ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలో భారతీయ కళలు.. వాస్తు-నిర్మాణ తొలి ద్వైవార్షిక వేడుకలు (ఐఎఎడిబి)-2023ను ఎర్రకోట వద్ద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ‘ఆత్మనిర్భర్ భారత్ సెంటర్ ఫర్ డిజైన్’ (ఎబిసిడి)తోపాటు విద్యార్థుల ద్వైవార్షిక వేడుకలు ‘సమున్నతి’ని కూడా ప్రధాని ప్రారంభించారు. అలాగే ఈ వేడుకల స్మారక తపాలా బిళ్లను ఆవిష్కరించి, ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. కాగా, ఢిల్లీ నగర సాంస్కృతిక ప్రాముఖ్యాన్ని ‘ఐఎఎడిబి’ ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అనంతరం ప్రధాని ప్రసంగిస్తూ- ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఎర్రకోటను సందర్శనకు ప్రతి ఒక్కరినీ ఆహ్వానించారు. దేశ స్వాతంత్ర్యానికి ముందు.. తర్వాత అనేక తరాలు గతించినా ఈ కోట ప్రాంగణానికిగల చారిత్రక ప్రాశస్త్యం ఎన్నటికీ చెరగనిదిగా, అచంచలంగా నిలిచి ఉందని ఆయన వివరించారు.
ప్రతి జాతికీ తనదైన ప్రత్యేక చారిత్రక గుర్తింపు చిహ్నాలుంటాయని, దేశ చరిత్రను, దాని మూలాలను ప్రపంచానికి పరిచయం చేసేవి ఇవేనని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ చిహ్నాలతో మన అనుసంధానంలో కళలు, సంస్కృతి, వాస్తుశిల్పం పోషించే కీలక పాత్రను ఆయన నొక్కిచెప్పారు. దేశ రాజధాని ఢిల్లీకిగల చారిత్రక ప్రాశస్త్యాన్ని ప్రధాని వివరించారు. ఘనమైన భారతీయ నిర్మాణ వారసత్వంపై సంగ్రహావలోకన చిహ్నాల నిధిగా ఈ నగరానికి ప్రపంచ ప్రాముఖ్యం ఉందన్నారు. అనేక విశిష్టతలున్న ఢిల్లీలో భారతీయ కళలు.. వాస్తు-నిర్మాణ ద్వైవార్షిక వేడుకల (ఐఎఎడిబి) నిర్వహణతో ఈ నగరం మరింత ప్రత్యేకతను సంతరించుకుందని చెప్పారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన పుస్తక.. కళారూపాల ప్రదర్శనను తిలకించి ప్రశంసించారు. సకల వర్ణాలు, సృజనాత్మకత, సంస్కృతి, సామాజిక అనుసంధానాల సమ్మేళనానికి ఇది ప్రతీకగా నిలిచిందని వ్యాఖ్యానించారు. ‘ఐఎఎడిబి’ వేడుకలను విజయవంతంగా నిర్వహించడంపై కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, అధికారులతోపాటు ఇందులో పాలుపంచుకుంటున్న దేశాలుసహా భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు. ‘‘పుస్తకాలు ప్రపంచ గవాక్షాలు… మానవ మేధ ఉజ్వల పయనానికి ప్రతీక కళలు’’ అని ప్రధానమంత్రి అభివర్ణించారు.
