడారు. ‘‘యువత తమ సానుకూల దృక్పథంతో సారాంశ సృష్టికర్తల వైపు ప్రభుత్వ దృష్టిని ఆకర్షించింది’’ అని వారిని అభినందిస్తూ, ఇటువంటి పురస్కార కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంలో వారి పాత్రను ప్రధాని కొనియాడారు.

   నేటి సృజనాత్మక యువతలో ఏ ఒక్కరూ సారాంశ సృష్టిలో ఏదైనా కోర్సును అభ్యసించలేదని ప్రధాని పేర్కొన్నారు. విద్యాభ్యాసం నుంచి సారాంశ సృష్టివైపు ప్రయాణంలో అటువంటి కోర్సులేవీ లేవని గుర్తుచేశారు. ఆ మేరకు వారు స్వయంకృషి, ప్రతిభతో ముందడుగు వేశారని ప్రధాని పేర్కొన్నారు. ‘‘మీరంతా మీ సొంత ప్రాజెక్టులకు రచయిత, దర్శకుడు, నిర్మాత, సంపాదకుడు’’ వంటి బాధ్యతలన్నీ నిర్వర్తించారు’’ అని ప్రశంసించారు. అలాగే ఇటువంటి ప్రతిభకుగల సామూహిక సామర్థ్యాన్ని నొక్కిచెబుతూ- ‘‘మీరొక ఆలోచనకు రూపమిచ్చి, ఆవిష్కరించడమే కాకుండా తెరపై దానికి జీవం పోశారు. అలాగే మీ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడమేగాక ప్రపంచాన్నే వారికి చూపించారు’’ అని అభివర్ణించారు. అదేవిధంగా సారాంశ సృష్టికర్తల సాహసాన్ని, సంకల్ప దీక్షను ప్రశంసించారు. దేశవ్యాప్తంగా సారాంశ సృష్టి ప్రభావాన్ని వివరిస్తూ ‘‘మీరంతా  ఇంటర్నెట్ ఎంవీపీలు’’ అని వ్యాఖ్యానించారు.

   సారాంశం, సృజనాత్మకతల మధ్య సహకారం సంబంధాలను పెంపొందిస్తుంది. సారాంశం, డిజిటల్ సాంకేతికతల మధ్య సహకారం పరివర్తనకు దోహదం చేస్తుంది. సారాంశం, సదాశయాల మధ్య సహకారం సమాజాన్ని ప్రభావితం చేస్తుందని ప్రధానమంత్రి అభివర్ణించారు. సారాంశ సృష్టి ద్వారా స్ఫూర్తిని ప్రోది చేయాలని సృష్టికర్తలను శ్రీ మోదీ అభ్యర్థించారు. ఎర్రకోట బురుజుల నుంచి తన ప్రసంగంలో మహిళల పట్ల చులకన భావాన్ని లేవనెత్తి- బాలబాలికల పెంపకంలో తల్లిదండ్రులు సమానత్వ స్ఫూర్తిని అనుసరించాలని కోరినట్లు గుర్తుచేశారు. సారాంశ సృష్టికర్తలు సమాజంతో అనుబంధం కలిగి ఉండటంలో ఇదే వైఖరిని ఇంటింటికీ చేర్చాలంటూ మార్గనిర్దేశం చేశారు. భారత నారీశక్తి బహుముఖ సామర్థ్యాలను ప్రదర్శించాలని సారాంశ సృష్టికర్తలను ఆయన కోరారు. ఒక తల్లి తన దైనందిన కార్యకలాపాలను అలవోకగా చక్కబెట్టడం, గ్రామీణ-గిరిజన ప్రాంతాల మహిళలు ఆర్థిక కార్యకలాపాలలో నిమగ్నం కావడం వంటి ఇతివృత్తాలతో సారాంశ సృష్టి చేయాల్సిందిగా సూచించారు. ‘‘దురవగాహనలను సరిదిద్దడంలో సారాంశ సృష్టి దోహదపడుతుంది’’ అని ప్రధానమంత్రి చెప్పారు.

