Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

“ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా”లెక్చర్ సందర్భంలో ప్ర‌ధానమంత్రి ఉపన్యాసం

“ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా”లెక్చర్ సందర్భంలో ప్ర‌ధానమంత్రి ఉపన్యాసం


శ్రేష్ఠుడు, సింగ‌పూర్ ఉప‌ ప్ర‌ధాని శ్రీ థ‌ర్మన్ ష‌ణ్ముగ‌ర‌త్నమ్,

నా స‌హచ‌ర మంత్రులు,

ముఖ్య‌మంత్రులు,

ఆహ్వానితులైన వక్తలు మరియు మిత్రులారా,

పెట్టుబ‌డులు, కార్మిక‌ శ‌క్తి నాణ్యతపైన అభివృద్ధి ఆధారపడి ఉంటుందని నమ్మిన రోజులు ఒక‌ప్పుడు ఉండేవి. కానీ, ఇవాళ అది సంస్థ‌లు, ఆలోచ‌న‌ల నాణ్య‌త పైన కూడా ఆధారపడుతున్నదని మనం ఎరుగుదుము. గ‌త ఏడాది ఆరంభంలో, నేషనల్ ఇన్ స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా లేదా ఎన్ ఐ టి ఐ (నీతి) పేరిట ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేయడమైంది. భార‌తదేశాన్ని పరివర్తన పథంలో నడిపించేటందుకు అవ‌స‌ర‌మైన స‌రికొత్త ఆలోచ‌న‌లను అందించ‌గ‌ల మేధావుల సంఘంగా దీని ఆవిష్కారం జ‌రిగింది.

నీతికి నిర్దేశించిన ప్ర‌ధాన‌ విధుల్లో ఒక‌టి:

– దేశ విదేశీ నిపుణుల‌తో స‌మ‌న్వ‌యం సాగిస్తూ వెలుప‌లి నుండి వ‌చ్చే స‌రికొత్త ఆలోచ‌న‌ల‌ను ప్ర‌భుత్వ విధానాల్లోకి తీసుకురావ‌డం;

– వెలుప‌లి ప్ర‌పంచం, నిపుణులు, ప్రాక్టీష‌న‌ర్ల‌తో ప్ర‌భుత్వానికి అనుసంధాన‌క‌ర్త‌గా ఉండ‌డం;

– వెలుప‌లి నుండి వ‌చ్చే ఆలోచ‌న‌లు ప్ర‌భుత్వ విధాన నిర్ణ‌యాల్లోకి తీసుకువ‌చ్చేందుకు ఒక సాధ‌నంగా నిల‌వ‌డం.

భార‌త‌ ప్ర‌భుత్వానికి, రాష్ర్ట‌ ప్ర‌భుత్వాల‌కు సుదీర్ఘ పాల‌నాప‌ర‌మైన సంప్రదాయం ఉంది. భార‌తదేశం గ‌తాన్ని ఆధారం చేసుకొని దేశ‌ విదేశీ నిపుణుల నుండి వెలువ‌డే ఆలోచ‌నాధోర‌ణుల‌ను ఈ సంప్ర‌దాయం అనుసంధానం చేస్తుంది. ఈ పాల‌నాప‌ర‌మైన సంప్ర‌దాయం ఎన్నో ర‌కాలుగా దేశానికి ఉప‌యోగ‌ప‌డింది. అన్నింటి క‌న్నా మిన్న‌గా భిన్న‌త్వానికి ఆల‌వాల‌మైన దేశంలో ప్ర‌జాస్వామ్యం, సమాఖ్య తత్వం, ఐక్య‌త‌, స‌మ‌గ్ర‌తల‌ను ప‌రిర‌క్షిస్తోంది. ఇవి స్వ‌ల్ప విజ‌యాలు కాదు. అయినా మ‌నం నిరంత‌రం ప‌రివ‌ర్త‌న‌తో కూడిన ప్ర‌పంచంలో నివ‌సిస్తున్నాం, దానికి మ‌నం అతీతులం కాదు.

