శ్రేష్ఠుడైన ప్రధాని శ్రీ అబే,
స్నేహితులారా,
మినా-సమా, కొంబన్ వా !
జపనీస్ భాషలో ఓ జెన్ బౌద్ధ తాత్విక వేత్త “ఇచిగో ఇచి” అని అన్నారు. దీని అర్థం మన ప్రతి కలయిక ప్రత్యేకమైనది. ప్రతి క్షణాన్ని మనం ఎంతో విలువైనదిగా భావించాలి అని.
నేను జపాన్ కు చాలా సార్లు వచ్చాను. ప్రధాన మంత్రిగా ఇది నా రెండో పర్యటన. నా ప్రతి జపాన్ సందర్శన విభిన్నమైనది, ప్రత్యేకమైనది, జ్ఞానదాయకమైనది. నా పర్యటనలు నాకు ఎంతగానో మేలును చేకూర్చాయి.
శ్రేష్ఠుడు శ్రీ అబే తో నేను పలు సందర్బాలలో సమావేశమయ్యాను. జపాన్‌లోను, భారతదేశంలోను, ఇంకా ఇతర దేశాల్లోను మేం సమావేశమయ్యాము. గత రెండు సంవత్సరాలుగా భారతదేశ సందర్శనార్థం జపాన్ నుండి వచ్చిన పలువురు రాజకీయ, వ్యాపార రంగాల నేతలను నేను ఎంతో సాదరంగా ఆహ్వానించాను.
ఇరు దేశాల మధ్య తరచుగా జరుగుతున్న సమావేశాలు ఉభయ దేశాల బంధాల్లోని చైతన్యానికి, ఉత్సాహానికి, దృఢత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. రెండు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యంలోని పూర్తి సామర్థ్యాన్ని వెలికి తీయడానికిగాను ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న నిబద్ధతను ఈ సమావేశాలు ప్రతిఫలిస్తున్నాయి.
గత శిఖరాగ్ర సమావేశం తరువాత ఇరు దేశాల మధ్య గల బంధాల్లో ఎంత ప్రగతి సాధించామో తెలుసుకోవడానికిగాను ఈ రోజున ప్రధాని శ్రీ అబే, నేను సమావేశమయ్యాము. పలు విధాలుగా ఇరు దేశాల మధ్య సహకారం కొత్త పుంతలు తొక్కుతోందని మా ఇద్దరికి స్పష్టమైంది.
ఆర్ధిక రంగంలో ఇరు దేశాల్లో కార్యక్రమాలు, వాణిజ్యాభివృద్ధి, తయారీ , పెట్టుబడుల రంగాల్లో ఒప్పందాలు, స్వచ్ఛ ఇంధనం కోసం కృషి, పౌరుల భద్రత కోసం భాగస్వామ్యం, ప్రాథమిక వనరుల కల్పనలో, నైపుణ్యాల అభివృద్ధిలో సహకారం మొదలైనవి ఇరు దేశాల ప్రాధాన్యాంశాలు.
శాంతి కోసం పరమాణు శక్తిని ఉపయోగించుకోవడంలో సహకార ఒప్పందంపైన ఇరు దేశాల ఒప్పందం ఈ రోజు కుదిరింది. ఇరు దేశాలు స్వచ్ఛ ఇంధన భాగస్వామ్యాన్ని నెలకొల్పుకోవడానికి చేస్తున్న కృషిలో ఇది చరిత్రాత్మకమైనది.
వాతావరణ మార్పుల విషయంలో మనం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఇరు దేశాల మధ్య సహకారం ఉపయోగపడుతుంది. ఈ ఒప్పందం జపాన్ కు ఎంతో ప్రత్యేకమైనదని నేను భావిస్తున్నాను.
ఈ ఒప్పందం కుదరడానికి వీలుగా మద్దతు పలికినందుకు ప్రధాని శ్రీ అబే కు, జపాన్ ప్రభుత్వానికి, పార్లమెంటుకు నా అభినందనలు.
స్నేహితులారా,
భారతదేశం, భారతదేశ ఆర్ధిక రంగం అనేక మార్పుల దిశగా సాగుతోంది. తయారీ రంగంలోను, పెట్టుబడుల విషయంలోను, 21 వ శతాబ్ది జ్ఞాన కేంద్రాల ఏర్పాటు విషయంలోను ప్రధాన కేంద్రంగా అవతరించడమే మా లక్ష్యం.
ఈ ప్రయాణంలో జపాన్ ను మేము సహజమైన భాగస్వామిగా పరిగణిస్తున్నాము. ఇరు దేశాలకు ఉన్న పలు అనుకూలతలను ఒక చోటుకు చేర్చడానికి చాలా అవకాశముందని మేము విశ్వసిస్తున్నాము. పెట్టుబడి కావచ్చు, సాంకేతికత కావచ్చు లేదా మానవ వనరులు కావచ్చు.. ఇరు దేశాల పరస్పర లబ్ధి కోసం పని చేయడానికి ఈ అనుకూలతలు ఉపయోగపడతాయి.
