బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా రిపబ్లిక్ దేశాధినేతలమైన మేము 2019 జూన్ నెల 28వ తేదీన జపాన్ లోని ఒసాకాలో జి-20 సదస్సు నేపథ్యంలో కలిశాము. ఆతిధ్యం ఇచ్చిన జి-20 జపాన్ దేశ అధ్యక్షులకు మా కృతజ్ఞతలు తెలియజేశాము.
2. వాణిజ్యం, శాస్త్ర, సాంకేతికత, ఆవిష్కరణ, మౌలిక సదుపాయాలూ, వాతావరణ మార్పు, సార్వత్రిక ఆరోగ్య పరిరక్షణ, పెరుగుతున్న జనాభా, సుస్థిర అభివృద్ధి మొదలైన అంశాలపై జపాన్ ప్రాధాన్యతలను మేము గమనించాము.
3. ప్రపంచ ఆర్థికాభివృద్ధి స్థిరపడుతున్నట్లు కనబడుతోంది. సాధారణంగా ఇది ఈ ఏడాది నుండి 2020 నాటికి క్రమంగా పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ, ఈ వృద్ధి బలోపేతం అనిశ్చితంగా ఉంది. దీనికి వాణిజ్యం పెరగడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వస్తువుల ధరల అస్థిరత, అసమానత, తగినంత వృద్ధి లేకపోవడం, గడ్డు ఆర్ధిక పరిస్థితులు వంటివి కూడా అవరోధంగా ఉన్నాయి. అంతర్జాతీయ అసమానతలు ఎక్కువగా, నిరంతరాయంగా ఉన్నాయి. వీటిని అధిగమించడానికి సమగ్ర పర్యవేక్షణ, సకాలంలో విధాన రూపకల్పనల అవసరం ఉంది. స్థిరమైన అంతర్జాతీయ వాణిజ్యాభివృద్ధి కోసం, అనుకూలమైన ప్రపంచ ఆర్ధిక వాతావరణం ప్రాముఖ్యతపై మరింత దృష్టి కేంద్రీకరించవలసిన అవసరాన్ని మేము గుర్తించాము.
4. ఈ నేపథ్యంలో, గత దశాబ్దకాలంలో అంతర్జాతీయ అభివృద్ధి కి బ్రిక్స్ దేశాలు కీలకంగా పనిచేయడం, ప్రస్తుతం ప్రపంచ ఉత్పత్తిలో మూడోవంతుకు దగ్గరగా ఉండడం మాకు సంతృప్తినిచ్చింది. 2030 నాటికి బ్రిక్స్ దేశాలు ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో సగం కంటే ఎక్కువ స్థాయిలో కొనసాగుతాయని అంచనాలు పేర్కొంటున్నాయి. నిర్మాణాత్మక సంస్కరణలను నిరంతరాయంగా అమలుచేయడం, మన వృద్ధి సామర్ధ్యాన్ని పెంపొందిస్తుంది. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య నెలకొన్న సమతుల వాణిజ్య విస్తరణ, అంతర్జాతీయ వాణిజ్య విస్తరణను మరింత బలోపేతం చేస్తుంది.
5. సవాళ్ళను అధిగమించడానికీ, అవకాశాలనుండి పూర్తిగా ప్రయోజనం పొందడానికీ, పరస్పరం సహకరించుకోడానికీ వీలుగా, బహిరంగ మార్కెట్లు, పటిష్టమైన ఆర్ధిక పరిస్థితి, ఆర్ధిక సుస్థిరత, చక్కగా రూపొందించి, సమన్వయ పరచిన స్థూల ఆర్ధిక విధానాల ప్రాముఖ్యాన్ని మేము గుర్తించాము. అదేవిధంగా నిర్మాణాత్మక సంస్కరణలు, మానవ మూలధనంలో తగినంత పెట్టుబడి, పేదరిక స్థాయిల్లో తగ్గుదల, అసమానత్వం వంటివి వాటిని కూడా గుర్తించడం జరిగింది. పెట్టుబడులు, అన్వేషణల ప్రోత్సాహానికి సమర్ధవంతమైన పోటీ, సార్వత్రికమైన, సరైన, న్యాయమైన, వివక్ష లేని వ్యాపార వాతావరణం, ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంలో సహకారం (పిపిపి), మౌలిక సదుపాయాలకు ఆర్ధిక సహకారం, అభివృద్ధి మొదలైనవి కూడా వీటిలో ఉన్నాయి. ఈ విషయాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీసుకునే చర్యలు వంటివి కూడా సుస్థిరమైన, సమగ్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయి. ప్రపంచ స్థాయిలో విలువల అభివృద్ధి ప్రణాళికలో మరింతగా భాగస్వాములు కావాలని అభివృద్ధి చెందుతున్న దేశాలకు మేము పిలుపునిస్తున్నాము. వాణిజ్యం, డిజిటల్ ఆర్ధిక వ్యవస్థ మధ్య సామరస్య ప్రాముఖ్యాన్ని మేము గుర్తించాము. అభివృద్ధిలో సమాచారం (డేటా) పాత్రను కూడా మేము ధృవీకరిస్తున్నాము.