భారత ఉజ్వల చరిత్రను, సకల సౌభాగ్యాలతో తులతూగిన ఈ దేశం గురించి ఒకనాడు యావత్ ప్రపంచం చర్చించుకోవడాన్ని ప్రధాని గుర్తుచేశారు. అందుకే భారతీయ సంస్కృతి-వారసత్వాలు ఈనాటికీ ప్రపంచ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయని ఆయన వివరించారు. మన వారసత్వం పట్ల గర్విస్తూ ముందుకు సాగడంలోని విశ్వాసాన్ని ప్రధాని పునరుద్ఘాటించారు. ఆ మేరకు కళలు, వాస్తుశిల్పం సంబంధిత రంగాల్లో సృజనాత్మకత మన ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. కేదార్‌నాథ్, కాశీ సాంస్కృతిక కేంద్రాల అభివృద్ధిని, మహాకాల్ లోక్ పునరాభివృద్ధిని ఈ సందర్భంగా శ్రీ మోదీ ఉదాహరించారు. స్వాతంత్ర్య అమృత కాలంలో జాతీయ వారసత్వం-సంస్కృతికి కొత్త కోణాలను జోడించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇవి నిదర్శనాలను నొక్కిచెప్పారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నగరం ‘ఐఎఎడిబి’ వేడుకలను నిర్వహించడం ఈ దిశగా మరొక ముందడుగని ఆయన పేర్కొన్నారు. అత్యాధునిక వ్యవస్థల తోడ్పాటుతో అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణను సంస్థాగతీకరించడంలో భాగంగా 2023 మే నెలలో అంతర్జాతీయ ప్రదర్శనశాలల మహా ప్రదర్శన, ఆగస్టు నెలలో గ్రంథాలయ మహోత్సవాలు వంటివి నిర్వహించడాన్ని గుర్తుచేశారు. నేడు వెనిస్, సావో పాలో, సింగపూర్, సిడ్నీ, షార్జాలలో ద్వైవార్షిక ఉత్సవాలతోపాటు దుబాయ్, లండన్ నగరాల్లో కళా ప్రదర్శనల వంటి ప్రపంచ గుర్తింపుగల కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు. మన ‘ఐఎఎడిబి’ కూడా భారతీయ సాంస్కృతిక కార్యక్రమాలకు సమున్నత అంతర్జాతీయ వేదికగా నిలవాలని ప్రధాని ఆకాంక్షించారు. నేటి సమాజం సాంకేతికతపై భారీగా ఆధారపడిన నేపథ్యంలో ఎదురయ్యే ఒడుదొడుకుల నడుమ భారతీయ జీవనశైలికి ప్రేరణనిచ్చేది మన కళలు, సంస్కృతేనని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి వీటికి సంబంధించిన కార్యక్రమాలను తరచూ నిర్వహించడం ఒక అవసరమని నొక్కిచెప్పారు. ‘‘మానవ మేధ, అంతఃకరణల అనుసంధానంసహా వాటి సామర్థ్యాన్ని గుర్తించేందుకు కళలు, సంస్కృతి అవశ్యం’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.
ఆత్మనిర్భర్ భారత్ సెంటర్ ఫర్ డిజైన్ (ఎబిసిడి)ను ప్రారంభించడంపై మాట్లాడుతూ- భారతీయ విశిష్ట హస్తకళలను ప్రోత్సహించే వేదికను ఇది సమకూరుస్తుందని ప్రధానమంత్రి వివరించారు. ఈ మేరకు కళాకారులు, రూపకర్తలను ఏకీకృతం చేసి, మార్కెట్ అవసరాలు, ప్రజల అభిరుచికి తగినట్లు కళారూపాలను ఆవిష్కరించడంలో తోడ్పడుతుందని పేర్కొన్నారు. అలాగే ‘‘రూపకల్పన మెలకువలపై కళాకారులకు మరింత అవగాహన లభించడంతోపాటు డిజిటల్ మార్కెటింగ్ రంగంలో వారు నైపుణ్యం సాధించగలరు’’ అని చెప్పారు. ఈ ఆధునిక పరిజ్ఞానంతోపాటు అందుబాటులోగల అత్యాధునిక వనరుల సాయంతో భారతీయ కళాకారులు ప్రపంచంపై తమదైన ముద్ర వేయగలరని ప్రధానమంత్రి ఈ సందర్భంగా విశ్వాసం వ్యక్తం చేశారు.
