Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

తమిళనాడులోని కోయంబత్తూరులో పలు మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

తమిళనాడులోని కోయంబత్తూరులో పలు మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం


తమిళనాడు గవర్నర్ శ్రీ భన్వారీలాల్ పురోహిత్‌గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పళనిస్వామిగారు, ఉప-ముఖ్యమంత్రి శ్రీ ఒ.పన్నీర్ సెల్వం గారు, నా మంత్రిమండలి సహచరులు ప్రహ్లాద్‌ జోషిగారు, తమిళనాడు ప్రభుత్వంలో మంత్రి శ్రీ వేలుమణిగారు, విశిష్ట అతిథులు… సోదరీ సోదరులారా!

వణక్కం! (నమస్కారం)

   కోయంబత్తూరుకు రావడం నాకెంతో సంతోషంగా ఉంది. ఇదొక పారిశ్రామిక, ఆవిష్కరణాత్మక నగరం. ఇవాళ ఇక్కడ మనం ప్రారంభించబోతున్న అభివృద్ధి పనులు కోయంబత్తూరుకు మాత్రమేగాక తమిళనాడు మొత్తానికీ ప్రయోజనకరమే.

మిత్రులారా !

   భవానీ సాగర్‌ ఆనకట్ట ఆధునికీకరణకు శంకుస్థాపన చేస్తున్నాం. దీనివల్ల రెండు లక్షల ఎకరాలకుపైగా భూమి సాగవుతుంది. ఈ ప్రాజెక్టుతో ముఖ్యంగా- ఈరోడ్, తిరుప్పూర్‌, కరూర్  జిల్లాలు ప్రయోజనం పొందుతాయి. ఈ జిల్లాల్లోని మన రైతులందరికీ ఈ ప్రాజెక్టువల్ల లబ్ధి చేకూరుతుంది. ఈ సందర్భంగా మహనీయులైన తిరువళ్లువర్‌ మాటలు గుర్తుకొస్తున్నాయి.

உழுதுண்டு வாழ்வாரே வாழ்வார்மற் றெல்லாம் (ఉళుదుండు వాళ్వారే వాళ్వార్; தொழுதுண்டு பின்செல் பவர். మట్రెల్లాం తొళుదుండు పిన్ సెల్వవర్‌)…

అంటే- “రైతులు మాత్రమే నిజంగా జీవించేవారు; మిగిలినవారంతా వారివల్లనే జీవిస్తారు; వారిని ఆరాధిస్తారు.”

మిత్రులారా!

   భారత పారిశ్రామిక ప్రగతికి తమిళనాడు ఇతోధికంగా తోడ్పడుతోంది. పరిశ్రమలు ఎదగాలంటే ప్రాథమికంగా అవసరమైన వాటిలో నిరంతరాయ విద్యుత్‌ సరఫరా ఒకటి. ఈ నేపథ్యంలో ఇవాళ రెండు ప్రధాన విద్యుదుత్పాదన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతోపాటు మరొకదానికి శంకుస్థాపన చేస్తుండటం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. నైవేలి లిగ్నైట్‌ కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎల్‌సి) తిరునల్వేలి, తూత్తుకుడి, రామనాథపురం, విరుద్‌నగర్‌ జిల్లాల్లో రూ.3వేల కోట్ల వ్యయంతో 709 మెగావాట్ల సౌరశక్తి ప్రాజెక్టును అభివృద్ధి చేసింది. అలాగే ‘ఎన్‌ఎల్‌సి’ రూ.7,800 కోట్లతో నిర్మించిన 1000 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టు తమిళనాడు ప్రగతికి ఎంతగానో దోహదం చేస్తుంది. ఈ ప్రాజెక్టులో ఉత్పత్తయ్యే విద్యుత్తులో 65 శాతానికిపైగా తమిళనాడుకే కేటాయించబడుతుంది.

మిత్రులారా!

   సముద్ర వర్తకంలో, రేవు ఆధారిత అభివృద్ధిలో తమిళనాడుకు ఉజ్వల చరిత్ర ఉంది. దీనికి తగినట్లుగా తూత్తుకుడిలోని వి.ఒ.చిదంబరనార్‌ రేవు సంబంధిత వివిధ ప్రాజెక్టులను ప్రారంభించడం నాకెంతో సంతోషాన్నిస్తోంది. ఈ సందర్భంగా గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు వి.ఒ.సి కృషిని మననం చేసుకుందాం. బలమైన నౌకా పరిశ్రమ, నావికా సంబంధ అభివృద్పై ఆయన దార్శనికత మనకెంతో స్ఫూర్తినిస్తుంది. ఆ మేరకు ఇవాళ ప్రారంభిస్తున్న ప్రాజెక్టులతో ఈ రేవులో సరకుల రవాణా నిర్వహణ మరింత బలోపేతం అవుతుంది. దీంతోపాటు హరిత రేవుల అభివృద్ధిలో మన చొరవకు ఊతమిస్తుంది. అంతేకాకుండా తూర్పు తీరంలో ఈ రేవును ఓ పెద్ద నౌకా రవాణా కూడలిగానూ రూపొందించేందుకు చర్యలు తీసుకుంటాం. మన రేవులు మరింత సమర్థంగా రూపొందితే భారతదేశం స్వయం సమృద్ధం కావడంసహా అంతర్జాతీయ వాణిజ్య, రవాణా కూడలిగా అభివృద్ధి చెందగలదు. రేవుల ఆధారిత అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని ‘సాగరమాల’ పథకం ప్రస్ఫుటం చేస్తుంది. ఈ పథకం కింద రూ.6 లక్షల కోట్లకుపైగా వ్యయంతో 2015-2035 మధ్యకాలంలో సుమారు 575 ప్రాజెక్టులను అమలు చేయబోతున్నాం. “రేవుల ఆధునికీకరణ, కొత్త రేవుల అభివృద్ధి, రేవుల అనుసంధానం పెంపు, రేవుతో ముడిపడిన పారిశ్రామికీకరణ, తీరప్రాంత సామాజికాభివృద్ధి” తదితరాలు ఇందులో భాగంగా ఉంటాయి.