   స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఒక నిరంతర కార్యమని నొక్కి చెబుతూ- నీటిగుంటలో ఎవరో పడేసిన ప్లాస్టిక్ సీసాను ఓ పెద్దపులి బయటకు తీసుకెళ్తున్న వీడియోను ప్రధాని ప్రస్తావించారు. సారాంశ  సృష్టికర్తలు కూడా ఈ మార్గంలో ఆలోచనలు చేయాలని కోరారు. మానసిక ఆరోగ్యం, ఒత్తిడి వంటి తీవ్ర సమస్యలపై బాలల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే స్థానిక భాషలలో సారాంశ సృష్టిపై దృష్టి సారించాలని కోరారు. ఈ అంశంపై 15 ఏళ్ల కిందట తాను చూసిన ఓ లఘు చిత్రంపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. అలాగే ‘పరీక్ష పే చర్చ’ కార్యక్రమాన్ని కూడా ప్రస్తావిస్తూ-  అక్కడ పరీక్షలకు ముందు పిల్లల భావాలు తెలుసుకునే అవకాశం తనకు లభిస్తుందన్నారు. యువతపై మాదకద్రవ్యాల దుష్ప్రభావాన్ని ఎత్తిచూపుతూ సారాంశ సృష్టి చేపట్టాలని సూచిస్తూ ‘‘మాదకద్రవ్యాలు మహమ్మారుల’ని మనం చెప్పగలం’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

   రాబోయే లోక్‌సభ ఎన్నికల గురించి ప్రధాని ప్రస్తావిస్తూ- వచ్చే ఏడాది కూడా సారాంశ సృష్టికర్తలతో మమేకం కాగలమన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘‘ఇది మోదీ హామీ కాదు… 140 కోట్ల మంది భారత పౌరుల హామీ’’ అని ప్రధాని వివరించారు. ఓటింగ్ అనేది ఎన్నికల్లో విజేతలు, పరాజితులను ప్రకటించే కార్యక్రమం కాదని, భారత్ వంటి సువిశాల దేశ భవితకు రూపమిచ్చే నిర్ణయాత్మక ప్రక్రియలో భాగమనే భావనను ప్రోదిచేస్తూ యువతరంతోపాటు తొలిసారి ఓటు వేయబోతున్న వారిలో అవగాహన కల్పించాలని కోరారు. అనేక దేశాలు పలు విధాలుగా సంపన్నమైనప్పటికీ, చివరకు ప్రజాస్వామ్యాన్నే ఎంచుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘‘నిండైన ప్రజాస్వామ్యంపట్ల గర్విస్తూ వికసిత భార‌త్‌గా అవతరించాలని మన దేశం సంకల్పించింది’’ అని ప్రధానమంత్రి అన్నారు. యువతరంపై తనకుగల అంచనాలను వివరిస్తూ, భారతదేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా మార్చడంలో వారి సహకారాన్ని అర్ధించారు. సామాజిక మాధ్యమ శక్తితో భారతదేశంలోని దివ్యాంగుల స్వాభావిక సామర్థ్యాలను వెలుగులోకి తేవాల్సిన అవసరాన్ని కూడా నొక్కిచెప్పారు.

