న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జిల్లా న్యాయ వ్యవస్థల సదస్సును ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. 75ఏళ్ల భారత సుప్రీం కోర్ట్ స్మారక స్టాంపు, నాణేన్ని ఈ సందర్భంగా ప్రధాని ఆవిష్కరించారు. భారత సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రెండు రోజుల సదస్సులో భాగంగా జిల్లా న్యాయ వ్యవస్థలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, అందరి కోసం సమీకృత కోర్టు గదులు, న్యాయపరమైన భద్రత అలాగే సంక్షేమం, కేసుల నిర్వహణ, న్యాయపరమైన శిక్షణ వంటి అంశాలను చర్చించ డానికి ఐదు వర్కింగ్ సెషన్స్ నిర్వహిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం రాజస్థాన్ హైకోర్టు ప్లాటినమ్ జూబ్లీ వేడుకలకు హాజరైన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. సుప్రీంకోర్టు 75 ఏళ్ల వేడుకల్లో భాగంగా నేడు నిర్వహిస్తున్న జిల్లా న్యాయవ్యవస్థ జాతీయ సదస్సుకు హాజరవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. భారత సుప్రీం కోర్టు 75 సంవత్సరాల ప్రయాణం కేవలం ఒక సంస్థతో అనుబంధం గలది కాదని, ఇది భారత రాజ్యాంగం, దాని విలువలు అలాగే ప్రజాస్వామ్యపరంగా అభివృద్ధి చెందుతున్న దేశ ప్రయాణం అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ ప్రయాణంలో రాజ్యాంగ నిర్మాతలు అలాగే మొత్తం న్యాయ వ్యవస్థ పోషించిన కీలక పాత్రను ప్రధాన మంత్రి ప్రశంసించారు. ఈ న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసం కలిగి ఉన్న కోట్లాది మంది భారత పౌరుల పాత్రను కూడా ఆయన ప్రస్తావించారు. “భారత ప్రజలు భారత సుప్రీంకోర్టుపై లేదా న్యాయవ్యవస్థపై ఎన్నడూ అవిశ్వాసం చూపలేదు” అని ప్రధాని మోదీ ఉద్వేగంగా చెప్పారు. 75 ఏళ్ల భారత సుప్రీంకోర్టు ప్రయాణం ప్రజాస్వామ్య మాతగా భారతదేశ వైభవాన్ని చాటిచెప్పిందన్నారు. ఇది సత్యమేవ జయతే అన్న సూక్తిని బలపరుస్తుందని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యాయని, అలాగే రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సందర్భం గర్వం, స్ఫూర్తితో నిండినదని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా న్యాయవ్యవస్థలోని సోదరులకు అలాగే భారత పౌరులకు ఆయన అభినందనలు తెలిపారు. జిల్లా న్యాయవ్యవస్థల జాతీయ సదస్సులో పాల్గొన్న వారికి తన శుభాకాంక్షలు తెలియజేశారు.
“న్యాయవ్యవస్థను మన ప్రజాస్వామ్యాన్ని సంరక్షించేదిగా పరిగణించవచ్చు” అని ప్రధాని పేర్కొన్నారు. ఇది చాలా పెద్ద బాధ్యత అని పేర్కొన్న శ్రీ మోదీ, ఈ బాధ్యతలను సమర్ధంగా నిర్వర్తించడంలో సుప్రీంకోర్టు కృషిని ప్రశంసించారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి న్యాయవ్యవస్థ న్యాయ స్ఫూర్తిని పరిరక్షిస్తున్నదని, ఎమర్జెన్సీ వంటి కష్ట సమయంలోనూ రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో న్యాయవ్యవస్థ ముఖ్యమైన పాత్ర పోషించిందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ప్రాథమిక హక్కులపై దాడులకు వ్యతిరేకంగా కూడా సుప్రీంకోర్టు రక్షణ కల్పించిందని, అలాగే జాతీయ భద్రతకు సంబంధించిన ప్రశ్న తలెత్తినప్పుడల్లా న్యాయవ్యవస్థ జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ భారతదేశ ఐక్యతను, సమగ్రతను కాపాడుతోందని కొనియాడారు. ఈ విజయాలన్నిటి కోసం, ఈ చిరస్మరణీయమైన 75ఏళ్ల న్యాయవ్యవస్థలోని విశిష్ట వ్యక్తులందరికీ శ్రీ మోదీ అభినందనలు తెలిపారు.
