Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఢిల్లీ ఎక‌నామిక్స్ కాంక్లేవ్ ప్రారంభ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని ప్ర‌సంగం పూర్తి పాఠం

ఢిల్లీ ఎక‌నామిక్స్ కాంక్లేవ్ ప్రారంభ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని ప్ర‌సంగం పూర్తి పాఠం

ఢిల్లీ ఎక‌నామిక్స్ కాంక్లేవ్ ప్రారంభ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని ప్ర‌సంగం పూర్తి పాఠం

ఢిల్లీ ఎక‌నామిక్స్ కాంక్లేవ్ ప్రారంభ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని ప్ర‌సంగం పూర్తి పాఠం

ఢిల్లీ ఎక‌నామిక్స్ కాంక్లేవ్ ప్రారంభ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని ప్ర‌సంగం పూర్తి పాఠం

ఢిల్లీ ఎక‌నామిక్స్ కాంక్లేవ్ ప్రారంభ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని ప్ర‌సంగం పూర్తి పాఠం

ఢిల్లీ ఎక‌నామిక్స్ కాంక్లేవ్ ప్రారంభ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని ప్ర‌సంగం పూర్తి పాఠం


నా ప్రభుత్వ సహచరులు,

దేశ విదేశాలనుంచి వచ్చిన గౌరవనీయ అతిథులు, మిత్రులారా..

ఢిల్లీ ఆరవ ఆర్థిక సమ్మేళనంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. భారత్కు, ఇతర దేశాలకు చెందిన ఆర్థికవేత్తలు, విధానకర్తలు, మేధావులు అందరూ కలిసిన ఇది చక్కని వేదిక. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖను నేను అభినందిస్తున్నాను.

జన్ధన్ యోజన, ఆధార్ అండ్ మొబైల్ (జెఎఎమ్) మీ చర్చనీయాంశం. త్వరలో మనందరి ముందుకు రానున్న పలు చొరవలకు జెఎఎమ్ ఒక చక్కని వాహిక అవుతుంది. నా దృష్టిలో జెఎఎమ్ అంటే జస్ట్ అచీవ్ మాక్సిమమ్ (అవలీలగా గరిష్ఠ ఫలితం సాధించడం)

– ఖర్చు చేసే ప్రతీ రూపాయికి గరిష్ఠ విలువ

– పేదలకు గరిష్ఠ స్థాయి సాధికారత

– ప్రజల్లోకి టెక్నాలజీని గరిష్ఠ స్థాయిలో చొప్పించడం

భారత ఆర్థిక వ్యవస్థ గురించి కాస్త సంక్షిప్తంగా ప్రస్తావిస్తాను. 17 నెలల క్రితం మేం అధికారం చేపట్టిన నాటి కన్నా భారత ఆర్థిక వ్వవస్థ ఏ ప్రధాన ఆర్థిక సూచీని బట్టి చూసినా సరే చక్కని పనితీరును కనబరుస్తోంది.

– జీడీపీ జోరందుకుంది, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది.

– విదేశీ పెట్టుబడులు పెరిగాయి, కరెంట్ ఖాతా లోటు తగ్గింది.

– ఆదాయాలు పెరిగాయి, వడ్డీరేట్లు తగ్గాయి.

– విత్తలోటు తగ్గింది, రూపాయి స్థిరపడింది.

ఇదంతా యాదృచ్ఛికంగా జరిగింది కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్త వాస్తవానికి సవ్యంగా లేదు. అయినా మనం ఈ విజయం సాధించామంటే ఎంతో ఆలోచించి రూపొందించిన విధానాలే అందుకు ఊతం ఇచ్చాయి. మేం చేపట్టిన స్థూల ఆర్థిక సంస్కరణలు చాలా వరకు మీ అందరికి బాగా పరిచయం అయ్యే ఉంటాయి. మేం ఆర్థిక సమ్మిళితానికి చర్యలు చేపట్టాం. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు రిజర్వ్ బ్యాంకుతో మేం తొలిసారిగా ఒక అంగీకారానికి వచ్చాం. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నప్పటికీ ఉత్పాదక విభాగాల్లో ప్రభుత్వ పెట్టుబడులు గణనీయంగా పెంచాం. రెండు విధాలుగా ఇది సాధ్యమయింది. |శిలాజ ఇంధనాలపై కార్బన్ పన్ను విధింపు ఒకటి. డీజిల్ ధరపై సబ్సిడీ ఎత్తివేయాలన్న సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాం. దీని వల్ల ఇంధన సబ్సిడీ నిర్మూలించగలిగాం. బొగ్గుపై సెస్ను కూడా 50 రూపాయల నుంచి 200 రూపాయలు నాలుగు రెట్లు పెంచాం. అంతర్జాతీయంగా కార్బన్ పన్నులపై ఎక్కువగా మాట్లాడుతున్నారు. కాని అదంతా మాటలకే పరిమితం. మేం దాన్ని ఆచరణీయం చేశాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా వృథా వ్యయాన్ని నిర్మూలించడం రెండోది. వాటిలో కొన్ని మీ అజెండాలో భాగంగా ఉన్నాయి. అర్హులైన వారికి సబ్సిడీలు అందించేందుకు ఆధార్తో అనుసంధానం వాటిలో ప్రధానమైనది. ఈ సంస్కరణలు మీకు కూడా తెలిసి ఉండవచ్చు కాని మా సంస్కరణల పరిధి మరింత విస్తృతమైనది, మరింత లోతైనది, సార్వత్రికంగా గుర్తించినది.

