Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఢిల్లీ లో ఏడు జిపిఆర్ఎ కాలనీల పునరాభివృధికి మంత్రివర్గ ఆమోదం


ఢిల్లీ లోని ఏడు జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామడేషన్ (జిపిఆర్ఎ) కాలనీల పునరాభివృద్ధి ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు. సరోజిని నగర్, నేతాజి నగర్ మరియు నౌరోజి నగర్ కాలనీలను నేషనల్ బిల్డింగ్స్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్బిసిసి) ద్వారానూ, కస్తూర్బా నగర్, త్యాగరాజ్ నగర్, శ్రీనివాసపురి మరియు మహమ్మద్ పూర్ కాలనీలను సెంట్రల్ పబ్లిక్ వర్క్ స్ విభాగం (సిపిడబ్ల్యుడి) ద్వారానూ రీడెవలప్ చేస్తారు. ఈ కాలనీలలో ఇప్పుడు టైప్-I నుండి టైప్-IV వరకు ఇంచుమించు 7.49 లక్షల చదరపు మీటర్ల బిల్డప్ ఏరియా (బియుఎ)తో ఉన్న 12, 970 నివాస గృహాలనూ, అలాగే టైప్-II నుండి టైప్-VI వరకు సుమారు 29.18 లక్షల చదరపు మీటర్ల బియుఎ తో ఉన్న 25,667 నివాస గృహాలను ఇతర సాంఘిక మౌలిక సదుపాయాలతో సహా అభివృద్ధి చేయనున్నారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా నేతాజి నగర్ లో సుమారు 2.42 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రభుత్వ కార్యాలయ వసతిని సైతం అభివృద్ధి చేస్తారు.

30 ఏళ్ల పాటు నిర్వహణ మరియు మరమ్మత్తుల ఖర్చులు కలుపుకొని ఈ ప్రాజెక్టు కు మొత్తం అంచనా వ్యయం రూ.32,835 కోట్లు కావచ్చు. రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న నౌరోజి నగర్ మరియు సరోజిని నగర్ లోని కొన్ని ప్రాంతాలలో గల వాణిజ్యపరమైన బి యు ఎ ను విక్రయించడం ద్వారా స్వీయ ఆర్ధిక సహాయం (సెల్ఫ్ ఫైనాన్సింగ్) పద్ధతిలో ఈ ప్రాజెక్టును అమలు చేస్తారు.

ఈ ప్రాజెక్టును దశలవారీగా ఐదు సంవత్సరాలలో పూర్తి చేస్తారు.

పూర్వ రంగం:

జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సిఆర్)లో ప్రస్తుతం ప్రభుత్వ వసతి అవసరమైనంతగా లేదు. దీనితో ప్రభుత్వ అధికారులు తమకు అనువైన గృహ వసతి కోసం వేచి ఉండవలసి వస్తోంది. దీనిని ట్టణాభివృద్ధి శాఖ దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం పాతబడిన, శిథిలావస్థలో ఉన్న గృహ సముదాయాలను పునరాభివృద్ధి చేయాలన్న ఒక ప్రతిపాదనను సిద్ధం చేసింది. మాస్టర్ ప్లాన్ ఢిల్లీ (ఎంపిడి)- 2021 ప్రకారం భూవనరులను సాధ్యమైనంత ఎక్కువగా వినియోగించుకోవడం ద్వారాను మరియు గృహ యూనిట్ లను పెంచి గృహాలను నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ క్రమంలో హరిత భవన నిర్మాణ నియమావళి సహా ఆధునిక నిర్మాణ సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించనున్నారు. అలాగే ఘన రూప, ద్రవ రూప వ్యర్ధ పదార్ధాల యాజమాన్య సదుపాయాలను కాలనీలలోనే ఏర్పాటు చేయనున్నారు.