డెన్మార్క్ ప్రధానమంత్రి మాననీయ శ్రీమతి మెట్టీ ఫ్రెడరిక్సన్ 2021 అక్టోబరు 9 నుంచి 11 మధ్య భారత్‌లో అధికారిక పర్యటనకు వచ్చిన నేపథ్యంలో గణతంత్ర భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు ఆతిథ్యమిచ్చారు. ఉమ్మడి ప్రజాస్వామ్య సూత్రాలు-విలువలు, చట్టబద్ధ పాలన, మానవ హక్కులకు గౌరవం తదితరాల ప్రాతిపదికగా భారత్-డెన్మార్క్ దేశాల మధ్య సౌహార్ద, స్నేహపూర్వక సంబంధాలు వర్ధిల్లుతున్నాయని ప్రధానమంత్రులిద్దరూ పేర్కొన్నారు. భారత్-డెన్మార్క్ సహజ, సన్నిహిత భాగస్వాములని ప్రకటిస్తూ బహుళపక్షవాద బలోపేతం, సంస్కరణల దిశగానే కాకుండా సముద్రయాన స్వేచ్ఛసహా నిబంధనల ఆధారిత అంతర్జాతీయ విధానాల కోసం తమ ప్రయత్నాను మరింత ముమ్మరం చేస్తామని వారు స్పష్టం చేశారు.
భారత-డెన్మార్క్ మధ్య 2020 సెప్టెంబరు 28నాటి ప్రత్యక్ష సాదృశ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా రెండుదేశాల నడుమ ‘వ్యూహాత్మక హరిత భాగస్వామ్యం’ ప్రారంభమయ్యాక ద్వైపాక్షిక సంబంధాల్లో సానుకూల-ప్రోత్సాహకర పురోగతిపై ప్రధానులిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ మేరకు రాబోయే సంవత్సరాల్లో పరస్పర ప్రాధాన్యంగల అంశాల్లో… ముఖ్యంగా హరితరంగం మాత్రమేగాక ఆరోగ్యంసహా సహకారానికి ప్రాముఖ్యంగల ఇతర రంగాలన్నిటా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కాగలవని వారిద్దరూ ఆశాభావం వెలిబుచ్చారు. అలాగే సాంస్కృతి సహకారం ప్రాముఖ్యాన్ని పునరుద్ఘాటిస్తూ భారత-డెన్మార్క్‌ల మధ్య సాంస్కృతిక ఆదానప్రదానాలను మరింత పెంచడానికి ఇద్దరు ప్రధానమంత్రులూ అంగీకరించారు.
వ్యూహాత్మక హరిత భాగస్వామ్యం కోసం పంచవర్ష కార్యాచరణ ప్రణాళిక
సత్ఫలితాలవ్వగల, ప్రగతిశీల వ్యూహాత్మక హరిత భాగస్వామ్యం దిశగా తమ నిబద్ధతను ప్రధానులిద్దరూ మరోసారి ప్రస్ఫుటం చేశారు. తదనుగుణంగా సమగ్ర పంచవర్ష (2021-2026) కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై వారు హర్షం వ్యక్తం చేయడంతోపాటు దాని అమలులో పురోగతిని ప్రశంసించారు. హరిత వృద్ధి సాధన దిశగా వ్యూహాత్మక హరిత భాగస్వామ్యం బలోపేతానికిగల ప్రాధాన్యంపై ఏకాభిప్రాయం వెలిబుచ్చుతూ పరస్పర ప్రయోజనకర సహకారానికి ఇది బాటలు వేస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో తగిన తరుణం వచ్చినపుడు వ్యూహాత్మక హరిత భాగస్వామ్యం పురోగమనంపై సమీక్షించి మరింత పెంపు, బలోపేతం చేయగల మార్గాలను అన్వేషించాలని వారు నిర్ణయించారు.