న్యాయాన్ని సులభతరం చేయడానికి గత 10 సంవత్సరాలలో జరిగిన కృషిని వివరిస్తూ, మిషన్ స్థాయిలో కోర్టుల ఆధునీకరణ పనులను ప్రధాని ప్రస్తావించారు. అలాగే సుప్రీంకోర్టు, న్యాయవ్యవస్థల సహకారాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించారు. జిల్లా న్యాయవ్యవస్థల జాతీయ సదస్సు దీనికి మరో ఉదాహరణగా అభివర్ణించిన మోదీ, సుప్రీం కోర్టు, గుజరాత్ హైకోర్టుల ద్వారా నిర్వహించిన ‘అఖిల భారత జిల్లా న్యాయమూర్తుల సదస్సు’ను గుర్తుచేసుకున్నారు. న్యాయాన్ని సులభతరం చేయడంలో ఇటువంటి కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించిన ప్రధాని, రాబోయే రెండు రోజుల్లో చర్చించాల్సిన అంశాల గురించి పలు సూచనలు చేశారు. పెండింగ్‌లో ఉన్న కేసుల నిర్వహణ, మానవ వనరులు అలాగే న్యాయ సౌభ్రాతృత్వాన్ని మెరుగుపరిచే చర్యల వంటి అంశాలపై చర్చ జరగాలన్నారు. మరో రెండు రోజుల్లో జ్యుడీషియల్ వెల్నెస్పై సెషన్‌ను నిర్వహిస్తుండడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. “సామాజిక శ్రేయస్సు కోసం వ్యక్తిగత శ్రేయస్సు అతి ముఖ్యమైన అవసరం. ఇది మన పని సంస్కృతిలో మనం ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి సహాయపడుతుంది” అన్నారు.
“అభివృద్ధి చెందిన భారతదేశం, సరికొత్త భారతదేశం – నేటి ఆజాదీ కా అమృత్ కాల్ సమయంలో 140 కోట్ల మంది పౌరుల కోరిక అలాగే కల” అని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు. సరికొత్త భారతదేశం అంటే సరికొత్త ఆలోచనలు, దృఢ సంకల్పంతో కూడిన ఆధునిక దేశం అని ఆయన వివరించారు. ఈ దృక్పథానికి న్యాయవ్యవస్థ బలమైన మూలస్తంభమని, ప్రత్యేకించి జిల్లా న్యాయవ్యవస్థ మన భారతీయ న్యాయ వ్యవస్థకు పునాది వంటిదని శ్రీ మోదీ పేర్కొన్నారు. దేశంలోని సామాన్య పౌరుడికి న్యాయం చేసేందుకు జిల్లా న్యాయవ్యవస్థ ప్రధాన కేంద్రం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అందువల్ల, న్యాయానికి ప్రధాన కేంద్రాలైన ఆ న్యాయస్థానాలు పూర్తి సామర్థ్యాలతో ఆధునికమైనవిగా ఉండడం అత్యంత ప్రాధాన్యత గల విషయమని ఆయన చెప్పారు. ఈ జాతీయ సదస్సు, చర్చలు దేశం అంచనాలను నెరవేర్చడంలో సహాయపడగలవని శ్రీ మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
సాధారణ పౌరుల జీవన ప్రమాణం వారి జీవన సౌలభ్యం ద్వారానే నిర్ణయమవుతుందని, ఇది ఏ దేశాభివృద్ధి కోసమైనా అత్యంత ముఖ్యమైన పరామితి అవుతుందని మోదీ తెలిపారు. అయితే జీవన సౌలభ్యం కోసం ప్రజలకు న్యాయం సరళంగా, సులభంగా అందుబాటులో ఉండడం తప్పనిసరన్నారు. జిల్లా కోర్టుల్లో ఆధునిక మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందన్నారు. జిల్లా కోర్టుల్లో దాదాపు 4.5 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్న ప్రధాని, న్యాయం అందించే విషయంలో ఈ జాప్యాన్ని తొలగించడానికి గత దశాబ్ద కాలంగా అనేక స్థాయిలలో కృషి జరిగిందన్నారు. న్యాయవ్యవస్థ మౌలిక సదుపాయాల అభివృద్ధికి దేశం దాదాపు రూ.8,000 కోట్లు ఖర్చు చేసిందని ఆయన తెలిపారు. దీనికోసం గత 25 ఏళ్లలో వెచ్చించిన నిధుల్లో 75 శాతం గత 10 ఏళ్లలోనే ఖర్చుచేశామన్నారు. “ఈ 10 సంవత్సరాల కాలంలో, ఏడువేల ఐదు వందలకు పైగా కోర్టు హాళ్లు అలాగే 11 వేల నివాస భవనాలు జిల్లా న్యాయవ్యవస్థ కోసం సిద్ధం చేసినట్లు” తెలిపారు.
