Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

టాంజానియా సంద‌ర్శ‌న సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ (జులై 10, 2016)

టాంజానియా సంద‌ర్శ‌న సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ (జులై 10, 2016)


హిస్ ఎక్స్ లెన్సీ, అధ్యక్షుడు శ్రీ జాన్ మాగూఫూలి,

ప్రసార సాధనాల స‌భ్యులారా,

ఎక్స్ లెన్సీ, మీ సాదర స్వాగ‌త వ‌చ‌నాల‌కు ధన్యవాదములు.

నాకు, నా వెంట వ‌చ్చిన నా ప్ర‌తినిధివర్గానికి అందజేసిన దయాపూరిత, ఉదారభరిత అతిథి స‌త్కారాల‌కు సైతం నేను కృతజ్ఞుడిని.

నాలుగు ఆఫ్రికా దేశాలలో ప‌ర్య‌టించేందుకు నేను బయలుదేరి ఇది నాలుగో రోజు. ఉత్సాహం తొణికిసలాడే దార్ ఎస్ స‌లామ్ న‌గ‌రానికి వ‌చ్చినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఎక్స్ లెన్సీ, మన సంబంధ‌ బాంధ‌వ్యాల బ‌లాలను గురించి, వాటి భావి సామ‌ర్థ్యాన్ని గురించి కాసేపటి క్రితం మీరు చెప్పిన మాటలతో నేను ఏకీభ‌విస్తున్నాను.

స్నేహితులారా,

ఆఫ్రికాలోని తూర్పు కోస్తా ప్రాంతం ముఖ్యంగా టాంజానియాను తీసుకున్న‌ప్పుడు భార‌త‌దేశంతో ఈ ప్రాంతానికి బ‌ల‌మైన సంబంధాలున్నాయి. మనం చాలా కాలంగా స‌ముద్ర‌ సంబంధి స్నేహితులుగా ఉన్నాం. ఉభయ దేశాల నేత‌లు, ప్ర‌జ‌లు క‌లిసిక‌ట్టుగా వలసరాజ్యదానికి, జాతిపరమైన పీడనకు వ్య‌తిరేకంగా పోరాడిన వారే.

19వ శ‌తాబ్దం ప్రారంభం నుండే ఇరు దేశాల వ్యాపార‌స్తులు వాణిజ్యాన్ని కొన‌సాగించారు. హిందూ మ‌హాస‌ముద్రంలోని విస్తార‌మైన ప్రాంతం ఇరు దేశాల స‌మాజాల‌ను, ప్ర‌జ‌ల‌ను క‌లిపి ఉంచింది.

స్నేహితులారా,

నేను ఆదివారం నాడు ఈ దేశాన్ని సంద‌ర్శించ‌డానికిగాను అధ్యక్షుడు శ్రీ జాన్ మాగూఫూలి అంగీక‌రించినందుకు నేను హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నాను. ‘ఇక్క‌డ ప‌ని మాత్ర‌మే’ అనే అర్థం వ‌చ్చే “హ‌పా కాజి తు” అనే ఆయ‌న సిద్ధాంతానికి ఇది ఘ‌న‌మైన సాక్ష్యంగా నిలుస్తుంది.

జాతి నిర్మాణం, అభివృద్ధి, పారిశ్రామికీక‌ర‌ణ విష‌యంలో అధ్యక్షుడు శ్రీ జాన్ మాగూఫూలికి దార్శ‌నిక‌త ఉంది. భార‌త‌దేశం విష‌యంలో నా క‌ల‌లు కూడా అవే.

స్నేహితులారా,

భార‌త‌దేశం టాంజానియాతో చెప్పుకోద‌గ్గ స్థాయిలో ఆర్ధిక‌ భాగ‌స్వామ్యాన్ని ఇప్ప‌టికే క‌లిగి ఉంది. ఇరు దేశాల ఆర్ధిక బంధాల‌ను స‌మ‌గ్రంగా చూసిన‌ప్పుడు ఆరోగ్య‌దాయ‌కంగా, ప్ర‌గ‌తి దిశ‌గా ఉన్నాయి.

• ఇరు దేశాల‌ వార్షిక వ్యాపార విలువ ఇంచుమించు 3 బిలియ‌న్ అమెరికా డాల‌ర్లుంది.

• టాంజానియాలో భార‌త‌దేశ పెట్టుబ‌డులు ఇప్ప‌టికే దాదాపుగా 3 బిలియ‌న్ అమెరికా డాలర్లకు చేరుకున్నాయి; ఇక ముందు కూడా

• టాంజానియాలో భార‌తీయ వ్యాపారులు అభివృద్ధి చెందుతాయి.. విస్త‌రిస్తాయి.

