Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జ‌పాన్ ప్ర‌ధానితో క‌లసి ప్ర‌ధాని శ్రీ నరేంద్ర మోదీ మీడియా ప్ర‌క‌ట‌న (డిసెంబ‌ర్ 12, 2015)

జ‌పాన్ ప్ర‌ధానితో క‌లసి ప్ర‌ధాని శ్రీ నరేంద్ర మోదీ మీడియా ప్ర‌క‌ట‌న (డిసెంబ‌ర్ 12, 2015)

జ‌పాన్ ప్ర‌ధానితో క‌లసి ప్ర‌ధాని శ్రీ నరేంద్ర మోదీ మీడియా ప్ర‌క‌ట‌న (డిసెంబ‌ర్ 12, 2015)

జ‌పాన్ ప్ర‌ధానితో క‌లసి ప్ర‌ధాని శ్రీ నరేంద్ర మోదీ మీడియా ప్ర‌క‌ట‌న (డిసెంబ‌ర్ 12, 2015)

జ‌పాన్ ప్ర‌ధానితో క‌లసి ప్ర‌ధాని శ్రీ నరేంద్ర మోదీ మీడియా ప్ర‌క‌ట‌న (డిసెంబ‌ర్ 12, 2015)


యువ‌ర్ ఎక్స్‌లెన్సీ, ప్ర‌ధాని శ్రీ అబే , మీడియా స‌భ్యులారా..

ప్ర‌ధాని శ్రీ అబేకు స్వాగ‌తం ప‌లుకుతున్నందుకు నేను ఎంత‌గానో సంతోషిస్తున్నాను.

శ్రీ అబే వ్య‌క్తిగ‌తంగా నాకు మంచి మిత్రుడు. అంతే కాదు, ఇండియా- జ‌పాన్ భాగ‌స్వామ్యానికి ఎంత‌గానో కృషి చేసి విజ‌యం సాధించిన నేత‌గా ఆయ‌న‌కు పేరుంది. అలాంటి గొప్ప‌ వ్య‌క్తికి ఆతిథ్య‌ం ఇవ్వడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది.

భారతదేశం ఆర్థిక‌ రంగంలో సాధించిన గ‌ణ‌నీయ‌మైన మార్పుల‌లో జ‌పాన్ పోషించినటువంటి నిర్ణ‌యాత్మ‌క పాత్ర‌ను పోషించిన మరొక భాగ‌స్వామ్య‌ దేశ‌ం ఏదీ లేదు.

భార‌త‌దేశం కంటున్న ఆర్థికాభివృద్ధి క‌ల‌ల్ని జపాన్ అర్థం చేసుకున్నంతగా మ‌రే మిత్ర దేశ‌మూ అర్థం చేసుకోలేదు.

అంతే కాదు, ఆసియా ప్ర‌గ‌తి రూప‌క‌ల్ప‌న‌లోను, ఒక‌దానితో మ‌రొక‌టి క‌లిసిపోయిన‌ట్టుగా ఉన్న స‌ముద్ర ప్రాంతాల అభివృద్ధిలోను భారతదేశం, జ‌పాన్ ల వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం కంటే మరింత గుణాత్మ‌క‌మైన ప్ర‌భావాన్ని చూపగల భాగస్వామ్యాన్ని గురించి నేను ఊహించలేకపోతున్నాను కూడా.

అందుకే మేము ఇరు దేశాల మ‌ధ్య‌నున్న ప్ర‌త్యేక వ్యూహాత్మ‌క, అంత‌ర్జాతీయ భాగ‌స్వామ్యానికి ఎంతో విలువ‌నిస్తున్నాం. దీనికి భార‌త‌దేశంలో ప్ర‌జ‌ల‌ప‌రంగా విశేష‌మైన, అస‌మాన‌మైన‌ మ‌ద్ద‌తుతో పాటు, రాజకీయ ఏకాభిప్రాయం కూడా ఉంది.

ఇరు దేశాల భాగ‌స్వామం ప‌ట్ల ప్ర‌జ‌ల‌కు భారీ ఆశ‌లున్నాయి. ఈ భాగస్వామ్యంలో మ‌నకు అంతే స్థాయిలో బాధ్య‌త‌లు కూడా ఉన్నాయి.

వీటిని అందుకోవ‌డానికి గ‌త సంవ‌త్స‌రంలో మ‌నం చాలానే కృషి చేశాం.

