Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డాక్ట‌ర్ ఆంబేడ్క‌ర్ అంత‌ర్జాతీయ కేంద్రాన్ని దేశ ప్ర‌జ‌లకు అంకితం చేసిన ప్ర‌ధాన మంత్రి


న్యూ ఢిల్లీ లో డాక్ట‌ర్ ఆంబేడ్క‌ర్ అంత‌ర్జాతీయ కేంద్రాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు. ఈ సంస్థ‌కు 2015 ఏప్రిల్ లో ఆయ‌న పునాదిరాయి చేశారు.

ప్ర‌ధాన మంత్రి ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, డాక్ట‌ర్ ఆంబేడ్క‌ర్ బోధ‌న‌లను, దార్శ‌నిక‌తను వ్యాప్తి చేయడంలో కేంద్ర ప్రభుత్వం కీల‌క‌ పాత్ర‌ను పోషించ‌గ‌ల‌ద‌న్న విశ్వాన్ని వ్య‌క్తం చేశారు.

ఈ ప్రాజెక్టులో డాక్ట‌ర్ ఆంబేడ్క‌ర్ ఇంట‌ర్ నేష‌న‌ల్‌ సెంట‌ర్ ఫ‌ర్ సోశియో- ఇక‌నామిక్ ట్రాన్స్ ఫర్మేషన్ కూడా ఒక భాగంగా ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. సామాజిక అంశాలపైనా, ఆర్థిక అంశాల‌పైనా ప‌రిశోధ‌నల కోసం ఇది ఒక ప్రధాన కేంద్రంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని ఆయన అన్నారు. స‌మ్మిళిత వృద్ధి మ‌రియు సంబంధిత సామాజిక‌, ఆర్థిక అంశాల‌కు ఈ కేంద్రం ఒక స‌ల‌హాదారు గా కూడా ప‌ని చేస్తుంద‌ని ప్రధాన మంత్రి చెప్పారు.

ఆలోచ‌నాప‌రులు మ‌రియు దార్శ‌నికులు వేరు వేరు కాలాల‌లో మ‌న దేశానికి దిశ‌ను నిర్దేశించినట్లు ప్ర‌ధాన మంత్రి చెప్పారు. జాతి నిర్మాణంలో బాబాసాహెబ్ అందించిన తోడ్పాటుకుగాను దేశం ఆయ‌న‌కు రుణ‌ప‌డి ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. డాక్ట‌ర్ ఆంబేడ్క‌ర్ దార్శ‌నిక‌తను మ‌రియు ఆలోచ‌న‌ల‌ను మ‌రింత ఎక్కువ మంది, ప్ర‌త్యేకించి యువ‌త, ఆక‌ళింపు చేసుకోవాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం కోరుకొంటోంద‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు. ఈ కార‌ణంగానే డాక్ట‌ర్ ఆంబేడ్క‌ర్ జీవితంతో ముడిప‌డి ఉన్న ముఖ్య‌మైన ప్ర‌దేశాల‌ను యాత్రా కేంద్రాలుగా అభివృద్ధి ప‌ర‌చ‌డం జ‌రిగింద‌ని ఆయ‌న వివ‌రించారు. ఈ సంద‌ర్భంలో ఢిల్లీ లోని అలీపుర్, మ‌ధ్య‌ ప్ర‌దేశ్‌ లోని మ‌హూ, ముంబ‌యి ఇందూ మిల్లు, నాగ్‌పుర్ లోని దీక్షా భూమి ల‌తో పాటు లండ‌న్ లో డాక్ట‌ర్ ఆంబేడ్క‌ర్ నివ‌సించిన ఇంటిని గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు. ఈ ‘‘పంచ తీర్థాలు’’ డాక్ట‌ర్ ఆంబేడ్క‌ర్ కు నేటి త‌రం అర్పిస్తున్న‌టు వంటి శ్ర‌ద్ధాంజ‌లి అంటూ ఆయ‌న అభివ‌ర్ణించారు. డిజిట‌ల్ లావాదేవీల కోసం ఉద్దేశించిన‌టువంటి ‘భీమ్ యాప్’ (BHIM App) డాక్ట‌ర్ ఆంబేడ్క‌ర్ ఆర్థిక దృష్టికి కేంద్ర ప్ర‌భుత్వం స‌మ‌ర్పించిన శ్ర‌ద్ధాంజ‌లి అని కూడా ఆయ‌న చెప్పారు.

