ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు న్యూఢిల్లీలోని భారత మండపంలో ‘జి-20 విశ్వవిద్యాలయ అనుసంధానం’ ముగింపు కార్యక్రమంలో ప్రసంగించారు. దేశంలోని యువతరంలో భారత జి-20 అధ్యక్షతపై అవగాహన పెంపు, సంబంధిత కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం లక్ష్యంగా విశ్వవిద్యాలయ అనుసంధానం కార్యక్రమం చేపట్టబడింది. ముగింపు కార్యక్రమంలో భాగంగా ప్రధాని జి-20 సంబంధిత 4 ప్రచురణలు- “జి20 అధ్యక్షతలో భారత్ ఘన విజయం-దార్శనిక నాయకత్వం-సార్వజనీన విధానం; జి-20కి భారత అధ్యక్షత- వసుధైవ కుటుంబకం; జి-20 విశ్వవిద్యాలయ అనుసంధాన కార్యక్రమ సంగ్రహం; జి-20లో భారతీయ సంస్కృతీ ప్రదర్శన”ను ఆవిష్కరించారు.
జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో రెండు వారాల కిందట భారత మండపం వద్ద నెలకొన్న సందడి వాతావరణాన్ని గుర్తుచేస్తూ ప్రధాని తన ప్రసంగం ప్రారంభించారు. ఈ ప్రదేశం నేడు ఉత్సాహ-ఉల్లాసాలకు నిలయంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ఈ వేదిక నేటి భారత భవిష్యత్తుకు సాక్షిగా నిలుస్తుండటంపై హర్షం ప్రకటించారు. జి-20 వంటి భారీ కార్యక్రమాల నిర్వహణలో భారత్ సరికొత్త ప్రమాణాలతో ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యా్ల్లో ముంచిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. కానీ, ఇంతటి బృహత్ కార్యక్రమ నిర్వహణలో ఉరకలేసే యువోత్సాహం తోడుగా ఉండటంవల్ల ఈ విజయం తనకేమీ ఆశ్చర్యం కలిగించలేదని వ్యాఖ్యానించారు. “యువతరం చేయి కలిపితే ఎంతటి భారీ కార్యక్రమాలైనా ఇట్టే విజయవంతం కాగలవు” అని ఆయన ప్రశంసించారు. భారతదేశం ఇవాళ అనేక భారీ కార్యక్రమాలు చేపడుతున్నదంటే ఆ ఘనత యువశక్తిదేనని ప్రధాని మోదీ అభివర్ణించారు.
భారతదేశం ఇప్పుడు ఉత్సాహోల్లాసాలు పొంగిపొర్లే ప్రదేశంగా రూపాంతరం చెందుతున్నదని ప్రధాని అన్నారు. గడచిన 30 రోజులుగా సాగుతున్న కార్యకలాపాలు ఈ వాస్తవాన్ని స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలపై సంక్షిప్తంగా సమీక్షిస్తూ- చంద్రయాన్-3 విజయంతో “భారత్ చందమామను అందుకుంది” అని ప్రపంచం మొత్తం నినదించడాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ప్రధాని మాట్లాడటం మొదలుపెట్టారు. “ఈ ఏడాది ఆగస్టు 23 మన దేశంలో ‘జాతీయ అంతరిక్ష దినోత్సవం’గా అజరామరమైంది” అని పేర్కొన్నారు. దీనికి కొనసాగింపుగా, భారత్ తన సూర్యాన్వేషణ కార్యక్రమానికి విజయవంతంగా శ్రీకారం చుట్టిందన్నారు. చంద్రయాన్ 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తే, సూర్యాన్వేషణ ఉపగ్రహ ప్రయాణం 15 లక్షల కిలోమీటర్ల దాకా సాగుతుందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. “భారత సామర్థ్య స్థాయికి దీటుకాగలది ఏదైనా ఉందా!” అంటూ ఈ సందర్భంగా ఆయన చమత్కరించారు.