ఆర్థిక‌ప‌ర‌మైన స‌హ‌కారంలో, భ‌ద్ర‌తాపరమైన స‌హ‌కారంలో, ప్రాంతీయ భాగ‌స్వామ్యంలో గ‌ణ‌నీయ‌మైన ప్ర‌గ‌తిని సాధించాం.

మా ఆర్థిక ప్ర‌తిపాద‌న‌ల‌ ప‌ట్ల ఆశించిన‌ట్టుగానే ప్ర‌ధాని శ్రీ అబే వెంట‌నే స్పందిస్తున్నారు. ఈ ప్ర‌తిపాద‌న‌ల్లో అనేకం భారత్ కు ప్ర‌త్యేక‌మైన‌వి. ఇండియాలో జ‌పాన్ ప్రైవేటు పెట్టుబ‌డులు కూడా వేగంగా పెరుగుతున్నాయి.

ఇరు దేశాల ప్ర‌యాణంలో ఈ రోజు చరిత్రాత్మ‌క‌మైన మైలురాయిని దాటాం. శాంతి సమయాలలో అణు శ‌క్తి స‌హ‌కారానికి సంబంధించిన అవగాహనపూర్వక ఒప్పంద ప‌త్రంపైన ఉభయ దేశాలు సంత‌కాలు చేశాయి. ఇది వ్యాపారం, స్వ‌చ్ఛ ఇంధ‌న సాధనకు సంబంధించిన‌ది మాత్ర‌మే కాదు.. అంత‌ కంటే విలువైన‌ది.

శాంతియుత‌మైన‌, పదిలమైన ప్ర‌పంచ సాధన‌కుగాను ఇరు దేశాల మ‌ధ్య‌ నూత‌న‌ స్థాయిలో ప‌ర‌స్ప‌ర విశ్వాసాన్ని, వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని ఏర్ప‌రుచుకోవాలి. ఈ దిశలో ఈ ఒప్పందం గొప్పది.

జ‌పాన్‌కు ఈ నిర్ణ‌యం ఎంత ముఖ్య‌మైన‌దో నాకు తెలుసు. ఈ నిర్ణ‌యానికి ఇండియా క‌ట్టుబ‌డి ఉంటుంద‌ని నేను మీకు హామీ ఇస్తున్నాను. ప‌ర‌స్ప‌రం పంచుకుంటున్న నిబ‌ద్ద‌త‌ల్ని గౌర‌విస్తామ‌ని తెలియ‌జేస్తున్నాను.

జ‌పాన్ కు చెందిన షింక‌న్ సెన్ అంటేనే వేగం, న‌మ్మ‌కం, భ‌ద్ర‌త‌ల‌కు మారుపేరు. షింక‌న్‌సెన్ రైల్వే వ్య‌వ‌స్థ సాయంతో ముంబాయి, అహ్మ‌దాబాద్ సెక్టర్ లో అధిక వేగంతో న‌డిచే రైలును ప్ర‌వేశ‌పెట్టాల‌ని నిర్ణయించ‌డం కూడా చరిత్రాత్మ‌క‌మైన నిర్ణ‌యమే.

ఈ ప్రాజెక్టు సాకారం కావ‌డానికి ప్ర‌ధాని శ్రీ అబే ఒక అసాధార‌ణ‌మైన ప్యాకేజిని సులువైన నియ‌మ‌ నిబంధ‌న‌లతో ప్ర‌క‌టించ‌డం ఎంతో అభినందనీయం. దీని ద్వారా 12 బిలియ‌న్ అమెరికా డాల‌ర్ల‌ను ఖ‌ర్చుపెడ‌తారు. అంతే కాదు, జ‌పాన్ సాంకేతిక సాయాన్నీ అంద‌జేస్తుంది.

ఈ ప్రాజెక్టు భార‌తీయ రైల్వేల చ‌రిత్ర‌లో ఒక విప్ల‌వాత్మ‌క‌మైన మార్పునకు శ్రీకారం చుడుతుంది. భవిష్యత్తులోకి భార‌త‌దేశ ప్ర‌స్థానాన్ని మరింత వేగంగా పరుగులు పెట్టిస్తుంది.

భార‌త‌దేశ ఆర్థికరంగంలో గ‌ణ‌నీయ‌మైన మార్పునకు ఈ ప్రాజెక్టు ఒక ఇంజనుగా ఉంటుంది.

జ‌పాన్ ద్వైపాక్షిక స‌హ‌కార కార్య‌క్ర‌మం గ‌ణ‌నీయంగా అభివృద్ధి చెందడాన్ని మేం అభినందిస్తున్నాం. మేక్ ఇన్ ఇండియా కార్య‌క్ర‌మంలో జ‌పాన్ ప్ర‌భుత్వ‌, ప్రైవేటు సంస్థ‌లు చురుగ్గా పాల్గొంటున్నాయి.