1946 డిసెంబ‌ర్ లో రాజ్యాంగ ప‌రిష‌త్తును ఉద్దేశించి డాక్ట‌ర్ ఆంబేడ్క‌ర్ చేసిన ప్ర‌సంగంలో నుండి కొన్ని మాట‌ల‌ను ప్ర‌ధాన మంత్రి ఉదాహ‌రిస్తూ, డాక్ట‌ర్ ఆంబేడ్క‌ర్ త‌న సంఘ‌ర్ష‌ణ‌ల‌కు అతీతంగా దేశం యొక్క స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించే ఒక స్ఫూర్తిదాయ‌క‌మైన విజన్ ను ఆవిష్క‌రించార‌ని అన్నారు. డాక్ట‌ర్ ఆంబేడ్క‌ర్ విజ‌న్ ను మ‌నం ఇప్ప‌టికీ ఆచ‌ర‌ణ రూపంలోకి తీసుకురాలేక‌పోయామ‌ని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు. సామాజిక దుష్క‌ర్మ‌ల‌ను తుడిచిపెట్టే శ‌క్తి యుక్తులు నేటి త‌రానికి ఉన్న‌ాయని ప్రధాన మంత్రి చెప్పారు.

మ‌న రాజ‌కీయ ప్ర‌జాస్వామ్యాన్ని ఒక సాంఘిక ప్ర‌జాస్వామ్యంగా కూడా మ‌ల‌చాల‌ని డాక్ట‌ర్ ఆంబేడ్క‌ర్ చెప్పిన మాట‌ల‌ను ప్ర‌ధాన మంత్రి గుర్తు చేశారు. ఈ విధ‌మైన సామాజిక ప్ర‌జాస్వామ్య స్వ‌ప్నాన్ని సాకారం చేసే దిశగా కేంద్ర ప్ర‌భుత్వం గ‌త మూడు, మూడున్న‌ర సంవత్సరాలుగా కృషి చేసిన‌ట్లు ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు. ఈ సంద‌ర్భంలో ‘జ‌న్ ధ‌న్ యోజ‌న’, ‘ఉజ్జ్వ‌ల యోజ‌న‌’, ‘స్వ‌చ్ఛ భార‌త్ అభియాన్‌’, బీమా ప‌థకాలు, ‘ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న’ ల‌తో పాటు ఇటీవ‌లే ప్ర‌వేశ‌పెట్టిన ‘సౌభాగ్య యోజ‌న’ ల వంటి ప్ర‌భుత్వం చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌ను ఆయ‌న ఏక‌రువు పెట్టారు. ఆయా ప‌థ‌కాల‌ను మ‌రియు ప్రాజెక్టుల‌ను వాటికి నిర్దేశించిన గ‌డువులోగా పూర్తి చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం స‌క‌ల ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. మ‌రి డాక్ట‌ర్ ఆంబేడ్క‌ర్ అంత‌ర్జాతీయ కేంద్రం వీటిలో ఒక ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంద‌ని ప్రధాన మంత్రి చెప్పారు. ప్ర‌జా సంక్షేమ కార్య‌క్ర‌మాలను అమ‌లు చేయ‌డంలో కేంద్ర ప్ర‌భుత్వం క‌న‌బ‌రుస్తున్న నిబ‌ద్ధ‌తను, ప్రదర్శిస్తున్న వేగాన్ని చాటి చెప్ప‌డానికి భూమి స్వ‌స్థ‌త కార్డుల పంపిణీ, ‘మిష‌న్ ఇంద్ర‌ధ‌నుష్‌’, ఇంకా గ్రామీణ విద్యుదీక‌ర‌ణ ల‌క్ష్యాల దిశ‌గా పురోగ‌మ‌నం వంటి ఇత‌ర ప‌థ‌కాల‌ను గురించి ప్రధాన మంత్రి సుదీర్ఘంగా వివ‌రించారు. స్వ‌తంత్ర ఉద్యోగ క‌ల్ప‌న కోసం ప్ర‌వేశ‌పెట్టిన ‘స్టాండ్‌- అప్‌ ఇండియా’ ను గురించి కూడా ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

తాను పిలుపునిచ్చిన‌టు వంటి ‘‘న్యూ ఇండియా’’ డాక్ట‌ర్ ఆంబేడ్క‌ర్ క‌లగ‌న్న భార‌త‌దేశంలో భాగ‌మ‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు. ఇందులో ప్ర‌తి ఒక్కరికి స‌మాన అవ‌కాశాలు మ‌రియు హ‌క్కులు కుల‌ప‌ర‌మైన అణ‌చివేత నుండి విముక్తి ల‌తో పాటు, సాంకేతిక విజ్ఞానం అండ‌దండ‌ల‌తో పురోగ‌మించ‌డం వంటివి భాగంగా ఉంటాయ‌ని ప్రధాన మంత్రి అన్నారు. బాబాసాహెబ్ ఆంబేడ్క‌ర్ క‌ల‌ల‌ను పండించే దిశ‌గా ప్ర‌తి ఒక్క‌రు ప‌ని చేయాల‌ని ఆయ‌న ఉద్బోధించారు. 2022 సంవ‌త్స‌రం క‌ల్లా మ‌నం దీనిని సాధించ‌గ‌లుగుతామ‌న్న ఆశాభావాన్ని ప్ర‌ధాన మంత్రి వ్య‌క్తం చేశారు.