ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు న్యూఢిల్లీలో పలు కీలకమైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ శ్రీ మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2025వ సంవత్సరం భారత దేశ అభివృద్ధికి విస్తృత అవకాశాలను తీసుకువస్తుందని, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే లక్ష్యం వైపు దేశాన్ని ముందుకు తీసుకెళుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘ప్రస్తుతం రాజకీయ, ఆర్థిక సుస్థిరతలో ప్రపంచానికి భారత్ ఆదర్శంగా మారింది’’ అని ప్రధానమంత్రి అన్నారు. ఈ ఏడాది దేశ ప్రతిష్ఠ మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. దేశం ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ కేంద్రంగా మారడం, అంకుర సంస్థలు, ఔత్సాహిక పారిశ్రామిక రంగంలో యువతకు సాధికారత కల్పించడం, వ్యవసాయంలో నూతన రికార్డులు నెలకొల్పడం, మహిళా కేంద్ర అభివృద్ధిని ప్రోత్సహించడం, జీవన సౌలభ్యంపై దృష్టి సారించి ప్రతి పౌరునికీ నాణ్యమైన జీవితాన్ని అందించడమే 2025లో భారత్ లక్ష్యమని శ్రీ మోదీ వివరించారు.
ఈ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ, ఈ రోజు ప్రారంభించిన వాటిలో పేదలకు ఇళ్లు, పాఠశాలలు, కళాశాలలకు సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయని ప్రధానమంత్రి వెల్లడించారు. వీటి వల్ల లబ్ధి పొందే వారికి, మహిళలకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, వారు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారని అన్నారు. రేకుల షెడ్ల స్థానంలో పక్కా ఇళ్లు, అద్దె ఇళ్లకు బదులు సొంత గృహాలు ఉన్నాయని, ఇది కచ్చితంగా నూతన ప్రారంభానికి కారణమని అన్నారు. ప్రజలకు కేటాయించిన ఇళ్లు వారి ఆత్మగౌరవానికి, ఆత్మవిశ్వాసానికి, కొత్త ఆశయాలకు, ఆకాంక్షలకు ప్రతీకగా శ్రీ మోదీ వర్ణించారు. వారి సంతోషంలో భాగం పంచుకొనేందుకే తాను వచ్చానని తెలిపారు. ఆత్యయిక పరిస్థితి నాటి చీకటి రోజులను గుర్తు చేసుకుంటూ, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చేపట్టిన అజ్ఞాత ఉద్యమంలో పాల్గొన్న తనలాంటి కార్యకర్తలు ఎంతోమంది ఆ సమయంలో అశోక్ విహార్‌లో ఉన్నామని వెల్లడించారు.
‘‘ఇప్పుడు యావత్ దేశం వికసిత్ భారత్ నిర్మాణంలో నిమగ్నమై ఉంది’’ అని శ్రీ మోదీ అన్నారు. అభివృద్ధి చెందిన భారత దేశంలో ప్రతి పౌరుడికీ పక్కా ఇళ్లు ఉండాలనే సంకల్పంతో పని చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సంకల్పాన్ని నెరవేర్చడంలో ఢిల్లీ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం రేకుల షెడ్ల స్థానంలో పక్కా ఇళ్లను నిర్మించే పథకాన్ని ప్రారంభించిందని ఆయన వివరించారు. రెండేళ్ల క్రితం కల్కాజీ ఎక్స్‌టెన్షన్లో రేకుల షెడ్లలో నివసించే వారికోసం నిర్మించిన 3000 ఇళ్లను ప్రారంభించిన సందర్భాన్ని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. కొన్ని తరాల పాటు ఎలాంటి ఆశలు లేకుండా జీవించిన కుటుంబాలు మొదటిసారి పక్కా ఇళ్లలోకి అడుగుపెట్టాయని అన్నారు. అది ప్రారంభం మాత్రమే అని ఆయన చెప్పారు. ఆ రోజు 1,500 ఇళ్ల తాళాలను అందించామని వివరించారు. ‘‘స్వాభిమాన్ అపార్ట్‌మెంట్లు ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచుతాయి’’ అని ప్రధాని అన్నారు. ఆ రోజు లబ్ధిదారులతో మాట్లాడుతున్న సమయంలో వారిలో నూతన ఉత్సాహాన్ని గమనించినట్లు ప్రధానమంత్రి వెల్లడించారు. ఆ ఇళ్లకు యజమాని ఎవరైనప్పటికీ ఆ కుటుంబంలో తాను ఓ సభ్యుడిగా ఉంటానని తెలియజేశారు.