గ‌త సంవ్స‌త‌రం సెప్టెంబ‌ర్ నెల‌లో టోక్యోలో ప్ర‌ధాని శ్రీ అబే మాట్లాడుతూ, రాబోయే ఐదు సంవ‌త్స‌రాల‌లో భారతదేశంలో 35 బిలియ‌న్ అమెరికా డాల‌ర్ల ఆర్థిక సాయం, పెట్టుబ‌డులు ఉంటాయ‌ని ప్ర‌క‌టించారు.
అప్పుడ‌ది గొప్పలకు పోయి చేసిన ప్రకటన అనుకున్నారు. కానీ, ఇరు దేశాల స‌హ‌కారంతో ఇది ఇప్పుడు శీఘ్రంగా వాస్త‌వ‌ రూపం దాలుస్తోంది.

వాతావ‌ర‌ణ మార్పుల‌ను ఎదుర్కోవ‌డానికి ఉభయ దేశాలు చేస్తున్న కృషి కూడా అంతే బలమైనటువంటిది.

స్వ‌చ్ఛ‌మైన ఇంధనాన్ని, ఇంధన సామ‌ర్థ్య సంబంధిత సాంకేతిక‌త‌ల్ని సాధించాడానికి ఎంతో విస్తార‌మైన భాగ‌స్వామ్యంతో మ‌నం పాటు పడుతున్నాం. మన కృషి ప్ర‌పంచంలోని ఇత‌ర దేశాల‌కు కూడా పరిష్కార మార్గాలను అన్వేషిస్తుంది.

ఇరు దేశాల మ‌ధ్య‌న ఈ రోజు కుదిరిన ఇత‌ర ఒప్పందాలు రెండు దేశాల మ‌ధ్య‌ గ‌ల స‌హ‌కారంలోని వైవిధ్యాన్ని, గాఢ‌త‌ను ప్ర‌తి ఫ‌లిస్తున్నాయి.

భ‌ద్ర‌తా స‌హ‌కారానికి సంబంధించి ఈ రోజు మ‌నం మ‌రో రెండు నిర్ణ‌యాత్మకమైన అడుగులు వేశాం. ఈ రెండు ఒప్పందాల కార‌ణంగా ఇరు దేశాల ర‌క్ష‌ణ బంధాలు మ‌రింత బలోపేత‌మ‌వుతాయి. అలాగే ఇండియాలో ర‌క్ష‌ణ‌రంగ త‌యారీకి మ‌రింత ప్రోత్సాహం ల‌భిస్తుంది.

ఈ ఒప్పందాలు ఉభయ దేశాల త్రివిధ ద‌ళాల అధికారుల మ‌ధ్య‌ చ‌ర్చ‌ల‌ విస్త‌రణ‌కు తోడ్పడుతాయి. మ‌ల‌బార్ నౌకా ద‌ళ విన్యాసాల్లో జపాన్ కూడా భాగ‌స్వామి అవుతుంది.

గ‌త సంవ‌త్స‌ర కాలంలో ప్రాంతీయ భాగ‌స్వామ్యాన్ని మ‌రింత ముందుకు తీసుకువెళ్లాం. అమెరికా సంయుక్త రాష్ర్టాలతో కలసి త్రైపాక్షిక చ‌ర్చ‌లు జరపడానికి వీలుగా మ‌న స్థాయిని ఉన్న‌తీక‌రించాం. ఇదే కోవ‌లో, ఆస్ట్రేలియాతో త్రైపాక్షిక చ‌ర్చ‌లు కూడా మొద‌లుపెట్టాం.

స‌మ్మిళితమైన‌, స‌మ‌తూకంతో కూడిన, దాపరికానికి తావు లేని ప్రాంతీయ సంబంధాలను, స‌ముద్ర‌జ‌లాల భ్ర‌ద‌త‌ను సాధించడానికి తూర్పు ఆసియా శిఖ‌రాగ్ర స‌మావేశంలో మ‌నం భుజం భుజం కలిపి ప‌ని చేద్దాం.

