వాణిజ్యం, పారిశ్రామిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద గల పారిశ్రామిక విధాన ప్రోత్సాహక విభాగం సమర్పించిన డబ్ల్యుఐపిఒ.. విపో కాపీరైట్ ఒప్పందం, విపో పెర్ఫార్మర్స్ మరియు ఫోనోగ్రామ్స్‌కు సంబంధించిన ఒప్పందం ల విలీనత కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఇందులో ఇంటర్ నెట్ మరియు డిజిటల్ కాపీరైట్ లు కూడా కలిసివున్నాయి. 2016 మే 12వ తేదీన అంగీకరించిన నేశనల్ ఇంటెలెక్చువల్ ప్రోపర్టి రైట్స్ (ఐపిఆర్) విధానం లో భాగంగా పేర్కొన్న లక్ష్యాల సాధనకు ఈ ఆమోదాన్ని ఒక ముందంజ గా చెప్పుకోవచ్చును. ఐపిఆర్ యజమానులకు ఇంటర్ నెట్, మొబైల్ ప్లాట్‌ఫార్మ్ ల ద్వారా ఇ-కామర్స్ కు సంబంధించిన వాణిజ్య అవకాశాల విషయం లో తగిన మార్గనిర్దేశాన్ని, మద్దతును కల్పిస్తుంది. ఇది ఐపిఆర్ లకు వాణిజ్యపరంగా విలువను ఆపాదించి పెడుతుంది.
ప్రయోజనాలు:
కాపీరైట్ పరిశ్రమ డిమాండ్ లను నెరవేరుస్తూ ఈ ఒప్పందాలు భారతదేశానికి సహాయపడనున్నాయి:
సృజనాత్మకత కు సంబంధించి హక్కులు కలిగిన వారు వారి యొక్క కష్టానికి తగినటువంటి ఫలితాన్ని పొందడానికి దీని ద్వారా వీలు ఉంటుంది. అంతర్జాతీయ కాపీరైట్ వ్యవస్థ ను ఉపయోగించుకోవడం ద్వారా తమ సృజనాత్మక కార్యకలాపాల ఉత్పత్తి, పంపిణీ విషయంలో వారు పెట్టిన ఖర్చు భద్రంగా తిరిగి పొందడానికి దీనిని ఉపయోగించవచ్చు. ఇతర దేశాలకు సంబంధించిన మేధోపరమైన హక్కులకు సంబంధించి భారతదేశం ఇప్పటికే రక్షణలను వర్తింప చేసినందున, దేశీయ హక్కుదారులకు కూడా అంతర్జాతీయ స్థాయిలో, ఇతర దేశాలలో వారి హక్కులకు రక్షణ పొందడానికి ఈ ఒప్పందాలు ఉపకరిస్తాయి.
డిజిటల్ కార్యకలాపాలలో సృజనాత్మక పనుల పంపిణీ కి నమ్మకం కల్పించడం, వాటికి వారు పెట్టిన పెట్టుబడి వచ్చేలా చేయడం, వ్యాపారం పెంపు, సృజనాత్మక కార్యకలాపాల ఆర్థిక వ్యవస్థను, సంస్కృతిని అభివృద్ధి చేయడం దీని ఉద్దేశం.