దీన్ని మరింతగా వివరించేందుకు ముందు రెండు అంశాలు మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను. సంస్కరణలు ఎందుకు అన్నది మొదటిది. సంస్కరణల ప్రధానోద్దేశం ఏమిటి? జిడిపి వృద్ధిరేటును మరింతగా పెంచడం ఒక్కటేనా లేకపోతే, సమాజంలో పరివర్తన తీసుకురావడమా..? నా సమాధానం సుస్పష్టం, పరివర్తనకే సంస్కరణలు.

ఎవరికోసం సంస్కరణలు…ఇది రెండో ప్రశ్న. సంస్కరణల లబ్ధిదారులెవరు? మేధోపరమైన చర్చల్లో నిపుణుల బృందాలను మెప్పించి మంచి పాయింట్లు స్కోర్ చేయడమా, లేక అంతర్జాతీయ లీగ్ టేబుల్లో ర్యాంకు సాధించడమా…?ఇక్కడ కూడా నా జవాబు సుస్పష్టమే. పౌరులందరికీ ప్రత్యేకించి పేదలకు మేలు చేకూర్చి చక్కని జీవితాన్నిఅందించేదే సంస్కరణ. ‘సబ్కా సాథ్.. సబ్కా వికాస్’ సూత్రం మాది.

సూక్ష్మంగా సంస్కరణ ఏదైనా దానికదే అంతం కాదు. నా దృష్టిలో సంస్కరణ అంటే చక్కని భవిష్యత్తు దిశగా సాగించే ప్రయాణంలో ఒక స్టేషన్ మాత్రమే. మా గమ్యం భారత పరివర్తన. అంటే మేం చేపట్టినది పరివర్తన దిశగా సంస్కరణ. పరివర్తన కోసం సంస్కరణ ఒక సుదీర్ఘమైన పరుగు.

మేం చేపట్టిన సంస్కరణలు చాలా రకాలు. ఆర్థిక, వ్యవస్థాత్మక, సంస్థాగత సంస్కరణలుగా వాటిని నేను వర్గీకరిస్తున్నాను. వాటన్నింటినీ ఇక్కడ ప్రస్తావించడం సాధ్యం కాదు…కాని అత్యంత ప్రముఖమైనవి తప్పకుండా వివరిస్తాను.

తొలుత ఆర్థిక సంస్కరణలకు వద్దాం. వడ్డీరేట్లు, క్రెడిట్ పాలసీ గురించి మేం తరచు మాట్లాడతాం. వడ్డీరేట్లలో మార్పుల గురించి నెలల తరబడి చర్చిస్తున్నాం. ఆ వాదోపవాదాల కోసం టన్నుల కొద్ది న్యూస్ప్రింట్, గంటల కొద్ది టివి ప్రసారాలు ఖర్చయ్యాయి. కాని బ్యాంకింగ్ పరిశ్రమ పరిధికి వెలుపల ఉండిపోయిన వారికి ఇదంతా అవసరమా…? బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి అవకాశమే లేని వ్యక్తికి ఇంత చర్చ వాంఛనీయమా…? దేశంలో అధిక జనాభా ఇదే స్థితిలో ఉండగా వారికి వడ్డీరేట్లు ఏ విధంగా కీలకాంశం అవుతాయి? అందుకే అభివృద్ధి నిపుణులు ఆర్థిక సమ్మిళిత సూత్రం ప్రచారం చేస్తున్నారు. 17 నెలల్లో మేం 190 మిలియన్ ప్రజలను బ్యాంకింగ్ వ్యవస్థకు చేరువ చేయగలిగాం. ప్రపంచంలోని కొన్ని దేశాల జనాభా కన్నా కూడా ఈ సంఖ్య ఎక్కువ. అలాంటి వారందరికీ ఇప్పుడు వడ్డీరేట్ల అవసరం ఏర్పడింది. వారు ఒక పిరమిడ్కు అడుగు భాగం బలం ఏమిటో నిరూపించారు. నమ్మండి…నమ్మకపోండి, జన్ధన్ యోజన కింద తెరిచిన ఖాతాల్లో ఇప్పుడు 26 వేల కోట్ల రూపాయలు లేదా నాలుగు వందల కోట్ల డాలర్ల నిధులు నిల్వ ఉన్నాయి. మా ఆర్థిక సమ్మిళితం సంస్కరణ పరివర్తనతో కూడినదనేందుకు ఇదే తార్కాణం. అయినా ఈ సంస్కరణకు రావలసినంత గుర్తింపు రాలేదు.

పేదలు ఎలక్ర్టానిక్ చెల్లింపులు అందుకోవడం, చేయడానికి జన్ధన్ యోజన ఒక పరివర్తన సాధనంగా నిలిచింది. ప్రతి జన్ధన్యోజన ఖాతాదారు డెబిట్ కార్డు అందుకునే అర్హత పొందారు. మొబైల్ ఎటిఎంలు ఉపయోగించాల్సిందిగా భారతీయ బ్యాంకులు ప్రజలను ప్రోత్సహిస్తున్నాయి. చేతిలో పట్టుకోగల ఒక డివైస్ సహాయంతో నగదు తీసుకోవడం, తేలికపాటి బ్యాంకింగ్ కార్యకలాపాల నిర్వహణకు మొబైల్ ఎటిఎంలు ఉపయోగపడుతున్నాయి. జన్ధన్యోజనకు, రూపే కార్డుకు కృతజ్ఞతలు. డెబిట్కార్డు, క్రెడిట్ కార్డుల విభాగంలో ఆరోగ్యవంతమైన పోటీని మేం ప్రవేశపెట్టాం. సాంప్రదాయికంగా ఈ విభాగంలో కొన్ని అంతర్జాతీయ సంస్థల ఆధిపత్యం కొనసాగుతోంది. ఏడాది క్రితం కూడా మనకి దేశీయ కార్డు బ్రాండ్ ఏదీ లేదు. కాని ఈ రోజు దేశంలోని 36 శాతం డెబిట్ కార్డులు రూపే కార్డులే.