సుస్థిర ప్రగతి – హరిత వృద్ధి
పంచవర్ష కార్యాచరణ ప్రణాళిక నిర్దేశిస్తున్న ప్రకారం హరిత, స్వల్ప కర్బన ఉద్గారసహిత వృద్ధిని వేగిరపరచడం, సమీకృతం చేయడానికి అనుసరించాల్సిన మార్గాలపై ఇద్దరు ప్రధానులూ దృష్టి సారించారు. ఈ కార్యాచరణలోని రంగాల్లో: “నీరు; పర్యావరణం; పునరుత్పాదక ఇంధనం-గ్రిడ్‌తో దాని అనుసంధానం; వాతావరణ మార్పు కార్యాచరణ; వనరుల సామర్థ్యం-వర్తుల ఆర్థిక వ్యవస్థ; సుస్థిర-అత్యాధునిక నగరాలు; వర్తకం; మేధో సంపత్తి హక్కులపై సహకారంతోపాటు వాణిజ్యం-పెట్టుబడులు; సముద్ర భద్రత-సహకారం; ఆహారం-వ్యవసాయం; శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానాలు-ఆవిష్కరణలు; ఆరోగ్యం-జీవశాస్త్రాలు; బహుపాక్షిక సంస్థలలో సహకారం; సాంస్కృతిక-పరస్పర ప్రజా సంబంధాలు” తదితరాలున్నాయి.
పునరుత్పాదక ఇంధన అభివృద్ధికి భారతదేశంలోగల అపార అవకాశాలను ప్రధాన మంత్రులిద్దరూ గుర్తుచేశారు. ఈ మేరకు సరికొత్త తయారీ, సాంకేతిక రంగాలకు సంబంధించి దేశంలోని గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా డెన్మార్క్ కంపెనీలకు ఆహ్వానం పలికారు. నిరుడు సెప్టెంబరు నాటి ప్రత్యక్ష సాదృశ శిఖరాగ్ర సదస్సు తర్వాత రెండు దేశాల మధ్య పవన విద్యుత్, విద్యుత్ నమూనాల ఆవిష్కరణ-గ్రిడ్‌తో సంధానంసహా ఇంధన రంగంలో విశాల పునాదిగల సహకారం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వారు ఈ విధంగా పిలుపునిచ్చారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు- ముఖ్యంగా హరిత ఉదజని, విద్యుత్-రవాణా, నిల్వ తదితరాల్లో వాణిజ్యపరమైన సహకార విస్తరణకు ప్రధానమంత్రులు ఇద్దరూ అంగీకరించారు. ‘ఈయూ హొరైజన్ ప్రోగ్రామ్స్, మిషన్ ఇన్నొవేషన్’ వంటి కార్యక్రమాల ద్వారానే కాకుండా సరికొత్త హరిత ఇంధన సాంకేతిక పరిజ్ఞానాలపై చురుకైన అంతర్జాతీయ సహకారం అవసరాన్ని ఇద్దరు ప్రధానులూ గుర్తుచేశారు. అలాగే ఉద్గారాల తగ్గింపులో భారత-డెన్మార్క్ సంయుక్త కృషికిగల ప్రాధాన్యాన్ని వారు నొక్కిచెప్పారు. దీంతోపాటు హరిత ఉదజనిసహా హరిత ఇంధనాల రంగంలో పరిశోధన-అభివృద్ధి ప్రాజెక్టుపైనా ప్రణాళికబద్ధ సంయుక్త కృషి అవసరమని కూడా వారు పిలుపునిచ్చారు.
జలరంగంలో సహకారం ప్రాముఖ్యాన్ని ప్రధానులిద్దరూ నొక్కిచెప్పారు. ఈ దిశగా పట్టణ-గ్రామీణ నీటి సరఫరా, వ్యర్థజల నిర్వహణ, నదుల పునరుద్ధరణ రంగాల్లో రెండు ప్రభుత్వాల వినూత్న చర్యలపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా నీటి సరఫరా, వ్యర్థజల నిర్వహణ, నదుల పునరుద్ధరణ రంగాల్లో నగరాల స్థాయినుంచి రాష్ట్రాల/నదీ పరీవాహకాల స్థాయిదాకా కార్యకలాపాలను ముమ్మరం చేయగల అవకాశాలున్నాయని, దీనికి సంబంధించి మార్గాన్వేషణ కోసం సంబంధిత అధికారవర్గాలతో చర్చించవచ్చునని వారు గుర్తుచేశారు. భారతదేశంలో సుస్థిర నీటి సరఫరాతోపాటు నీటినష్టాల తగ్గింపు, జలవనరుల నిర్వహణ, వ్యర్థజలాల నిర్వహణ నుంచి వనరుల పునరుద్ధరణదాకా సహకారం మరింత మెరుగుకు వీలుందని వారిద్దరూ పేర్కొన్నారు.
