Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

తమిళనాడులోని తిరుచిరాపల్లిలో రూ.20,000 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపన.. ప్రారంభోత్సవం.. జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి

తమిళనాడులోని తిరుచిరాపల్లిలో రూ.20,000 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపన.. ప్రారంభోత్సవం.. జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి


   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ తమిళనాడులోని తిరుచిరాపల్లి నగరంలో రూ.20,000 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన, జాతికి అంకితం చేశారు. వీటిలో పౌర విమానయానం, రైలు, రోడ్డు, చమురు-గ్యాస్, రేవులు తదితర రంగాలకు చెందిన పథకాలున్నాయి. ఈ కార్యక్రమాల సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ తొలుత- కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సకల సౌభాగ్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. అలాగే 2024లో తన తొలి ప్రజాసంబంధ కార్యక్రమం తమిళనాడులో జరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

   రాష్ట్రంలో ఇవాళ రూ.20,000 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన, జాతికి అంకితం చేయడంపై ప్రజలకు అభినందనలు తెలిపారు. ఇవన్నీ తమిళనాడు ప్రగతిని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. రైలు-రోడ్డు  మార్గాలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, ఇంధనం, పెట్రోలియం పైప్‌లైన్‌ల తదితర రంగాల్లో ఇవన్నీ సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేస్తాయని ప్రధాని తెలిపారు. ఆ మేరకు ప్రయాణ సదుపాయాలను పెంచడంతోపాటు రాష్ట్రంలో వేలాది ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తాయని వెల్లడించారు.

   తమిళనాడు ప్రజలు గత మూడు వారాల్లో కష్టనష్టాలు ఎదుర్కొన్నారని, భారీవర్షాలతో ప్రాణనష్టంతోపాటు గణనీయ ఆస్తి నష్టం కూడా సంభవించిందని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతూ, రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. ఈ మేరకు ‘‘రాష్ట్ర ప్రభుత్వానికి అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తున్నాం’’ అని గుర్తుచేశారు.

   ప్రముఖ తమిళ నటుడు శ్రీ విజయకాంత్‌ మృతిపై ప్రధాని మోదీ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ‘‘సినిమా రంగంలోనేగాక రాజకీయాల్లోనూ ‘కెప్టెన్’గా ఆయన తననుతాను రుజువు చేసుకున్నారు. జనజీవితంలో తన కృషితోనే కాకుండా నటనా పటిమతోనూ ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. అన్నింటికీ మించి జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చారు’’ అని కొనియాడారు. అలాగే దేశ ఆహార భద్రతకు భరోసా ఇవ్వడంలో ప్రముఖ పాత్ర పోషించిన డాక్టర్ ఎం.ఎస్.స్వామినాథన్ అద్వితీయ సేవానిరతిని ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన శ్రద్ధాంజలి ఘటించారు.

   మన దేశం ‘వికసిత భారతం’ రూపొందడంలో రాబోయే 25 ఏళ్ల స్వాతంత్ర్య అమృత కాలం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఈ సంకల్పంలో ఇమిడి ఉన్న ఆర్థిక, సాంస్కృతిక కోణాలను కూడా ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా భారతదేశ సంస్కృతి-సౌభాగ్యాలకు  తమిళనాడు ప్రతిబింబమని ఈ సందర్భంగా ప్రధాని నొక్కిచెప్పారు. ‘‘ఈ రాష్ట్రం ప్రాచీన తమిళ భాషా నిలయం.. ఇది సాంస్కృతిక వారసత్వ సంపద’’ అని కొనియాడారు. ఈ మేరకు అద్భుత సాహిత్య సృష్టికర్తలైన తిరువళ్లువర్, సుబ్రమణ్య భారతి వంటి మహనీయులను ప్రస్తుతించారు. అదేవిధంగా తమిళనాడు వాస్తవ్యులైన సి.వి.రామన్ తదితర శాస్త్రవేత్తలు ఈ రాష్ట్రాన్ని సందర్శించినప్పుడల్లా తనలో కొత్త శక్తిని నింపుతారని పేర్కొన్నారు. ఎందరో సాహితీవేత్తలు,శాస్త్రజ్ఞులు, సాంకేతిక నిపుణులకు తమిళనాడు పురిటిగడ్డ అని ప్రధాని అభివర్ణించారు.