భారత దౌత్య నైపుణ్యం గడచిన 30 రోజుల్లో కొత్త శిఖరాలకు చేరిందని ప్రధాని నొక్కిచెప్పారు. జి-20కి ముందు దక్షిణాఫ్రికాలో ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సదస్సు గురించి ప్రస్తావిస్తూ- ఇందులో భాగంగా భారత్ కృషితో ఆరు కొత్త దేశాలు కూటమిలో సభ్యత్వం తీసుకున్నాయని తెలిపారు. ఆ తర్వాత తన గ్రీస్ పర్యటనను ప్రస్తావిస్తూ- నాలుగు దశాబ్దాల తర్వాత భారత ప్రధానమంత్రి తొలిసారి ఆ దేశంలో పర్యటించారని పేర్కొన్నారు. అలాగే జి-20 సదస్సుకు ముందు ఇండోనేషియాలో తాను పలువురు ప్రపంచ నేతలను కలవడాన్ని కూడా ప్రస్తావించారు. అదేవిధంగా ప్రపంచ సౌభాగ్యం దిశగా ఇదే భారత మండపంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడాన్ని ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుత ఏకధ్రువ ప్రపంచ వాతావరణం నడుమ ఒకే వేదికపై సభ్య దేశాలన్నింటి మధ్య ఏకాభిప్రాయ సాధన తమ ప్రభుత్వం సాధించిన ప్రత్యేక విజయమని నొక్కిచెప్పారు. ఈ మేరకు “న్యూఢిల్లీ ప్రకటనలో ఏకాభిప్రాయం ప్రపంచ పతాక శీర్షికలను అలంకరించింది” అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా భారత్ అనేక కీలక చర్యలకు, సత్ఫలితాల సాధనకు నాయకత్వం వహించిందని పేర్కొన్నారు. ఈ 21వ శతాబ్దపు దశదిశలను పూర్తిగా మార్చే సామర్థ్యంగల జి-20 పరివర్తనాత్మక నిర్ణయాలను ఆయన ప్రస్తావించారు. ఇందులో భాగంగా ఆఫ్రికా సమాఖ్యకు జి-20లో శాశ్వత సభ్యత్వం కల్పన, భారత్-మధ్యప్రాచ్యం-ఐరోపా కారిడార్ సహా అంతర్జాతీయ జీవ ఇంధన కూటమికి మన దేశం నాయకత్వం వహించడాన్ని గుర్తుచేశారు.
ఇక జి-20 సదస్సు ముగియగానే సౌదీ అరేబియా యువరాజు భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మన దేశంలో సౌదీ అరేబియా 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడంపై ఒప్పందం కుదిరింది. మొత్తంమీద గడచిన 30 రోజుల్లో ప్రపంచంలో దాదాపు సగం… అంటే- 85 మంది దేశాధినేతలతో సమావేశమైనట్లు ప్రధాని వివరించారు. అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట ఇనుమడిస్తుండటంతో కొత్త అవకాశాలు.. స్నేహాలు.. మార్కెట్లు లభిస్తాయని, తద్వారా యువతకు కొత్త అవకాశాలు అందివస్తాయని ప్రధాని అన్నారు.
దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలతోపాటు పేద, మధ్యతరగతి వర్గాలకు సాధికారత దిశగా ప్రభుత్వం గత 30 రోజుల్లో చేపట్టిన చర్యలను ప్రధాని ప్రస్తావించారు. విశ్వకర్మ పవిత్ర జయంతి నేపథ్యంలో ‘పీఎం విశ్వకర్మ యోజన’కు శ్రీకారం చుట్టామని, తద్వారా చేతివృత్తుల నిపుణులు, హస్తకళాకారులు, సంప్రదాయ కార్మికులకు ఎంతో మేలు కలుగుతుందని తెలిపారు. అలాగే లక్ష మందికిపైగా యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేసేందుకు ఉపాధి సమ్మేళనాలు నిర్వహించినట్లు వెల్లడించారు. వీటిని మొదలుపెట్టాక ఇప్పటిదాకా 6 లక్షల మందికిపైగా యువతకు నియామక లేఖల ప్రదానం పూర్తయిందని ప్రధాని తెలిపారు. తాజాగా కొత్త పార్లమెంటు సౌధంలో ప్రారంభమైన తొలి సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీశక్తి వందన్ అధినియం)కు ఆమోదముద్ర పడటాన్ని శ్రీ మోదీ ప్రస్తావించారు.