   ప్ర‌పంచంపై భార‌త్ ప్ర‌భావం పెరుగుతోంద‌ని ప్ర‌ధానమంత్రి అన్నారు. ఉక్రెయిన్ నుంచి విద్యార్థుల‌ను మాతృదేశానికి ర‌ప్పించే స‌మ‌యంలో త్రివ‌ర్ణ పతాక ప్రభావాన్ని ఈ సందర్భంగా ఆయన ప్ర‌స్తావించారు. భారతదేశం పట్ల ప్రపంచ వాతావరణం, అభిప్రాయం మారినప్పటికీ దేశ ప్రతిష్టను పరివర్తనాత్మకం చేయడానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని ప్రధాని నొక్కిచెప్పారు. ఈ సందర్భంగా తన విదేశీ పర్యటనల సమయంలో ఒకసారి ఆతిథ్యదేశ ప్రభుత్వ దుబాసీగా పనిచేస్తున్న కంప్యూటర్ ఇంజనీర్‌తో తన సంభాషణను శ్రీ మోదీ గుర్తుచేసుకున్నారు. తనతో మాట్లాడుతూ- ‘‘భారతదేశం పాములను ఆడించేవారికి, మంత్రవిద్యలకు ప్రసిద్ధమట కదా!’’ అని అతడు అడిగినట్లు తెలిపారు. వాస్తవానికి ఆ రోజుల్లోనే భారత్ అత్యంత శక్తిమంతమైన దేశం అయినప్పటికీ, నేడు దాని శక్తి ప్రపంచ దిశను నిర్దేశించే కంప్యూటర్ మౌస్‌లో కేంద్రీకృతమైందని ప్రధాని అభివర్ణించారు. అందుకే ‘‘మీరు భారతదేశానికి అంతర్జాతీయ డిజిటల్ దూతలు… ‘స్థానికం కోసం నినాదం’ బ్రాండ్ రాయబారులు కూడా మీరే’’నంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. నిన్న తన శ్రీనగర్‌ పర్యటన సందర్భంగా డిజిటల్ ఇండియా అండతో అంతర్జాతీయ బ్రాండ్‌ను సృష్టించిన తేనెటీగల పెంపకందారుతో సంభాషణను ఆయన ప్రస్తావించారు.

   ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి యువతకు ఉత్తేజమిస్తూ- ‘‘మీరంతా కదలిరండి… ‘భారతీయతను సృష్టిద్దాం’ పేరిట మనం ఒక ఉద్యమం ఆరంభిద్దాం. భారతీయ కథలు, సంస్కృతి, వారసత్వం, సంప్రదాయాలను యావత్ ప్రపంచంతో పంచుకుందాం. ప్రపంచం కోసం సృష్టిద్దాం… భారతీయతను సృష్టిద్దాం’’ అని పిలుపునిచ్చారు. సృష్టికర్తకు మాత్రమేగాక భారతదేశానికీ గరిష్టంగా ‘లైక్‌’లు వచ్చేలా సారాంశ రూపకల్పన ద్వారా ప్రపంచ వీక్షక సమూహాన్ని మమేకం చేయాలని ఆయన కోరారు. భారతదేశంపై ప్రపంచానికిగల ఆసక్తిని ప్రస్తావిస్తూ- సారాంశ సృష్టికర్తలు తమ పరిధి విస్తరణ దిశగా జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్ తదితర ఐక్యరాజ్య సమితి పరిగణనలోగల భాషలలో ప్రావీణ్యం సాధించాలని సూచించారు. కృత్రిమ మేధ (ఎఐ) గురించి బిల్ గేట్స్‌తో తన ముఖాముఖి సంభాషణను శ్రీ మోదీ గుర్తుచేశారు. అలాగే ‘ఇండియాఎఐ’ మిషన్‌కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం గురించి తెలిపారు. ఈ ఘనత భారత యువతకు, వారి ప్రతిభకు దక్కుతుందని పేర్కొన్నారు. అలాగే సెమి-కండక్టర్ మిషన్‌ను గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. ఇక 5జి సాంకేతిక పరిజ్ఞాన స్వీకరణలోనూ భారత్ ఆదర్శంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పొరుగు దేశాలతో సంబంధాల  మెరుగుకు ఆయా  దేశాల భాషలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన నొక్కిచెప్పారు. ‘నమో అనువర్తనం’ నుంచి  తన ప్రస్తుత ప్రసంగాన్ని స్వల్ప సమయంలో వివిధ భాషలలోకి అనువదించడంతోపాటు ఫోటోలను  ప్రసారం చేయడంలోనూ ‘ఎఐ’ వినియోగం గురించి ప్రధానమంత్రి సభకు తెలిపారు.