బ్యాంకు ఖాతాలు తెరిచి, ఎలక్ర్టానిక్ చెల్లింపులు అందుబాటులోకి తెచ్చినంత మాత్రాన ఆర్థిక సమ్మిళితం సాధించినట్టు కాదు.

భారతీయుల్లో అద్భుతమైన పారిశ్రామిక ధోరణులున్నాయని నాకు తెలుసు. వారికి సరైన ప్రోత్సాహం ఇచ్చి వెన్ను తట్టినట్టయితే మన దేశం ఉద్యోగార్థుల దేశం స్థాయి నుంచి ఉద్యోగ కల్పన దేశంగా మారుతుంది. 58 మిలియన్ నాన్ కార్పొరేట్ సంస్థలు 128 మిలియన్ ఉద్యోగాలు అందిస్తున్నట్టు మేం అధికారంలోకి వచ్చినప్పుడు గుర్తించాం. వారిలో 60 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారు. ఆ సంస్థల్లో 40 శాతానికి పైబడి వెనుకబడిన తరగతులు, 15 శాతం షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన ఔత్సాహికుల చేతిలో ఉన్నాయి. వారికి ఆర్థిక సహాయంలో మాత్రం బ్యాంకు రుణాల వాటా చాలా తక్కువగా ఉంది. చాలా మంది బ్యాంకు రుణం అసలు అందుకోనైనా లేదు. ఆర్థిక రంగంలో అత్యధిక ఉపాధికి ఆసరాగా నిలుస్తున్న విభాగానికి బ్యాంకు రుణం కనుచూపులోనైనా లేదు. ఇలా నిధులు అందుబాటులో లేని వారికి రుణపరపతి అందుబాటులోకి తేవడం మేం చేపట్టిన రెండో సంస్కరణ. ముద్రాగా సుప్రసిద్ధమైన మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీని మేం ఇందుకోసం రూపొందించాం. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం కింద బ్యాంకులు ఇప్పటికే చిన్న వ్యాపారులకు 6 మిలియన్ రుణాలు అందించాయి. ఈ రుణాల విలువ 38 వేల కోట్ల రూపాయలు లేదా 600 బిలియన్ డాలర్లు. ఒక్కో రుణం రెండు ఉద్యోగాలు కల్పిస్తుందని అంచనా వేస్తే, 12 మిలియన్ కొత్త రుణాలకు మేం పునాదులు వేశాం. కార్పొరేట్ రంగం రెండు వందల లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసినా, ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించలేదు. దేశంలోని ప్రతీ బ్యాంకుకు చెందిన ప్రతీ ఒక్క బ్రాంచి 1,25,000 బ్రాంచిలు ఒక్కో దళితునికి లేదా ఒక షెడ్యూల్డు తెగలకు చెందిన వ్యక్తికి, ఒక మహిళకు వ్యాపారం ప్రారంభించుకునేందుకు రుణం మంజూరు చేయాలన్న స్కీమ్ ప్రవేశపెట్టాం. అటల్ ఇన్నోవేషన్ మిషన్ అండ్ ద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ టాలెంట్ యుటిలైజేషన్ ప్రోగ్రాం కింద నవ్యతను, స్టార్టప్లను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాం.

కొత్త సామాజిక భద్రతా పథకాల ద్వారా సామాజిక భద్రతను విస్తరించేందుకు తీసుకున్న చర్యలు ఆర్థికంగా తీసుకున్న మరో కీలక సంస్కరణ. ప్రమాద బీమా, జీవితబీమా, పింఛన్లు మూడు విభాగాలను కవర్ చేస్తూ ఏ మాత్రం సబ్సిడీ భారం లేని తక్కువ వ్యయంతో కూడిన స్కీమ్లను మేం ప్రవేశపెట్టాం. వాటి పరిధి చాలా విస్తృతం కావడం వల్ల ప్రీమియం అతి తక్కువగా నిర్ణయించడం సాధ్యమయింది. ఈ స్కీమ్లకు ఇప్పుడు 120 మిలియన్ చందాదారులున్నారు.

ఈ సంస్కరణలు విజయవంతం కావడానికి శక్తివంతమైన బ్యాంకింగ్ వ్యవస్థ చాలా కీలకం. బ్యాంకింగ్ నిర్ణయాలు, పిఎస్యు బ్యాంకుల నియామకాల్లో అవినీతి, క్రోనీయిజమ్ విచ్చలవిడిగా ఉన్న వ్యవస్థ మనకి వారసత్వంగా లభించింది. జ్ఞాన సంగమ్ పేరిట నిర్వహించిన బ్యాంకర్లతో ప్రధాని తొలి భేటీ కార్యక్రమంలో ఈ తరహా వ్యవస్థను పూర్తిగా మార్చి వేశాం. స్పష్టమైన పెర్ఫార్మెన్స్, బాధ్యతాయుత ధోరణి గల యంత్రాంగం సహాయంతో సమర్థతను పెంచేందుకు చర్యలు తీసుకున్నాం. తగినంత మూలధనం అందించేందుకు కూడా మేం కట్టుబాటు ప్రకటించాం.

ఈ చర్యలకు తోడు కొన్ని శక్తివంతమైన ఆర్థికేతర చర్యలు కూడా తీసుకున్నాం. బ్యాంకింగ్లో ఇతరుల జోక్యానికి తెర పడింది. బ్యాంకు బోర్డ్స్ బ్యూరో కింద కొత్త నియామకాల విధానం అమలులోకి తెచ్చాం. విశ్వసనీయత, సమర్థత కలిగిన వారిని బ్యాంకుల అధిపతులుగా నియమించాం. 46 సంవత్సరాల క్రితం బ్యాంకులు జాతీయం అయిన తొలిసారిగా ప్రైవేటు రంగానికి చెందిన వృత్తి నిపుణులను పిఎస్బి కీలక పదవుల్లో నియమించాం. ఇది ఒక పెద్ద సంస్కరణ.