విద్యుత్ రవాణా రంగంలో తాజా పరిణామాలను వివరిస్తూ- దేశంలో బ్యాటరీ విద్యుత్ నిల్వ వ్యవస్థ సాధికారత కోసం కొత్త పథకాన్ని ఆమోదించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. ఇలాంటి ఇతరత్రా పరిణామాలుసహా న్యూఢిల్లీలోని ద్వారకలో ‘యశోభూమి కన్వెన్షన్ సెంటర్’ ప్రారంభోత్సవం గురించి శ్రీ మోదీ ప్రస్తావించారు. వారణాసిలో కొత్త అంతర్జాతీయ క్రికెట్ మైదానానికి శంకుస్థాపన, ఏకకాలంలో 9 వందేభారత్ రైళ్లను ప్రారంభించడం గురించి వెల్లడించారు. అలాగే మధ్యప్రదేశ్‌లోని చమురుశుద్ధి కర్మాగారంలో పెట్రో-రసాయన సముదాయంతోపాటు పునరుత్పాదక ఇంధన ‘ఐటీ’ పార్క్, భారీ పారిశ్రామిక పార్కుసహా ఆ రాష్ట్రంలో 6 కొత్త పారిశ్రామిక రంగాలకు శంకుస్థాపన చేయడాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారు. “ఈ పరిణామాలన్నీ యువతకు నైపుణ్యాభివృద్ధి-ఉద్యోగావకాశాల సృష్టితో ముడిపడినవే” అని శ్రీ మోదీ తెలిపారు.
ఆశావహ దృక్పథం, అవకాశాలు, నిష్పాక్షికత ఉన్నపుడు యువతరం పురోగమించగలదని ప్రధానమంత్రి అన్నారు. నేటి యువత గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచిస్తూ- “మీరు సాధించలేదంటూ ఏదీ లేదు.. దేశం సదా వెన్నుతట్టి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది” అన్నారు. ఏ సందర్భాన్నీ తేలికగా తీసుకోవద్దని, ప్రతి పనిలోనూ మనదైన ప్రమాణం సృష్టించేందుకు కృషి చేయాలని ఉద్బోధిస్తూ- జి-20 విజయాన్ని ఉదాహరించారు. ఈ మేరకు “ఇది కేవలం ఢిల్లీకి పరిమితమైన దౌత్యసంబంధ కార్యక్రమం కావచ్చు… కానీ, జి-20ని ప్రజా చోదక జాతీయ ఉద్యమంగా భారత్ రూపుదిద్దింది” అని గుర్తుచేశారు. జి-20 విశ్వవిద్యాలయ అనుసంధానం కార్యక్రమంలో 100కుపైగా విశ్వవిద్యాలయాల నుంచి లక్ష మందికిపైగా విద్యార్థులు పాల్గొనడం అభినందనీయమన్నారు. పాఠశాలలతోపాటు ఉన్నత విద్య-నైపుణ్యాభివృద్ధి సంస్థలలోనూ 5 కోట్ల మంది విద్యార్థులకు జి-20ని ప్రభుత్వం చేరువ చేసిందని తెలిపారు. “మనవాళ్లు గొప్పగా ఆలోచిస్తారు.. ఘనమైన ఫలితాలు సాధిస్తారు” అని ఆయన కొనియాడారు.
రానున్న 25 ఏళ్ల అమృత కాలం ప్రాధాన్యాన్ని పునరుద్ఘాటిస్తూ- దేశానికి, యువతరానికి ఇదెంతో కీలక సమయమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. శరవేగంగా పురోగమిస్తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో భారత్ ఒకటని ఆయన గుర్తుచేశారు. కాబట్టే, అత్యంత తక్కువ వ్యవధిలోనే 10వ స్థానం నుంచి దూసుకెళ్లి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని పేర్కొన్నారు. ఇందుకు దోహదం చేసిన అంశాలను వివరిస్తూ- భారత్‌పై ప్రపంచవ్యాప్తంగా బలమైన నమ్మకం ఏర్పడిందన్నారు. అందుకే దేశంలోకి రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు ప్రవహిస్తున్నాయని చెప్పారు. ఎగుమతి, తయారీ, సేవా రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయని, కేవలం ఐదేళ్లలో 13.5 కోట్ల మంది ప్రజలు పేదరిక విముక్తులైన నయా మధ్యతరగతి వర్గంలో చేరారని గుర్తుచేశారు. “భౌతిక, సామాజిక, డిజిటల్ వ్యవస్థాపన పురోగమనం అభివృద్ధిలో కొత్త వేగానికి భరోసా ఇస్తోంది. భౌతిక మౌలిక సదుపాయాల కల్పన రంగంలో రూ.10 లక్షల కోట్లదాకా పెట్టుబడులు రాగలవని అంచనాలు చెబుతున్నాయి” అని ప్రధాని పేర్కొన్నారు.