గత పదేళ్లుగా ప్రభుత్వం చూపిస్తున్న చిత్తశుద్ధి గురించి ప్రధానమంత్రి వివరిస్తూ, పక్కా ఇల్లు ఉండాలనే 4 కోట్ల మంది ప్రజల కలల్ని తమ ప్రభుత్వం నిజం చేసిందని పేర్కొన్నారు. కనీస సౌకర్యాలతో కూడిన గృహానికి కచ్చితంగా యజమానులు అవుతారనే మాటను ఇల్లు లేని వారికి తెలియజెప్పాలని సభకు హాజరైన వారిని ప్రధాని కోరారు. ఇలాంటి కార్యక్రమాలు వికసిత భారత్‌కు అసలైన శక్తిగా పరిగణించే ఆత్మవిశ్వాసాన్ని పేదల్లో నింపుతాయని అన్నారు. ఢిల్లీలో 3000 కొత్త ఇళ్లను నిర్మించనున్నట్లు ఆయన ప్రకటించారు. వచ్చే ఏడాది నగర ప్రజలకు వేల సంఖ్యలో గృహాలు అందుబాటులోకి వస్తాయని తెలియజేశారు. ‘‘ఈ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు నివసిస్తారు. వారు నివసించే ఇళ్లు బాగా పాతవి అయిపోయాయి. మెరుగైన సౌకర్యాలతో ఆధునిక గృహాలను నిర్మించి, వారి సంక్షేమం పట్ల మా నిబద్ధతను చాటుకుంటాం’’ అని శ్రీ మోదీ అన్నారు. నగరంలో పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న పట్టణీకరణ నేపథ్యంలో నరేలా సబ్ సిటీ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి ఢిల్లీలో మౌలిక సదుపాయాలను కేంద్రం విస్తరిస్తుందని ప్రధాని ప్రకటించారు.
అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో నగరాల పాత్ర గురించి వివరిస్తూ దేశం నలుమూలల నుంచి తమ కలలను నెరవేర్చుకోవడానికి పట్టణాలకు ప్రజలు వస్తున్నారని ప్రధానమంత్రి అన్నారు. పౌరులందరికీ మన్నికైన ఇళ్లు, నాణ్యమైన విద్యను అందించే దిశగా ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తుందని స్పష్టం చేశారు. ‘‘అభివృద్ధి చెందిన భారతదేశానికి నగరాలే పునాది. పెద్ద పెద్ద కలలతో ఇక్కడికి వచ్చిన ప్రజలు వాటిని సాకారం చేసుకొనేందుకు కష్టపడి పని చేస్తారు. నగరంలో నివసించే ప్రతి కుటుంబానికి నాణ్యమైన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని ప్రధానమంత్రి వెల్లడించారు. గృహ నిర్మాణ రంగంలో గణనీయమైన రీతిలో సాధించిన పురోగతి గురించి వివరిస్తూ, ప్రధానమంత్రి ఆవాస యోజన (పట్టణ) పథకాన్ని విజయవంతంగా అమలు చేయడం ద్వారా గత దశాబ్దంలో కోటికి పైగా గృహాలు నిర్మించామని ప్రధానమంతి పేర్కొన్నారు. ‘‘ఈ పథకం ద్వారా ఢిల్లీలో గడచిన పదేళ్లలో 30,000కు పైగా ఇళ్లను నిర్మించాం. ఇప్పుడు ఈ పథకాన్ని మరింత విస్తరిస్తున్నాం, తర్వాతి దశలో మరో కోటి ఇళ్లను దేశవ్యాప్తంగా ఉన్న పట్టణ ప్రాంత పేదలకు నిర్మిస్తాం’’ అని ఆయన అన్నారు. మధ్యతరగతి ప్రజలకు అందిస్తున్న ఆర్థిక సాయాల గురించి కూడా ప్రస్తావించారు. వాటిలో రూ.9 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి గృహ రుణాల వడ్డీ రేట్లపై పెద్ద మొత్తంలో రాయితీలు కూడా ఉన్నాయి. ‘‘పేద, మధ్య తరగతి అనే తేడా లేకుండా ప్రతి కుటుంబానికి మంచి ఇంటికి యజమాని అయ్యే అవకాశాన్ని అందించేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుంది’’ అని హామీ ఇచ్చారు.