పేదరిక నిర్మూలనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇందుకోసం మేం ప్రారంభించిన ఉద్యమాన్ని పేదరిక నిర్మూలన ఉద్యమంగా పిలవవచ్చు. దీని ఉద్దేశం గొప్పదే. చక్కగా రూపొందించిన స్కీమ్లు, సబ్సిడీలకు ఈ విధానంలో కీలక స్థానం ఉంటుంది. కాని పేదరిక నిర్మూలన పరిశ్రమను సాధికారం చేయడం కన్నా పేదలను సాధికారం చేయడం వల్లనే అధిక ప్రయోజనం ఉంటుంది. మేం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు పేదరికంపై పేదలే స్వయంగా పోరాటం చేసేందుకు అవకాశం కల్పిస్తాయి. ఇందుకు సంబంధించిన మౌలిక వ్యవస్థ, పునాదుల నిర్మాణానికి కొంత వ్యయం అవుతుంది. ఆ తర్వాత వాటికి సంబంధించిన ఫర్నిచర్, ఫిటింగ్లు, ఫిక్సర్ల నిర్మాణం జరుగుతుంది. పునాది, నిర్మాణం బలహీనంగా ఉంటే ఎంత అందమైన ముస్తాబులైనా వృథా అవుతాయి. పేదలను సాధికారం చేయడం వల్ల ఆర్థిక సమ్మిళిత విధానాలు, సామాజిక భద్రత మరింత స్థిరత్వం సాధిస్తాయి. శాశ్వత పరిష్కారాలకు అవకాశం కలుగుతుంది.

ఇప్పుడు వివిధ రంగాల్లో వ్యవస్థాత్మక సంస్కరణల విషయం పరిశీలిద్దాం…

ప్రజలకు జీవనోపాధి కల్పించడంలో భారత్లో వ్యవసాయ రంగం ఎప్పటికీ ప్రధానమైనదిగానే ఉంటుంది. ఈ రంగంలో మేం పలు సంస్కరణలు ప్రవేశపెట్టాం. ఎరువుల సబ్సిడీలను రసాయనాల తయారీకి తరలించే ఒక ధోరణి ఉంది. ఎరువులకు వేపపూత పూయడం వంటి తేలికపాటి ఉపాయం ద్వారా వాటిని ఇతర ప్రయోజనాలకు మళ్ళించే అవకాశం ఉండదు. గతంలో దీన్ని స్వల్ప పరిమాణంలో అమలుపరిచారు. యూరియా అంతటికీ వేపపూత పూసే విధానం మేం ప్రవేశపెడుతున్నాం. వ్యవసాయ సబ్సిడీల దారి మళ్ళింపును నిరోధించడం ద్వారా ఇప్పటికే కోట్ల రూపాయలు ఆదా అయింది. తేలికపాటి సంస్కరణ ఎంత సమర్థవంతంగా పని చేస్తుందనేందుకు ఇది ఒక ఉదాహరణ.

జాతీయ స్థాయిలో సాయిల్ హెల్త్ కార్డును మేం ప్రవేశపెట్టాం. దీని ద్వారా ప్రతీ ఒక్క రైతుకు అతని లేదా ఆమె భూమి ఎంత సారవంతంగా ఉందో తెలుస్తుంది. దాని వల్ల రైతాంగం వ్యవసాయ ఉపకరణాల్లో సరైన నాణ్యత, సరైన మిశ్రమం ఎంపిక చేసుకోగలుగుతారు. వ్యవసాయ ఉపకరణాల్లో వృథాను నివారించడంతో పాటు భూమిని కూడా సంరక్షించుకోగలుగుతాం. అనవసర రసాయనాల వినియోగం తగ్గడం ఉత్పత్తులను వినియోగించే వారికి కూడా మంచిదే. అలాగే తమ భూమికి ఏ పంట ఆదర్శవంతమైనదో కూడా రైతులు తెలుసుకోగలుగుతారు. చాలా మంది రైతులకు వారు సాంప్రదాయికంగా వేస్తున్న పంట కన్నా భిన్నమైన పంటకు తమభూమి ఎంత అనుకూలమో తెలియదు. ఆర్థిక పదజాలం కింద ఇది ‘విన్- విన్- విన్- విన్’ స్థితి. వ్యయాలు తగ్గుతాయి, దిగుబడులు పెరుగుతాయి, పర్యావరణం మెరుగుపడుతుంది, వినియోగదారుల ఆరోగ్యానికి భరోసా ఉంటుంది. ఈ రకంగా 140 మిలియన్ సాయిల్ హెల్త్ కార్డులు మేం జారీ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా పని చేస్తున్న 1500 ప్రయోగశాలల ద్వారా 25 మిలియన్ సాయిల్ శాంపిల్స్ పరీక్షించాల్సి ఉంటుంది. ఇప్పటికే నాలుగు మిలియన్ శాంపిల్స్ సేకరణ పూర్తయింది. ఇది కూడా పరివర్తన దిశగా చేపట్టిన సంస్కరణే.

అందరికి ఇల్లు కార్యక్రమాన్ని మేం చేపట్టాం. ప్రపంచంలోనే ఇది అత్యంత ఆశావహమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం కింద 20 మిలియన్ పట్టణ గృహాలు, 30 మిలియన్ గ్రామీణ గృహాలు, వెరసి 50 మిలియన్ గృహాలు నిర్మిస్తున్నాం. ఏ ఒక్క భారతీయుడు ఇల్లు లేకుండా ఉండకూడదన్నది ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ బృహత్ కార్యక్రమం వల్ల నైపుణ్యాలు లేని వారికి భారీ ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఈ బహుముఖీన కార్యక్రమం పూర్తిగా పరివర్తనీయమైనదే.