దేశ యువతరానికి కొత్త అవకాశాల గురించి ప్రస్తావిస్తూ- ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్‌ఒ) జాబితాలో దాదాపు 5 కోట్లమంది నమోదయ్యారని ప్రధాని తెలిపారు. వీరిలో 3.5 కోట్లమంది తొలిసారి ఈ సంస్థ పరిధిలోకి వచ్చినవారని పేర్కొన్నారు. అంటే- ఇది వారికి మొదటి ఉద్యోగమని తెలిపారు. దేశంలో 2014 తర్వాత అంకుర సంస్థల సంఖ్య 100కన్నా తక్కువ స్థాయి నుంచి నేడు లక్షకుపైగా చేరడం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. “ప్రపంచంలో భారత్ నేడు రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా ఉంది. అలాగే 2014తో పోలిస్తే రక్షణ ఎగుమతులు 23 రెట్లు పెరిగాయి. ముద్రా యోజన యువతను ఉద్యోగార్థుల స్థాయి నుంచి ఉద్యోగ సృష్టికర్తలుగా మారుస్తోంది” అన్నారు. ఈ పథకం కింద 8 కోట్ల మంది తొలిసారి పారిశ్రామికవేత్తలుగా మారారని, గడచిన 9 ఏళ్లలో 5 లక్షల సార్వత్రిక సేవా కేంద్రాలు ప్రారంభించామని ఆయన వెల్లడించారు.
దేశంలో ఇలాంటి సానుకూల పరిణామాలన్నటికీ కారణం- రాజకీయ సుస్థిరత, విధాన స్పష్టత, ప్రజాస్వామ్య విలువలేనని ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. గడచిన 9 సంవత్సరాల్లో అవినీతి నిరోధానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేసిందని పేర్కొంటూ- దళారీ వ్యవస్థ నిర్మూలన, వ్యవస్థల్లో స్వాహాకు అడ్డుకట్ట తదితరాల కోసం సాంకేతికాధారిత వ్యవస్థల వినియోగాన్ని ఆయన ఉదాహరించారు. “నేడు నిజాయితీపరులకు గౌరవం దక్కుతుండగా.. నీతి తప్పినవారికి శిక్ష పడుతోంది” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. అలాగే “దేశ ప్రగతి నిరంతర పయనానికి నీతిమంతమైన.. నిష్పాక్షిక.. నిలకడైన పరిపాలన తప్పనిసరి” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
భారత యువతరం దృఢ సంకల్పం పూనితే 2047 నాటికి వికసిత భారతం.. స్వయం సమృద్ధ భారతంగా మారడంలో మన దేశాన్ని ఆపగల శక్తి ఏదీ ప్రపంచంలో లేదని ప్రధాని నొక్కిచెప్పారు. భారత్‌తోపాటు దేశ యువతరం సామర్థ్యాన్ని గుర్తించిన యావత్ ప్రపంచం నేడు మన దేశంవైపు ఆశాభావంతో చూస్తోందని ఉద్ఘాటించారు. ప్రపంచం పురోగమించాలంటే భారత్, దాని యువతరం పురోగతి చాలా కీలకమని ఆయన అన్నారు. యువతరం స్ఫూర్తితోనే దేశం తరఫున ప్రధానమంత్రి ప్రపంచానికి పలు హామీలు ఇవ్వగలుగుతున్నారని చెప్పారు. ప్రపంచ వేదికలపై భారత దృక్కోణాన్ని ఆవిష్కరించడంలో తనకు ఉత్తేజమిచ్చేది దేశ యువతేనని తెలిపారు. “నా బలమంతా భారత యువతరంలోనే ఉంది” అని ప్రధానమంత్రి సహర్షంగా ప్రకటించారు. యువతకు అద్భుత భవిష్యత్తు కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తానని ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
పరిశుభ్ర భారతం (స్వచ్ఛ భారత్) కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో యువత కృషి తనను ముగ్ధుణ్ని చేసిందని ప్రధాని కొనియాడారు. ఈ నేపథ్యంలో వారికి కొన్ని విజ్ఞప్తులు చేశారు. ఈ మేరకు మహాత్మా గాంధీ జయంతికి ఒక రోజు ముందు… అంటే- 2023 అక్టోబర్ 1న పరిశుభ్రతపై దేశవ్యాప్తంగా నిర్వహించే విస్తృత కార్యక్రమంలో పాల్గొనాలని తొలి విజ్ఞప్తి చేశారు. అలాగే రెండో అభ్యర్థనగా- డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా వారం వ్యవధిలో కనీసం ఏడుగురు వ్యక్తులకు ‘యూపీఐ’ వాడకం నేర్పించాలని కోరారు. ఇక మూడో కోరికగా- ‘స్థానికత కోసం స్వగళం’ నినాదం కింద పండుగలకు బహూకరణ కోసం కానుకల కొనుగోలులో ‘భారత్‌లో తయారీ’ వస్తువులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. 4 అంతేకాకుండా భారతీయ మూలాలుగల స్వదేశీ వస్తు వినియోగానికి ప్రాముఖ్యం ఉండాలని కోరారు. ఈ మేరకు నిత్యావసరాల జాబితా రూపొందించి, వాటిలో ఎన్ని విదేశీ తయారీ వస్తువులున్నాయో పరిశీలించాలని సూచించారు. మనకు తెలియకుండానే అనేక విదేశీ వస్తుజాలం మన జీవితాల్లో చొరబడిందని, దేశాన్ని రక్షించాలంటే వాటిని వదిలించుకోవడం అత్యంత అవశ్యమని నొక్కిచెప్పారు.
