డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కు చెందిన పిఎస్‌యు అయినటువంటి హెమిస్ఫియర్ ప్రాపర్టీస్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌పిఐఎల్) కు 700 కోట్ల రూపాయల ఈక్విటీ ని మరియు 51 కోట్ల రూపాయల సెక్యూర్డ్ జిఒఐ లోను ను సమకూర్చడానికి, మిగులు భూమి విభజన కు సంబంధించిన పథకాన్ని అమలు చేయడానికి తోడు తదనంతరం హెచ్‌పిఐఎల్ యొక్క పాలన పరమైన నియంత్రణ ను గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కు బదిలీ చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
వివరాలు:
ఎ. ప్రైవేట్ ప్లేస్‌మెంట్ పద్ధతి న ఒక్కొక్కటి పది రూపాయల ముఖ విలువ గల 70 కోట్ల క్యుములేటివ్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లను సమకూర్చుకొనేందుకు హెమిస్ఫియర్ ప్రాపర్టీస్ లిమిటెడ్ (హెచ్‌పిఐఎల్) కు 700 కోట్ల రూపాయల మేరకు ఈక్విటీ ని సమకూరుస్తారు. అలాగే స్కీమ్ ఆఫ్ అరేంజ్‌మెంట్ కు అనుగుణంగా మరో 51 కోట్ల రూపాయలను భారత ప్రభుత్వం నుండి సెక్యూర్డ్ రుణాల రూపంలో, డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎకనోమిక్ అఫైర్స్ నిర్ణయించే కూపన్ రేటు, వడ్డీ రేటు ల ప్రకారం సమకూరుస్తారు.
బి) రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో భారత ప్రభుత్వ పాలసీ నుండి హెచ్‌పిఐఎల్ కు మినహాయింపు ను మంజూరు చేస్తారు.
సి) హెచ్‌పిఐఎల్ కు చెందిన ఎమ్ఒఎ లోని లక్ష్యాల క్లాజు ప్రకారం అమ్మకం, లాంగ్ టర్మ్ లీజు, ఇంకా భూమి విక్రయానికి సంబంధించి తగిన నిర్ణయం తీసుకోవడానికి హెచ్‌పిఐఎల్ కు తగిన అధికారాన్ని బదిలీ చేస్తారు.
డి) ఈక్విటీ వాటా, హెచ్‌పిఐల్ యాజమాన్య నియంత్రణ ను కమ్యూనికేషన్ ల మంత్రిత్వ శాఖ లోని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుండి గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కు బదిలీ.
ఇ) ఈక్విటీ ని సమకూర్చడం, స్కీమ్ ఆఫ్ అరేంజ్‌మెంట్ అమలు, హెచ్‌పిఐఎల్ ఈక్విటీ ని కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ నుండి గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కు బదిలీచేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకొనేందుకు డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కు అనుమతిని ఇవ్వడం.
లాభాలు:
ఇది టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్ నుండి మిగులు భూమి ని వేరుచేసి హెమిస్ఫియర్ ప్రాపర్టీస్ లిమిటెడ్ కు బదిలీ చేయడానికి, హెచ్‌పిఐఎల్ సజావుగా కార్యకలాపాలు సాగించడానికి వీలు కల్పిస్తుంది.
వ్యూహం, లక్ష్యాల అమలు:
మంత్రివర్గం ఇందుకు సంబంధించి తగిన అనుమతి మంజూరు చేసిన అనంతరం, మిగులు భూమి ని స్టాంప్ డ్యూటీ చెల్లింపు తరువాత టిసిఎల్ నుండి హెచ్‌పిఐఎల్ కు బదిలీ చేస్తారు. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యూనల్ ఈ ఏర్పాటు ను ఆమోదించడానికి సుమారు ఏడు నుండి ఎనిమిది నెలలు పడుతుందని టిసిఎల్ అంచనా వేస్తోంది. ఎన్‌సిల్‌టి నుండి అనుమతి రాగానే, ఇందుకు సంబంధించిన వివిధ చర్యలు తీసుకోవడానికి నాలుగు నుండి ఐదు నెలల కాలం పడుతుంది. మొత్తంమీద ఈ నిర్ణయం అమలు కావడానికి సుమారు ఏడాది కాలం పడుతుంది.
పూర్వరంగం:
మెస్సర్స్ విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (ప్రస్తుత టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్ – టిసిఎల్) ను 2002 ఫిబ్రవరి 13 న భారత ప్రభుత్వం డిసిన్వెస్ట్ చేసింది. ఇందుకు సంబంధించిన యాజమాన్య నియంత్రణ ను వ్యూహాత్మక భాగస్వామి, టాటా గ్రూప్ కంపెనీస్ స్పెషల్ పర్సస్ వెహికిల్ అయిన పేనటోన్ ఫిన్‌వెస్ట్ లిమిటెడ్ (పిఎఫ్ఎల్) కు అప్పగించారు.
డిసిన్వెస్ట్‌మెంట్ సమయంలో దేశం లోని పుణె, కోల్‌కాతా, న్యూ ఢిల్లీ, చెన్నై లలోని నాలుగు ప్రాంతాలలో (మొత్తం 1230.13 ఎకరాలలో) మిగులుగా తేలిన 773.13 ఎకరాల స్థలాన్ని ప్రత్యేకంగా గుర్తించారు. ఈ మిగులు భూమిని డిసిన్వెస్ట్‌మెంట్ లో భాగం కాదని ప్రకటించారు.
షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్, షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ ల ప్రకారం మిగులు భూమిని వేరు చేసి కంపెనీల చట్టం, 1956 లోని సెక్షన్ 391 నుండి 394 నిబంధనల ప్రకారం రియల్టీ కంపెనీగా మార్చే బాధ్యతను పిఎఫ్ఎల్ స్వీకరించింది.
***