Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జ‌మ్ములో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ స్థాపనకు మంత్రివర్గం ఆమోదం


జమ్ము లోని ఓల్డ్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ లో తాత్కాలిక కేంపస్ ను నెలకొల్పి 2016-17 విద్యా సంవ‌త్స‌రం నుండి ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎమ్) కార్యకలాపాలను ఆరంభించేందుకు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్యక్ష‌త‌న స‌మావేశమైన‌ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

2016 నుండి 2020 వరకు మొదటి నాలుగు సంవత్సరాల పాటు తాత్కాలిక కేంపస్ లో కొన‌సాగే ఐఐఎమ్ కోసం రూ.61.90 కోట్లు వ్యయం అవుతుంది. 2016కుగాను పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ కింద 54 మంది విద్యార్థుల‌కు ప్ర‌వేశం క‌ల్పిస్తారు. ఈ కోర్సు నాలుగో ఏడాదికి చేరేసరికల్లా విద్యార్థుల సంఖ్య క్రమంగా 120కి పెరుగుతుంది. మ‌రో పక్క, జ‌మ్ములో కేంపస్ ను, క‌శ్మీర్ ప్రాంతంలో ఒక అవుట్- కేంపస్ ను స్థాపించేందుకు చర్యలు చేపడుతారు. శాశ్వ‌త వసతుల కల్పనకు ఒక స‌మ‌గ్ర ప్రాజెక్టు రిపోర్టు ప్ర‌స్తుతం సిద్ధం అవుతోంది. అనంతరం కేంపస్ ల ఏర్పాటు ప్ర‌క్రియను మొదలుపెడతారు.

సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్టు, 1860 లో భాగంగా జ‌మ్ములో ఒక ఐఐఎమ్ జమ్ము సొసైటీని స్థాపించేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భారత ప్రభుత్వం నియమించే ఒక బోర్డ్ ఆఫ్ గ‌వ‌ర్న‌ర్స్‌ (బిఒజి ఎస్) ద్వారా ఐఐఎమ్ జమ్మును సొసైటీ నిర్వ‌హిస్తుంది. ఈ బోర్డు.. ఇన్ స్టిట్యూట్ ను పాలిస్తుంది. అంతే కాక ఇన్ స్టిట్యూట్ స్థాపనకు, ఇన్ స్టిట్యూట్ కార్యకలాపాల నిర్వహణకు బోర్డు బాధ్యత వహిస్తుంది.

ఇది జ‌మ్ము & క‌శ్మీర్ అభివృద్ధికి ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌క‌టించిన ప్యాకేజీలో ఒక భాగం. ఈ ఇన్ స్టిట్యూట్ తో పాటు జమ్ము లో ఐఐటిని ఆరంభించడం, ఎన్ ఐ టి శ్రీనగర్ ను ఆధునికీకరించడం, రెండు కొత్త ఎఐఐఎమ్ఎస్ సంస్థల యొక్క ఆరంభం జ‌మ్ము & క‌శ్మీర్ లో విద్య మరియు ఉన్నత ప్రమాణంతో కూడిన జీవనానికి బాట పరచేందుకు తోడ్పడనున్నాయి. రెండు నూతన ఎఐఐఎమ్ఎస్ లలో ఒకదానిని కశ్మీర్ లోను, రెండో దానిని జమ్ము ప్రాంతంలోను నెలకొల్పుతారు.

పూర్వ రంగం:

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ దేశంలో ఉత్త‌మ నాణ్య‌త‌ కలిగిన విద్య‌ను బోధించే ప్ర‌ధాన సంస్థ‌లు. వీటిలో మేనేజ్‌మెంట్, ఇంకా ఇతరేతర సంబంధిత విద్య‌, శిక్ష‌ణలను ప్ర‌పంచ‌ స్థాయి ప్ర‌మాణాలు, ప్ర‌క్రియ‌ల‌కు అనుగుణంగా అందిస్తారు.

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా 19 ఐఐఎమ్ లు ఉన్నాయి. వీటిలో 13 ఐఐఎమ్ లు. అహ్మ‌దాబాద్‌, బెంగ‌ళూరు, కోల్‌క‌తా, ల‌క్నో, ఇండోర్‌, కోషిక్కోడ్‌, షిల్లాంగ్‌, రాంచీ, రాయ్‌పూర్‌, రోహ్ త‌క్‌, కాశీపూర్‌, తిరుచ్చి, ఉద‌య్‌పూర్‌ ల‌లో ఉన్నాయి. 2015లో ఆరంభమైన మ‌రో ఆరు ఐఐఎమ్ లు అమృత్ స‌ర్‌, సిర్‌ మౌర్, నాగ్‌పూర్‌, బోధ్‌గ‌య‌, సంబ‌ల్ పూర్‌ మరియు విశాఖ‌ప‌ట్నం ల‌లో ఏర్పాట‌య్యాయి.

***