దేశంలోని కళాశాలలు, విశ్వవిద్యాలయ ప్రాంగణాలు, ‘స్థానికత కోసం స్వగళం’ నినాదానికి కీలక కేంద్రాలు కాగలవని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఖాదీని తమ ప్రాంగణాల్లో అత్యాధునిక వస్త్రధోరణికి సంకేతంగా మార్చాలని విద్యార్థులను కోరారు. ఖాదీ ఫ్యాషన్ ప్రదర్శనలు నిర్వహించాలని, కళాశాలల సాంస్కృతికోత్సవాల్లో విశ్వకర్మల కృషిని ప్రోత్సహించాలని సూచించారు. తన ఈ మూడు విజ్ఞప్తులూ నేటి యువతతోపాటు భవిష్యత్తరాలకు మేలు చేయగలవని పేర్కొంటూ, భారత మండపం నుంచి వెళ్లేటపుడు యువత ఇదే దృఢ సంకల్పంతో బయటకు అడుగుపెడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
స్వాతంత్య్ర యోధుల తరహాలో దేశం కోసం ప్రాణాలిచ్చే పరిస్థితి మనకు లేకపోయినా, దేశం కోసం జీవించే బాధ్యత మనపై ఉందని ప్రధాని అన్నారు. శతాబ్దం కిందట దశాబ్దాల పాటు యువత స్వాతంత్య్ర సాధన మహత్తర లక్ష్యంతో పోరాడారని గుర్తుచేశారు. వారి త్యాగనిరతి అసమాన శక్తిగా దేశమంతటా వ్యాపించి వలస శక్తులనుంచి దేశాన్ని విముక్తం చేసిందని వివరించారు. ఈ నేపథ్యంలో “మిత్రులారా! మీకిదే ఆహ్వానం.. రండి.. నాతో నడవండి.. మనకు పాతికేళ్ల వ్యవధి ఉంది; శతాబ్దం కిందట స్వరాజ్యం కోసం మన యోధులు ఉద్యమించారు.. మనమిప్పుడు సౌభాగ్యం కోసం ఉద్యమిద్దాం” అని పిలుపునిచ్చారు. అలాగే “స్వయం సమృద్ధ భారతం దేశ సౌభాగ్యానికి కొత్త బాటలు వేస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని కొత్త శిఖరాలకు చేరుస్తుంది” అని ఆయన ఉద్బోధించారు. భారతదేశాన్ని ప్రపంచంలోని తొలి మూడు ఆర్థిక వ్యవస్థల జాబితాలో చేరుస్తామన్న తన వాగ్దానాన్ని పునరుద్ఘాటించారు, “ఈ దిశగా భరతమాతకు, 140 కోట్ల మంది భారతీయులకు మీ మద్దతును, సహకారాన్ని నేను కోరుతున్నాను” అంటూ ప్రధాని తన ప్రసంగం ముగించారు. ప్రధానమంత్రితోపాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం
జి-20 ప్రజా భాగస్వామ్య ఉద్యమంలో దేశంలోని వివిధ పాఠశాలలు, ఉన్నత విద్యా- నైపుణ్యాభివృద్ధి సంస్థల నుంచి రికార్డు స్థాయిలో 5 కోట్ల మందికిపైగా యువత పాలు పంచుకున్నారు. ఈ మేరకు యువతరంలో భారత జి-20 అధ్యక్షతపై అవగాహన పెంపు, సంబంధిత కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం లక్ష్యంగా విశ్వవిద్యాలయ అనుసంధానం కార్యక్రమం చేపట్టబడింది. ఇందులో దేశవ్యాప్తంగాగల విశ్వవిద్యాలయాల నుంచి లక్ష మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. భారత 75 ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాల నేపథ్యంలో 75 విశ్వవిద్యాలయాలకు ఈ ప్రణాళిక తొలుత పరిమితం చేయబడింది. అయితే, ఇది చివరకు 101 విశ్వవిద్యాలయాలకు విస్తరించడం విశేషం.