టాంజానియా అభివృద్ధి ప్రాధాన్యాల‌ను దృష్టిలో పెట్టుకొని ప‌ని చేస్తున్న న‌మ్మ‌క‌మైన భాగ‌స్వామిగా భార‌త‌దేశం నిల‌వ‌డం మా అదృష్టం.

ఈ రోజు అధ్యక్షుల వారు, నేను క‌లసి ఇరు దేశాల భాగ‌స్వామ్యంలోని లోతుపాతుల‌న్నింటిపైనా స‌మ‌గ్రంగా చ‌ర్చించాం.

ఇరు దేశాల మ‌ధ్య‌ ఉండవలసిన స‌హకారానికి సంబంధించి కార్య‌శీల‌త‌ గ‌ల కార్యాచరణను రూపొందించ‌డంపై మేం దృష్టి పెట్టాం. త‌ద్వారా మేం మాట‌ల‌ కన్నా సాధించాల్సిన విజ‌యాల‌కే ప్రాధాన్య‌త‌నిచ్చాం.

మన రెండు స‌మాజాల‌కు కావ‌ల‌సిన ఆర్ధిక సౌభాగ్య‌మ‌నే ఉమ్మ‌డి కోరిక అనేది ఉభయ దేశాల మ‌ధ్య‌ స‌హకారం విస్త‌రించ‌డానికి నూత‌న అవ‌కాశాల‌ను సృష్టిస్తున్న‌ద‌నే విష‌యంలో మా మధ్య ఏకాభిప్రాయం వ్యక్తమైంది.

ఇందుకోసం, ఈ కింది అంశాలపై ముందుకు సాగాలని మేమిరువురం భావించాం..:

• ఒక‌టి- వ్య‌వ‌సాయం, ఆహార భ‌ద్ర‌త విష‌యంలో ఇరు దేశాల భాగ‌స్వామ్యం మ‌రింత బ‌లోపేతం కావాలి.

టాంజానియా నుండి భార‌త‌దేశానికి ఎగుమ‌తి అవువుతున్న ప‌ప్పు ధాన్యాల విష‌యంలో మ‌రింత ప్ర‌గ‌తి ఇందులో భాగంగా ఉంది;

• రెండు- అభివృద్ధి విష‌యంలో ఇరుదేశాలు క‌లిసిక‌ట్టుగా ప‌ని చేయాలి, స‌హ‌జ వాయువుల‌ను ఉప‌యోగించుకోవాలి;

• మూడు- టాంజానియాలోని పారిశ్రామిక ఆర్ధిక వ్య‌వ‌స్థ నిర్మాణంలోను, సామ‌ర్థ్యాల పెంపుద‌ల‌లోను, సంస్థల నిర్మాణంలోను భార‌త‌దేశం భాగ‌స్వామిగా ఉండాలి;

• నాలుగు- ఇరు దేశాల పారిశ్రామిక రంగాల మ‌ధ్య‌న ఉన్న‌త‌మైన బందాల‌ను ప్రోత్స‌హించ‌డం ద్వారా ఇరు దేశాల వాణిజ్య‌, పెట్టుబ‌డుల భాగ‌స్వామ్యాన్ని బ‌లోపేతం చేయాలి.

స్నేహితులారా,

ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా, ఇరు దేశాల ప్ర‌జ‌ల జీవితాలను మెరుగుప‌ర‌చాల్స‌ని ఆవ‌శ్య‌క‌త‌, ప్రాధాన్య‌త గురించి భార‌త‌దేశం అవ‌గాహ‌న చేసుకోగ‌ల‌దు.

మీరు మీ దేశ ప్ర‌జ‌ల‌కు ఏం సాధించి పెట్టాల‌నుకుంటున్నారో ఒక మిత్ర దేశంగా మా ప్ర‌య‌త్నాల దృష్టి కూడా వాటి పైనే ఉంటుంది.

ఈ దిశ‌గా చూసిన‌ప్పుడు దార్ ఎస్ స‌లామ్ సిటీకి నీటిని స‌ర‌ఫ‌రా చేసే 100 మిలియన్ డాల‌ర్ల ప్రాజెక్టు పూర్తి కావ‌డం ఒక మంచి విజ‌యంగా లెక్కకు వస్తుంది.

92 మిలియ‌న్ డాల‌ర్ల రుణ సాయంతో జాంజీబార్ లో నీటి స‌ర‌ఫ‌రా ప్రాజెక్టును నిర్మించడానికి సంబంధించిన ఒప్పందంపై మ‌న‌ ఇప్పుడే సంత‌కాలు చేయ‌డం జరిగింది. 17 న‌గ‌రాల‌కు సంబంధించి అనేక నీటి ప్రాజెక్టుల నిర్మాణంపై క‌స‌ర‌త్తు చేస్తున్నాం. ఇందుకోసం అద‌నంగా 500 మిలియ‌న్ డాల‌ర్ల రాయితీతో కూడిన రుణం కోసం భార‌త‌దేశం సుముఖంగా ఉంది. ఇరు దేశాల సంబంధాలలో ప్ర‌జా ఆరోగ్యం మ‌రో ప్రాధాన్య‌తాంశంగా ఉంది.