విద్యారంగం గురించి ప్రధాని మాట్లాడుతూ.. చిన్నారులందరికీ ముఖ్యంగా వెనకబడిన నేపథ్యాల నుంచి వచ్చిన వారికి మంచి విద్య, మెరుగైన అవకాశాలు లభించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని వివరించారు. ‘‘తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని ప్రతి కుటుంబం తపిస్తుంది. ఈ దిశగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది’’ అని ఆయన వివరించారు. అట్టడుగు వర్గాలకు చెందినవారితో సహా అన్ని నేపథ్యాలకు చెందిన బాలలు విజయం సాధించేలా మాతృభాషలో విద్యను అందించేందుకు ఉద్దేశించిన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ)ను ప్రశంసించారు. ‘‘నూతన జాతీయ విద్యా విధానం ఆధారంగా పేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఇప్పుడు డాక్టర్లు, ఇంజినీర్లు, నిపుణులుగా మారేందుకు మార్గం సుగమమైంది’’ అని అన్నారు. భారతీయ విద్యా వ్యవస్థను మెరుగుపరచడంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పోషిస్తున్న కీలకపాత్ర గురించి కూడా ప్రధాని వివరించారు. ఆధునిక విద్యాపద్ధతులను ప్రోత్సహించేందుకు నూతన సీబీఎస్ఈ భవనాన్ని నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. ‘‘కొత్త సీబీఎస్ఈ భవనం ఆధునిక విద్యను విస్తరించడానికి, అధునాతన పరీక్షా పద్ధతులను అనుసరించడానికి తోడ్పడుతుంది’’ అని ఆయన అన్నారు.
ఉన్నత విద్యా రంగంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం పేరుప్రతిష్ఠలు నిరంతరంగా వృద్ధిచెందుతున్నాయని ప్రధానమంత్రి అన్నారు. ఢిల్లీ లో యువతీయువకులకు ఉన్నత విద్యావకాశాల్ని మరిన్నింటిని అందించాలనేది మా ప్రయత్నం. ఇవాళ కొత్త క్యాంపస్‌ల నిర్మాణానికి శంకుస్థాపన పూర్తి అయింది. దీంతో ఏటా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో వందల కొద్దీ విద్యార్థినీవిద్యార్థులు చదువుకొనే అవకాశం లభిస్తుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈస్టర్న్ క్యాంపస్‌ను సూరజ్‌మల్‌లోనూ, వెస్టర్న్ క్యాంపస్‌ను ద్వారకలోనూ అందించనున్నారు’’ అని శ్రీ మోదీ తెలిపారు. దీనికి అదనంగా, వీర్ సావర్కర్ జీ పేరిట ఒక కొత్త కళాశాలను నజఫ్‌గఢ్‌లో నిర్మించనున్నారని ఆయన అన్నారు.
ఒక వైపు, ఢిల్లీలో విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంటే, మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం పచ్చి అబద్ధాలు ఆడుతోందని ప్రధాని వ్యాఖ్యానించారు. విద్య కోసం ఉద్దేశించిన నిధులను దుర్వినియోగపరచడం ద్వారా మరీ ముఖ్యంగా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద నష్టాన్ని కలగజేసింది అని ఆయన అన్నారు. ‘‘సమగ్ర శిక్షా అభియాన్’’లో భాగంగా కేటాయించిన నిధులను అయినా రాష్ట్ర ప్రభుత్వం బాలల కోసం ఖర్చు పెట్టని స్థితి ఉంది. గత పది సంవత్సరాల్లో మద్యం కాంట్రాక్టులు, పాఠశాల విద్య, పేదల ఆరోగ్య సంరక్షణ, కాలుష్య నియంత్రణ, ఉద్యోగ నియామకాలు వంటి వివిధ రంగాల్లో అవినీతి, కుంభకోణాలు జరిగాయి. కొంతమంది కరడుగట్టిన అవినీతిపరులు అన్నా హజారే పేరును చెప్పుకొంటూ ఢిల్లీని సంకటస్థితిలోకి నెట్టివేశారు’’ అని శ్రీ మోదీ అన్నారు. ఢిల్లీ సదా సుపరిపాలనను కోరుకుంది అయితే అధికార రాష్ట్ర ప్రభుత్వం తన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమై, స్థితిని మరింత దిగజార్చింది అని కూడా ప్రధాని అన్నారు. ఫలితంగా, ఈ సంక్షోభానికి వ్యతిరేకంగా పోరాడాలని ఢిల్లీ ప్రజలు దృఢనిశ్చయులయ్యారు, మార్పును తీసుకురావాలని, ఈ నగరంలో నుంచి అవినీతిని పారదోలాలని వారు శపథం చేశారని ఆయన చెప్పారు.