6. పారదర్శకమైన, వివక్ష రహిత, సార్వత్రిక, స్వేచ్చాయుత అంతర్జాతీయ వాణిజ్యానికి మేము కట్టుబడి ఉన్నాము. స్వదేశీవస్తు రక్షణ విధానం, ఏకపక్ష విధానం వంటివి డబ్ల్యు.టి.ఓ. విధి విధానాలకు వ్యతిరేకం. బహుముఖ, అంతర్జాతీయ చట్టానికి మేము కట్టుబడి ఉన్నాము. డబ్ల్యు.టి.ఒ. కేంద్రంగా రూపొందించబడిన బహుముఖ వాణిజ్య విధానానికి ఆధారమైన నియమాలకు మా పూర్తి సహకారం ఉంటుందని పునరుద్ఘాటిస్తున్నాము. అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రస్తుత, భవిష్యత్ సవాళ్ళను సమర్ధంగా ఎదుర్కోడానికి వీలుగా సంస్థ కు అవసరమైన సంస్కరణలపై డబ్ల్యు.టి.ఓ. సభ్యులందరితో నిర్మాణాత్మకంగా కలిసి పనిచేస్తాము. తద్వారా దాని ఔచిత్యాన్నీ, ప్రాభవాన్నీ పెంపొందిస్తాము. సంస్కరణలు ఇంటర్ అలియా, కేంద్రీకృతాన్ని, ప్రధాన విలువలను, డబ్ల్యు.టి.ఒ. ప్రాధమిక సూత్రాలను పరిరక్షించాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఎల్.డి.సి. లతో సహా సభ్యులందరి ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోవాలి. డబ్ల్యు.టి.ఒ. సంప్రదింపుల అజెండా వివరాలు సమతుల్యంగా ఉండాలి. వాటిని సార్వత్రికంగా, పారదర్శకంగా, సమ్మిళిత విధానంలో చర్చించాలి.
7. బహుముఖ వాణిజ్య విధానం లో డబ్ల్యు.టి.ఓ. వివాద పరిష్కార యంత్రా0గం ఒక తప్పనిసరి వ్యవస్థ. అదేవిధంగా సంస్థ సజావుగా, సమర్ధంగా పనిచేయడానికి అప్పిలేట్ బాడీ (విచారణ యంత్రాంగం) కూడా తప్పనిసరి. డబ్ల్యు.టి.ఓ. లో వివాదాలకు రెండంచెల తీర్పు వ్యవస్థ పనితీరును సంరక్షించడానికి మేము కట్టుబడి ఉన్నాము. అప్పిలేట్ బాడీ (విచారణ యంత్రాంగం) లో సభ్యుల నియామక ప్రక్రియలో ప్రతిష్టంభనను పరిష్కరించవలసిన ఆవశ్యకతను గుర్తుచేస్తూ, అప్పిలేట్ బాడీ (విచారణ యంత్రాంగం) ఎంపిక ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని మేము కోరుతున్నాము.
8. అంతర్జాతీయ ఆర్ధిక భద్రతా వ్యవస్థ కేంద్రంగా, పటిష్టమైన, కోటా ఆధారిత, సమృద్ధిగా వనరులు కలిగిన అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) కోసం కట్టుబడి ఉన్నామని మేము తిరిగి నిర్ధారిస్తున్నాము. 2010 లో ఆమోదించిన సూత్రాల ఆధారంగా పరిపాలనా సంస్కరణలకు, ఐఎంఎఫ్ కోటా అమలు దిశగా, కార్యనిర్వాహక మండలితో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నామని మేము పునఃరుద్ఘాటిస్తున్నాము. 2019 వార్షిక సమావేశాల కంటే ముందు కోటా గురించిన 15వ సాధారణ సమీక్షను ముగించడానికి మేము కట్టుబడి ఉన్నాము.
