టెలికాం కమిషన్ పార్ట్ టైమ్ సభ్యులుగా నీతి (నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా) ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారిని నియమించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ పదవిలో ఇదివరకు ప్రణాళికా సంఘం కార్యదర్శి ఉండే వారు. ప్రస్తుతం ప్రణాళికా సంఘాన్ని ఎత్తివేశారు.
ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చే బాధ్యతను నిర్వహిస్తున్న నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి టెలికాం కమిషన్ సమావేశాలలో పాలు పంచుకోవడం వల్ల కమిషన్ చర్చలకు ప్రాముఖ్యం చేకూరుతుంది.
పూర్వ రంగం
భారత ప్రభుత్వం 1989 ఏప్రియల్ 11న చేసిన ఒక తీర్మానం ద్వారా టెలికాం కమిషన్ ను ఏర్పాటు చేసింది. టెలీ కమ్యూనికేషన్లకు సంబంధించిన అన్ని రంగాలలోనూ త్వరిత గతిన అభివృద్ధిని సాధించడం కోసం తగిన పరిపాలన పరమైన, విత్త పరమైన అధికారాలను టెలీకాం కమిషన్ కు ఇచ్చారు.
ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడం కన్నా ముందు, టెలికాం కమిషన్ ను ఒక ఛైర్మన్ (టెలీ కమ్యూనికేషన్ల విభాగ కార్యదర్శి), నలుగురు పూర్తి కాలపు సభ్యులు (ఫైనాన్స్, ప్రొడక్షన్, సర్వీసెస్, టెక్నాలజీ ఈ నాలుగింటి నుంచి ఒక్కొక్క సభ్యులు) మరో నలుగురు పార్ట్ టైమ్ సభ్యులు (ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం, ఆర్థిక వ్యవహారాల విభాగం, ప్రణాళికా సంఘం, ఇండస్ట్రియల్ పాలసీ & ప్రమోషన్ విభాగం.. ఈ నాలిగింటి నుంచి ఒక్కొక్క కార్యదర్శి ) తో ఏర్పాటు చేశారు.
ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి ఆ స్థానంలో నీతి ఆయోగ్ ను ప్రవేశపెట్టాక టెలికాం కమిషన్ లో కేవలం ముగ్గురు పార్ట్ టైమ్ సభ్యులు మిగిలారు.
ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చే బాధ్యతను నిర్వహిస్తున్న నీతి ఆయోగ్ సీఈఓ ను టెలికాం కమిషన్ చర్చలకు విలువను జోడించడానికి ఆ కమిషన్ కు పార్ట్ టైమ్ సభ్యులుగా వేయవలసిన అవసరముందని భావించారు.