మందులు, ప‌రిక‌రాల స‌ర‌ఫ‌రాతో స‌హా టాంజానియా ప్ర‌భుత్వ ఆరోగ్య ప్రాధాన్యాల‌ను నెర‌వేర్చ‌డానికి మేం సిద్ధంగా ఉన్నాం. బుగాండో ఆరోగ్య కేంద్రంలో కేన్స‌ర్ రోగుల కోసం భార‌తీయ రేడియో థెర‌పీ యంత్రాన్ని ఏర్పాటు చేశార‌నే విష‌యం నా దృష్టికి వ‌చ్చింది.

విద్య‌, వృత్తి శిక్ష‌ణ‌, నైపుణ్యాల అభివృద్ధి లాంటి రంగాల‌కు మీరు ప్రాధాన్య‌మిస్తున్నారు. వాటి విష‌యంలో వీల‌యినంత‌ మేర‌కు స‌హాయం అంద‌జేయ‌డానికి భార‌త‌దేశం సిద్ధంగా ఉంది.

అరుష పేరుతో నెల్స‌న్ మండేలా ఆఫ్రిక‌న్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ లో నిర్మిత‌మ‌వుతున్న ఐటీ రీసోర్స్ సెంట‌ర్ పూర్తి కావ‌స్తున్న‌ద‌నే విష‌యం నా దృష్టికి తీసుకువచ్చారు.

టాంజానియాతో భార‌త‌దేశ స‌హ‌కారం ఎల్ల‌ప్పుడూ మీ అవ‌స‌రాలు, ప్రాధాన్య‌త‌ల ప్ర‌కారమే ఉంటుంది.

స్నేహితులారా,

హిందూ మ‌హాస‌ముద్రానికి సంబంధించి ఇరుగు పొరుగు దేశాలైన మ‌న రెండు దేశాలు ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త భాగ‌స్వామ్యాన్ని బ‌లోపేతం చేసుకోవాల‌నే అంశంలో అధ్యక్షుల వారు, నేను ఒకే మాట మీద ఉన్నాం. ముఖ్యంగా స‌ముద్ర‌త‌లంలో ఈ భాగ‌స్వామ్యం మ‌రింత‌బలోపేతం కావాలి.

ప్రాంతీయ‌, అంత‌ర్జాతీయ అంశాల‌పైన మేం చేసిన లోతైన చ‌ర్చ‌లు ఇరు దేశాల మ‌ధ్య‌ గ‌ల ఉమ్మ‌డి ప్రాధాన్యాలు, ఆందోళ‌న‌లలోని ముఖ్య‌ సారూప్య‌త‌ను ప్ర‌తిఫ‌లించాయి.

ఉగ్ర‌వాదం, వాతావ‌ర‌ణ మార్పు.. ఈ రెండు పెను సవాళ్ల పై పోరాడడంలో ద్వైపాక్షింగా, ప్రాంతీయంగా, అంత‌ర్జాతీయంగా క‌లసి ప‌ని చేయాల‌ని మేం నిర్ణ‌యించాం.

పారిస్ లో జ‌రిగిన సి ఒ పి- 21 స‌మావేశ సంద‌ర్భంగా ఇంటర్ నేషనల్ సోలార్ అలయెన్స్ ఏర్పాటు కోసం జ‌రిగిన ప్ర‌య‌త్నాల‌కు భార‌త‌దేశం సార‌థ్యం వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ అలయెన్స్ కు 120 దేశాల మ‌ద్ద‌తు ఉంది. ఇందులో ముఖ్య‌మైన పాత్ర‌ను పోషించాల‌ని టాంజానియాకు స్వాగ‌తం ప‌లుకుతున్నాను.

స్నేహితులారా,

టాంజానియా అధ్య‌క్ష పదవిని అలంకరించిన వారందరికీ ఆతిథ్య‌ాన్నిచ్చిన గౌర‌వాన్ని భార‌త‌దేశం దక్కించుకొంది. సాధ్యమైనంత త్వరగా అధ్యక్షుడు శ్రీ మాగుఫులీ కి భార‌త‌దేశంలో స్వాగతం పలికేందుకు నేను ఎదురుచూస్తుంటాను. చివరగా.. ఎక్స్‌లెన్సీ ద ప్రెసిడెంట్, మీ స్నేహభావానికి, మీరందించిన స్వాగ‌త స‌త్కారాల‌కు ఇవే నా కృత‌జ్ఞ‌త‌లు.

మీకు నా ధన్యవాదాలు.

పలు మార్లు కృత‌జ్ఞ‌త‌లు.