ఢిల్లీలో రహదారులు, మెట్రో వ్యవస్థలు, ఆసుపత్రులు, కాలేజీ క్యాంపస్‌లు వంటి ప్రధాన ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఏమైనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతలను నెరవేర్చడంలో ముఖ్యంగా యమునా నది నీటిని శుభ్రంగా ఉంచడం వంటి రంగాల్లో విఫలమైందన్నారు. యమునా నది విషయంలో అజాగ్రత్త వహించడంతో సంక్షోభం తలెత్తి, ప్రజలకు మురికినీరు వినా మరో మార్గం లేకపోయిందని కూడా ఆయన అన్నారు.
మంచి జాతీయ పథకాల ప్రయోజనాలు ఢిల్లీకి అందేటట్టు చూడాలన్నదే తన ధ్యేయమని శ్రీ మోదీ స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు పేదలకు, మధ్యతరగతి వారికి అటు ఆర్థిక లాభాలు, ఇటు పొదుపు.. ఈ రెండు ప్రయోజనాల్నీ అందించాయి అని ఆయన అన్నారు. ప్రభుత్వం కరెంటు బిల్లులను సున్నా స్థాయికి తీసుకువచ్చే దిశలో కృషి చేస్తోందని, విద్యుత్తును ఉత్పత్తి చేసే అవకాశాలను కుటుంబాలకు అందిస్తోందని ఆయన అన్నారు. ‘ప్రధాన్ మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్‌లీ యోజన’లో భాగంగా కుటుంబాలు విద్యుత్తు ఉత్పాదన శక్తిని సంపాదించుకొంటున్నాయనీ, కేంద్రం సౌర విద్యుత్తు ఉత్పాదక ఫలకాలను ఏర్పాటు చేసుకోవడంలో రూ. 78,000 సాయాన్ని అందిస్తోందనీ శ్రీ మోదీ వివరించారు.
కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో సుమారు 75 లక్షల మంది ఆపన్న వర్గాలకు ఉచితంగా ఆహారపదార్థాలను అందిస్తోందని శ్రీ మోదీ ప్రధానంగా చెప్పారు. ‘‘వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్’’ పథకం ఢిల్లీ ప్రజలకు ఎంతో సాయపడిందని ఆయన అన్నారు.
మందులను 80 శాతానికి పైగా తగ్గింపు ధరలకు అందించడానికి ఢిల్లీలో దాదాపు 500 జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేశారని, ప్రజలు నెలనెలా వేల కొద్దీ రూపాయల డబ్బును ఆదా చేసుకోవడంలో ఈ కేంద్రాలు తోడ్పడుతున్నాయని ప్రధాని తెలిపారు. ఢిల్లీ ప్రజలకు ఉచితంగా వైద్యచికిత్స సదుపాయాన్ని సమకూర్చే ఆయుష్మాన్ పథకం లాభాల్ని అందించాలని తాను కోరుకుంటున్నానని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఇక్కడ అమలు చేయడానికి అనుమతిని ఇవ్వడంలేదని శ్రీ మోదీ ప్రధానంగా చెప్పారు. దీంతో, ఢిల్లీ ప్రజలు కష్టాలపాలవుతున్నారని ఆయన అన్నారు.
ప్రపంచంలోనే అతి పెద్దదైన ఆరోగ్య బీమా పథకంతో ఢిల్లీ వాసుల జీవనాన్ని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. ‘‘70 ఏళ్ల వయస్సు పైబడ్డ పౌరులను కూడా కలుపుకోవడానికి ఆయుష్మాన్ భారత్ యోజనను కేంద్ర ప్రభుత్వం విస్తరించింది. ఏమైనా, రాష్ట్ర ప్రభుత్వ స్వార్థపరత్వం, అహంకారం, మొండితనంల కారణంగా ఢిల్లీ ప్రజలు, ప్రత్యేకించి వయోవృద్ధులు దీని నుంచి లాభపడలేకపోతున్నారు’’ అని ఆయన అన్నారు.
ఢిల్లీ నివాసుల అవసరాలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ స్పందనశీలత్వంతో పనిచేస్తోందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఢిల్లీలో కాలనీలను క్రమబద్ధీకరించడంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను గురించి కూడా శ్రీ మోదీ ప్రధానంగా చెప్తూ, దీనితో లక్షల మందికి ప్రయోజనం కలిగిందన్నారు.