జి-20 విశ్వవిద్యాలయ అనుసంధానం కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించగా ఉన్నత విద్యా సంస్థల నుంచి విస్తృత భాగస్వామ్యం నమోదైంది. తొలుత విశ్వవిద్యాలయాల స్థాయిలో ఇది ప్రారంభం కాగా, అనతి కాలంలోనే కళాశాలలు-పాఠశాలల స్థాయికి విస్తరించి మరింత ఎక్కువ మందికి చేరువైంది. చివరగా ఇవాళ నిర్వహించిన జి-20 విశ్వవిద్యాలయ అనుసంధానం ముగింపు కార్యక్రమంలో దాదాపు 3,000 మంది విద్యార్థులు, అధ్యాపకులు, ఆయా విశ్వవిద్యాలయాల ఉప-కులపతులు హాజరయ్యారు. అలాగే కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారం ద్వారా దేశం నలుమూలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
*****
India is witnessing positive transformations powered by Yuva Shakti. Delighted to join energetic youth during the G20 University Connect Finale. https://t.co/BGgttzmvws
— Narendra Modi (@narendramodi) September 26, 2023
Our Yuva Shakti has made India a happening place. pic.twitter.com/5sMko3aPgt
— PMO India (@PMOIndia) September 26, 2023
G20 में कुछ फैसले ऐसे हुए हैं, जो 21वीं सदी की पूरी Direction ही Change करने की क्षमता रखते हैं। pic.twitter.com/WqNqm75kU7
— PMO India (@PMOIndia) September 26, 2023
पिछले 30 दिनों में SC-ST-OBC के लिए, गरीबों और मिडिल क्लास के लिए, उनको Empower करने के लिए भी कई कदम उठाए गए हैं: PM @narendramodi pic.twitter.com/FtpqJHm0FQ
— PMO India (@PMOIndia) September 26, 2023
Youth progress only where there is optimism, opportunities and openness.
— PMO India (@PMOIndia) September 26, 2023
My message to the youth is - 'Think Big': PM @narendramodi pic.twitter.com/TQKceNYYCx
G20 Summit could have been limited to only a diplomatic and Delhi-centric programme.
— PMO India (@PMOIndia) September 26, 2023
But India made it a people-driven national movement. pic.twitter.com/feqx3jF6pi
आज भारत पर दुनिया का भरोसा बुलंद है। pic.twitter.com/0QPXqGY2IV
— PMO India (@PMOIndia) September 26, 2023
दुनिया की प्रगति के लिए भारत की प्रगति, और भारत के युवाओं की प्रगति आवश्यक है। pic.twitter.com/ucKM2Un5E4
— PMO India (@PMOIndia) September 26, 2023
आज हमारे युवाओं की वजह से पूरा भारत एक ‘Happening Place’ बन गया है। पिछले 30 दिनों में इसके कई उदाहरण हमें देखने को मिले हैं… pic.twitter.com/2Y6iWUAjMS
— Narendra Modi (@narendramodi) September 26, 2023
युवा वहीं आगे बढ़ते हैं, जहां Optimism, Opportunities और Openness होती है। आज के भारत में ये सब कुछ है। pic.twitter.com/WiPM985sbO
— Narendra Modi (@narendramodi) September 26, 2023
भारत के युवा इसलिए मेरी असली ताकत और सामर्थ्य हैं… pic.twitter.com/n03TYikeI8
— Narendra Modi (@narendramodi) September 26, 2023
मुझे विश्वास है कि आप देश के लिए इन तीन संकल्पों को जरूर पूरा करेंगे… pic.twitter.com/nEc4akO7pX
— Narendra Modi (@narendramodi) September 26, 2023