భారత కార్మిక మార్కెట్ గురించి ఎంతో రాశారు, ఎంతో చెప్పారు. మేం ఇప్పటికే పలు చర్యలు చేపట్టాం. చాలా మంది కార్మికులు ఉద్యోగాలు మారినప్పుడు ప్రావిడెంట్ ఫండ్, ఇతర ప్రయోజనాలు అందక బాధ పడేవారు. ఒక యజమాని కింద జమ అయిన ప్రయోజనాలు ఇతర యజమానికి బదిలీ కావడం చాలా కష్టంగా ఉండేది. దాన్ని పరిష్కరించేందుకు మేం యూనివర్సల్ నంబర్ విధానం ప్రవేశపెట్టాం. ఉద్యోగి సంస్థ మారినా, అదే నంబర్ కొనసాగుతుంది. కార్మిక శక్తి ఎక్కడకు కావాలంటే అక్కడకు కదిలి వెళ్ళడానికి ఇది సహాయకారిగా ఉంటుంది. ఇటు ఉద్యోగులకు, అటు యాజమాన్యాలకు కూడా పని తేలిక అవుతుంది.

మేం మరో అడుగు ముందుకేసి అవ్యవస్థీకృత రంగంలోని వారి సాధికారతకు చర్యలు తీసుకున్నాం. వారికి యూనివర్సల్ ఐడెంటిటీ నంబర్ జారీ చేశాం, కనీస సామాజిక భద్రత ప్రయోజనం అందేలా చూశాం. రానున్న సంవత్సరాల్లో ఉద్యోగ నాణ్యతను మెరుగుపరచడంలో ఇది ఎంతగానో దోహదకారి అవుతుంది.

ప్రధాని కావడానికి ముందు నాకు భారతదేశానికి ఎలాంటి సంస్కరణలు అవసరం అన్న విషయంలో పలువురు ఆర్థికవేత్తల నుంచి ఎన్నో సూచనలు అందాయి. కాని వారిలో ఎవరూ పారిశుధ్యం, స్వచ్ఛత గురించి ప్రస్తావించలేదు. సమాజంలో ఆరోగ్యం, నీటిపారుదల వసతులతో పాటు పారిశుధ్యం కూడా చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోంది. దాన్ని ఎవరైనా బడ్జెట్లు, ప్రాజెక్టులు, వ్యయం దృష్టిలోనే చూశారు. పారిశుధ్య లోపం అనేది ఆరోగ్య సమస్య కన్నా తీవ్రమైనది అన్నది అందరూ అంగీకరిస్తారు. మన సంక్షేమానికి సంబంధించిన అన్ని విభాగాలకు పారిశుధ్యంతో అనుసంధానం ఉంది. మహిళల విషయంలో పారిశుధ్యం మరింత ప్రధానం. మేం చేపట్టిన స్వచ్ఛ భారత్ ఉద్యమం, ఆరోగ్యం, పారిశుధ్యానికే కాదు…మహిళల హోదాను, భద్రతను కూడా పెంచుతుంది. అన్నింటి కన్నా మిన్నగా అందరూ బాగుండాలనే ఒక బలీయమైన వాంఛ కల్పిస్తుంది. ఈ సంస్కరణ విజయవంతం అయితే భారత్ సంపూర్ణ పరివర్తన సాధిస్తుందన్న నమ్మకం నాకుంది.

రవాణా రంగంలో కూడా నిర్వహణాపరమైన ఎన్నో సంస్కరణలు మేం చేపట్టాం. అంతర్జాతీయ వాణిజ్యం తీవ్ర మాంద్యంలో ఉన్న వాతావరణంలో కూడా 2014-15 ఆర్థిక సంవత్సరంలో మన ప్రధాన పోర్టులు రవాణాలో 5 శాతం, నిర్వహణాపరమైన ఆదాయాల్లో 11 శాతం వృద్ధిని నమోదు చేశాయి. షిప్పింగ్ కార్పొరేషన్ ఎన్నో సంవత్సరాలుగా నష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. 2013-14 సంవత్సరంలో 275 కోట్ల రూపాయల నష్టంలో ఉన్న ఆ సంస్థ 2014-15 సంవత్సరం నాటికి లాభాల బాటలో ప్రవేశించి 2014-15 సంవత్సరంలో 201 కోట్ల రూపాయల లాభం ఆర్జించింది. ప్రధాన రహదారుల నిర్మాణం 2012-13 సంవత్సరంలో రోజుకి 5.2 కిలోమీటర్లుండగా 2013-14 నాటికి 8.7 కిలోమీటర్లకు, ఇప్పుడు 23.4 కిలోమీటర్లకు పెరిగింది. ప్రభుత్వ రంగం పనితీరు మెరుగుపరిచేందుకు చేపట్టిన ఈ సంస్కరణ ఆర్థిక వ్యవస్థ మొత్తంపై బహుముఖీన ప్రభావాన్ని చూపింది.