దేశంలోని ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, అహ్మదాబాద్, వారణాసిలలో సాంస్కృతిక కేంద్రాల నిర్మాణాన్ని చారిత్రక కార్యాచరణగా ప్రధాని అభివర్ణించారు. ఈ కేంద్రాలు ఆయా నగరాల సంస్కృతిని సుసంపన్నం చేస్తాయని ఆయన చెప్పారు. అంతేకాకుండా స్థానిక కళారూపాలను మరింత ఆవిష్కరణాత్మకం చేయగల వినూత్న ఆలోచనలను ప్రేరేపిస్తాయని తెలిపారు. రాబోయే 7 రోజులపాటు 7 ప్రధాన ఇతివృత్తాల ఆధారంగా ‘ఐఎఎడిబి’ వేడుకలు నిర్వహించటాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ మేరకు ‘‘దేశజ్ భారత్ డిజైన్: స్వదేశీ డిజైన్లు’; ‘సమత్వ: షేపింగ్ ది బిల్ట్’ వంటి ఇతివృత్తాలను ఒక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లడంలో ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. యువతరం దీన్ని మరింత సుసంపన్నం చేసే దిశగా స్వదేశీ డిజైన్‌ను పరిశోధన-అధ్యయనంలో అంతర్భాగం చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. వాస్తు కళారంగంలో మహిళల భాగస్వామ్యాన్ని సమానత్వంపై ఇతివృత్తం ప్రముఖంగా ప్రస్తావిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ రంగాన్ని కొత్త శిఖరాలకు చేర్చడంలో మహిళలకుగల కల్పనాశక్తి, సృజనాత్మకతలపై ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి తన ప్రసంగం కొనసాగిస్తూ- ‘‘కళలు.. అభిరుచి.. వర్ణాలు భారతీయ జీవన ప్రతీకలు’’ అని వ్యాఖ్యానించారు. మానవులకు, జంతువులకు మధ్య వ్యత్యాసాన్ని సుస్పష్టం చేసేది సాహిత్యం, సంగీతం, కళలేననే మన పూర్వీకుల సందేశాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ‘‘కళలు, సాహిత్యం, సంగీతం వంటివి మానవ జీవితాన్ని రసాత్మకంగా మలచి, ప్రత్యేకతను ఆపాదిస్తాయి’’ అని నొక్కి చెప్పారు. చతుష్షష్టి… అంటే 64 కళలతో ముడిపడిన వివిధ అవసరాలు, బాధ్యతల గురించి వివరిస్తూ- నీటి తరంగాల ఆధారంగా సంగీత ధ్వనులు సృష్టించే ‘జల తరంగిణి’ వాద్యం; ఆటపాటలకు సంబంధించిన నృత్య-సంగీతాలు వంటి నిర్దిష్ట కళారూపాలను ప్రధాని ప్రస్తావించారు. అలాగే పరిమళం వెదజల్లే సువాసన లేపనాల తయారీ సంబంధిత ‘గంధఃయుక్తి’, బొమ్మలు చెక్కి రంగులతో అలంకరించే ‘తక్ష కర్మ’, కుట్లు-అల్లికలు-చేనేత నైపుణ్యాన్ని తెలిపే ‘సుచివాన్ కర్మాణి’ వగైరా కళల గురించి కూడా వివరించారు. మన దేశంలోని ప్రాచీన వస్త్ర తయారీ నైపుణ్యాన్ని ప్రస్తావిస్తూ… ఉంగరం గుండా అటునుంచి ఇటు తీయగల సున్నిత మస్లిన్ వస్త్రాన్ని ఉదాహరించారు. అంతేకాకుండా కరవాలాలు, కవచాలు, ఈటెలు వంటి శక్తిమంతమైన ఆయుధాలపై సున్నితమైన, అద్భుత కళాకృతులు చెక్కగల భారతీయ నైపుణ్యం ప్రశంసాత్మకమని ప్రధాని వ్యాఖ్యానించారు.
అక్షయమైన కాశీ నగర సంస్కృతి నిరంతర సాహిత్య, సంగీత, కళా స్రవంతికి నెలవని ప్రధానమంత్రి అభివర్ణించారు. ‘‘ఆధ్యాత్మికంగా కళలకు మూలకర్తగా పరిగణించబడే పరమశివుడిని కాశీ తన కళా సంస్కృతిలో మమేకం చేసుకున్నది’’ అన్నారు. ‘‘కళలు, హస్తకళా నైపుణ్యం, సంస్కృతి మానవ నాగరికతా శక్తి ప్రవాహాలు. శక్తి అజరామరం.. చైతన్యం అనశ్వరం.. కాబట్టి కాశీ నగరం అక్షయం’’ అన్నారు. గంగానదీ తీరానగల అనేక నగరాలు, ప్రాంతాల పర్యటనతోపాటు కాశీ నుంచి అస్సాం వరకూ విహారయాత్రకు అనువుగా ఇటీవల ‘ఎంవి గంగా విలాస్’ విహార నౌకను ప్రారంభించడాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు.