అంతర్జాతీయ సౌరశక్తి కూటమి (ఐఎస్ఏ)ని తమ దేశం ఆమోదించడం గురించి డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్టీ ఫ్రెడరిక్సన్ ప్రస్తావించారు. పునరుత్పాదక ఇంధన వనరులన్నిటికీ తగిన ప్రోత్సాహం దిశగా కృషిని ఏకీకృతం చేయడంసహా వాతావరణ మార్పుపై సమష్టి కార్యాచరణకు తోడ్పడగల నిర్దిష్ట సామర్థ్యం ఈ వినూత్న కూటమికి ఉందని ఆమె నొక్కిచెప్పారు. భారత్, డెన్మార్క్ దేశాలకు ‘లీడ్ఐటీ’లో సభ్యత్వం ఉన్న నేపథ్యంలో ‘పారిశ్రామిక పరివర్తనపై నాయకత్వ కూటమి’కి సంబంధించి అనివార్య కీలక రంగాల్లో సహకారం కొనసాగించడంపై వారు అంగీకారానికి వచ్చారు.
పారిస్ ఒప్పందం, ఐక్యరాజ్యసమితి నిర్దేశిత సుస్థిర ప్రగతి లక్ష్యాల (ఎస్డీజీ)కు అనుగుణంగా అంతర్జాతీయ వాతావరణ మార్పు సవాళ్ల పరిష్కార చర్యలపై సంయుక్త సహకారం కొనసాగుతుందని ఇద్దరు ప్రధానమంత్రులూ ధ్రువీకరించారు. వాతావరణ మార్పు ప్రపంచవ్యాప్త సంక్షోభం కాబట్టి దీన్ని ఎదుర్కొనడానికి అంతర్జాతీయ నాయకత్వం అవసరమని వారు నొక్కిచెప్పారు. సుస్థిర-హరిత భవిష్యత్ దిశగా న్యాయమైన, పారదర్శక పరివర్తనను అత్యవసరంగా సాధించడంలో అంతర్జాతీయ సంఘీభావం సాధించాల్సి ఉందని పేర్కొన్నారు. ఆ మేరకు జాతీయ పరిస్థితులు, సమానత్వ సూత్రాలతోపాటు పారిస్ ఒప్పందంనాటి హామీలకు తగినట్లు సామూహిక చర్యలు అవసరమని డెన్మార్క్, భారత్ అభిప్రాయపడ్డాయి.
అదేవిధంగా వాతావరణ మార్పు అనుసరణ, ఉపశమనం కోసం ప్రపంచం ప్రధాన కార్యాచరణ చేపట్టాల్సి ఉందని ప్రధానులిద్దరూ అంగీకరించారు. అందుబాటులోగల అత్యుత్తమ శాస్త్ర పరిజ్ఞానం తోడ్పాటు, వాతావరణ మార్పుపై అంతర ప్రభుత్వ సంఘం 6వ అంచనా నివేదిక సిఫారసులకు అనుగుణంగా ఈ కార్యాచరణను ఉండాలని అభిప్రాయపడ్డారు. అలాగే ప్రపంచ మహమ్మారి అనంతర సంఘటిత ఆర్థిక పునరుద్ధరణలోనూ అంతర్జాతీయ సహకారం అవసరమని ఇద్దరు ప్రధానమంత్రులూ స్పష్టం చేశారు. గ్లాస్గోలో నిర్వహించనున్న ‘కాప్26’ సదస్సుపై చర్చించిన సందర్భంగా నిర్దిష్ట, కీలక తీర్మానాలు చేయాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ, ఇందుకోసం సన్నిహితంగా కృషి చేయాలని వారిద్దరూ నిర్ణయించారు.
