Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జార్ఖండ్ ముఖ్యమంత్రి తో కూడిన ఉన్నత స్థాయి సమావేశంలో కరవు, నీటి ఎద్దడి పరిస్థితి ని సమీక్షించిన ప్రధానమంత్రి

జార్ఖండ్ ముఖ్యమంత్రి తో కూడిన ఉన్నత స్థాయి సమావేశంలో కరవు, నీటి ఎద్దడి పరిస్థితి ని సమీక్షించిన ప్రధానమంత్రి


జార్ఖండ్ లోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న కరవు, నీటి ఎద్దడి పరిస్థితి పై ఏర్పాటైన ఒక ఉన్నతస్థాయి సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అధ్యక్షత వహించారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ రఘువర్ సింగ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. భారత ప్రభుత్వానికీ, జార్ఖండ్ ప్రభుత్వానికీ చెందిన సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు.

రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF) లో కేంద్ర ప్రభుత్వ వాటా క్రింద 2015-16 ఆర్ధిక సంవత్సరానికి 273 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. వీటికి అదనంగా 2016-17 సంవత్సరానికి SDRF మొదటి వాయిదా కింద 143 కోట్ల 25 లక్షల రూపాయలు విడుదలయ్యాయి.

రాష్ట్ర ప్రభుత్వం SDRF కింద DBT ద్వారా 376 కోట్ల రూపాయలను 12 లక్షల మంది రైతులకు పంపిణీ చేసింది.

జార్ఖండ్ రాష్ట్రం ప్రస్తుతం 19 శాతంగా ఉన్న సాగు భూమిని వచ్చే రెండేళ్లలో 40 శాతానికి పెంచాలని యోచిస్తోంది. రాష్ట్ర ప్రణాళికలో భాగంగా లక్ష వ్యవసాయ కుంటలను నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. అలాగే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం (MNREGA) కింద మరో 5 లక్షల వ్యవసాయ కుంటలను నిర్మిస్తారు. జలవనరుల్లో చేపల పెంపకాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

జల సంరక్షణ, వర్షపు నీటి పరిరక్షణ కోసం ఒక సమగ్రమైన పద్ధతిలో ప్రజా ఉద్యమం చేపట్టవలసిన అవసరం ఉందని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. NCC, NSS, NYKS, స్కౌట్స్ & గైడ్స్ వంటి యువజన సంస్థలు ముందుకు వచ్చి నీటి నిల్వ కోసం నిర్మాణాల ఏర్పాటులో పాలుపంచుకోవాలని కోరారు.

రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కోసం టెండర్లు ఖరారు చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు ప్రగతిని పర్యవేక్షించవలసిన ఆవశ్యకత గురించి ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.

భూమి ఆరోగ్య కార్డుల కోసం ఒక భారీ ఉద్యమాన్ని ప్రారంభించాలని కూడా ప్రధానమంత్రి పిలుపు నిచ్చారు. భూమి ఆరోగ్య కార్డుల కార్యక్రమం విజయవంతం కావడానికి ” సమీకరణ, కదలిక, యంత్రాంగం ” అవసరమని చెప్పారు. భూసార పరీక్ష ను ఒక నైపుణ్యంతో కూడిన ప్రక్రియగా అభివృద్ది చేయాలని ఆయన చెప్పారు. ఇందుకు అవసరమైన ప్రయోగశాలలు నెలకొల్పుకునేందుకు ముద్రా బ్యాంకు ద్వారా ఋణాలు అందజేయవచ్చునని చెప్పారు.

సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించే విషయాన్ని ప్రధానమంత్రి ఉద్ఘాటిస్తూ – జియో ట్యాగింగు ద్వారానూ, చేతితో ఉపయోగించే పరికరాల సహాయంతో ఫోటోలను అప్ లోడ్ చేయడం ద్వారానూ – MNREGA ద్వారా నిర్మించిన ఆస్తుల వివరాలను నమోదుచేయాలని సూచించారు. జల వనరులన్నింటినీ ఒక విశిష్టమైన సంఖ్య ద్వారా గుర్తించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలనే తీర్మానంతో ఈ సమావేశం ముగిసింది.