‘‘భారతీయ కళారూపం ఏదైనా.. అది ప్రకృతితో సాన్నిహిత్యం ద్వారా ఉద్భవించినదే.. కాబట్టి మన కళలు ప్రకృతి హితం… పర్యావరణ హితం.. వాతావరణ అనుకూలం’’ అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలలో నదీతీర సంస్కృతిని ప్రస్తావిస్తూ- భారతదేశంలో వేల ఏళ్లుగా నదీతీరాల్లో స్నానఘట్టాల సంప్రదాయ సారూప్యాన్ని శ్రీ మోదీ ఉదాహరించారు. దేశంలో నిర్వహించుకునే అనేక పండుగలు, వేడుకలు కూడా వీటితో ముడిపడి ఉన్నాయని గుర్తుచేశారు. అలాగే మన దేశంలోని బావులు, చెరువులు, దిగుడు బావుల నిర్మాణంలోని గొప్ప సంప్రదాయాన్ని ప్రముఖంగా వివరించారు. గుజరాత్‌లోని ‘రాణి కీ వావ్’, రాజస్థాన్ సహా ఢిల్లీలోని అనేక ఇతర ప్రదేశాల్లోగల ఇటువంటి కట్టడాలను ప్రధానమంత్రి ఉదాహరించారు. ఈ మెట్ల బావులతోపాటు దేశంలోని అనేక కోటల రూపకల్పన, నిర్మాణశైలి ప్రాశస్త్యన్ని ప్రధాని ప్రశంసనీయమని పేర్కొన్నారు. కొద్దిరోజుల కిందట తాను సింధుదుర్గ్ కోటను సందర్శించినపుడు ఈ విశేషాన్ని మరోసారి గుర్తు చేసుకున్నానని తెలిపారు. అలాగే జైసల్మేర్‌లోని ‘పట్వా కీ హవేలీ’ని శ్రీ మోదీ ప్రస్తావించారు. ఇది సహజ శీతానుకూల సౌకర్యంతో కూడిన 5 సౌధాల సమూహమని చెప్పారు. ‘‘ఈ వాస్తుశిల్పం శాశ్వతమైనదేగాక పర్యావరణం పరంగానూ సుస్థిరం’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. భారత కళాసంస్కృతుల నుంచి ప్రపంచం అవగాహన చేసుకోవాల్సింది.. నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఆయన నొక్కిచెప్పారు.
‘‘మానవ నాగరికత వైవిధ్యం, ఏకత్వాలకు కళ, వాస్తుశిల్పం, సంస్కృతి మూలాలు’’ అని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యభరిత దేశమని, భిన్నత్వంలో ఏకత్వంతో కూడిన ఈ వైవిధ్యమే మన బంధానికి బలమని ఆయన అన్నారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు కావడమే మన ప్రజాస్వామ్య సంప్రదాయానికి, భిన్నత్వానికి మూలమని ఆయన పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ భావ స్వాతంత్య్రం, పని స్వేచ్ఛ ఉన్నప్పుడే కళలు, వాస్తుశిల్పం, సంస్కృతి వంటివన్నీ వర్ధిల్లుతాయని ప్రధాని స్పష్టం చేశారు. అలాగే ‘‘చర్చలు, సంప్రదింపుల సంప్రదాయంతో ఈ వైవిధ్యం తనంతటతానే వర్ధిల్లుతుంది. ప్రతి వైవిధ్యాన్ని మనం స్వాగతించి మద్దతిస్తాం’’ అన్నారు. ఇలాంటి మన వైవిధ్యాన్ని ప్రపంచానికి ప్రదర్శించడంలో భాగంగానే జి-20 అధ్యక్ష బాధ్యతల సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాలు, నగరాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించామని ప్రధాని గుర్తుచేశారు.
భారతీయులు వ్యష్టికన్నా సమష్టి తత్వాన్ని విశ్వసిస్తారని, ఆ మేరకు స్వీయ ప్రయోజనాలకన్నా లోక హితానికి ప్రాధాన్యమిస్తారని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. భారత్ నేడు ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఆవిర్భవిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అందులో తమ భవిష్యత్ అవకాశాలను చూసుకుంటున్నారని చెప్పారు. ‘‘భారత ఆర్థిక వృద్ధి యావత్ ప్రపంచ పురోగమనంతో ముడిపడి ఉంది. దానికి కేంద్రకం వంటి ‘స్వయం సమృద్ధ భారతం’ దృక్కోణం మరిన్ని కొత్త అవకాశాలను తెస్తుంది’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. అదేవిధంగా కళలు-నిర్మాణ రంగంలో భారత పునరుజ్జీవనం దేశ సాంస్కృతిక సముద్ధరణకు దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాగే యోగా, ఆయుర్వేద వారసత్వాన్ని కూడా శ్రీ మోదీ స్పృశించారు. భారత సాంస్కృతిక విలువల దృష్ట్యా సుస్థిర జీవనశైలి కోసం ‘మిషన్ లైఫ్’ పేరిట చేపట్టిన కొత్త కార్యక్రమాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు.