జాతీయ‌, అంత‌ర్జాతీయ కార‌ణాలు రెండింటి దృష్య్టా ఈ ప‌రివ‌ర్త‌న అవ‌స‌రం. ప్ర‌తి ఒక్క దేశానికి సొంత అనుభ‌వాలు, సొంత వ‌న‌రులు, సొంత బ‌లాలు ఉంటాయి. 30 సంవ‌త్స‌రాల క్రితం అయితే, ఏ దేశం అయినా త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి అంత‌ర్గ‌తంగానే అన్వేషించేది. కానీ ఈ రోజు దేశాలు ఒక దానిపై మ‌రొక‌టి ఆధార‌పడి ఉన్నాయి; అనుసంధానమయ్యాయి. ఏ ఒక్క దేశం ఏకాకిగా అభివృద్ధిని సాధించ‌లేదు. ప్ర‌తి ఒక్క దేశం త‌న కార్య‌క‌లాపాల‌కు అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌నే గీటురాయిగా నిర్దేశించుకోవ‌ల‌సి ఉంటుంది, లేదంటే దేశం వెనుక‌బ‌డిపోవ‌ల‌సిందే.

అంత‌ర్గ‌త కార‌ణాల దృష్ట్యా కూడా ఈ ప‌రివ‌ర్త‌న అవ‌స‌రం. మ‌న యువ‌త భిన్నంగా ఆలోచిస్తోంది, భిన్నంగా నిల‌వాల‌ని ఆశ ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం సుదీర్ఘ స‌మ‌యం పాటు గ‌తం నుండి పాతుకుపోయిన వేళ్ళ‌నే ప‌ట్టుకుని ముందుకు సాగ‌లేదు. కుటుంబాలలోనూ యువ‌త‌రం, వృద్ధ‌త‌రం మ‌ధ్య బాంధ‌వ్యాలు మారాయి. గ‌తంలో కుటుంబాలలోని వృద్ధుల‌కు యువ‌త‌రం క‌న్నా అధిక ప‌రిజ్ఞానం ఉండేది. కానీ ఇవాళ సాంకేతిక విప్ల‌వం పుణ్య‌మా అని ప‌రిస్థితి త‌ర‌చు మారిపోతోంది. మారుతున్న యువ‌త‌రం అభిరుచుల‌కు అనుగుణంగా స‌మాచారాన్ని అందించాల్సిన స‌వాలు పెరిగిపోయింది.

మారుతున్న స‌వాళ్ళ‌కు అనుగుణంగా ప్రగ‌తిని సాధించాలంటే, గ‌తం క‌న్నామెరుగైన వృద్ధిని నమోదు చేయడం ఎంతమాత్రం సరిపోదు. ఇప్పుడు ప‌రివ‌ర్త‌న అనేది సంపూర్ణంగా ఉండాలి.

అందుకే భార‌తదేశం క్ర‌మ‌క్ర‌మంగా పురోగ‌మించ‌డం కాకుండా, స‌త్వ‌ర ప‌రివ‌ర్త‌నను సాధించాల‌న్న‌దే నా ఆలోచ‌న‌.

– పాల‌న‌లో ప‌రివ‌ర్త‌న లేకుండా సాధ్యం కాని దేశీయ ప‌రివ‌ర్త‌న‌;

– ఆలోచ‌నా ధోర‌ణుల్లో ప‌రివ‌ర్త‌న లేకుండా సాధ్యం కాని పాల‌నా ప‌రివ‌ర్త‌న‌;

– ప‌రివ‌ర్త‌న‌కు దారి తీసే న‌వ్య‌త లేకుండా సాధ్యం కాని ఆలోచ‌నా ప‌రివ‌ర్త‌న‌.

ఇందుకోసం మ‌నం చ‌ట్టాలలో మార్పులు చేయవలసి ఉంటుంది. అన‌వ‌స‌ర‌మైన విధి విధానాల‌కు స్వ‌స్తి చెప్పాల్సి ఉంటుంది. స‌రికొత్త సాంకేతిక విజ్ఞానాలను అందిపుచ్చుకోవలసి ఉంటుంది. 19వ శ‌తాబ్ది నాటి ప‌రిపాల‌నా వ్య‌వ‌స్థ‌ల‌తో 21వ శ‌తాబ్దిలోకి పురోగ‌మించ‌డం ఏ మాత్రం సాధ్యం కాదు.