ధనవంతుల ఇళ్ళలో మురిగిపోతున్న సొమ్ముగా పరిగణిస్తున్న బంగారాన్ని ఉత్పాదక అవసరాలకు అందుబాటులోకి తెచ్చే దిశగా కూడా మేం చర్యలు తీసుకున్నాం. భారతీయుల జీవితం సాంస్కృతికంగా బంగారంతో ముడిపడిపోయిన విషయం అందరికీ విదితమే. ఈ సాంస్కృతిక బంధానికి ఆర్థిక బంధం కూడా ఉన్న విషయం ఆర్థికవేత్తలుగా మీ అందరికీ తెలిసిన విషయమే. భారత్ తరచుగా అధిక ద్రవ్యోల్బణంతో అల్లాడుతూ ఉంటుంది. ద్రవ్యోల్బణం నుంచి రక్షణకు బంగారాన్ని మించిన సాధనం లేదు. పైగా దాని నిల్వ విలువ కూడా చాలా అధికం. సాంప్రదాయికంగా బంగారు ఆభరణాలకు యజమానులైన మహిళలకు సాధికారత తెచ్చే సాధనంగా కూడా బంగారానికి చాలా విలువ ఉంది. కాని ఈ ధోరణుల వల్ల ఆర్థిక వ్యవస్థకు బంగారం దిగుమతులు పెద్ద భారంగా నిలిచాయి. ఈ ధోరణులను నిరోధించడానికి మేం కొద్ది కాలం క్రితమే బంగారం ఆధారిత పథకాలు ప్రవేశపెట్టాం. ఈ పథకాలు దేశ ప్రజలకు ద్రవ్యోల్బణం నుంచి రక్షణ ఇవ్వడమే కాకుండా బంగారం భౌతికంగా ఉండాల్సిన పని లేకుండానే కొంత వడ్డీ కూడా అందిస్తాయి. ఈ పథకాలు పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తే ప్రజల ఆశలు తీరడంతో పాటు దిగుమతుల భారాన్ని కూడా తగ్గిస్తాయి. పరివర్తన దిశగా ఇది కూడా విశేషంగా చెప్పుకోదగ్గ సంస్కరణే.

వ్యవస్థాత్మకమైన, పాలనాపరమైన సంస్కరణల గురించి వివరించబోతున్నాను.

సంవత్సరాల తరబడి ప్రణాళికా సంఘం పనితీరు విషయంలో తీవ్ర విమర్శలకు గురవుతోంది. కేంద్ర అభీష్టాలను రాష్ర్టాలపై బలవంతంగా రుద్దుతున్న ఒక కేంద్రీయ వ్యవస్థగా పేరు గడించింది. అధికారం చేపట్టిన తర్వాత మేం ఒక కొత్త వ్యవస్థను నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా పేరిట (నీతి ఆయోగ్) రూపొందించాం. ఇది ప్రణాళికా సంఘం కన్నా పూర్తిగా భిన్నంగా ఉండాలన్నది నా ధ్యేయం. సహకార ఫెడరలిజం స్ఫూర్తితో కేంద్రం రాష్ట్రాలు సమాన భాగస్వాములుగా ఆలోచనలు, కార్యాచరణకు ఇది ఒక చక్కని వేదికగా నిలవాలని నేను భావించాను. కాని ఇది ఒక్క నినాదం మాత్రమేనని కొందరన్నారు. కాని అది పరివర్తిత శక్తిగా నిలిచిందనేందుకు ఎన్నో తార్కాణాలున్నాయి. అవేమిటో చూద్దాం.

కేంద్రప్రభుత్వ ఆదాయంలో రాష్ట్రాలకు మరింత హెచ్చు వాటా ఉండాలని 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన విషయం మీ అందరికీ తెలుసు. అంతర్గతంగా కొందరు దానికి వ్యతిరేకమైన సలహా ఇచ్చినా ఆ సిఫారసులు అమలు చేయడానికే నేను నిర్ణయించాను. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోకి కొన్ని పథకాల్లో మార్పులు చేయాల్సివచ్చింది. 1952లో మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రారంభమైన నాటి నుంచి కేంద్రం ఎన్నో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది. మేం దానికి భిన్నమైన పని చేశాం. ఆ పథకాల్లో ఎవరికి ఎంత వాటా ఉండాలనేది నిర్ణయించే బాధ్యతను కేంద్రప్రభుత్వంలో భాగస్వాములైన కొందరు మంత్రుల బృందానికి కాకుండా ముఖ్యమంత్రులు సభ్యులుగా గల ఒక ఉప సంఘానికి అప్పగించాం. ఆ ఉపసంఘం సిఫారసులను ముఖ్యమంత్రులందరూ ఏకగ్రీవంగా ఆమోదించడం సహకార ఫెడరలిజం స్ఫూర్తికి అత్యుత్తమ ఉదాహరణ. అది చాలా సంక్లిష్టమైన సమస్యే అయినా భిన్న రాజకీయ పార్టీల నుంచి వచ్చింది. అక్టోబర్ 27న వారి నివేదిక నాకు అందింది. వారు స్కీమ్ల భాగస్వామ్యానికి సంబంధించి చేసిన అత్యంత ప్రధానమైన సిఫారసును నేను అదే రోజున ఆమోదించాను. మర్నాడే రాతపూర్వకంగా కూడా ఉత్తర్వులు జారీ చేశాం. చాలా ఇతర అంశాల్లో కూడా ముఖ్యమంత్రులు జాతీయ అజెండాను రూపొందించడానికి చొరవ తీసుకుంటున్నారు. వ్యవస్థను సంస్కరించడం ద్వారా బాంధవ్యాల్లో మేం పరివర్తన తీసుకువచ్చాం.

మేక్ ఇన్ ఇండియా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం మేం చేపట్టిన చర్యలు అందరికీ తెలిసినవే. ప్రపంచ వాణిజ్యంలో కనివిని ఎరుగని మాంద్యం నెలకొన్న వాతావరణంలో మేక్ ఇన్ ఇండియాకు మేం చేస్తున్న ప్రయత్నాన్ని అందరూ వీక్షించాలి. 1993 నుంచి 2008 సంవత్సరాల మధ్య కాలంలో వాణిజ్యంలో వృద్ధి జిడిపి వృద్ధిని దాటిపోయింది. కాని ఆ తర్వాత వాణిజ్య వృద్ధి జిడిపి వృద్ధి కన్నా వెనుకబడింది. ఈ నేపథ్యంలో వృద్ధికి ఊతం ఇవ్వాలంటే దేశీయ వినియోగం కోసం ఉత్పత్తులు తయారుచేయడం చాలా అవసరం.