ప్రత్యేకంగా ప్రాజెక్టులను ప్రస్తావించినప్పుడు ముంబయి- అహమ్మదాబాద్ లైనులో అత్యంత వేగంగా ప్రయాణించగలిగే రైలును ఏర్పాటు చేసుకునే ప్రాజెక్టుపైన మేము దృష్టి పెట్టాము. ఆర్ధిక రంగంలో ఇరు దేశాల సహకారానికి సంబంధించిన ఒప్పందమనేది మౌలిక వసతుల అభివృద్ధికి కావలసిన గణనీయమైన వనరుల సమీకరణకు ఉపయోగపడుతుంది. శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధికి సంబంధించి ఇరు దేశాల మధ్యన చర్చలు ఈ రంగంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాయి. ఇరు దేశాల ఆర్దిక భాగస్వామ్యంలో ఇది ముఖ్యమైన అంశం. అంతరిక్షరంగం, సముద్ర, భూ విజ్ఞాన శాస్త్రాల రంగం, వస్త్ర తయారీ రంగం, క్రీడారంగం, వ్యవసాయ రంగం, తపాలా బ్యాంకింగ్ రంగంలో ఇరు దేశాలు నూతన భాగస్వామ్యాలను రూపొందించుకుంటున్నాయి.
స్నేహితులారా,
ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యమనేది ఇరు దేశాల సమాజాల భద్రత, సంక్షేమాలకు మాత్రమే మేలు చేయదు. ఇది ఈ ప్రాంతంలో శాంతిని, స్థిరత్యాన్ని, సమన్వయాన్ని తెస్తుంది. ఆసియా- పసిఫిక్ ప్రాంతంలో ఏర్పడుతున్న అవకాశాలను, సవాళ్లను అందిపుచ్చుకోవడానికి ఇది సదా సిద్ధంగా ఉంది.
అందరి అభివృద్ధిని కోరుకునే దేశాలుగా ఇండో పసిఫిక్ సముద్ర జలాల అంతర్గత లింకులను కలిగిన ప్రాంతాలుగా ఇరు దేశాలు కలిసి అనుసంధానాన్ని ప్రోత్సహించడానికి, మౌలిక వసతుల కల్పనకు, సామర్థ్యాల పెంపుదలకుగాను అంగీకారానికి వచ్చాయి.
విస్తారంగా వున్న ఇండో- పసిఫిక్ సముద్ర జలాల్లో ఇరు దేశాల వ్యూహాత్మక ప్రాధాన్యాల సంగమ ప్రాధాన్యతను… ఈ మధ్యనే విజయవంతంగా ముగిసిన మలబారు నావికా దళ విన్యాసాలు ఘనంగా చాటాయి.
ప్రజాస్వామ్య దేశాలుగా మనం చిత్తశుద్ధిని, పారదర్శకతను, చట్టాలను గౌరవించాలి. ఉగ్రవాదాన్ని, ముఖ్యంగా సరిహద్దుల్లో పెరుగుతున్న ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఇరు దేశాలు ఐక్యంగా పనిచేస్తున్నాయి.
స్నేహితులారా,
ఇరు దేశాల మధ్య స్నేహసంబంధాలనేవి ఇరు దేశాల మధ్య గల బలమైన సాంస్కృతిక బంధాలతోను, ప్రజల మధ్య గల సత్సంబంధాలతోను బలోపేతమవుతున్నాయి. గత సంవత్సరం ప్రధాని శ్రీ అబే భారతదేశ పర్యటన సందర్భంగా ఇరు దేశాల బంధాలు మరింతగా విస్తరించడానికి వీలుగా పలు చర్యలు తీసుకోవాలని నేను చిత్తశుద్దితో నిర్ణయించాను.
దాని ఫలితంగానే ఈ సంవత్సరం మార్చి నుండి జపనీయులు ఎవరు భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చినా వారికి వీసా ఆన్ అర్రైవల్ స్కీమును (భారతదేశానికి వచ్చిన తరువాత వీసా జారీ) వర్తింప చేయడం జరుగుతోంది. అర్హత కలిగిన జపాన్ వ్యాపారస్తులు భారతదేశానికి రావడానికి వీలుగా వారికి పది సంవత్సరాల దీర్ఘకాల వీసా సౌకర్యాన్ని వర్తింపచేయడం జరుగుతోంది.
స్నేహితులారా,
ప్రాంతీయంగాను, అంతర్జాతీయ వేదికలపైనా ఇరు దేశాలు ఒకరినొకరు సంప్రదించుకుంటూ సహకరించుకోవాలి. ఐక్యరాజ్యసమితిలో సంస్కరణల కోసం రెండు దేశాల కృషి కొనసాగాలి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సరైన స్థానం కోసం రెండు దేశాలు కలిసి పని చేయాలి.
అణు శక్తి సరఫరాదారుల బృందంలో భారతదేశం స్థానం సంపాదించడానికి వీలుగా ప్రధాని ఏబ్ అందించిన మద్దతుకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను.
శ్రేష్ఠుడైన శ్రీ అబే,
ఇరు దేశాల భాగస్వామ్య భవిష్యత్ ఎంతో బలంగా ఉందనే విషయాన్ని ఇరు దేశాలు గుర్తించారు. ఇరు దేశాల కోసం, ఈ ప్రాంతంలో అభివృద్ది కోసం రెండు దేశాలు కలిసి సాధించబోయే లక్ష్యాలకు పరిమితి లేదు.
దీనికి ముఖ్య కారణం మీరు అందిస్తున్న బలమైన, సమర్థనీయమైన నాయకత్వమే. మీ భాగస్వామిగా ఉండడం, మీ స్నేహదేశంగా గుర్తింపు పొందడం మాకు ఎంతో గర్వకారణం. ఈ శిఖరాగ్ర సమావేశంద్వారా మనం ఎంతో విలువైన ఫలితాలను సాధించబోతున్నాము. మీ స్వాగత సత్కారాలకు ఆతిథ్యానికి నా అభినందనలు.
అనత నో ఓ మొతెనాశి ఓ అరిగాతో గొజాయ్‌మషితా!
(మీ సహృదయ ఆతిథ్యానికి అభినందనలు)
ధన్యవాదాలు, మరీ మరీ ధన్యవాదాలు.
***