Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ స్మారక చిహ్నాన్ని రేపు ప్రారంభించనున్న ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు (27.07.2017) ఉదయం 11.30 గంటలకు రామేశ్వరం లోని పేయి కరుంబు లో పూర్వ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ స్మారక చిహ్నాన్ని ప్రారంభిస్తారు. డిఆర్ డిఒ రూపుదిద్దిన మరియు నిర్మించిన ఈ స్మారకం వద్ద ప్రధాన మంత్రి జాతీయ పతాకాన్ని ఎగరవేస్తారు.

ప్రధాన మంత్రి డాక్టర్ అబ్దుల్ కలామ్ విగ్రహాన్ని ఆవిష్కరించి, పుష్పాంజలిని ఘటిస్తారు. ప్రధాన మంత్రి శ్రీ మోదీ డాక్టర్ కలామ్ కుటుంబ సభ్యులతో సంభాషిస్తారు.

ఆ తరువాత, ‘కలామ్ సందేశ్ వాహిని’ పేరుతో తీర్చిదిద్దిన ఒక ఎగ్జిబిషన్ బస్సును ప్రధాన మంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ బస్సు దేశం లోని వివిధ రాష్ట్రాలలో ప్రయాణించి పూర్వ రాష్ట్రపతి జయంతి రోజైన అక్టోబర్ 15 నాడు రాష్ట్రపతి భవన్ కు చేరుకొంటుంది.

దీని తరువాత ప్రధాన మంత్రి బహిరంగ సభలో పాల్గొనడానికి మండపమ్ కు వెళతారు. నీలి విప్లవ పథకంలో భాగంగా లాంగ్ లైనర్ ట్రాలర్ లను మంజూరు చేస్తున్నట్లు తెలిపే పత్రాలను లబ్దిదారులకు ఆయన పంపిణీ చేస్తారు. అంతే కాకుండా, అయోధ్య నుండి రామేశ్వరానికి ఒక కొత్త ఎక్స్ ప్రెస్ రైలును- వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా- ఆయన ఒక జెండాను ఊపి ప్రారంభిస్తారు. హరిత రామేశ్వరం పథకం యొక్క సారాంశాన్ని వివరించే పుస్తకాన్ని ప్రధాన మంత్రి విడుదల చేస్తారు. ముకుందరాయర్ చతిరమ్ మరియు అరిచల్ మునయ్ మధ్య సాగే ఎన్ హెచ్ 87లో భాగమయ్యే 9.5 కిలో మీటర్ల లింకు రోడ్డును దేశ ప్రజలకు అంకితమిచ్చేందుకు గాను ఒక ఫలకాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. ఒక బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించడంతో ప్రధాన మంత్రి శ్రీ మోదీ తన పర్యటనను ముంగించనున్నారు.

కలామ్ స్మారకం నేపథ్యం

ఈ స్మారక చిహ్మాన్ని డిఆర్ డిఒ సరిగ్గా ఒక సంవత్సర కాలంలో నిర్మించింది. వాస్తు కళ పరంగా దీని రూపకల్పనలో అనేక జాతీయ సీమా చిహ్నాల నుండి ప్రేరణను పొందారు. ముఖ ద్వారం ఇండియా గేట్ ను పోలి ఉన్నట్లు కనిపిస్తుంది. కాగా, దీని రెండు గుమ్మటాలు రాష్ట్రపతి భవన్ మాదిరిగా అగుపిస్తాయి.

స్మారక భవనంలో నాలుగు ప్రధానమైన పెద్ద గదులు ఒక్కొక్కటీ డాక్టర్ కలామ్ జీవిత ఘటనలకు అద్దం పడతాయి. ఒకటవ హాల్ లో ఆయన బాల్యం మరియు విద్యార్థి దశ, రెండవ హాల్ లో రాష్ట్రపతిగా సేవలు అందించినప్పటి దశతో పాటు పార్లమెంట్ ను, యుఎన్ కౌన్సిల్ ను ఉద్దేశించిన చేసిన ప్రసంగాలు, మూడవ హాల్ లో ఇస్రో తోను, డిఆర్ డిఒ తోను ఆయనకు ఉన్నటువంటి అనుబంధం, నాలుగవ హాల్ లో రాష్ట్రపతి పదవిలో నుండి వైదొలగిన అనంతరం ఆయన గడిపిన జీవితంతో పాటు శిలాంగ్ లో ఆయన అంతిమ శ్వాస వదలిన ఘట్టం వరకు గుర్తుకు తెచ్చే విధంగా ఆయా గదుల నిర్మాణం సాగింది.

డాక్టర్ కలామ్ కు సంబంధించిన ప్రఖ్యాత రుద్రవీణ, ఎస్ యు-30 ఎమ్ కెఐ లో ప్రయాణించేందుకు ఆయన ధరించిన ప్రత్యేక దుస్తులు మరియు ఆయన అందుకున్న అసంఖ్యాక పురస్కారాలు సహా, ఆయన వ్యక్తిగత వస్తువులలో కొన్నింటిని ప్రదర్శించే ఒక ప్రత్యేక విభాగం కూడా స్మారకంలో ఉంటుంది. 12 గోడల పైన కుడ్య చిత్రాలను మరియు చిత్రకళను అలంకరించారు.

స్మారక చిహ్నం అంతటా డాక్టర్ కలామ్ వ్యక్తిత్వంలోని శాంతి మరియు సామరస్య భావనలకు అద్దం పట్టే విధంగా సుందరంగా తీర్చి దిద్దారు.

స్మారక చిహ్నానికి నిర్మాణ సామగ్రిని మరియు ఇతరత్రా వస్తువులను భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండి రామేశ్వరానికి తరలించారు. ఉదాహరణగా చెప్పాలంటే- చిత్రిక పట్టిన తలుపులను తంజావూరు నుండి, శిలాచ్ఛాదనలను జైసల్మేర్ మరియు ఆగ్రా నుండి, రాతి స్తంభాలను బెంగళూరు నుండి, చలువరాళ్ళను కర్ణాటక నుండి, కుడ్య చిత్రాలను హైదరాబాద్, కోల్ కతా లోని శాంతినికేతన్ ఇంకా చెన్నై నుండి తీసుకు వచ్చారు.

***