స‌ముద్ర ర‌వాణాలోను, స‌ముద్ర ప్రాంతంపైన వైమానిక ప్ర‌యాణంలోను, సముద్ర వాణిజ్యంలోను స్వేచ్ఛ‌కోసం మ‌నం బ‌లంగా నిల‌బ‌డాలి. స‌ముద్ర జ‌లాల‌కు సంబంధించిన వివాదాల‌ను శాంతియుతంగా ప‌రిష్క‌రించుకుందాం. సముద్ర సంబంధ అంశాలలో అన్ని దేశాలు అంత‌ర్జాతీయ చ‌ట్టాలు, విధివిధానాల‌కు క‌ట్టుబ‌డి ఉండాలి. ఈ విష‌యాన్ని మన ఇరు దేశాలు న‌మ్ముతున్నాయి.

అపెక్ (ఆసియా ప‌సిఫిక్ ఎక‌న‌మిక్ కో ఆప‌రేష‌న్.. ఏపీఈసీ‌) లో భారతదేశ స‌భ్య‌త్వం కోసం ప్ర‌ధాని శ్రీ అబే మ‌ద్ద‌తు ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు తెలియజేస్తున్నాను.

సంస్క‌ర‌ణ‌ల‌ త‌ర్వాత ఏర్ప‌డే ఐక్యారాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లిలో మ‌న‌కు ద‌క్కాల్సిన స్థానం కోసం గట్టిగా కృషి చేద్దాం.

ఏదైనా సంబంధానికి ఊపిరులూదేది సంస్కృతి, ప్ర‌జ‌లే.

మన మ‌ధ్య‌ ఉన్న చెప్పుకోదగిన సంబంధ‌ బాంధ‌వ్యాలకు ఒక అద్భుత‌మైన మాన‌వీయ కోణం కూడా ఉంది.

క్యోటో, వార‌ణాసి ల భాగ‌స్వామ్య‌మే దీనికి బ‌ల‌మైన నిదర్శ‌నం.

గ‌త సంవ‌త్స‌రం ప్ర‌ధాని శ్రీ అబే క్యోటోలో నాకు ఆతిథ్య‌మిచ్చారు.

ఈ రోజు నేను ఆయ‌న‌కు వార‌ణాసిలోని పురాత‌న వార‌స‌త్వ ప్రతీకలనుచూపించ‌బోతున్నాను. వార‌ణాసిని భ‌విష్య‌త్ లో ఆధునిక న‌గ‌రంగా తీర్చిదిద్ద‌డానికి మా వద్ద ఉన్న ప్రణాళికలను గురించి కూడా తెలియ‌జేయ‌బోతున్నాను.

చివరగా, ఇరు దేశాల మ‌ధ్య‌ ఉన్నప్ర‌త్యేక సంబంధ‌బాంధవ్యాల‌కు గుర్తింపుగా జపాన్ పౌరులకు భారతదేశం ‘చేరుకోగానే వీసా’ సౌకర్యాన్ని వర్తింపచేయ‌బోతున్నది. వ్యాపార పనులపై వచ్చే వారికి కూడా ఈ సౌకర్యం 2016 మార్చి నెల నుంచి అమలవుతుంది.

ప్ర‌పంచ‌ వ్యాప్తంగా అమ‌లులోకి తెస్తున్న ఎల‌క్ట్రానిక్ వీసా సౌక‌ర్యం కన్నా ఇది భిన్నమైంది.

ఎక్స్‌లెన్సీ,

అంత‌ర్జాతీయంగా దేశాల మ‌ధ్య‌న సంబంధాల్లో ఎంతో వేగం పెరిగింది. ఈ నేప‌థ్యంలో చూసిన‌ప్పుడు కొన్ని ప‌ర్య‌ట‌న‌లు నిజంగా చరిత్రాత్మ‌క‌మైన‌వి గాని, అప్ప‌టివ‌ర‌కు ఉన్నసంబంధాల్లో గ‌ణ‌నీయ‌మైన మార్పును తెచ్చేవీ అవుతాయని చెప్పాలి. ప్ర‌ధాని శ్రీ అబే.. మీ ప‌ర్య‌ట‌న కూడా ఆ కోవ‌కు చెందిన‌దే.

ఇండియా- జ‌పాన్ సంబంధాల‌కు సంబంధించిన విజ‌న్ 2025ను సాకారం చేసుకొనే క్రమంలో ఇరు దేశాల ప్ర‌జ‌ల సౌభాగ్యాన్ని మ‌రింత తొంద‌ర‌గా సాధించేందుకు కదులుదాం. త‌ద్వారా మ‌న దూర‌దృష్టిలో, విలువ‌ల్లో ఒక ఆసియా శతాభ్ది ఆవిష్కారం అవుతుంది.

ధన్యవాదాలు.