చివరగా- నాగరికతల వికాసంలో పరస్పర సంబంధాలు, సహకారానికిగల ప్రాధాన్యాన్ని ప్రధాని నొక్కిచెప్పారు. ఈ మేరకు వేడుకలలో పాల్గొంటున్న వివిధ దేశాల భాగస్వామ్యంపై ఆయన ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని దేశాలు ఏకతాటిపైకి రావడంలో ‘ఐఎఎడిబి’ వేడుకలు నాంది పలకగలవని విశ్వాసం వ్యక్తంచేస్తూ ఆయన తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి, సహాయమంత్రులు శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్, శ్రీమతి మీనాక్షి లేఖి, డయానా కెల్లాగ్ ఆర్కిటెక్ట్స్ సంస్థ ప్రధాన వాస్తుశిల్పి శ్రీమతి డయాన కెల్లాగ్ తదితరులు పాల్గొన్నారు.
నేపథ్యం
వెనిస్, సావో పాలో, సింగపూర్, సిడ్నీ, షార్జా నగరాలు అంతర్జాతీయ ద్వైవార్షిక వేడుకల నిర్వహణకు ప్రతిష్టాత్మక వేదికలుగా ఉంటున్నాయి. అదే తరహాలో మన దేశాన్ని కూడా సంస్థాగతీకరించాలన్నది ప్రధానమంత్రి దృక్కోణం. దీనికి అనుగుణంగా ప్రదర్శనశాలల పునర్నిర్మాణం, రీబ్రాండింగ్, పునరుద్ధరణ, పునరుజ్జీవనం వగైరాలపై దేశవ్యాప్త కార్యక్రమం ప్రారంభించబడింది. ఇందులో భాగంగా- కోల్‌కతా, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, వారణాసి నగరాల్లో సాంస్కృతిక కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత భారతీయ కళలు.. వాస్తు-నిర్మాణ తొలి ద్వైవార్షిక వేడుక (ఐఎఎడిబి)ల ద్వారా ఢిల్లీలోని సాంస్కృతిక ప్రాంగణం ప్రపంచానికి పరిచయం అవుతుంది.
ఈ వేడుకలను 2023 డిసెంబరు 9 నుంచి 15 వరకు న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద నిర్వహిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ఇంటర్నేషనల్ మ్యూజియం ఎక్స్‌పో (2023 మే), ఫెస్టివల్ ఆఫ్ లైబ్రరీస్ (2023 ఆగస్టు) వంటి కీలక కార్యక్రమాల తరహాలోనే ఈ వేడుకలు కూడా నిర్వహించబడుతున్నాయి. సాంస్కృతిక ఆదానప్రదానాలను బలోపేతం చేయడానికి కళాకారులు, వాస్తుశిల్పులు, డిజైనర్లు, ఫోటోగ్రాఫర్లు, సేకరణ కర్తలు, కళా నిపుణులు, ప్రజల మధ్య సంపూర్ణ సహకారం దిశగా నాంది పలకడం లక్ష్యంగా ‘ఐఎఎడిబి’ రూపొందించబడింది. ఆర్థిక వ్యవస్థ వికాసంలో భాగంగా కళ, వాస్తుశిల్పం, డిజైన్ సృష్టికర్తలతో సహకార విస్తరణకు ఇది కొత్త బాటలు వేయడంతోపాటు అవకాశాలను కూడా కల్పిస్తుంది.