   తిరుచిరాపల్లి నగర సుసంపన్న వారసత్వం గురించి మాట్లాడుతూ- పల్లవ, చోళ, పాండ్య, నాయక రాజవంశాల సుపరిపాలన నమూనాల ఆనవాళ్లు ఇక్కడ మనకు దర్శనిమిస్తాయని ప్రధాని మోదీ అన్నారు. విదేశీ పర్యటనల వేళ ఎప్పుడు అవకాశం లభించినా తాను తమిళ సంస్కృతిని తప్పక ప్రస్తావించేవాడినని గుర్తుచేశారు. ‘‘దేశ ప్రగతి, వారసత్వాల్లో తమిళ సాంస్కృతిక ప్రేరణ నిరంతర విస్తరణకు నేను కట్టుబడి ఉన్నాను’’ అని ప్రధాని ప్రకటించారు. కొత్త పార్లమెంటు భవనంలో పవిత్ర సెంగోల్‌ ప్రతిష్టాపనను ఈ సందర్భంగా గుర్తుచేశారు. అలాగే కాశీ-తమిళ, సౌరాష్ట్ర-తమిళ సంగమం వంటి కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ తమిళ సంస్కృతిపై ఉత్సుకత పెంచేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.

   దేశవ్యాప్తంగా రోడ్డు-రైలు మార్గాలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, పేదలకు గృహాలు, ఆస్పత్రుల నిర్మాణం వంటి రంగాల్లో భారీ పెట్టుబడులు పెడుతుండటాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఈ మేరకు గడచిన పదేళ్లుగా భౌతిక మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో భారతదేశం ప్రపంచంలోని 5 అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల జాబితాలో స్థానం సంపాదించిందని, తద్వారా యావత్ ప్రపంచానికీ ఆశాకిరణంగా మారిందని పేర్కొన్నారు. ప్ర‌పంచం నలుమూలలనుంచీ మన దేశంలోకి భారీగా వ‌స్తున్న పెట్టుబ‌డుల‌ ప్రవాహం గురించి చెబుతూ- ఈ క్రమంలో ‘మేక్ ఇన్ ఇండియా’ బ్రాండుకు తమిళనాడు ప్ర‌ధాన ప్రతినిధిగా మారిందని అభివర్ణించారు. ఈ మేరకు తమిళనాడు రాష్ట్రం, ప్రజలు ప్రత్యక్ష ప్రయోజనాలు పొందుతున్నారని ప్రధాని అన్నారు.

   దేశ ప్రగతిలో రాష్ట్రాల అభివృద్ధి ప్రతిబింబించాలన్నదే తమ ప్రభుత్వ విధానమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. గత ఏడాది కాలంలో 40 మందికిపైగా కేంద్ర మంత్రులు తమిళనాడులో 400 సార్లు పర్యటించారని గుర్తుచేశారు. ఆ మేరకు ‘‘తమిళనాడు ప్రగతి ప్రయాణంతో భారతదేశం కూడా  పురోగమిస్తుంది’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు. వ్యాపారాలకు చేయూతసహా ప్రజలకు జీవన సౌలభ్యం కల్పించడంలో అనుసంధాన సదుపాయాల అభివృద్ధి కీలక మాధ్యమమని ప్రధాని మోదీ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి కార్యక్రమాల గురించి వివరిస్తూ- తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయ కొత్త టెర్మినల్ భవన నిర్మాణంతో దీని సామర్థ్యం మూడు రెట్లు పెరుగుతుందన్నారు. అంతేగాక తూర్పు ఆసియా, మధ్యప్రాచ్యంసహా ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు అనుసంధానం మరింత బలోపేతం కాగలదని చెప్పారు. కొత్త టెర్మినల్ భవన ప్రారంభోత్సవం ఫలితంగా పెట్టుబడులు, వ్యాపారాలు, విద్య, ఆరోగ్యం, పర్యాటక రంగాల్లో కొత్త అవకాశాల సృష్టికి వీలుంటుందని తెలిపారు. ఎలివేటెడ్ రహదారి ద్వారా జాతీయ రహదారులకు విమానాశ్రయంతో అనుసంధానం పెంచడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. తిరుచ్చి విమానాశ్రయ మౌలిక సదుపాయాల అభివృద్ధి వల్ల ప్రపంచానికి తమిళ సంస్కృతి-వారసత్వాల పరిచయం సుగమం కానుండటంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

