Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జి-20 వ‌ర్కింగ్ స‌మావేశంలో ప్ర‌ధాని ప్ర‌సంగం: ప‌టిష్ట‌త‌ను పెంచ‌డంపైన దృష్టి


ఎక్స్ లెన్సీస్‌,

ప‌టిష్ట‌మైన‌, పార‌ద‌ర్శ‌క‌మైన ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను నిర్మించ‌డానికిగాను జి-20 దేశాలు విజ‌య‌వంతంగా చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌కు నా ప్ర‌శంస‌లు. ప్ర‌పంచ ఆర్థిక రంగంలో ఇది ఒక ఆవ‌శ్య‌క‌మైన‌ పునాది. ఇలాంటి ఆర్థిక వ్య‌వ‌స్థ‌వ‌ల్ల ప్ర‌పంచ ఆర్థిక రంగం అభివృద్ధి కావ‌డ‌మే కాకుండా స్థిర‌త్వం కూడా వ‌స్తుంది. భార‌త‌దేశంలో కేంద్ర‌ ప్ర‌భుత్వం, రిజ‌ర్వు బ్యాంకు కొన్ని చ‌ర్య‌ల‌ను చేప‌ట్ట‌డంద్వారా ఆర్థిక‌, బ్యాంకింగ్ రంగాల‌ను బ‌లోపేతం చేస్త‌న్నాయి.

ఈ ప్ర‌ధాన‌మైన అంశంపైన జి-20 స‌మావేశంలో చ‌ర్చిస్తున్నాం కాబ‌ట్టి నేను కొన్ని విష‌యాల‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాల‌నుకుంటున్నాను.

భారీ మూల‌ధ‌న ఆవ‌శ్య‌క‌త అనేది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బ్యాంకింగ్ రంగం చేప‌ట్టే ప‌నుల‌కు అడ్డంకిగా ఉండ‌కూడ‌దు. ఈ దేశాల్లో బ్యాంకింగ్‌ రంగం ప్ర‌జ‌లంద‌రికీ ఆర్థిక స్వావ‌లంబ‌న క‌ల‌గ‌జేయ‌డానికి చ‌ర్య‌లు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ ఆర్థిక స్వావ‌లంబ‌న‌ను ప్రోత్స‌హించ‌డానికి భారీ మూల‌ధ‌న‌ ఆవ‌శ్య‌క‌త‌లు స‌మ‌స్య‌గా మార‌కూడ‌దు.
అలాగే స‌మ‌ర్థ‌వంత‌మైన ప‌ర్య‌వేక్ష‌ణ‌, సాంకేతిక‌త‌ను చ‌క్క‌గా వినియోగించుకోవ‌డంద్వారా మూల‌ధ‌న ఆవ‌శ్య‌క‌త‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.

బ్యాంకింగ్ రంగ మౌలిక వ్య‌వ‌స్థ‌ల్ని భ‌ద్రంగా కాపాడుకోవాలంటే సైబ‌ర్ భ‌ద్ర‌త చాలా ముఖ్యం.

ఐఎంఎఫ్ సంస్థ కోటా ఆధారిత సంస్థ‌గానే ఉండాలి. అంతే కానీ అరువు తెచ్చుకున్న వ‌న‌రుల‌పైన ఆధార‌ప‌డ‌కూడ‌దు.

అమెరికాలో 2010లో చేప‌ట్టిన ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల్ని ఆమోదించే ప్ర‌క్రియ వీలైనంత తొంద‌ర‌గా ముగుస్తుంద‌ని నేను ఆశాభావంతో ఉన్నాను.

