సేవారంగంలో వాణిజ్యానికి తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు చేయూత నిచ్చే ఫ్రిఫరెన్షియల్ ట్రీట్ మెంట్ నోటిఫికేషన్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్లూటీవో) నిబంధనల మేరకు ఈ నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఈ నోటిఫికేషన్ వల్ల తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. ఆయా దేశాలకు సాంకేతిక అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం అందజేతలో భారత్ నుంచి సహకారం లభిస్తుంది. మార్కెట్ అందుబాటులో ఉంటుంది. భారత్ లో వాణిజ్యానికి లేదంటే ఉద్యోగం చేసేందుకు తక్కువ అభివృద్ధి చెందిన దేశాల నుంచి వచ్చే వీసా దరఖాస్తుల ఫీజులకు మినహాయింపు లభిస్తుంది. ఈ ప్రాధాన్యత నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి 15 ఏళ్ల పాటు అమలు లో ఉంటుంది. వస్తువుల వాణిజ్యానికి సంబంధించి భారత్ ఇప్పటికే డ్యూటీ ఫ్రీ టారిఫ్ ఫ్రిఫరెన్స్ (డీఎఫ్టీఎఫ్) పథకం ద్వారా ఔదార్యం ప్రదర్శిస్తోంది.