ఇ-కోర్టుల ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావించిన శ్రీ మోదీ, సాంకేతికత వినియోగం న్యాయ ప్రక్రియలను వేగవంతం చేయడమే కాకుండా న్యాయవాదుల నుండి ఫిర్యాదుదారుల వరకు ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించిందని అన్నారు. దేశంలో న్యాయస్థానాలు డిజిటలైజ్ అవుతున్నాయని, ఈ ప్రయత్నాలన్నింటిలో సుప్రీంకోర్టు ఇ-కమిటీ పాత్ర కీలకమైనదని ప్రధాని ప్రశంసించారు.
ఇ-కోర్టుల ప్రాజెక్ట్ మూడో దశ 2023లోనే ఆమోదం పొందిందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను వినియోగిస్తూ ఏకీకృత టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించే దిశగా దేశం ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు. ఇటువంటి సాంకేతిక ప్లాట్‌ఫామ్స్ పెండింగ్‌లో ఉన్న కేసులను విశ్లేషించడానికి అలాగే భవిష్యత్ కేసులను అంచనా వేయడానికి సహాయపడతాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. పోలీస్, ఫోరెన్సిక్స్, జైలు అలాగే కోర్టుల వంటి వివిధ విభాగాల పనిని సాంకేతికత ద్వారా ఏకీకృతం చేసి వేగంగా పని పూర్తిచేయవచ్చన్నారు.
దేశ పరివర్తన ప్రయాణంలో మౌలిక సదుపాయాలు, సాంకేతిక పురోగతితో పాటు విధానాలు, చట్టాల కీలక పాత్రను ప్రధాని మోదీ వివరించారు. అందువల్ల, స్వాతంత్ర్యం వచ్చిన 70 సంవత్సరాలలో దేశంలో మొదటిసారిగా న్యాయవ్యవస్థలో ఇంత పెద్ద, ముఖ్యమైన మార్పులు జరిగాయని శ్రీ మోదీ అన్నారు. భారతీయ న్యాయ సంహిత రూపంలో నూతన భారత న్యాయ వ్యవస్థను ప్రస్తావిస్తూ, ఈ చట్టాలకు స్ఫూర్తి ‘సిటిజన్ ఫస్ట్, డిగ్నిటీ ఫస్ట్, జస్టిస్ ఫస్ట్’ నినాదమేనని ప్రధాన మంత్రి తెలిపారు. దేశంలోని నేర చట్టాలు పాలకులు, బానిసలనే వలసవాద విధానం నుండి విముక్తి పొందాయని ఆయన పేర్కొన్నారు. రాజద్రోహం వంటి వలసరాజ్యాల నాటి చట్టాన్ని రద్దు చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. పౌరులను శిక్షించడం కాదు, వారిని రక్షించడం కోసమే న్యాయ వ్యవస్థ ఉండాలనే న్యాయ సంహిత ఉద్దేశాన్ని ప్రస్తావిస్తూ, మహిళలు, పిల్లలపై నేరాలకు కఠినమైన చట్టాలను అమలు చేయడం అలాగే మొదటిసారిగా చేసిన చిన్న నేరాలకు శిక్షగా సమాజ సేవ నిబంధనలను అమలుచేయాలని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. శ్రీ మోదీ భారతీయ సాక్ష్య అధినీయం గురించి కూడా మాట్లాడారు అలాగే కొత్త చట్టాల ప్రకారం ఎలక్ట్రానిక్, డిజిటల్ రికార్డులు సాక్ష్యంగాగుర్తిస్తున్నట్లు చెప్పారు. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత గురించి కూడా ఆయన ప్రస్తావించారు అలాగే న్యాయవ్యవస్థపై పెండింగ్‌లో ఉన్న కేసుల భారాన్ని తగ్గించడానికి ఎలక్ట్రానిక్ మోడ్‌లో సమన్లు పంపే వ్యవస్థ అమలులో ఉందన్నారు. న్యాయమూర్తులు, న్యాయవాద సహచరులు కూడా ఈ ప్రచారంలో భాగం కావాలని ఆయన పిలుపునిచ్చారు. “ఈ కొత్త వ్యవస్థ గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో మన న్యాయవాదులు, బార్ అసోసియేషన్ల పాత్ర ముఖ్యమైనది” అన్నారు.