సుస్థిర ఆర్థికసహాయ, పెట్టుబడుల దిశగా సముచిత వనరులను గుర్తించాల్సిన ఆవశ్యకతను ఇద్దరు ప్రధానులూ నొక్కిచెప్పారు. ఆ మేరకు ప్రైవేటు ఆర్థిక సహాయ సంస్థలు గణనీయ ఆసక్తి, నిబద్ధత ప్రదర్శించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. సానుకూల చట్రం నిర్దేశిత షరతులకు తగినట్లుగా చర్చలు-సహకారం విస్తరించడం ద్వారా పెట్టుబడులను ప్రోత్సహించడానికి, ప్రాజెక్టుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వారిద్దరూ నిర్ధారించారు. అంతేకాకుండా స్వల్ప కర్బన ఉద్గార ఇంధనం, పారిశ్రామిక పరివర్తనకు ప్రోత్సాహంతోపాటు వినూత్న, సౌలభ్యంగల సాంకేతిక పరిజ్ఞానాల బదిలీ అత్యంత ప్రధానమని ప్రధానులిద్దరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. హరిత ఉదజని, హరిత మిథనాల్ తదితరాలు సహా విద్యుత్ రవాణా, సముద్రతీర పవన విద్యుదుత్పాదక ఇంధన సాంకేతికతలకు సంబంధించి వాణిజ్యపరమైన సహకార విస్తరణ అవసరమని వారు అంగీకరించారు.
వినూత్న ప్రయోగాలు, ఆవిష్కరణలకు వేదికగా నిలిచిన ‘అన్లీష్’ తదుపరి దశను 2022లో భారత్‌లోని బెంగళూరు నగరంలో ప్రారంభించనున్నట్లు ప్రధానమంత్రులు ఇద్దరూ ప్రకటించారు. ఐరాస నిర్దేశిత సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనకు అవసరమైన వ్యవస్థాపనకు ప్రోత్సాహం దిశగా యువత పోషించే పాత్రకు ఇది అవసరమైన మద్దతిస్తుందని వారు పేర్కొన్నారు. నీతి ఆయోగ్, అటల్ ఇన్నొవేషన్ మిషన్, డెన్మార్క్‌లోని ఆవిష్కరణల కేంద్రం ‘వాటర్ చాలెంజ్’ నేతృత్వాన 2022, 2023లలో సంఘటిత జల పారిశ్రామిక సమారంభం నిర్వహించనుండటంపై వారిద్దరూ హర్షం వెలిబుచ్చారు.
వ్యూహాత్మక హరిత భాగస్వామ్యం అమలులో భాగంగా ఇప్పటికే చేపట్టిన చర్యలను ఇద్దరు ప్రధానమంత్రులూ స్వాగతించారు. సంఘటిత నీటి సరఫరాపై జల్‌జీవన్ మిషన్‌కు మద్దతుగా మూడేళ్ల కార్యాచరణ ప్రణాళికతోపాటు సంఘటిత పట్టణ-అత్యాధునిక నీటి సరఫరా కార్యక్రమంపై డెన్మార్క్ ప్రభుత్వం-భారత గృహనిర్మాణ/పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ మధ్య 2021 జూలై 5నాటి ‘ఆసక్తి వ్యక్తీకరణ లేఖ’ తదితరాలు ఈ చర్యల్లో భాగంగా ఉన్నాయి. అంతేకాకుండా ‘పరిశుద్ధ గంగానది’ సంబంధిత సాంకేతిక పరిష్కారాల రూపకల్పనకు మద్దతు దిశగా భారత్‌లోని ‘సెంటర్ ఫర్ గంగా రివర్ బేసిన్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-కాన్పూర్; డెన్మార్క్‌లో ప్రభుత్వ పరిధిలోగల ‘ఇన్నొవేషన్ సెంటర్ డెన్మార్క్’ల మధ్య అవగాహన ఒప్పందంపైనా వారు హర్షం వ్యక్తం చేశారు.
