టర్కీ నుండి గసగసాల గింజల దిగుమతి వేగవంతంగా జరిగేటట్లుగాను మరియు పారదర్శకమైన రీతిలో వాటి ప్రాసెసింగ్ కు మార్గాన్ని సుగమం చేయడానికిగాను గసగసాల గింజల వ్యాపారంలో భారతదేశానికి మరియు టర్కీ కి మధ్య ఒక అవగాహన పూర్వక ఒప్పందం (ఎమ్ఒయు)పై సంతకాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
వివరాలు:
ఈ ఎమ్ఒయు టర్కీ నుండి భారతదేశానికి గసగసాల పంట గింజల ఎగుమతిని క్రమబద్ధం చేసేందుకు వీలుగా టర్కిష్ గ్రెయిన్ బోర్డు (టిఎమ్ఒ) కు ఒక ఆన్‌లైన్ సిస్టమ్ ను నిర్వహించే అవకాశాన్ని ఇస్తుంది. ఎగుమతిదారు కంపెనీలు ఈ ఆన్‌లైన్ సిస్టమ్ లో సభ్యత్వం పొందడానికి టిఎమ్ఒ కు ఎజియన్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ (ఇఐబి) ద్వారా దరఖాస్తును దాఖలు చేయవలసివుంటుంది.
ప్రతి సంవత్సరం టర్కీ నుండి భారతదేశం దిగుమతి చేసుకొనే పాపీ గింజల రాశి ని టర్కీ ప్రభుత్వం తో సంప్రదించి భారత ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇందుకోసం ఒక పంట సంవత్సరంలో టర్కీ లో ఉత్పత్తి అయ్యే పాపీ గింజలను, మునుపటి పంట సంవత్సరాల తాలూకు నిల్వను, అలాగే టర్కీ గణతంత్రం యొక్క దేశీయ అవసరాలు లేదా ఇతర ఎగుమతి అవసరాలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
టిఎమ్ఒ నమోదు చేసుకొనే విక్రయ ఒప్పందాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ (సిబిఎన్) నమోదు చేసుకొంటుంది. ఇందుకోసం టిఎమ్ఒ నిర్వహించే ఆన్ లైన్ సిస్టమ్ నుండి వివరాలను తీసుకొంటుంది. భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ విధించిన రిజిస్ట్రేశన్ మార్గదర్శకాలను టిఎమ్ఒ అనుసరిస్తుంది.
సిబిఎన్ తాను ఆన్ లైన్ సిస్టమ్ లో రిజిస్టర్ చేసే సేల్ కాంట్రాక్ట్ వివరాలను అప్ లోడ్ చేయవలసివుంటుంది. సిబిఎన్ రిజిస్టర్ చేసే కాంట్రాక్టుల విషయంలో మాత్రమే ఎగుమతిని టిఎమ్ఒ అనుమతించవలసివుంటుంది.
సేల్స్ కాంట్రాక్టు సమర్పణ మరియు ఇతర ఆవశ్యక ప్రక్రియల పూర్తి అనంతరం పాపీ గింజల యొక్క చట్టబద్ధమైన ఉత్పత్తి ధ్రువపత్రాన్ని ఎగుమతిదారులకు టిఎమ్ఒ ఇవ్వవలసివుంటుంది.
ఈ ఎమ్ఒయు టర్కీ నుండి పాపీ గింజల దిగుమతికి ముందస్తు అధికారాన్నివ్వడాన్ని మరియు కోటా కేటాయింపు తాలూకు పారదర్శక ప్రాసెసింగ్ ను, ఇంకా త్వరిత గతిన ప్రాసెసింగ్ ను ప్రోత్సహించగలదు. ఒక రకంగా దిగుమతి కాంట్రాక్టు నికార్సయిందేనా అనేది ఇట్టే పసిగట్టడం సాధ్యపడగలదు. అలాగే, దిగుమతిలో పలు దావాలను నివారించడానికి కూడా వీలవుతుంది.
ఈ ఎమ్ఒయు భారతదేశ విపణిలో గసగసాల గింజల లభ్యత నిరంతరాయంగా ఉండేలా తోడ్పడనుంది. మరి అంతిమంగా భారతదేశం లోని గసగసాల గింజల వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది.
***