ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఇటలీలోని అపులియాలో ఆ దేశ ప్రధాని గౌరవనీయ శ్రీమతి జార్జియా మెలోనీతో సమావేశమయ్యారు. వరుసగా మూడోసారి భారత ప్రధాని పదవిని చేపట్టడంపై ఆమె ప్రధానమంత్రికి అభినందనలు తెలిపారు. కాగా, జి-7 విస్తృత సదస్సుకు తనను ఆహ్వానించడంపై ప్రధాని మెలోనీకి ప్రధానమంత్రి మోదీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ సదస్సును విజయవంతంగా నిర్వహించడంపై ప్రశంసించారు.
రెండు దేశాల మధ్య ఉన్నతస్థాయి రాజకీయ సంప్రదింపులు క్రమబద్ధంగా సాగుతుండటంపై దేశాధినేతలిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రగతిని సమీక్షించారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం పురోగమిస్తుండటంపై సంతోషం వ్యక్తం చేశారు. పరిశుభ్ర ఇంధనం, తయారీ, అంతరిక్షం, శాస్త్ర-సాంకేతిక, టెలికాం, కృత్రిమ మేధ, కీలక ఖనిజాలు తదితర రంగాల్లో సుస్థిర సరఫరా శ్రేణి నిర్మాణం దిశగా వాణిజ్య సంబంధాలను మరింత విస్తరించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పేటెంట్లు, డిజైన్లు, ట్రేడ్‌మార్క్ వంటి అంశాల్లో సహకార చట్రం రూపకల్పన సంబంధిత పారిశ్రామిక సంపద హక్కుల (ఐపిఆర్) ఒప్పందంపై ఇటీవల సంతకాలు పూర్తికావడంపై వారిద్దరూ హర్షం ప్రకటించారు.
భారత్-ఇటలీ ద్వైపాక్షిక రక్షణ-భద్రత సహకారంపై ప్రధానమంత్రులిద్దరూ చర్చించారు. రక్షణ పారిశ్రామిక సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవడంపై ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివరన ఇటలీ విమాన వాహక నౌక ‘ఐటిఎస్ కావర్’, సిబ్బంది శిక్షణ నౌక ‘ఐటిఎస్ విష్పూచి’ భారత్ రానుండటంపై వారిద్దరూ హర్షం వెలిబుచ్చారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇటలీకి భారత సైన్యం సహకారాన్ని గుర్తించడంపై ఆ దేశ ప్రభుత్వానికి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇటలీలోని మోంటోన్ వద్దగల యశ్వంత్ ఘడ్గే స్మారకానికి భారత్ మరింత మెరుగులు దిద్దనుందని చెప్పారు. ‘ప్రపంచ జీవ ఇంధన కూటమి’ కింద సమన్వయం గురించి వారిద్దరూ చర్చించారు. ఈ సందర్భంగా పరిశుభ్ర-హరిత ఇంధన రంగ పరివర్తనలో ద్వైపాక్షిక సహకార విస్తృతికి సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణ ఒడంబడికపై సంతకాలు పూర్తికావడంపై వారు హర్షం ప్రకటించారు. శాస్త్ర-సాంకేతిక రంగంలో సంయుక్త పరిశోధన-అభివృద్ధిని ప్రోత్సహించే దిశగా 2025-27 కాలానికగాను కొత్త సహకార కార్యాచరణ కార్యక్రమం చేపట్టడంపైనా వారు సంతోషం వ్యక్తం చేశారు.
ఇటలీలో దీర్ఘకాలం నుంచీ ‘ఇండలాజికల్ స్టడీస్’ సంప్రదాయం ప్రాతిపదికగా ప్రజలతో-ప్రజల అనుసంధానం మరింత బలోపేతం కావడంపై రెండు దేశాలూ హర్షం వ్యక్తం చేస్తున్నాయి. భారతదేశంపై అధ్యయనాల కోసం మిలన్ విశ్వవిద్యాలయం తొలిసారి పీఠం ఏర్పాటు చేయడంతో ఈ అనుబంధం మరింత పెనవేసుకోగలదు. రెండు దేశాల మధ్య వృత్తి నిపుణులు, నిపుణ-పాక్షిక నిపుణ మానవ శక్తి, విద్యార్థులు, పరిశోధకుల పరస్పర రాకపోకల సౌలభ్యం దిశగా ‘వలస-ప్రయాణ ఒప్పందం’ సత్వర అమలుకు దేశాధినేతలిద్దరూ పిలుపునిచ్చారు.
స్వేచ్ఛా-సార్వత్రిక ఇండో-పసిఫిక్ ప్రాంతం దిశగా ‘ఇండో-పసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్ ఫ్రేమ్‌వర్క్’ కింద ఉమ్మడి కార్యకలాపాల అమలుకు అధినేతలిద్దరూ సంసిద్ధత తెలిపారు. అంతేకాకుండా కీలక ప్రాంతీయ-అంతర్జాతీయ అంశాలపైనా ప్రధానమంత్రులు ఇద్దరూ చర్చించారు. భారత్-మధ్యప్రాచ్యం-ఐరోపా ఆర్థిక కారిడార్ సహా అంతర్జాతీయ వేదికలపైనా, బహుపాక్షిక కార్యక్రమాల్లో ద్వైపాక్షిక సహకార బలోపేతంపై వారిద్దరూ అంగీకారానికి వచ్చారు.
***
Fostering India-Italy friendship!
— PMO India (@PMOIndia) June 14, 2024
PM @narendramodi and PM @GiorgiaMeloni held a bilateral meeting on the sidelines of the G7 Summit. They conversed about taking forward the outcomes of the G20 Summit into the G7, augmenting partnership opportunities in defence development and… pic.twitter.com/QbxJXTHKdJ
Had a very good meeting with PM @GiorgiaMeloni. Thanked her for inviting India to be a part of the G7 Summit and for the wonderful arrangements. We discussed ways to further cement India-Italy relations in areas like commerce, energy, defence, telecom and more. Our nations will… pic.twitter.com/PAe6sdNRO9
— Narendra Modi (@narendramodi) June 14, 2024
Ho avuto un ottimo incontro con la PM @GiorgiaMeloni. L'ho ringraziata per aver invitato l'India a partecipare al G7 e per la meravigliosa organizzazione. Abbiamo discusso di come rafforzare le relazioni Italia-India in settori quali commercio, energia, difesa, telecomunicazioni… pic.twitter.com/ObB3ppTQiX
— Narendra Modi (@narendramodi) June 14, 2024