ప్రపంచ బ్యాంకు నిర్వహించిన వ్యాపారానుకూల సర్వేలో భారత్ ర్యాంకింగ్ చాలా మెరుగుపడిన విషయం కూడా మీకు తెలుసు. రాష్ర్టాల మధ్య ఆరోగ్యకరమైన, నిర్మాణాత్మక పోటీ నెలకొనడం ఒక కొత్త విషయం. ఇలా పోటీ పడుతున్న రాష్ర్టాల్లో జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశాలు ఉండడం నిర్మాణాత్మక పోటీ ఫెడరలిజానికి సజీవ నిదర్శనం.
ఆరు దశాబ్దాలుగా దేశంలో అమలుపరుస్తున్న సాంప్రదాయిక విధానానికి భిన్నంగా విదేశాంగ విధానంలో రాష్ట్రాలను కూడా భాగస్వాములను చేశాం. రాష్ట్రాలతో కలసి పని చేయాల్సిందిగా విదేశాంగ మంత్రిత్వ శాఖకు సూచించాం. నేను చైనా సందర్శించిన సమయంలో రాష్ట్రాల మధ్య శిఖరాగ్రాలు కూడా జరిగాయి. ఎగుమతి ప్రోత్సాహక మండలులు ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ర్టాలకు సలహా ఇచ్చాం. రాష్ట్రాలు అంతర్జాతీయంగా ఆలోచించేందుకు అవకాశం కల్పించడం పరివర్తన దిశగా చక్కని సంస్కరణ.

వాలు కుర్చీల్లో కూచుని విమర్శలు గుప్పించే వారు, నిపుణులు వ్యక్తం చేసే అభిప్రాయాల కన్నా భారత ప్రజలుఎంతో పరిణతి చెందిన వారు, మరింత ప్రజాస్ఫూర్తి గలవారు. ప్రభుత్వం, ప్రజల మధ్య పరస్పర నమ్మకం పాదుగొల్పడం పాలనాపరంగా కీలకమైన అంశం. సంతకాల అటెస్టేషన్ వంటి ఎన్నో ప్రతిబంధకాలను తొలగించి పౌరులను విశ్వసించడంలో కొత్త అధ్యాయానికి మేం తెర తీశాం. ఉదాహరణకి ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశానికి సమర్పించే పత్రాలను విద్యార్థులు స్వయంగా ధ్రువీకరించుకునే విధానాన్ని ఉన్నత విద్యా శాఖ అనుమతించింది. ఆన్లైన్ బయోమెట్రిక్ గుర్తింపును ప్రవేశపెట్టడం ద్వారా పింఛనుదారులు లైఫ్ సర్టిఫికెట్ కోసం ప్రభుత్వ కార్యాలయాలు సందర్శించాల్సిన ఇబ్బందిని తప్పించాం. ప్రజలు ఎప్పుడూ స్వప్రయోజనాలకే పెద్ద పీట వేస్తారని ఆర్థికవేత్తలు సాంప్రదాయికంగా భావిస్తూ ఉంటారు. కాని స్వచ్ఛందంగా ముందుకు వచ్చే చక్కని సంస్కారం సాంప్రదాయికంగా భారత్కు ఉంది. అందుకే వంటగ్యాస్ సబ్సిడీని స్వచ్ఛందంగానే వదులుకునేందుకు వీలుగా మేం గివ్ ఇట్ అప్ ఉద్యమం చేపట్టాం. ఇలా వదులుకున్న ప్రతి ఒక్క కనెక్షన్తోను వంటగ్యాస్ అందుబాటులో లేని ఒక కుటుంబానికి గ్యాస్కనెక్షన్ ఇస్తామని మేం హామీ ఇచ్చాం. దీని వల్ల ఎందరో పేదకుటుంబాలకు చెందిన మహిళలకు అనారోగ్యకర పరిస్థితుల నుంచి, ప్రధానంగా శ్వాసకోశ వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది. దీనికి స్పందన అత్యద్భుతంగా ఉంది. కొద్ది నెలల వ్యవధిలోనే 40లక్షల మంది పౌరులు తమ గ్యాస్ సబ్సిడీని వదులుకున్నారు. వారిలో అధిక శాతం మంది సంపన్న కుటుంబాల వారు కానే కాదు. దిగువ మధ్యతరగతి ప్రజలే. ఈ సమావేశంలో పాల్గొన్న వారిలో ఇప్పటికీ గ్యాస్ సబ్సిడీ అనుభవిస్తున్నవారు ఉన్నట్టయితే గివ్ ఇట్ అప్ ఉద్యమంలో భాగస్వాములు కావాలని వారికి పిలుపు ఇస్తున్నాను.