9. మౌలిక సదుపాయాలకు ఆర్ధిక సహాయం, సుస్థిర అభివృద్ధి, పటిష్టమైన, సమతులమైన, ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన ప్రాజెక్టులను నిర్మించడానికీ, మెరుగైన, నిరంతర కృషి జరుపుతున్న నూతన అభివృద్ధి బ్యాంకు (ఎన్ డి బి) పాత్రను మేము ప్రశంసిస్తున్నాము. సభ్యదేశాలలో క్లిష్టమైన మౌలిక సదుపాయాల పెట్టుబడులలో బ్యాక్ లాగ్ లను అధిగమించడానికి చేపట్టవలిసిన చర్యల ఆవశ్యకతను మేము నొక్కి చెప్పాము. ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటు ద్వారా ఎన్ డి బి ని పటిష్ఠపరచడం జరుగుతుంది. తన సభ్య దేశాల కరెన్సీ లో వనరుల సమీకరణకు, చైనా తో ప్రారంభించి, దక్షిణాఫ్రికా, రష్యా దేశాలలో చేపడుతున్న కార్యక్రమాలకు ఎన్ డి బి కట్టుబడి ఉండడాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఎన్ డి బి ప్రాజెక్టు తయారీ నిధి ని త్వరగా అమలు చేయాలని మేము ఎదురుచూస్తున్నాము. ఎన్ డి బి సభ్య దేశాలకు సాంకేతిక సహాయం అందించడంతో పాటు, ప్రోజెక్టులు తయారుచేయడానికి ఇది ఒక సమర్ధవంతమైన సాధనంగా మారుతుందని భావిస్తున్నాము.
10. సభ్యదేశాలలో స్వల్ప కాల మిగులు చెల్లింపుల ఒత్తిళ్లను తగ్గించడానికి ఉపయోగపడే ఒక యంత్రాంగం గా, బ్రిక్స్ కంటింజెంట్ రిజర్వు ఏర్పాటు (సి ఆర్ ఏ) ప్రాముఖ్యతను మేము గుర్తించాము. 2018 లో నిర్వహించిన ప్రయోగ పరీక్ష విజయవంతం కావడంతో, వనరుల కోసం వచ్చే విజ్ఞప్తులకు సిద్ధంగా ఉండే విధంగా, అవసరమైతే మరిన్ని ప్రయోగ పరీక్షలు నిర్వహించడానికి మేము కట్టుబడి ఉన్నాము. స్థూల ఆర్ధిక సమాచారం (ఎస్ఇఎంఐ) విధానంలో సి ఆర్ ఏ సిస్టం అఫ్ ఎక్సేంజ్ పనితీరును మేము స్వాగతించాము. బ్రిక్స్ స్థానిక కరెన్సీ బాండ్ ఫండ్ ఏర్పాటుకు కొనసాగుతున్న కృషిని మేము స్వాగతిస్తున్నాము, ఫండ్ త్వరలో పనిచేయడం ప్రారంభం కావాలని ఎదురుచూస్తున్నాము. సిఆర్ఎ మరియు ఐఎమ్ఎఫ్ ల మధ్య సహకారానికి కూడా మేము మద్దతునిస్తాము.
11. బ్రిక్స్ దేశాలపై సహా తీవ్రవాద దాడులకు ఎవరు, ఎవరిపై, ఎక్కడ, ఏరకంగా పాల్పడినా వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఒక గట్టి అంతర్జాతీయ చట్ట పరమైన ఆధారంతో తీవ్రవాదాన్ని ఎదుర్కోడానికి ఒక సమగ్ర విధానం, సమిష్టి కృషి జరగాలని మేము కోరుకుంటున్నాము. తమ భూభాగం పై నుండి ఎటువంటి తీవ్రవాదం కార్యకలాపాలు జరగకుండా, తీవ్రవాద బృందాలకు ఎటువంటి ఆర్ధిక సహాయం అందకుండా చూడవలసిన బాధ్యత అన్ని దేశాలపైనా ఉందన్న విషయాన్ని మేము పునఃరుద్ఘాటిస్తున్నాము. తీవ్రవాద కార్యకలాపాల కోసం ఇంటర్నెట్ ను దుర్వినియోగపరచకుండా పోరాడడానికి కట్టుబడి ఉన్నామని పునఃరుద్ఘాటిస్తున్నాము. ఐ సి టి ల వినియోగంలో భద్రతా, రక్షణ అంశాలను నిర్ధారించే విషయంలో ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించవలసిన అవసరం ఉందని మేము గుర్తించాము. తీవ్రవాద చర్యలను ప్రోత్సహించడానికి, నియమించుకోడానికి, నిర్వహించడానికి డిజిటల్ వేదికలను వినియోగించకుండా సాంకేతిక కంపెనీలు అందుబాటులో ఉన్న చట్టాల పరిధిలో ప్రభుత్వాలకు సహకరించాలని మేము పిలుపునిచ్చాము.
12. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో సమగ్రతను పెంపొందిచడానికి కృషి చేస్తున్నాము. అందువల్ల, మేము, అంతర్జాతీయంగా అవినీతి నిర్మూలనకు, అదేవిధంగా అవినీతిని మరింత సమర్ధంగా ఎదుర్కొనేందుకు ముఖ్యంగా ఆస్తుల స్వాధీనం వంటి కేసుల్లో అవసరమైన మేరకు చట్టాలను పటిస్టపరిచేందుకు గట్టిగా కృషి చేస్తున్నాము. అవినీతికి పాల్పడ్డ వ్యక్తులపై అభియోగం, విచారణ సమయంలో పరస్పరం సహకరాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించుకున్నాము. ప్రభుత్వ ప్రయివేటు రంగాల్లోఅవినీతిని నివారించడం, ఎదుర్కోవడంలో అవినీతి సమాచారం అందించే వ్యక్తి (విజిల్ బ్లోయర్) పాత్రను మేము గుర్తించాము. అటువంటి సమాచారం అందించే వ్యక్తులను కాపాడడానికి తీసుకునే చర్యలను మెరుగుపరచవలసిన అవసరం ఉంది.
13. అవినీతి, అక్రమ ధన ప్రవాహం, విదేశీ అధికార పరిధిలో ఉన్న అక్రమ ఆస్తి వంటివి ఒక అంతర్జాతీయ సవాలుగా మేము గుర్తించాము. ఇది ఆర్థికాభివృద్ధి, స్థిరమైన అభివృద్ధి పై వ్యతిరేక ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ విషయంలో ఒక పటిష్టమైన అంతర్జాతీయ నిబద్ధతకు వీలుగా మా విధానాన్ని సమన్వపరచి, ప్రోత్సహించాలని ప్రయత్నిస్తున్నాము. అవినీతి వ్యతిరేక చట్టం అమలు, పరారయిన వారిని, ఆర్ధిక, అవినీతికి పాల్పడిన నేరస్థులను పట్టుకోవడం, చోరీకి గురైన ఆస్తులను స్వాధీనం చేసుకోవడం వంటి వాటిలో దేశీయ న్యాయ వ్యవస్థల పరిధిలో సహకారాన్ని పటిష్టం చేసుకోవలసిన అవసరాన్ని కూడా మేము గుర్తించాము. ఆర్ధిక చర్యల టాస్క్ ఫోర్స్ (ఎఫ్ ఎ టి ఎఫ్), ప్రపంచ కస్టమ్స్ సంస్థ వంటి పలు ఇతర సంబంధిత బహుపాక్షిక యంత్రాంగాల పరిధిలో సహకారంతో పాటు అక్రమ ఆర్ధిక లావాదేవీలను ఎదుర్కోవడంలో అంతర్జాతీయ సహకారానికి మద్దతు ఇవ్వాలన్న మా నిబద్దతను మేము పునఃరుద్ఘాటిస్తున్నాము.
14. ఇంధన భద్రత, సుస్థిరమైన, సరసమైన ధరలో, అందుబాటులో ఇంధన లభ్యతకు భరోసా కల్పించుకుంటూనే, గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాల తగ్గింపుతో కూడిన వృద్ధితో పాటు స్వచ్చమైన, మరింత సరళమైన, సమర్ధమైన విధానాల వైపు మార్పుచెందే విధానంలో సహకారం పాత్ర చాలా కీలకమైనదని మేము గుర్తించాము. సౌరశక్తి, స్థిరమైన బయో ఎనర్జీ, రవాణాలో సహజ వాయువు వంటి స్వల్ప ఉద్గారాల భవిష్యత్తును సాధించడానికి విభిన్న శక్తి వనరులు, సాంకేతిక ఆధునికతల ప్రాముఖ్యతను మేము గుర్తించాము. ఈ విషయంలో, స్థిరమైన శక్తీ, అధునాతన ఇంధన సాంకేతికతలను ఇచ్చి పుచ్చుకోవడంపై సంయుక్త అధ్యయనాన్ని ప్రోత్సహించడం ధ్యేయంగా, పునరుత్పాదక ఇంధన వనరులపై అంతర్జాతీయ సహకారం పెంపొందించడం, బ్రిక్స్ ఇంధన పరిశోధన సహకార వేదికను పటిష్ఠపరడంలో బ్రిక్స్ దేశాల కృషిని మేము గుర్తించాము.