వారంపాటు సాగే ‘ఐఎఎడిబి’ వేడుకలలో ఇతివృత్తాధారిత ప్రదర్శనలు కిందివిధంగా ఉంటాయి:
తొలి రోజు: ప్రవేష్- రైట్ ఆఫ్ ప్యాసేజ్: డోర్స్ ఆఫ్ ఇండియా
2వ రోజు: బాగ్ ఇ బహార్- గార్డెన్స్ యాజ్ యూనివర్స్: గార్డెన్స్ ఆఫ్ ఇండియా
3వ రోజు: సంప్రవాహ్- కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ కమ్యూనిటీస్: బావోలిస్ ఆఫ్ ఇండియా
4వ రోజు: స్థపత్య- యాంటీ-ఫ్రజైల్ అల్గారిథం: టెంపుల్స్ ఆఫ్ ఇండియా
5వ రోజు: విస్మయ- క్రియేటివ్ క్రాస్ఓవర్: ఆర్కిటెక్చర్ వండర్స్ ఆఫ్ ఇండింపెండెంట్ ఇండియా
6వ రోజు: దేశజ్ భారత్ డిజైన్: ఇండిజినస్ డిజైన్స్
7వ రోజు: సమత్వ- షేపింగ్ ది బిల్ట్: సెలబ్రేటింగ్ విమెన్ ఇన్ ఆర్కిటెక్చర్
ఈ వేడుకలలో ఇతివృత్తాలు, ప్రతినిధుల చర్చలు, కళలపై కార్యశాలలు, ఆర్ట్ బజార్, హెరిటేజ్ వాక్, విద్యార్థుల సమాంతర ద్వైవార్షిక వేడుకల కేంద్రాలు వంటివన్నీ అంతర్భాగంగా ఉంటాయి. లలిత కళా అకాడమీలోని విద్యార్థి ద్వైవార్షికోత్సవాల్లో (సమున్నతి) వారు తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. దీంతోపాటు సహచరులు, నిపుణులతో సంభాషించడం సహా డిజైన్ పోటీలు, వారసత్వ ప్రదర్శన, ఇన్‌స్టాలేషన్ డిజైన్లు, వర్క్ షాప్‌లు తదితరాల ద్వారా వాస్తుశిల్ప సమాజంలో విలువైన అనుభవాలు పొందే వీలు కలుగుతుంది. ఈ విధంగా ‘ఐఎఎడిబి-23’ దేశానికి ఓ కొత్త మలుపుగా మారనుంది. ఇది భారత్ కూడా సంస్థాగత ద్వైవార్షికోత్సవ నిర్వహణ సమూహంలో ప్రవేశించడాన్ని ప్రస్ఫుటం చేస్తుంది.
‘స్థానికతే మన నినాదం’ అనే ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా ఎర్రకోటలో ‘ఆత్మనిర్భర్ భారత్ సెంటర్ ఫర్ డిజైన్’ ఏర్పాటైంది. ఇది దేశంలోని ప్రత్యేక, స్వదేశీ హస్తకళా రూపాలను ప్రదర్శిస్తుంది. అలాగే తయారీదారులు, డిజైనర్ల సహకార విస్తృతికి తోడ్పడుతుంది. నిలకడైన సాంస్కృతిక ఆర్థిక వ్యవస్థకు మార్గం సుగమం చేయడంతోపాటు కొత్త డిజైన్లు, ఆవిష్కరణల ద్వారా కళాకారుల సమాజాలకు సాధికారత కల్పిస్తుంది.
India Art, Architecture & Design Biennale is a celebration of our country's diverse heritage and vibrant culture. https://t.co/qml1zd9cLK
— Narendra Modi (@narendramodi) December 8, 2023
India's vibrant culture and our ancient heritage attract tourists from all over the world. pic.twitter.com/5H0J5MXMws
— PMO India (@PMOIndia) December 8, 2023
आज art और architecture से जुड़े हर क्षेत्र में आत्मगौरव की भावना से काम हो रहा है। pic.twitter.com/OAr4IQYY5G
— PMO India (@PMOIndia) December 8, 2023
'Aatmanirbhar Bharat Centre for Design' will provide a platform to promote the unique and rare crafts of India. pic.twitter.com/AQrVZv6wEy
— PMO India (@PMOIndia) December 8, 2023
The cultural spaces to be built in Delhi, Kolkata, Mumbai, Ahmedabad and Varanasi will enrich these cities culturally. pic.twitter.com/NSHS4WO0eM
— PMO India (@PMOIndia) December 8, 2023
भारत में कला को, रस और रंगों को जीवन का पर्याय, synonym of life माना गया है: PM @narendramodi pic.twitter.com/gE0ID0D62S
— PMO India (@PMOIndia) December 8, 2023
We are the most diverse nation in the world, but that diversity also binds us together: PM @narendramodi pic.twitter.com/R493bkdRgS
— PMO India (@PMOIndia) December 8, 2023