Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డిసెంబరు 25న ‘పండిట్ మదన్ మోహన్ మాలవీయ’ రచనల మహా సంకలనం ఆవిష్కరించనున్న ప్రధాని


   హామన పండిట్ మదన్ మోహన్ మాలవీయ 162వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 డిసెంబర్, 25న సాయంత్రం 4:30 గంటలకు ‘కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ పండిట్ మదన్ మోహన్ మాలవీయ’ పేరిట 11 సంచికలతో కూడిన మాలవీయ రచనల మహా సంకలనం తొలి శ్రేణిని ఆవిష్కరిస్తారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించే ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా సభనుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. జాతికి అనుపమాన సేవలందించిన స్వాతంత్ర్య సమర యోధులను అమృత కాలంలో సముచిత గుర్తింపుతో గౌరవించాలన్నది ప్రధానమంత్రి దృక్కోణం. ఈ దిశగా ‘పండిట్ మదన్ మోహన్ మాలవీయ రచనల మహా సంకలనం’ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.

   మొత్తం 11 సంచికలతో ఆంగ్ల, హిందీ భాషల్లో 4,000 పుటలతో ఈ మహా సంకలనం రూపొందింది. దేశం నలుమూలల నుంచి సేకరించిన పండిట్ మాలవీయ రచనలు, ఉపన్యాసాలతో దీన్ని ముద్రించారు. ఇందులో ఎక్కడా ప్రచురితం కాని లేఖలు, వ్యాసాలు, ఉపన్యాసాలు, స్వీయ జ్ఞాపకాలు ఇందులో పొందుపరచబడ్డాయి. అలాగే ఆయన 1907లో ప్రారంభించిన హిందీ వారపత్రిక ‘అభ్యుదయ’లోని సంపాదకీయ సారాంశాలుసహా ఆయా సందర్భాల్లో మహామన రచించిన వ్యాసాలు, కరపత్రాలు, కరదీపికలు కూడా జోడించబడ్డాయి. ఆయన 1903, 1910 సంవత్సరాల్లో ఆగ్రా, అవధ్ ఐక్య రాష్ట శాసనమండళ్లలో ఇచ్చిన ఉపన్యాసాలన్నీ కూడా ఇందులో చేర్చబడ్డాయి. అదేవిధంగా రాయల్ కమిషన్ ఎదుట చేసిన ప్రకటనలు, సామ్రాజ్య శాసనమండలి (ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్)లో 1910-1920 మధ్యకాలంలో బిల్లుల సమర్పణ సందర్భంగా చేసిన ఉపన్యాసాలు, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ముందు-తర్వాత రాసిన లేఖలు, వ్యాసాలు, ఇచ్చిన ఉపన్యాసాలతోపాటు 1923-1925 మధ్య మాలవీయ రాసుకున్న డైరీలోని అంశాల కూర్పుతో ఈ 11 సంచికల మహా సంకలనం రూపొందింది.

   మాలవీయ సంబంధిత పత్రాలు, రచనలు, ఉపన్యాసాలు తదితరాలపై పరిశోధన, కూర్పు నిమిత్తం ప్రత్యేకంగా ఏర్పాటైన ‘మహామన మాలవీయ మిషన్’ ఆ గురుతర బాధ్యతను ప్రశంసనీయంగా నెరవేర్చింది. మహామన పండిట్ మదన్ మోహన్ మాలవీయ ఆదర్శాలు, విలువల ప్రచారం కోసం  ఉద్దేశించబడిన సంస్థ. ప్రముఖ పాత్రికేయుడు శ్రీ రామ్ బహదూర్ రాయ్ నేతృత్వంలోని అంకితభావంతో కూడిన ఈ సంస్థ బృందం పండిట్ మాలవీయ వాస్తవ సాహిత్యంలోని భాష, భావం మార్చకుండా తన కర్తవ్యం నిర్వర్తించింది. కాగా, కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రచురణల విభాగం ఈ పుస్తకాలను ప్రచురించింది.

   పండిట్ మదన్ మోహన్ మాలవీయ ఆదర్శప్రాయుడైన మహా నాయకుడు… బనారస్ హిందూ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు. ఆధునిక భారత నిర్మాతలలో ఆయనది ప్రముఖ స్థానం. ప్రజలలో జాతీయ చైతన్యం రగిలించేందుకు నిరుపమాన కృషి చేసిన విశిష్ట పండితుడుగా, భరతమాత విముక్తి కోసం పోరాడిన అసమాన స్వాతంత్య్ర సమరయోధుడుగా ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.