   సారాంశ సృష్టికర్తల సామర్థ్యం భారత్ బ్రాండింగ్‌ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో కొత్త శిఖరాలకు చేర్చగలదని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. సృజనాత్మకతకుగల శక్తిని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దానిని అనుభవంలోకి తెచ్చుకోవడం గురించి ఉదాహరిస్తూ- తవ్వకాలలో బయల్పడిన కళాఖండాల దృశ్యాలు వీక్షకులను ఆ యుగంలోకి తీసుకెళ్తాయని పేర్కొన్నారు. చివరగా, దాని భారత సృజనాత్మకత శక్తి దేశాభివృద్ధికి ఉత్ప్రేరకం కాగలదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ, స్వల్ప సమయంలోనే 2 లక్షల మందికిపైగా దరఖాస్తుదారులను వడపోయడంలో న్యాయనిర్ణేతలు చేసిన కృషిని అభినందిస్తూ తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్-సమాచార సాంకేతికశాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం

జాతీయ సృష్టికర్తల పురస్కరం విశిష్ట ప్రజామోదానికి సాక్షిగా నిలిచింది. విజేతల ఎంపిక కోసం నిర్వహించిన పోటీల తొలిదశ కింద 20 విభిన్న విభాగాల్లో 1.5 లక్షలకుపైగా ప్రతిపాదనలు వచ్చాయి. ఆ తర్వాత వాటిపై ఓటింగ్ దశలో వివిధ అవార్డు విభాగాలకు సంబంధించి డిజిటల్ సృష్టికర్తలకు సుమారు 10 లక్షల ఓట్లు పోలయ్యాయి. అటుపైన ముగ్గురు అంతర్జాతీయ సారాంశ సృష్టికర్తలసహా 23 మంది విజేతలుగా నిలిచారు. పురస్కార గ్రహీతల నిర్ణయ ప్రక్రియలో ప్రజానీకం ఇంత విస్తృతంగా పాల్గొనడం వారి వాస్తవిక ఎంపికను ప్రతిబింబించిందనడానికి నిదర్శనం.

   ఉత్తమ కథకుడి అవార్డుసహా… ‘‘ది డిజ్రప్టర్ ఆఫ్ ది ఇయర్; సెలబ్రిటీ క్రియేటర్ ఆఫ్ ది ఇయర్; గ్రీన్ ఛాంపియన్ అవార్డు; సామాజిక మార్పుపై ఉత్తమ సృష్టికర్త; అత్యంత ప్రభావశీల అగ్రి సృష్టికర్త; ఈ ఏడాది సాంస్కృతిక రాయబారి; అంతర్జాతీయ సృష్టికర్త అవార్డు; ఉత్తమ ప్రయాణ సృష్టికర్త అవార్డు; స్వచ్ఛత రాయబారి అవార్డు; న్యూ ఇండియా ఛాంపియన్ అవార్డు; టెక్ క్రియేటర్ అవార్డు; హెరిటేజ్ ఫ్యాషన్ ఐకాన్ అవార్డు; అత్యంత సృజనాత్మక సృష్టికర్త (పురుష-మహిళా); ఆహార కేటగిరీలో ఉత్తమ సృష్టికర్త; విద్యా విభాగంలో ఉత్తమ సృష్టికర్త; గేమింగ్ కేటగిరీలో ఉత్తమ సృష్టికర్త; ఉత్తమ మైక్రో క్రియేటర్; ఉత్తమ నానో సృష్టికర్త; ఉత్తమ ఆరోగ్యం-దృఢత్వ సారాంశ సృష్టికర్త’’ వంటి 20 విభాగాల్లో ఈ పురస్కారం ప్రదానం చేయబడింది.