   చెన్నైలోని శ్రీపెరంబుదూరు సమీపానగల మాప్పేట్‌లో త్వరలోనే బహుముఖ సరకు రవాణా పార్కును ప్రారంభించబోతున్నామని ప్రకటించడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. మరోవైపు ‘సాగరమాల’ పథకంలో భాగంగానే 8 వరుసల కోరంపళ్లం బ్రిడ్జితోపాటు రైల్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం కూడా చేపడతాం. ఈ ప్రాజెక్టువల్ల రేవుకు వాహన రాకపోకల రద్దీ సజావుగా, నిరంతరాయంగా సాగిపోయే వీలుంటుంది. దీంతోపాటు సరకు రవాణా ట్రక్కులకు సమయం కలిసివస్తుంది.

మిత్రులారా!

   ప్రగతి, పర్యావరణ పరిరక్షణ పరస్పరం ముడిపడిన అంశాలు. ఈ నేపథ్యంలో వి.ఒ.సి. రేవు ఇప్పటికే 500 కిలోవాట్ల పైకప్పు సౌరశక్తి ప్లాంటును ఏర్పాటు చేసింది. ఇదేవిధమైన మరో 140 కిలోవాట్ల ప్రాజెక్టు ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా గ్రిడ్‌తో సంధానితమైన భూమిపై నిర్మించే 5 మెగావాట్ల సౌరవిద్యుత్‌ ప్లాంటును వి.ఒ.సి. రేవు యాజమాన్యం దాదాపు రూ.20 కోట్లతో చేపట్టడం నాకు చాలా సంతోషం కలిగించింది. రేవు వినియోగించే మొత్తం విద్యుత్తులో 60 శాతం అవసరాలను ఈ ప్రాజెక్టు తీరుస్తుంది. విద్యుత్‌ స్వయం సమృద్ధతకు ఇదొక తిరుగులేని ఉదాహరణ.

ప్రియ మిత్రులారా!

   అభివృద్ధిలో వ్యక్తుల ఆత్మగౌరవానికి భరోసా కల్పించడం ఓ కీలకాంశం. ప్రతి ఒక్కరికీ తలదాచుకునేందుకు ఇంత నీడ కల్పించడం ఇందుకుగల మార్గాల్లో ఒకటి. ఈ మేరకు మన పౌరుల ఆకాంక్షలకు, వారి స్వప్నాలకు రెక్కలు తొడగటం లక్ష్యంగా ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన ప్రారంభించబడింది. మిత్రులారా! ఈ నేపథ్యంలో 4,144 అద్దె సముదాయాలను ప్రారంభించడం నాకు దక్కిన మహదవకాశంగా భావిస్తున్నాను. ఇవన్నీ తిరుప్పూర్‌, మదురై, తిరుచిరాపల్లి జిల్లాల్లో నిర్మించబడ్డాయి. ఈ ప్రాజెక్టుకు రూ.332 కోట్లు వ్యయం కాగా, 70 ఏళ్ల సుదీర్ఘ స్వతంత్ర భారతంలో నేటికీ ఇంత నీడకు నోచుకోని పేదలకు ఈ ఇళ్లను అప్పగిస్తాం.

మిత్రులారా!

   తమిళనాడు భారీ పట్టణీకరణ చెందిన రాష్ట్రం. ఈ నగరాల సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంతోపాటు తమిళనాడు ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ఉన్నాయి. తమిళనాడులోని స్మార్ట్‌ నగరాల్లో సమీకృత కమాండ్‌-కంట్రోల్‌ సెంటర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడంపై నేనెంతో సంతోషిస్తున్నాను. తద్వారా ఈ నగరాలన్నిటా వివిధ సేవల నిర్వహణకు తగిన మేధోశక్తిగల సమీకృత సమాచార సాంకేతిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.

మిత్రులారా!

   ఇవాళ ప్రారంభించిన ప్రాజెక్టులు తమిళనాడులోని ప్రజల జీవితాలకు, జీవనోపాధికి భారీ స్థాయిలో ఉత్తేజం ఇవ్వగలవన్న విశ్వాసం నాకు మెండుగా ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ కొత్త ఇళ్ల తాళాలు అందుకుంటున్నవారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ స్వయం సమృద్ధ భారతం నిర్మించడంలో మా కృషి నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.

ధన్యవాదాలు…

థ్యాంక్యూ వెరీమచ్‌,

వణక్కం!!

 

***