15. వివిధ దేశాల పరిస్థితుల నేపథ్యంలో, సాధారణ సూత్రాలు, విభిన్న బాధ్ధ్యతలు, సంబంధిత సామర్ధ్యాలతో సహా, యు ఎన్ ఎఫ్ సి సి సి సూత్రాల కింద స్వీకరించిన ప్యారిస్ ఒప్పందాన్ని పూర్తిగా అమలుచేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. అభివృద్ధిచెందుతున్న దేశాలు ఉపశమనం, అనుసరణల సామర్ధ్యాన్ని పెంపొందించుకోడానికి వీలుగా, ఆయా దేశాలకు అవసరమైన ఆర్ధిక, సాంకేతిక, సామర్ధ్య నిర్మాణ మద్దతు అందజేయవలసిందిగా అభివృద్ధిచెందిన దేశాలను మేము కోరుతున్నాము. ఈ ఏడాది సెప్టెంబర్ లో జరిగే ఐక్యరాజ్యసమితి వాతావరణ చర్యల సదస్సు సానుకూల ఫలితాలను ఇస్తుందని మేము ఎదురుచూస్తున్నాము.
16. సుస్థిర అభివృద్ధి కోసం 2030 అజెండాను గుర్తుచేసుకుంటూ, సుస్థిర అభివృద్ధికి మేము గట్టిగా కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటిస్తున్నాము. అడ్డిస్ అబాబా కార్యాచరణ ఎజెండా కు అనుగుణంగా, అధికారిక అభివృద్ధి సహాయ ఒప్పందం, అభివృద్ధి వనరుల సహాయ ఒప్పందాలను పూర్తిగా గౌరవించవలసిన ప్రాముఖ్యాన్ని మేము నొక్కి చెబుతున్నాము. 2030 అజెండా ఆధారంగా రూపొందించిన జి-20 కార్యాచరణ ప్రణాళికకు, ఆఫ్రికాతో చేసుకున్న ఒడబడికతో సహా, ఆఫ్రికాలోనూ, ఇతర తక్కువగా అభివృద్ధి చెందిన దేశాలలోనూ పారిశ్రామికీకరణకు మద్దతుపై జి-20 తీసుకుంటున్న చర్యలకు, మా మద్దతును కొనసాగిస్తాము.
17. 2019 అధ్యస్థానానికి ” ఒక వినూత్న భవిష్యత్తు కోసం ఆర్థికాభివృద్ధి” అనే ఇతివృత్తాన్ని గుర్తించినందుకు మేము బ్రెజిల్ ను అభినందిస్తున్నాము. అభివృద్ధికి ఆవిష్కరణ ఒక కీలకమైన చోదక శక్తిగా గుర్తించి, గ్రామీణ, మారుమూల ప్రాంతాల జనాభా తో సహా ప్రజలందరికీ డిజిటలైజేషన్, అధునాతన సాంకేతికతల ప్రయోజనాలు సంపూర్ణంగా అందాలన్న మా నిబద్ధతను మరోసారి తెలియజేస్తున్నాము. పేదరిక నిర్మూలన కోసం ఇంటర్ నెట్ తో అనుసంధానం చేసిన మంచి చర్యలతో పాటు, పారిశ్రామిక రంగం చేపట్టిన డిజిటల్ పరివర్తనలను ఇచ్చిపుచ్చుకోడానికి కలిసికట్టుగా చేస్తున్న కృషిని మేము ప్రోత్సహిస్తున్నాము. నూతన పారిశ్రామిక విప్లవం (పార్ట్ ఎన్ ఐ ఆర్) పై బ్రిక్స్ భాగస్వామ్యం, ఐ బ్రిక్స్ నెట్ వర్క్, బ్రిక్స్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఫ్యూచర్ నెట్ వర్క్స్, యువ శాస్త్రవేత్తల ఫోరమ్ లతో సహా, బ్రిక్స్ కొనసాగిస్తున్న శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణలు, వ్యవస్థాపక సహకారం ప్రాముఖ్యతను మేము నొక్కి వక్కాణిస్తున్నాము.
18. 2019 లో బ్రిక్స్ కు అధ్యక్షత వహిస్తున్న బ్రెజిల్ కు మా మద్దతు ను ప్రకటిస్తున్నాము. నవంబర్ లో బ్రాసిలియా లో జరిగే 11వ బ్రిక్స్ సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాము.
***