మమ్మల్ని తీవ్రంగా విమర్శించే వారు కూడా కాదనలేని ఒక పెద్ద విజయం గురించి నేనిప్పుడు చెబుతాను. వర్తమాన ఆర్థిక వ్యవస్థల పురోగతికి అవినీతి పెద్ద అవరోధమని ఎన్నో సంవత్సరాలుగా ఆర్థికవేత్తలు, ఇతర నిపుణులు చెప్పే మాట. అవినీతి నిర్మూలనకు మేం నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మేం ఏం చేసిందీ నేను ఇప్పటికే చెప్పాను. ఈ దిశగా మేం చేపట్టిన మరో సంస్కరణ అందరికీ తెలిసిందే. కీలక వనరుల కేటాయింపులో వివక్షను తొలగించడమే అది. బొగ్గు, స్పెక్ర్టమ్, ఎఫ్ఎం రేడియో తరంగాలు వంటి విలువైన సహజ వనరుల కేటాయింపునకు వేలం విధానం ప్రవేశపెట్టడం సత్ఫలితాలనిచ్చింది. బొగ్గు వేలం వల్ల ప్రయోజనం పొందింది దేశంలోని కొన్ని నిరుపేద రాష్ర్టాలే. వాటికి ఇప్పడు అభివృద్ధికి కావలసిన వనరులు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వంలో దిగువ స్థాయి ఉద్యోగాలకు ఇంటర్వ్యూల విధానాన్ని మేం ఇటీవల తొలగించాం. ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంలో రాత పరీక్షల ఫలితాలనే పరిగణనలోకి తీసుకుంటున్నాం. పన్ను ఎగవేతలు, మనీ లాండరింగ్ కు వ్యతిరేకంగా మేం చేపట్టిన పోరాటం మీ అందరికీ తెలిసిందే. నల్లధనం నిరోధానికి రూపొందించిన కొ్త్త చట్టం అమలులోకి రావడానికి ముందే 6,500 కోట్ల రూపాయల పన్ను ఎగవేతల ఆదాయం బహిర్గతమయింది. కొత్త చట్టానికి అనుగుణంగా మరో 4,000 కోట్ల రూపాయలు ప్రకటించారు. ఆ రకంగా విదేశాల్లో దాచిన 10,500 కోట్ల రూపాయల నల్లధనాన్ని గుర్తించి అసెస్ చేయగలిగాం. ఇదే సమగ్రత, పారదర్శకత కొనసాగించగలిగినట్టయితే ఇంతకు మించిన పరివర్తిత సంస్కరణ ఏముంటుంది?

నిజాయతీతో పన్నులు చెల్లించే వారికి మరింతగా సేవలు అందించేందుకు మేం పలు చర్యలు తీసుకున్నాం. టాక్స్ రిటర్నుల్లో 85 శాతం ఎలక్ర్టానిక్ ఫైలింగ్ అవుతున్నాయి. గతంలో ఎలక్ర్టానిక్ ఫైలింగ్ అన్నింటినీ పేపర్ వెరిఫికేషన్ చేసే వారు. దీనికి చాలా సమయం పట్టేది. ఈ ఏడాది ఆధార్ మాధ్యమంలో ఎలక్ర్టానిక్ వెరిఫికేషన్ ను ప్రవేశపెట్టాం. 40 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఈ విధానాన్ని ఉపయోగించుకున్నారు. వారందరి ఫైలింగ్ ఎలాంటి జాప్యానికి తావు లేకుండా సరళంగా, ఎలక్ర్టానిక్ విధానంలో క్షణాల్లో పూర్తయింది. ఈ ఏడాది గత ఏడాదితో పోల్చితే ఎలక్ర్టానిక్ ఫైలింగ్ల పరిశీలన 90 రోజుల లోపు పూర్తి చేయడం 46 శాతం నుంచి 91 శాతానికి పెరిగింది. రిటర్న్ల ఫైలింగ్ మాత్రమే కాదు…పరిశీలన కూడా కార్యాలయానికి వెళ్ళాల్సిన పని లేకుండా పూర్తయ్యే విధానం ప్రవేశపెట్టాలని నేను ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సూచించాను. ఇ మెయిల్ కు ప్రశ్నలు పంపడం ద్వారానే ఏవైనా అనుమానాలుంటే నివృత్తి చేసుకోవాలని కోరాను. ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అమలులో ఉన్న పెర్ఫార్మన్స్ అప్రైజల్ విధానంలో కూడా మార్పులు చేయాలని కూడా నేను సూచించాను. అధికారులు జారీ చేసే ఆదేశాలు లేదా అసెస్మెంట్లు అప్పీల్కు నిలవగలిగాయా లేదా అన్నదే గీటురాయి కావాలి. పూర్తి స్థాయిలో అమలుజరిగినట్టయితే ఇవన్నీ చక్కని పరివర్తిత శక్తి కలిగి ఉన్నవనడంలో సందేహం లేదు.

ఇది ఎందరో మేధావులు, కాకలు తీరిన నిపుణుల సమ్మేళనం. ఎంతో ఆలోచన రేకెత్తించే, ఆసక్తికరమైన చర్చలు ఇక్కడ జరగాల్సి ఉంది. సాంప్రదాయిక పరిష్కారాల కన్నా అతీతంగా ఆలోచించాలని నేను మీ అందరికీ సూచిస్తున్నాను. కొన్ని ప్రమాణాత్మకమైన అంశాలకు మాత్రమే సంస్కరణలను పరిమితం చేయకూడదు. మనం చేపట్టే సంస్కరణలేవైనా అందరినీ భాగస్వాములను చేసేవి, విస్తృతమైనవీ అయి ఉండాలి. పత్రికల్లో ప్రత్యేకించి బిజినెస్ పత్రికల్లో పతాక శీర్షికల్లో చోటు సంపాదించడం కాదు…ప్రజల జీవితాల్లో పరివర్తన తీసుకురావడం సంస్కరణల లక్ష్యం కావాలి. మీ మేధస్సును ఉపయోగించి మరింత మెరుగైన ఆలోచనలు ఆవిష్కరించండి. దేశ ప్రజల జీవితాలను మరింత మార్చగల శక్తితో కూడిన పరివర్తనకు బాటలు వేయగల ఇంకా అనేక సంస్కరణలను మీ నుంచి వినేందుకు నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. అలాంటి ఆలోచనలతో భారత్లో నివసిస్తున్న మనమే కాదు…ప్రపంచం యావత్తు లాభపడుతుంది.

ధన్యవాదాలు.