పూర్వరంగం:
కాపీరైట్ చట్టం 1957:
కాపీరైట్ చట్టం 1957 అమలు ను 2016 మార్చి నెలలో డిఐపిపి కి బదిలీ చేసిన తరువాత ఈ చట్టం డబ్ల్యుసిటి కి, డబ్ల్యుపిపిటి కి అనుగుణంగా ఉందా?, లేదా ? అన్న అంశంపై ఒక అధ్యయనాన్ని చేపట్టడమైంది. డబ్ల్యుఐపిఒ తో కలసి ఒక సంయుక్త అధ్యయనాన్ని కూడా చేయడమైంది. కాపీరైట్ చట్టం 1957ను డబ్ల్యుసిటి, డబ్ల్యుపిపిటి ల నిబంధనలకు అనుగుణంగా రూపొందించేందుకు 2012లో ఈ చట్టానికి సవరణలను తీసుకురావడం జరిగింది. ఇందులో ప్రజలకు సందేశం చేరవేయడం అనే నిర్వచనం లో డిజిటల్ కార్యకలాపాలకు కూడా వర్తించేటట్టుగా సవరణను తీసుకువచ్చారు. ఇందుకు సెక్షన్ 2 (ఎఫ్‌ఎఫ్)ను తీసుకువచ్చారు. అలాగే సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అంశాలను కూడా చేర్చారు. రక్షణ చర్యలు (సెక్షన్ 65 ఎ), రైట్స్ మేనేజ్‌మెంట్ సమాచారం (సెక్షన్ 65 బి), పెర్ఫార్మర్ ల నైతిక హక్కులు (సెక్షన్ 38 బి), పెర్ఫార్మర్ ల ప్రత్యేక హక్కులు (సెక్షన్ 38 ఎ), ఎలక్ట్రానిక్ మీడియమ్ కు సంబంధించి సేఫ్ హార్బర్ నిబంధనలు (సెక్షన్ 52(1)(బి), (సి) ఉన్నాయి.
డబ్ల్యుఐపిఒ కాపీరైట్ ఒప్పందం 2002 మార్చి నెల 6వ తేదీన అమలు లోకి వచ్చింది. ఇప్పటి వరకు దీనిని 96 కాంట్రాక్టింగ్ పార్టీలు అమలు చేస్తున్నాయి. బెర్నే కన్వెన్షన్ కు సంబంధించి ఇది ఒక ప్రత్యేక ఏర్పాటుగా చెప్పుకోవచ్చు. (ఇది సాహిత్య, కళాత్మక కార్యకలాపాలకు సంబంధించినది). ఈ ఒప్పందం కింద డిజిటల్ కార్యకలాపాలకు కూడా కాపీరైట్ ను విస్తరింప చేసుకోవచ్చును. అంతేకాకుండా డిజిటల్ కార్యకలాపాలకు సంబంధించిన ప్రత్యేక హక్కులను కూడా ఇది గుర్తిస్తుంది.
డబ్ల్యుఐపిఒ పెర్ఫార్‌మెన్సెస్, ఫోనోగ్రామ్స్ ఒప్పందం 2002 మే 20న అమలు లోకి వచ్చింది. 96 కాంట్రాక్టింగ్ పార్టీలు ఇందులో సభ్యులు. డబ్ల్యు పిపిటి లబ్ధిదారులకు సంబంధించిన రెండు రకాల హక్కుల విషయాలను చూస్తుంది. ప్రత్యేకించి డిజిటల్ కార్యకలాపాలపై దృష్టి పెడుతుంది. అవి. 1) నటీనటులు, గాయకులు, సంగీతకారుల కార్యకలాపాలు, 2) సౌండ్ రికార్డింగ్‌కు సంబంధించిన ఫొనోగ్రామ్ ప్రొడ్యూసర్లు.
ఈ ఒప్పందం సరైన యజమానులకు కొత్త డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ లో, పంపిణీ కి సంబంధించిన సంప్రదింపులలో సరైన సాధికారితను కల్పిస్తుంది. పెర్ఫార్మర్ ల నైతిక హక్కులను ఇది గుర్తిస్తుంది. ఇలా గుర్తించడం ఇదే తొలి సారి. ఇది ప్రత్యేక ఆర్థిక హక్కులను కూడా కల్పిస్తుంది.
ఈ రెండు ఒప్పందాలు సృజనశీలురు, సరైన యజమానులు వారి యొక్క సృజనాత్మక కార్యకలాపాలను రక్షించుకోవడానికి సాంకేతిక ఉపకరణాలు వాడడానికి ఉపకరిస్తాయి. అలాగే సాంకేతిక రక్షణ చర్యలకు సంబంధించిన రక్షణలు (టిపిఎమ్ లు), హక్కుల నిర్వహణ సమాచారం (ఆర్‌ఎంఐ) యొక్క పరిరక్షణకు ఇవి దోహదపడతాయి.
***