మహిళలపై అఘాయిత్యాలు అలాగే పిల్లల భద్రత నేడు సమాజంలో తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయని మోదీ అన్నారు. దేశంలో మహిళలకు భద్రత కల్పించేందుకు ఇప్పటికే చాలా కఠిన చట్టాలున్నాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం 2019లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసిందన్నారు. ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానాల ఆధ్వర్యంలో ముఖ్య సాక్షుల రక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటిలో జిల్లా న్యాయమూర్తి, జిల్లా మెజిస్ట్రేట్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు భాగంగా ఉంటారన్నారు. ఈ జిల్లా పర్యవేక్షక బృందాలు సాక్షుల రక్షణ విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు మోదీ వివరించారు. క్రిమినల్ న్యాయ వ్యవస్థలోని వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని సాధించడంలో ఈ కమిటీ పాత్ర ముఖ్యమైనదని అన్నారు. ఈ కమిటీలను మరింత క్రియాశీలంగా మార్చాల్సిన అవసరం ఉందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. చెప్పారు. మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల్లో ఎంత త్వరగా నిర్ణయాలు తీసుకుంటే, మిగతా జనాభా భద్రతకు అంత భరోసా ఉంటుందని ఆయన అన్నారు.
తన ప్రసంగాన్ని ముగిస్తూ, ఈ చర్చలు దేశానికి విలువైన పరిష్కారాలను అందజేస్తాయని అలాగే ‘అందరికీ న్యాయం’ అనే మార్గాన్ని మరింత బలోపేతం చేస్తాయని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి వై చంద్రచూడ్, సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బి ఆర్ గవాయ్, కేంద్ర చట్టం, న్యాయశాఖ సహాయమంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ అర్జున్ రామ్ మేఘవాల్, భారత అటార్నీ జనరల్, శ్రీ ఆర్ వెంకటరమణి, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కపిల్ సిబాల్ అలాగే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీ మనన్ కుమార్ మిశ్రా తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
****
Addressing the National Conference of District Judiciary.https://t.co/QRCLSh1mDS
— Narendra Modi (@narendramodi) August 31, 2024
सुप्रीम कोर्ट के 75 वर्ष...
— PMO India (@PMOIndia) August 31, 2024
ये यात्रा है- भारत के संविधान और संवैधानिक मूल्यों की!
ये यात्रा है- एक लोकतन्त्र के रूप में भारत के और परिपक्व होने की! pic.twitter.com/Y97Jr5BBFr
सुप्रीम कोर्ट के ये 75 वर्ष, मदर ऑफ डेमोक्रेसी के रूप में भारत के गौरव को और बढ़ाते हैं। pic.twitter.com/5qbDMgp0HC
— PMO India (@PMOIndia) August 31, 2024
आज़ादी के अमृतकाल में 140 करोड़ देशवासियों का एक ही सपना है- विकसित भारत, नया भारत! pic.twitter.com/00ZF1a3WYQ
— PMO India (@PMOIndia) August 31, 2024
भारतीय न्याय संहिता के रूप में हमें नया भारतीय न्याय विधान मिला है।
— PMO India (@PMOIndia) August 31, 2024
इन क़ानूनों की भावना है- ‘Citizen First, Dignity First and Justice First’. pic.twitter.com/Qknl7O0o4y
सुप्रीम कोर्ट की 75 वर्ष की यात्रा देश के संविधान के साथ ही एक लोकतंत्र के रूप में भारत के और परिपक्व होने की भी अद्भुत यात्रा है। pic.twitter.com/zgs8aIPbjv
— Narendra Modi (@narendramodi) August 31, 2024
District Judiciary भारतीय न्यायिक व्यवस्था का आधार है, जिसे हर तरह से सक्षम और आधुनिक बनाना हमारी प्राथमिकता है। pic.twitter.com/kBFQVpRolL
— Narendra Modi (@narendramodi) August 31, 2024
टेक्नोलॉजी के Innovation से केवल न्यायिक प्रक्रिया में ही तेजी नहीं आई, बल्कि इससे वकीलों से लेकर फरियादी तक, हर किसी को बहुत फायदा मिल रहा है। pic.twitter.com/WCVTkmUcHO
— Narendra Modi (@narendramodi) August 31, 2024
भारतीय न्याय संहिता की भावना है- Citizen First, Dignity First और Justice First. pic.twitter.com/6jpv9JFMNq
— Narendra Modi (@narendramodi) August 31, 2024
महिलाओं पर अत्याचार से जुड़े मामलों में जितनी तेजी से फैसले आएंगे, आधी आबादी के मन में सुरक्षा का भरोसा उतना ही अधिक बढ़ेगा। pic.twitter.com/OYMUZ0wpkQ
— Narendra Modi (@narendramodi) August 31, 2024