   రైల్వే రంగంలో ఐదు కొత్త ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తూ- వీటివల్ల పరిశ్రమలతోపాటు విద్యుదుత్పాదనకు ప్రోత్సాహం లభిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. అలాగే కొత్త రహదారి ప్రాజెక్టులు శ్రీరంగం, చిదంబరం, రామేశ్వరం, వెల్లూర్ వంటి కీలక భక్తివిశ్వాస కేంద్రాలతో పర్యాటక రంగాన్ని అనుసంధానిస్తాయని తెలిపారు. మరోవైపు రేవుల చోదక ప్రగతిపై పదేళ్లుగా కేంద్ర  ప్రభుత్వం దృష్టి సారించడం గురించి ఆయన వివరించారు. ఇందులో భాగంగా తీర ప్రాంతాల అభివృద్ధి, మత్స్యకారులకు జీవన సౌలభ్యం చేకూర్చే ప్రాజెక్టులను ఆయన ప్రస్తావించారు. మత్స్య పరిశ్రమాభివృద్ధి కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుతోపాటు బడ్జెట్ కేటాయించడాన్ని గుర్తుచేశారు. అలాగే మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డు వర్తింపు, సముద్రపు లోతుల్లో చేపల వేటకు తగినట్లు పడవల ఆధునికీకరణకు సహాయం, ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన వంటివాటిని ప్రధాని ఉదాహరించారు.

   మరో ప్రతిష్టాత్మక పథకం ‘సాగరమాల’ గురించి వివరిస్తూ- దేశంలోని ఓడరేవులను మెరుగైన రహదారులతో అనుసంధానించడాన్ని ప్రధాని గుర్తుచేశారు. కామ్‌రాజర్ ఓడరేవు సామర్థ్యం రెట్టింపు కావడాన్ని ప్రస్తావిస్తూ- దీంతోపాటు నౌకలు తిరిగి రేవుకు చేరే సమయం గణనీయంగా మెరుగుపడటాన్ని వివరించారు. తమిళనాడు దిగుమతి-ఎగుమతులలో… ముఖ్యంగా ఆటోమొబైల్ రంగాన్ని బలోపేతం చేసే కామరాజర్ పోర్ట్ జనరల్ కార్గో బెర్త్-II ప్రారంభోత్సవం ప్రాధాన్యాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అదేవిధంగా ఉపాధి అవకాశాలను పెంచే అణు రియాక్టర్, గ్యాస్ పైప్‌లైన్‌లను కూడా ప్రధాని స్పృశించారు.

   త‌మిళ‌నాడులో కేంద్ర ప్ర‌భుత్వం రికార్డుస్థాయిలో నిధులు వెచ్చించడం గురించి ప్ర‌ధానమంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా 2014కు ముందు దశాబ్దంలో రాష్ట్రాలకు కేంద్రం నుంచి లభించింది రూ.30 లక్షల కోట్లు మాత్రమేనని ఆయన గుర్తుచేశారు. అయితే, తమ హయాంలో గత 10 ఏళ్ల వ్యవధిలో  ఇది రూ.120 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. ఇందులో భాగంగా 2014కు ముందు పదేళ్లలో  తమిళనాడుకు అందిన నిధులకన్నా తమ పదేళ్ల పాలనలో 2.5 రెట్లు ఎక్కువగా కేటాయించినట్లు తెలిపారు. ఈ మేరకు జాతీయ రహదారుల నిర్మాణం కోసం రాష్ట్రంలో ఖర్చు మూడు రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. అలాగే రైల్వేలకు సంబంధించి తమిళనాడులో 2.5 రెట్లు అధికంగా కేంద్రం వెచ్చించిందని చెప్పారు. రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలకు ఉచిత రేషన్, వైద్యం, పక్కా ఇళ్లు, మరుగుదొడ్లు, కొళాయిలద్వారా నీటి సరఫరా వంటి సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు.

   చివరగా- వికసిత భారతం సంకల్ప సాధనలో సమష్టి కృషి (సబ్‌కా ప్రయాస్) ఆవశ్యకతను ప్రధాని నొక్కిచెప్పారు. ఈ నేపథ్యంలో తమిళనాడు యువత, ప్రజల సామర్థ్యంపై తనకు దృఢ విశ్వాసం ఉందన్నారు. ‘‘తమిళనాడు యువతలో కొత్త ఆశలు చిగురించడాన్ని నేను చూస్తున్నాను. వారి ఆకాంక్షలే వికసిత భారతం సంకల్ప సాధనలో శక్తిప్రదాతలు’’ అంటూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ శ్రీ ఆర్.ఎన్.రవి, ముఖ్యమంత్రి శ్రీ ఎమ్.కె.స్టాలిన్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, సమాచార-ప్రసార శాఖ సహాయ మంత్రి శ్రీ ఎల్.మురుగన్ తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం

   తిరుచిరాపల్లి నగరంలో నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా రూ.1,100 కోట్లతో రెండు అంచెలుగా నిర్మించిన తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయ కొత్త  టెర్మినల్ భవనాన్ని ప్రధాని ప్రారంభించారు. ఈ భవనం ఏటా 44 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలను నిర్వహించగలదు. అంతేకాకుండా రద్దీ సమయాల్లో ఒకేసారి దాదాపు 3500 మందికి సేవలందించగల సామర్థ్యంతో ఇది నిర్మితమైంది. ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు, విశిష్టతలతో ఈ టెర్మినల్ రూపుదిద్దబడింది.

      దీంతోపాటు రైల్వేలకు సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. వీటిలో… 41.4 కిలోమీటర్ల పొడవైన సేలం–మాగ్నసైట్ జంక్షన్–ఓమలూరు–మెట్టూర్ డ్యామ్ విభాగం డబ్లింగ్ ప్రాజెక్ట్; మదురై-టుటికోరిన్ నుంచి 160 కిలోమీటర్ల రైలు మార్గం డబ్లింగ్ ప్రాజెక్ట్; వీటితోపాటు తిరుచిరాపల్లి-మనమదురై-విరుదునగర్; విరుదునగర్- తెన్‌కాశి జంక్షన్; సెంగోట్టై-తెన్‌కాశి జంక్షన్- తిరునల్వేలి-తిరుచెందూర్ మార్గాల్లో మూడు విద్యుదీకరణ ప్రాజెక్టులున్నాయి. ఇవి ప్రయాణిక-సరకు రవాణాలో రైల్వేల సామర్థ్యం పెంచుతాయి. అంతేకాకుండా తమిళనాడు ఆర్థికాభివృద్ధికి, ఉపాధి కల్పనకు దోహదం చేస్తాయి.

      అలాగే రహదారుల రంగంలో 5 ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. వీటిలో- జాతీయ రహదారి-81లోని తిరుచ్చి-కల్లగం విభాగంలో 39 కిలోమీటర్ల 4 వరుసల రోడ్డు; ఇదే జాతీయ రహదారిలోని కల్లగం-మీన్సురుట్టి విభాగంలో 60 కిలోమీటర్ల 4/2 వరుసల రోడ్డు; ఎన్‌హెచ్‌-785 పరిధిలో 29 కిలోమీటర్ల చెట్టికుళం-నాథమ్ విభాగం 4 వరుసల రోడ్డు; ఎన్‌హెచ్‌-536 పరిధిలో కారైకుడి- రామనాథపురం విభాగంలో 80 కిలోమీటర్ల 2 వరుసల మార్గం; ఎన్‌హెచ్‌-179ఎ పరిధిలో సేలం-తిరుపత్తూరు-వానియంబాడి మార్గంలో 44 కిలోమీటర్ల 4 వరుసల రోడ్డు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులతో ఈ ప్రాంత ప్రజలకు సురక్షిత, వేగవంతమైన ప్రయాణ సౌలభ్యం కలుగుతుంది. అలాగే తిరుచ్చి, శ్రీరంగం, చిదంబరం, రామేశ్వరం, ధనుష్కోటి, ఉత్తిరకోశమంగై, దేవీపట్టణం, ఎర్వాడి, మదురై వంటి పారిశ్రామిక, వాణిజ్య కూడళ్లకు అనుసంధానం మెరుగవుతుంది.

   ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని కీలక రహదారి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. వీటిలో… ఎన్‌హెచ్‌-332ఎ ప‌రిధిలోని ముగాయ్యూర్-మరక్కనం మధ్య 31 కిలోమీటర్ల 4 వరుసల రహదారి నిర్మాణం కూడా ఉంది. ఈ రహదారి తమిళనాడు తూర్పు తీరంలోని ఓడరేవులను కలుపుతుంది. అలాగే ప్రపంచ వారసత్వ ప్రదేశమైన మామల్లపురం (మహాబలిపురం) రహదారిని కలపడంతోపాటు కల్పక్కం అణువిద్యుత్ కేంద్రానికి అనుసంధానం మెరుగవుతుంది.