భార‌త‌దేశ మ‌ద్ద‌తుకోసం నిర్ణీత స‌మ‌యంలోనే బేస్ ఎరోజ‌న్ అండ్ ప్రాఫిట్ షిప్టింగ్ ప్యాకేజిని (ప‌న్నును ఎగ‌వేసేందుకు బ‌హుళ‌జాతి సంస్థ‌లు అనుస‌రించే వ్యూహాల‌ను ఎదుర్కొనే విధివిధానాలు) పంపినందుకు ట‌ర్కీ అధ్య‌క్షునికి నా అభినంద‌నలు. ఆటోమేటిగ్గా స‌మాచార కార్య‌క్ర‌మాల ప‌ర‌స్ప‌ర బ‌ద‌లాయింపుకు నేను స్వాగ‌తం ప‌లుకుతున్నాను. దీన్ని అంద‌రం క‌లసి ఐక‌మ‌త్యంగా చేప‌ట్టాలి. భార‌త‌దేశంలో మా ప్ర‌భుత్వం అవినీతిని, న‌ల్ల‌ధ‌నాన్ని ఏమాత్రం స‌హించ‌డం లేదు. ఇంత‌వ‌ర‌కు ప్ర‌క‌టించ‌ని ఆస్తుల్ని, విదేశాల్లో దాచుకున్న ఆదాయాల‌ను వెలుగులోకి తేవ‌డానికి ఒక కొత్త చ‌ట్టాన్ని అమ‌లులోకి తెచ్చాం. అలాగే అనేక ద్వైపాక్షిక ప‌న్ను ఒప్పందాల‌పైన సంత‌కాలు చేశాం.

అలాగే దేశంలో లెక్కాప‌త్రంలేని ధ‌నాన్ని వెలుగులోకి తేవ‌డానికి ప్ర‌త్యేక‌మైన చ‌ర్య‌ల‌ను చేప‌ట్టాం. ఆ డ‌బ్బును ప్ర‌భుత్వ‌ప‌రం చేయ‌డానికి త్వ‌ర‌లో ఒక శాస‌నాన్ని తేబోతున్నాం.

ప‌న్ను స‌మాచారాన్ని ఆటోమేటిగ్గా పంచుకునే విధానాన్ని ఆధారం చేసుకొని కామ‌న్ రిపోర్టింగ్ స్టాండ‌ర్డ్ ను అన్ని దేశాలు అమ‌లు చేయాలి. త‌ద్వారా ఈ విష‌యంలో అంత‌ర్జాతీయంగా చేస్తున్న కృషి మ‌రింత బలోపేత‌మ‌వుతుంది.

అవినీతిపై చేస్తున్న‌ పోరాటానికి ఇప్పుడు ఇస్తున్న‌ట్టుగానే ముందు ముందు కూడా జి-20 దేశాలు ప్రాధాన్య‌త‌నివ్వాలి.

ప్రైవేటు రంగంలో పార‌ద‌ర్శ‌క‌త‌, నిజాయితీకి ల‌భిస్తున్న ప్రోత్సాహాన్ని స్వాగ‌తిస్తున్నాను.

విదేశాల్లో అక్ర‌మంగా కూడ‌బెట్టుకున్న ధ‌నాన్ని దాని సొంత‌ దేశానికి పంపించ‌డానికిగాను మ‌రింత‌ అంత‌ర్జాతీయ స‌హ‌కారం అవ‌స‌రం. బ్యాంకింగ్ రంగంలో క‌నిపిస్తున్న అన‌వ‌స‌ర నిగూఢ‌త‌, సంక్లిష్ట‌మైన న్యాయ‌, నియంత్ర‌ణా వ్య‌వ‌స్థ‌ల అడ్డంకుల‌ను తొల‌గించడానికి చ‌ర్య‌లు చేప‌ట్టాలి.

ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు ల‌భిస్తున్న ఆర్థిక స‌హ‌కారానికి వ్య‌తిరేకంగా పోరాటం చేయ‌డానికిగాను స‌హ‌క‌రాన్ని విస్తృతం చేయాలి. ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు ఆర్థిక‌ స‌హ‌కారం అందించే దేశాల‌పై ఆర్థిక ఆంక్ష‌ల్ని విధించాలి. అంతే కాదు మ‌రింత స‌మ‌ర్థ‌వంత‌మైన ఉగ్ర‌వాద వ్య‌తిరేక ఆర్థిక చ‌ర్య‌ల్ని చేప‌ట్టాలి.

ఫైనాన్షియ‌ల్ యాక్ష‌న్‌ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ ఏ టి ఎఫ్‌) ఆయా దేశాల‌ కోసం రూపొందించిన నివేదిక‌ల్ని అంద‌రికీ అందుబాటులోకి తేవాలి. అంతే కాదు ఈ సంస్థ ఆర్థికంగా వెనుక‌బ‌డిన దేశాల‌తో పనిచేయ‌డానికిగాను ఒక యంత్రాంగాన్ని రూపొందించాలి.

అంద‌రికీ ధ‌న్య‌వాద‌ములు