నీరు, మురుగుపారుదల వంటి అత్యవసర సేవలను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని ఆయన విమర్శించారు. ఈ సమస్యల్ని పరిష్కరిస్తామంటూ ఢిల్లీ ప్రజలకు శ్రీ మోదీ హామీనిచ్చారు.
ప్రతి ఇంటికీ గొట్టపుమార్గం ద్వారా సహజవాయువును సమకూర్చడం, నూతన హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేల వంటి ఏర్పాట్లతో ఢిల్లీలో ప్రధాన సదుపాయాల ఆవిష్కరణలో ప్రస్తుతం పురోగతి చోటు చేసుకొంటోందని ప్రధాని ప్రధానంగా చెప్పారు. ‘‘ఈ ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి ఎలాంటి జోక్యం లేని కారణంగా, పనులు త్వరితగతిన సాగుతున్నాయి. ఢిల్లీ ప్రజల జీవనాన్ని మెరుగుపరచడానికి ఈ పనులు చాలా కీలకం’’ అని ఆయన అన్నారు.
శివ్ మూర్తి నుంచి నెల్సన్ మండేలా మార్గ్ వరకు ఒక సొరంగ మార్గం నిర్మాణంతోపాటు అనేక ప్రధాన ఎక్స్‌ప్రెస్‌వేల సంధానం సహా వాహనాల రాకపోకల రద్దీని తగ్గించేందుకుగాను ఇటీవల ప్రతిపాదించిన పరిష్కారాల్ని గురించి కూడా ఆయన ప్రస్తావించారు.ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేశారని, ఇవి రాబోయే కాలంలో వాహనాల రాకపోకలలో రద్దీని చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గిస్తాయని ప్రధాని అన్నారు.
ప్రధానమంత్రి 2025కు గాను తన దృష్టికోణాన్ని వివరిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు. ‘‘2025వ సంవత్సరం ఢిల్లీలో సుపరిపాలన నవశకాన్ని తీసుకువస్తుంది. అది ‘నేషన్ ఫస్ట్, కంట్రీమెన్ ఫస్ట్’ (దేశానికే ప్రాధాన్యం, దేశప్రజలకే ప్రాధాన్యం) భావనను బలపరుస్తుంది. అంతేకాకుండా దేశనిర్మాణంపైనా, ప్రజా సంక్షేమంపైనా దృష్టిని కేంద్రీకరించే కొత్త రకం రాజకీయాల ప్రారంభానికి సంకేతంగా నిలవనుంది’’ అని శ్రీ మోదీ అన్నారు. ఇళ్ల తాళంచెవులను అందుకొన్న వారికి, నూతన విద్యాసంస్థలను అందుకొంటున్న ఢిల్లీ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ మనోహర్ లాల్, విద్య శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నరు శ్రీ వినయ్ కుమార్ సక్సేనా సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నేపథ్యం
‘అందరికీ ఇళ్లు’ అంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన వాగ్దానానికి అనుగుణంగా ఢిల్లీలోని అశోక్ విహార్‌లో నిర్మాణాన్ని పూర్తి చేసిన స్వాభిమాన్ అపార్ట్‌మెంట్స్‌ను ఈ రోజు సందర్శించారు. వీటిని ఝుగ్గీ ఝోప్‌డీ (జేజే) క్లస్టర్ల నివాసితుల కోసం నిర్మించారు.
జేజే క్లస్టర్ల నివాసితుల కోసం ఢిల్లీలోని అశోక్ విహార్‌లో నిర్మించిన 1,675 ఫ్లాట్లను ప్రధాని ప్రారంభించి, లబ్ధిదారులకు ఇళ్ల తాళంచెవులను అందజేశారు. ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) ఆధ్వర్యంలో యథాస్థానంలో మురికివాడ పునరావాస ప్రాజెక్టులో రెండో దశ ఇది. ఢిల్లీలోని జేజే క్లస్టర్ల నివాసితులకు సరైన వసతి, సౌకర్యాలతో కూడిన మేలైన, ఆరోగ్యప్రదమైన నివాసాలను కల్పించాలన్నదే ఈ ప్రాజెక్టు ఉద్దేశం.