   మరోవైపు కామరాజర్ రేవులోని సార్వత్రిక సరకు రవాణా బెర్త్-2 (ఆటోమొబైల్ ఎగుమతి/దిగుమతి టెర్మినల్-II, క్యాపిటల్ డ్రెడ్జింగ్ ఫేజ్-4)ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. దీంతో దేశ వాణిజ్యాన్ని బలోపేతం చేసేదిశగా ముందడుగు పడుతుంది. ఇది ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనలోనూ ఇతోధికంగా తోడ్పడుతుంది.

   ఇదే కార్యక్రమంలో ప్ర‌ధానమంత్రి రూ.9,000 కోట్లకుపైగా విలువైన పెట్రోలియం-సహజ వాయువు ప్రాజెక్టుల‌లో కొన్నిటికి శంకుస్థాప‌న చేయడంసహా మరికొన్నిటిని జాతికి అంకితం చేశారు. దేశానికి అంకితం చేయబడిన రెండు ప్రాజెక్టులలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఒసిఎల్) పరిధిలో  ఎన్నూర్-తిరువళ్లూరు-బెంగళూరు-పుదుచ్చేరి-నాగపట్నం-మధురై-టుటికోరిన్ మార్గంలోని ‘ఐపి101’ (చెంగల్పట్టు) నుంచి ‘ఐపి105’ (సాయల్‌కుడి) వరకు 488 కిలోమీటర్ల పొడవైన సహజ వాయువు పైప్‌లైన్ ఒకటి; అలాగే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్‌) పరిధిలో 697 కిలోమీటర్ల పొడవైన విజయవాడ-ధర్మపురి (విడిపిఎల్) బహుళ ఉత్పత్తుల (పిఒఎల్) పెట్రో పైప్‌లైన్ మరొకటిగా ఉంది.

   ఇవేకాకుండా మరో రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వీటిలో ఒకటి…   గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (జిఎఐఎల్) చేపడుతున్న కొచ్చి-కూత్తనాడ్-బెంగళూరు-మంగళూరు గ్యాస్ పైప్‌లైన్-2 (కెకెబిఎంపిఎల్‌-II) ప్రాజెక్టు కింద కృష్ణగిరి-కోయంబత్తూరు విభాగంలో 323 కిలోమీటర్ల సహజవాయు పైప్‌లైన్ నిర్మాణం; రెండోది… చెన్నైలోని వల్లూర్ వద్ద ప్రతిపాదిత గ్రాస్ రూట్ టెర్మినల్ కోసం సార్వత్రిక కారిడార్‌లో ‘పిఒఎల్’ పైప్‌లైన్ల నిర్మాణం. పెట్రోలు-సహజ వాయువు రంగంలోని ఈ ప్రాజెక్టులతో ఈ ప్రాంత పారిశ్రామిక, గృహ, వాణిజ్య ఇంధనం అవసరాలు తీరడమేగాక ఉపాధి అవకాశాల సృష్టికి మార్గం ఏర్పడుతుంది.

   కల్పక్కంలోగల ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటమిక్ రీసెర్చ్ (ఐజిసిఎఆర్)లో డిమోన్‌స్ట్రేషన్ ఫాస్ట్ రియాక్టర్ ఫ్యూయల్ రీప్రాసెసింగ్ ప్లాంటును (డిఎఫ్ఆర్‌పి) ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. మొత్తం రూ.400 కోట్లతో నిర్మించిన ‘డిఎఫ్ఆర్‌పి’ ప్రత్యేక డిజైన్‌తో అమర్చబడింది. ఇది ప్రపంచంలో అరుదైనదే కాకుండా, దీనికి ఫాస్ట్ రియాక్టర్ల నుంచి విడుదలయ్యే కార్బైడ్-ఆక్సైడ్ ఇంధనాలను తిరిగి ప్రాసెస్ చేయగల సామర్థ్యం ఉంది. అంతేగాక పూర్తిగా భారతీయ శాస్త్రవేత్తల కృషితో రూపొందించబడింది. ఇది భారీ వాణిజ్య స్థాయి ఫాస్ట్ రియాక్టర్ ఇంధన రీప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్మాణంలో భారత్ సామర్థ్యం కీలక దశకు చేరిందనడానికి ఒక సంకేతం. వీటన్నిటితోపాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటి)-తిరుచిరాపల్లి ప్రాంగణంలో 500 పడకల యువకుల హాస్టల్ ‘అమెథిస్ట్’ను కూడా ప్రధాని ప్రారంభించారు.