సాధార‌ణంగా ఆక‌స్మికంగా సంభ‌వించే సంఘ‌ట‌న‌లు, సంక్షోభాల‌ తోనే పాల‌నాప‌ర‌మైన ఆలోచ‌నా ధోర‌ణులలో మౌలిక‌మైన మార్పులు చోటు చేసుకుంటాయి. భార‌తదేశానికి సుస్థిర‌మైన ప్ర‌జాస్వామిక రాజ‌కీయ వ్య‌వ‌స్థ అమరడం ఒక వ‌రం వంటిది. ఆక‌స్మిక సంఘ‌ట‌న‌లకు, సంక్షోభాల‌కు తావు లేని వాతావ‌ర‌ణంలో ప‌రివ‌ర్తిత మార్పుల కోసం మ‌నం ప్ర‌త్యేకంగా కృషి చేయవలసి ఉంటుంది. పుస్త‌కాలను, వ్యాసాలను చ‌ద‌వ‌డం ద్వారా మ‌నం స‌రికొత్త ఆలోచ‌నా ధోర‌ణులను ఆక‌ళింపు చేసుకోవ‌చ్చు. పుస్త‌కాలు మ‌న మ‌న‌సును త‌ట్టి లేపుతాయి. కానీ మ‌నం సంఘ‌టితంగా ముందుకు దూక‌లేక‌పోతే, ఆ ఆలోచ‌నా ధోర‌ణులు వ్య‌క్తిగ‌త మ‌స్తిష్కాల‌కే ప‌రిమితం అయిపోతాయి. మ‌నం ఎప్పుడూ కొత్త ఆలోచ‌న‌లను విని వాటిని అవ‌గాహ‌న చేసుకుంటూ ఉంటాం. కానీ వ్య‌క్తిగ‌త సామ‌ర్థ్యం చాల‌క‌, వాటిని ఆచ‌ర‌ణలోకి తీసుకురాము. మ‌నంద‌రం కూర్చొని ఆలోచిస్తే, అటువంటి ఆలోచ‌న‌లు కార్యాచ‌ర‌ణ‌లోకి తీసుకురాగ‌లిగే ఉమ్మ‌డి శ‌క్తి మ‌న‌కు ల‌భిస్తుంది. ఇందుకు మ‌న మ‌న‌సుల‌ను ఉమ్మ‌డి ఆలోచ‌న‌ల‌కు తెర‌చి ఉంచాలి. అంత‌ర్జాతీయ దృక్ప‌థంతో స‌రికొత్త ఆలోచ‌న‌ల‌ను ఆహ్వానించాలి. అందుకే మ‌నం వ్య‌క్తిగ‌తంగా క‌న్నా ఉమ్మ‌డిగా కొత్త ఆలోచ‌న‌లను ఆక‌ళింపు చేసుకోవాలి. ఇందుకు ఉమ్మ‌డి ప్ర‌య‌త్నం అవ‌స‌రం.

మీ అంద‌రికీ తెలుసు.. నేను అధికార బాధ్య‌త‌లు స్వీక‌రించిన నాటి నుండి బ్యాంక‌ర్లు, పోలీసు అధికారులు, ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శులు.. ఇంకా ఎంద‌రితోనో స‌మావేశాలలో పాల్గొని ఆయా రంగాల‌కు, ప్ర‌జాసంక్షేమానికి కీల‌క‌మైన ప‌లు అంశాల‌పైన చ‌ర్చించాను. ఆయా స‌మావేశాలలో వారు వ్య‌క్తం చేసిన ఆలోచ‌న‌ల‌ను విధానాలలో పొందుప‌రిచాను.