ప్రతి ఫ్లాటు నిర్మాణానికి ప్రభుత్వం ఖర్చు చేసిన ప్రతి రూ.25 లక్షలకుగాను, అర్హత కల లబ్ధిదారులు మొత్తం సొమ్ములో 7 శాతం కన్నా తక్కువ సొమ్మునే చెల్లిస్తారు. దీనిలో రూ.1.42 లక్షల నామమాత్రపు చెల్లింపుతో పాటు అయిదేళ్లు నిర్వహణ కోసం రూ.30,000 కలిసి ఉంటుంది.
రెండు పట్టణ పునరాభివృద్ధి ప్రాజెక్టులు – నౌరోజీ నగర్లో నిర్మించిన అంతర్జాతీయ వ్యాపార కేంద్రం (డబ్ల్యూటీసీ)తోపాటు, సరోజినీ నగర్‌లోని జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామడేషన్ (జీపీఆర్‌ఏ) టైప్ – II క్వార్టర్లను కూడా ప్రధాని ప్రారంభించారు. నౌరోజీ నగర్లో శిథిలావస్థలో ఉన్న 600 క్వార్టర్లను తొలగించి, అత్యాధునిక వసతులతో కూడిన వాణిజ్య టవర్లతో అంతర్జాతీయ వ్యాపార కేంద్రాన్ని నిర్మించారు. తద్వారా 34 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాతన వసతులతో ఖరీదైన వాణిజ్య స్థలాన్ని సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టును సున్నా వ్యర్థాల విధానం, సౌర విద్యుత్తు ఉత్పత్తి, వాన నీటి సంరక్షణ వ్యవస్థల వంటి హరిత భవన నిర్మాణ పద్ధతులను అనుసరిస్తూ నిర్మించారు.
సరోజినీ నగర్‌లోని జీపీఆర్‌ఏ టైప్-II క్వార్టర్లలో 28 టవర్లు, వాటిలో స్థలాన్ని సమర్థంగా ఉపయోగించి ఆధునిక వసతులతో నిర్మించిన 2,500 నివాస యూనిట్లు ఉన్నాయి. వాన నీటి నిలవ వ్యవస్థ, మురుగునీటి పారుదల, నీటి శుద్ధి వ్యవస్థలు, సౌర విద్యుత్తు ఆధారిత వ్యర్థాల నిర్వహణ యంత్రాలు తదితర పర్యావరణమిత్రపూర్వక జీవనవిధానాన్ని ప్రోత్సహించే పద్ధతులను ఈ ప్రాజెక్టులో భాగం చేశారు.
ఢిల్లీలోని ద్వారకలో దాదాపు రూ.300 కోట్లతో నిర్మించిన సీబీఎస్ఈ సమీకృత కార్యాలయ సముదాయాన్ని కూడా ప్రధాని ప్రారంభించారు. దీనిలో కార్యాలయాలు, సభాభవనం, అధునాతన డేటా సెంటర్, సమగ్ర నీటి నిర్వహణ వ్యవస్థ మొదలైన సదుపాయాలున్నాయి. అత్యున్నత పర్యావరణ నిర్దేశాలు, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) నిర్దేశించిన ప్లాటినం రేటింగ్ ప్రమాణాల ప్రకారం ఈ భవనాన్ని పర్యావరణానికి చేటు చేయని పద్ధతిలో నిర్మించారు.
ఢిల్లీ యూనివర్సిటీలో రూ.600 కోట్లతో నిర్మించే మూడు కొత్త ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. వీటిలో తూర్పు ఢిల్లీలోని సూరజ్‌మల్ విహార్‌లో ఈస్టర్న్ క్యాంపస్, ద్వారకలోని వెస్టర్న్ క్యాంపస్‌లున్నాయి. అంతేకాక దీనిలో ఒక భాగంగానే, అత్యాధునిక వసతులతో విద్యాబోధనకు గాను నజఫ్‌గఢ్‌లోని రోషన్‌పురాలో వీర్ సావర్కర్ కళాశాల భవనాన్ని కూడా నిర్మించనున్నారు.
Today is a landmark day for Delhi, with transformative projects in housing, infrastructure and education being launched to accelerate the city's development.
— Narendra Modi (@narendramodi) January 3, 2025
https://t.co/4WezkzIoEP
केंद्र सरकार ने झुग्गियों की जगह पक्का घर बनाने का अभियान शुरू किया: PM @narendramodi pic.twitter.com/PfNkLbRCjd
— PMO India (@PMOIndia) January 3, 2025
नई राष्ट्रीय शिक्षा नीति, गरीब घर के बच्चों को नए अवसर देने वाली नीति है: PM @narendramodi pic.twitter.com/cinYRBhoKe
— PMO India (@PMOIndia) January 3, 2025