కోవిడ్-19.. ఆరోగ్యం-టీకాలపై భాగస్వామ్యం
కోవిడ్-19 మహమ్మారి పరిణామాలపై తమ అభిప్రాయాలను ప్రధానమంత్రులు ఇద్దరు పరస్పరం తెలియజేసుకున్నారు. అంతర్జాతీయంగా ప్రయోజనకరం కాగల టీకాల భాగస్వామ్యం ఏర్పాటు అవసరాన్ని వారిద్దరూ గుర్తించారు. ముఖ్యంగా టీకాల ఉత్పత్తిసహా అవసరమైన దేశాలన్నిటికీ టీకాల సరఫరాపై భరోసా దిశగా భారత్‌కుగల శక్తిసామర్థ్యాలు ఇందుకు ఎంతగానో తోడ్పడగలవని వారు నిర్ణయానికి వచ్చారు. గుండె, జీవక్రియ సంబంధ వ్యాధుల విషయంలో పరిశోధన-అభివృద్ధి లక్ష్యంగా భారత్ తరఫున శాస్త్రవిజ్ఞాన సంస్థలు, డెన్మార్క్ తరఫున ‘నోవో నార్డిస్క్ ఫౌండేషన్’ల మధ్య ఆదానప్రదానాలకు సంయుక్త సహకారంపై ఇద్దరు ప్రధానమంత్రులూ ఏకాభిప్రాయం వెలిబుచ్చారు. అలాగే రెండు దేశాల మధ్య ప్రయాణ సౌలభ్యం కోసం టీకా ధ్రువీకరణ పత్రాల పరస్పర ఆమోదానికిగల అవకాశాలను పరిశీలించాలని వారిద్దరూ నిర్ణయించారు.
ఆరోగ్య రంగంలో కుదిరిన కొత్త అవగాహన ఒప్పందానికి తమ మద్దతును ప్రధానులిద్దరూ పునరుద్ఘాటించారు. దీనిపై తొలి సంయుక్త కార్యాచరణ బృందం ఇప్పటికే సమావేశం కావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. కోవిడ్-19 నేపథ్యంలో ‘డిజిటల్ ఆరోగ్యం, దీర్ఘకాలిక వ్యాధులు, టీకాలు-సూక్ష్మజీవ నిరోధకత పెరుగుదల’సహా ఆరోగ్య రంగంలో సమగ్ర సంయుక్త సహకార విస్తరణకు ఈ అవగాహన ఒప్పందం ఎంతగానో తోడ్పడగలదని వారు ప్రకటించారు.
కొత్త ఒప్పందాలు
ప్రధానమంత్రులిద్దరి సమక్షంలో ఇచ్చిపుచ్చుకోబడిన ఒప్పందాలు ఇవే:
బహుపాక్షిక సహకారం
కోవిడ్-19ను సమర్థంగా ఎదుర్కొనడంలో బహుపాక్షిక సహకార బలోపేతం ప్రాధాన్యాన్ని ఇద్దరు ప్రధానులూ నొక్కిచెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ బలోపేతం-సంస్కరణలు, అంతర్జాతీయంగా అత్యవసర సమయ సంసిద్ధతసహా పచ్చదనం మరింత పెంపు ఇందులో భాగంగా ఉండాలని స్పష్టం చేశారు. కాగా, ఆగస్టు నెలలో ఐక్యరాజ్యసమితి భద్రత మండలి అధ్యక్ష బాధ్యతలను భారత్ విజయవంతంగా నెరవేర్చడంపై డెన్మార్క్ ప్రధాని ఫ్రెడరిక్సన్ అభినందనలు తెలిపారు. అలాగే మండలి విస్తరణసహా అందులో భారత్‌కు శాశ్వత సభ్యత్వం డిమాండ్‌పై డెన్మార్క్ పూర్తి మద్దతిస్తుందని పునరుద్ఘాటించారు. మరోవైపు 2025-26 కాలానికిగాను భద్రత మండలిలో శాశ్వతేతర సభ్యత్వం కోసం డెన్మార్క్ అభ్యర్థిత్వానికి భారత్ మద్దతిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.
ప్రాంతీయ – అంతర్జాతీయ అభివృద్ధి
ఆఫ్ఘనిస్థాన్‌లో ఆందోళనకర పరిస్థితులుసహా తమతమ ప్రాంతీయ దేశాల్లో పరిణామాలపై ప్రధానమంత్రులు ఇద్దరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా- 1) ప్రాంతీయ అస్థిరత మరింత ముదరకుండా చూడటం; 2) ప్రాంతీయ వాణిజ్యం-అనుసంధానం సహా ప్రాంతీయ సంబంధాల బలోపేతం, ఉగ్రవాద ప్రబోధం నివారణ; 3) మౌలిక హక్కులపై ప్రగతి కొనసాగింపు తదితరాలకుగల ప్రాధాన్యాన్ని వారిద్దరూ అంగీకరించారు. ఆఫ్ఘన్ ప్రజలకు నిరంతర మద్దతుపై తమ నిబద్ధత ప్రకటించారు. అయితే, ఆఫ్ఘనిస్థాన్ సార్వజనీనత, ఉగ్రవాద నిరోధంపై హామీలు, ఐక్యరాజ్య సమతి తీర్మానం 2593 (2021)కి అనుగుణంగా మానవ హక్కులకు… ముఖ్యంగా మహిళల హక్కులకు గౌరవం అవశ్యమని వారు స్పష్టం చేశారు. కాగా, ఇండో-పసిఫిక్‌పై ఐరోపా సమాఖ్య (ఈయూ) తన వ్యూహం ప్రకటించడంపై ఇద్దరు ప్రధానులూ హర్షం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతానికి సంబంధించి ఐరోపా దేశాల కార్యాచరణ మెరుగుదల ప్రణాళికల అవసరాన్ని గుర్తుచేశారు.