దేశీయంగా ఆలోచ‌న‌ల‌ను కూడ‌గ‌ట్టే ప్ర‌క్రియ ఇది. ఇక త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ దేశం వెలుప‌లి నుండి ఆలోచ‌న‌లను స‌మీక‌రించ‌డమనేది. సాంస్కృతికంగా భార‌తీయులు ప్ర‌పంచంలోని ఏ ప్రాంతానికి చెందిన ఆలోచ‌న‌ల‌నైనా ఎలాంటి వ్య‌తిరేక‌త లేకుండా ఆహ్వానిస్తారు. ఋగ్వేదం “ఆ నో భ‌ద్రా: కృత‌వో యంతు విశ్వత:” అని చెప్పింది. దీని అర్థం ఏమిటంటే– అన్ని దిశ‌ల నుంచి వ‌చ్చే మంచి ఆలోచ‌న‌లు ఆహ్వానిద్దాం అని.

భార‌తదేశం ప‌రివ‌ర్త‌న‌పై ఉప‌న్యాసాలను ఒక పరంపరగా నిర్వ‌హించ‌డానికి ఇదే కార‌ణం. ఈ కార్య‌క్ర‌మాలలో మేము వ్య‌క్తిగ‌త హోదాలో కాకుండా మార్పును కోరే వారుగా ఒక జట్టుగా పాల్గొంటున్నాము.

ఎన్నో రంగాలు, ఎంద‌రి జీవనాలనో ప‌రివ‌ర్త‌న చేసిన‌, ప్ర‌భావితం చేసిన‌ ప్ర‌ముఖులు వారి అనుభ‌వాన్ని, విష‌య ప‌రిజ్ఞానాన్ని రంగ‌రించి తెలియ‌చేసే అభిప్రాయాలను స్వీక‌రించి, ఈ భూమండ‌లంపైన భార‌తదేశాన్ని ఉత్త‌మ ప్ర‌దేశంగా తీర్చిదిద్దేందుకు ఉప‌యోగించుకుంటున్నాము.

ఆ దిశ‌గా నిర్వ‌హిస్తున్న ఉప‌న్యాసాల ప‌రంప‌ర‌లో ఇది తొలి ఉప‌న్యాసం. మీ అంద‌రికీ మీ అభిప్రాయాలు తెలియ‌చేసే (ఫీడ్ బ్యాక్) ఫారం ఇచ్చారు. ఈ ఉప‌న్యాసాల ప్ర‌క్రియ‌ను మ‌రింత ముందుకు న‌డిపించేందుకు మీ అంద‌రి నుండి స‌వివ‌ర‌మైన‌, నిష్క‌ల్మ‌ష‌మైన అభిప్రాయాలు తెలుసుకునేందుకు నేను ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను. ఆయా ఉప‌న్యాస కార్య‌క్ర‌మాలలో పాల్గొనేందుకు అర్హులైన దేశ విదేశాల‌కు చెందిన నిపుణులు, ప్యానెలిస్టుల పేర్లు కూడా సూచించాల‌ని నేను కోరుతున్నాను. వివిధ మంత్రిత్వ శాఖ‌ల నుండి ఈ కార్య‌క్ర‌మాలలో పాల్గొన్న అధికారులతో వారం రోజుల్లోగా త‌దుప‌రి చ‌ర్చను నిర్వ‌హించాల్సిందిగా కూడా ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శుల‌కు నేను సూచిస్తున్నాను. ఇక్క‌డ వెలువ‌డే ఆలోచ‌న‌ల‌ను నిర్దిష్ట కార్యాచ‌ర‌ణ‌గా మార్చ‌డం ప్ర‌తి ఒక బృందానికి ల‌క్ష్యం. అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఇటువంటి కార్య‌క్ర‌మాలలో పాల్గొనాల‌ని మంత్రిత్వ‌ శాఖ‌ల‌ను నేను కోరుతున్నాను.

సింగ‌పూర్ ముఖ‌చిత్రాన్ని సంపూర్ణంగా మార్చి వేసిన లీ కువాన్ యు మ‌న త‌రంలో అతి పెద్ద సంస్క‌ర‌ణ‌వేత్త‌, పాల‌నా నిపుణుడు. అదే దేశానికి ఉప‌ ప్ర‌ధానిగా ప‌ని చేస్తున్న శ్రీ థ‌ర్మన్ ష‌ణ్ముగ‌ర‌త్నమ్ ప్ర‌సంగంతో ఈ ఉప‌న్యాస కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్ట‌డం స‌రైన చ‌ర్య‌గా నేను భావిస్తున్నాను. ఆయ‌న చ‌క్క‌ని పండితుడు, ప్ర‌భుత్వ విధానాల రూప‌క‌ర్త‌. ఆయ‌న ఉప‌ ప్ర‌ధాని మాత్ర‌మే కాదు, సింగ‌పూర్ ప్ర‌భుత్వ ఆర్థిక‌, సామాజిక విధానాల స‌మ‌న్వ‌య విభాగం మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, సింగ‌పూర్ ద్ర‌వ్య విధాన సంస్థ చైర్మ‌న్ గా కూడా సేవలు అందిస్తున్నారు. గ‌తంలో ఆయ‌న మాన‌వ వ‌న‌రుల శాఖ మంత్రిగా, ఆర్థిక శాఖ సెకండ్ మినిస్ట‌ర్ గా, విద్యాశాఖ మంత్రిగా ప‌ని చేశారు.

1957లో జ‌న్మించిన శ్రీ ష‌ణ్ముగ‌ర‌త్నమ్ పూర్వీకులు శ్రీ‌లంక త‌మిళులు. లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎక‌నామిక్స్ లో ఆయ‌న బాచిల‌ర్ డిగ్రీ పుచ్చుకున్నారు. కేంబ్రిడ్జి విశ్వ‌విద్యాల‌యంలో అర్థ‌శాస్త్రంలో స్నాతకోత్తర పట్టా పొందారు. హార్వ‌ర్డ్ విశ్వ‌విద్యాల‌యం నుండి ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ లో మ‌రో మాస్ట‌ర్స్ డిగ్రీ చేశారు. ఆయ‌న అసాధార‌ణ కృషికి గుర్తింపుగా లిట‌రేచ‌ర్ ఫెలో పుర‌స్కారాన్ని హార్వ‌ర్డ్ అందించింది.

ప్ర‌పంచంలోని ప్ర‌ముఖ‌ మేధావులలో శ్రీ ష‌ణ్ముగ‌ర‌త్నం ఒక‌రు. ఆయ‌న ఆలోచ‌నా ధోర‌ణుల ప‌రిధికి ఒక ఉదాహ‌ర‌ణ మీ ముందుంచాల‌నుకుంటున్నాను. నేడు సింగ‌పూర్ ఆర్థిక వ్య‌వ‌స్థ పూర్తిగా ఇత‌ర దేశాల నుండి అందే వ‌స్తువుల‌పైన ఆధార‌ప‌డి ఉంది. భూతాపాన్ని త‌గ్గించిన‌ట్ట‌యితే సింగ‌పూర్ కు స‌రికొత్త జ‌ల మార్గం (నావిగేష‌న్) ఏర్ప‌డి, ఆ దేశ ఆధార‌నీయ‌త త‌గ్గుతుంది. ఈ అవ‌కాశంపై ఆయ‌న ఇప్ప‌టికే ఆలోచించి, దానిని సాధించేందుకు ప్ర‌ణాళికను కూడా రూపొందించార‌ని నాకు తెలిసింది.

మిత్రులారా, శ్రీ ష‌ణ్ముగ‌ర‌త్నమ్ సాధించిన విజ‌యాలు, అందుకున్న కీర్తి ప‌తాకాలు సుదీర్ఘ‌మైన‌వి. ఆయ‌న విలువైన స‌ల‌హాలు వినేందుకు అంద‌రం ఆస‌క్తిగా ఉన్నాం. అందుకే ఇక ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా శ్రీ ష‌ణ్ముగ‌ర‌త్నంను ఈ వేదిక పైకి ఆహ్వానిస్తున్నాను. అంత‌ర్జాతీయ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో భార‌తదేశం పాత్ర‌పై మ‌నంద‌రిలో చైత‌న్యం నింపాల‌ని ఆయ‌నను కోరుతున్నాను.

*****