భారత-ఐరోపా సమాఖ్య దేశాధినేతల సమావేశానికి 2021 మే నెలలో పోర్చుగల్ ఆతిథ్యమిచ్చిన నేపథ్యంలో భారత-‘ఈయూ’ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఇదొక మైలురాయిగా ఇద్దరు ప్రధానులూ పేర్కొన్నారు. ఈ సమావేశం సందర్భంగా- ప్రగతికాముక, సమతూక, సమగ్ర, పరస్పర ప్రయోజనకర భారత-‘ఈయూ’ స్వేచ్ఛావాణిజ్య ఒప్పందంపై చర్చల పునరుద్ధరణ, పెట్టుబడులపై ప్రత్యేక ఒప్పందం కోసం చర్చలకు శ్రీకారంపై నిర్ణయం తీసుకోవడాన్ని వారిద్దరూ స్వాగతించారు. కాగా, ఈ చర్చలు వీలైనంత త్వరగా ప్రారంభం కావాలని ఇద్దరు ప్రధానులూ ఆకాంక్షించారు. అలాగే భారత-‘ఈయూ’ అనుసంధాన భాగస్వామ్యంపైనా వారిద్దరూ హర్షం వెలిబుచ్చుతూ దీనికి ద్వైపాక్షిక సహకారంసహా సదరు అనుసంధాన ప్రాజెక్టులను ‘ఈయూ’ స్థాయిలో ప్రోత్సహించేందుకు నిర్ణయించారు. కాగా, కోపెన్‌హాగెన్ వేదికగా 2022లో నిర్వహించే భారత-నార్డిక్ రెండో శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని ఫ్రెడరిక్సన్ తనను ఆహ్వానించడంపై ప్రధానమంత్రి మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
***
Addressing a joint press meet with Prime Minister of Denmark @Statsmin Mette Frederiksen. https://t.co/rIRzOngzhq
— Narendra Modi (@narendramodi) October 9, 2021
आज से एक साल पहले, हमने अपनी virtual summit में भारत और डेनमार्क के बीच Green Strategic Partnership स्थापित करने का ऐतिहासिक निर्णय लिया था।
— PMO India (@PMOIndia) October 9, 2021
यह हम दोनों देशों की दूरगामी सोच और पर्यावरण के प्रति सम्मान का प्रतीक है: PM
Energy, food processing, logistics, infrastructure, machinery, software आदि अनेक क्षेत्रों में डेनिश कंपनियां लंबे समय से भारत में काम कर रही हैं।
— PMO India (@PMOIndia) October 9, 2021
उन्होंने न सिर्फ ‘Make in India’ बल्कि ‘Make in India for the World’ को सफल बनाने में महत्वपूर्ण योगदान दिया है: PM @narendramodi
हमने आज एक निर्णय यह भी लिया, कि हम अपने सहयोग के दायरे का सतत रूप से विस्तार करते रहेंगे, उसमें नए आयाम जोड़ते रहेंगे।
— PMO India (@PMOIndia) October 9, 2021
स्वास्थ्य के क्षेत्र में हमने एक नई पार्टनरशिप की शुरुआत की है: PM @narendramodi
भारत में Agricultural productivity और किसानों की आय बढ़ाने के लिए, कृषि सम्बंधित technology में भी हमने सहयोग करने का निर्णय लिया है।
— PMO India (@PMOIndia) October 9, 2021
इसके अंतर्गत food safety, cold chain, food processing, fertilizers, fisheries, aquaculture, आदि क्षेत्रों की technologies पर काम किया जायेगा: PM