Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతీయ రోజ్ గార్ మేళానుద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

జాతీయ రోజ్ గార్ మేళానుద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతీయ రోజ్ గార్ మేళాను ఉద్దేశించి ప్రసంగించారు. వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా ఎంపికైన వారికి 70,000 కి పైగా నియామక పత్రాలను (అపాయింట్మెంట్ లెటర్స్)  ను పంపిణీ చేశారు.

రెవెన్యూ, ఫైనాన్షియల్ సర్వీసెస్, తపాలా శాఖ, పాఠశాల విద్య, ఉన్నత విద్య, రక్షణ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జలవనరులు, పర్సనల్ అండ్ ట్రైనింగ్, హోం మంత్రిత్వ శాఖ సహా వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో వివిధ ఉద్యోగాలకు దేశమంతటి నుంచి వీరు ఎంపికయ్యారు.

ప్రధాని ప్రసంగం సందర్భంగా దేశవ్యాప్తంగా 44 ప్రాంతాలు మేళాతో అనుసంధానమయ్యాయి.

ప్రధాన మంత్రి  మేళానుద్దేశించి ప్రసంగిస్తూ, కొత్తగా ఉద్యోగాలలో చేరబోతున్న యువతకు మాత్రమే నేడు చిరస్మరణీయ రోజు కాదని, 1947లో తొలిసారిగా ప్రస్తుత రూపం లో తిరంగా ను రాజ్యాంగ సభ ఆమోదించిన రోజు కావడంతో ఇది దేశానికి కూడా చారిత్రాత్మకమైన రోజు అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ ముఖ్యమైన రోజున కొత్తగా నియమితులైన వారికి ప్రభుత్వ సర్వీసులకు అపాయింట్ మెంట్ లెటర్ అందుకోవడం ఎంతో స్ఫూర్తిదాయకమని, వారంతా దేశం పేరును ముందుకు తీసుకెళ్లాలని ప్రధానమంత్రి పిలుపు ఇచ్చారు. భారతదేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న సమయంలో వికసిత భారత్ లక్ష్యానికి దోహదపడే అవకాశం కొత్తగా నియమితులైన వారికి వారి శ్రమ, అంకితభావం ఫలితంగానే లభించిందని ఆయన  చెప్పారు.

ఈ సందర్భంగా రిక్రూట్ అయిన వారికి, చేసుకున్న వారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రధాన మంత్రి అభినందనలు తెలిపారు.

ఆజాదీ కా అమృత్ కాల్ లో భారతదేశాన్ని ‘ వికసిత్ భారత్’గా మార్చాలని ప్రతి పౌరుడు సంకల్పం తీసుకున్నారని ప్రధాని అన్నారు. రాబోయే 25 సంవత్సరాలు కొత్త ఉద్యోగులకు, దేశానికి చాలా కీలకమని ఆయన నొక్కిచెప్పారు, ఎందుకంటే ఇటీవలి సంవత్సరాలలో ప్రపంచ దేశాలకు  భారతదేశం పట్ల పెరిగిన విశ్వాసం, ప్రాముఖ్యత,  ఆకర్షణను సద్వినియోగం చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

ప్రపంచంలో 10వ స్థానం నుంచి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు. చాలా మంది ఆర్థిక నిపుణులు చెబుతున్నట్లుగా భారత్ ప్రపంచంలోని టాప్ త్రీ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారబోతోందని ఆయన పునరుద్ఘాటించారు. ప్రపంచంలో టాప్ త్రీ ఆర్థిక వ్యవస్థ గా ఎదగడం భారత్ కు ఒక గొప్ప విజయం అవుతుందని ప్రధాన మంత్రి అన్నారు. ఇది అన్ని రంగాల్లోనూ ఉపాధి అవకాశాలను పెంచుతుందని, సామాన్య ప్రజల ఆదాయాన్ని కూడా పెంచుతుందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. అమృత్ కాల్ లో దేశానికి సేవ చేసే సువర్ణావకాశం కొత్త అధికారులకు లభించిందని, ప్రభుత్వం రిక్రూట్ చేసుకోవడానికి ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. దేశ ప్రజలకు సేవ చేయడం, వారి సమస్యలను పరిష్కరించి జీవన సౌలభ్యాన్ని పెంపొందించడం, వికసిత భారత్ లక్ష్యాలకు అనుగుణంగా తమను తాము అనుసంధానం చేసుకోవడం వారి ప్రాధాన్యాంశాలుగా ఉండాలని ఆయన సూచించారు. “మీ నుండి ఒక చిన్న ప్రయత్నం మరొకరి జీవితంలో ఒక పెద్ద మార్పును సృష్టించగలదు”, అని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు, ఎందుకంటే ప్రజలు దేవుని రూపమని, వారికి సేవ చేయడం దేవుని సేవతో సమానమని అన్నారు. నూతన ఉద్యోగులు ఇతరులకు సేవ చేయాలనే నమ్మకంతో పనిచేయాలని, తద్వారా గొప్ప సంతృప్తిని పొందాలని ఆయన ఉద్ఘాటించారు.

నేటి కార్యక్రమంలో నియామక పత్రాలు అందుకున్నవారిలో ఎక్కువ మంది ఉన్న బ్యాంకింగ్ రంగం గురించి ప్రస్తావిస్తూ, ఆర్థిక వ్యవస్థ విస్తరణలో బ్యాంకింగ్ రంగం పాత్రను ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. “నేడు, బ్యాంకింగ్ రంగం బలంగా ఉన్నట్టు bపరిగణించబడుతున్న దేశాలలో భారతదేశం ఒకటి” అని శ్రీ మోదీ గత తొమ్మిదేళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో రాజకీయ స్వార్థం ఈ రంగంపై చూపిన దుష్ప్రభావాన్ని వివరించారు. గతంలో శక్తివంతుల ఫోన్ కాల్స్ ద్వారా రుణాలు మంజూరు చేసిన ‘ఫోన్ బ్యాంకింగ్’ను ఆయన ప్రస్తావించారు. ఈ రుణాలు తిరిగి చెల్లించ బడలేదని తెలిపారు.  ఈ కుంభకోణాలు దేశంలోని బ్యాంకింగ్ రంగం వెన్నుముకను విరిచాయని ఆయన అన్నారు. 2014 తర్వాత పరిస్థితిని చక్కదిద్దేందుకు తీసుకున్న చర్యలను వివరించారు.

ప్రభుత్వ బ్యాంకుల నిర్వహణను బలోపేతం చేయడం, ప్రొఫెషనలిజానికి ప్రాధాన్యం ఇవ్వడం, చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకులుగా విలీనం చేయడం వంటి అంశాలను ప్రస్తావించారు. ఐదు లక్షల వరకు డిపాజిట్లకు ఇన్సూరెన్స్ చేయడం ద్వారా 99 శాతానికి పైగా డిపాజిట్లు సురక్షితంగా మారాయని, ఇది బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించిందని శ్రీ మోదీ అన్నారు.

దివాలా కోడ్ వంటి చర్యల ద్వారా బ్యాంకులను నష్టాల నుంచి కాపాడినట్టు చెప్పారు. అంతేకాకుండా, ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టిన వారి ఆస్తులను జప్తు చేయడం ద్వారా వారిపై పట్టు

బిగించినట్టు పేర్కొన్నారు. గతం లో నష్టాలకు, ఎన్ పి ఎ లకు పేరొందిన బ్యాంకులు ఇప్పుడు తమ రికార్డు లాభాల పై చర్చించుకుంటున్నాయని తెలిపారు.

బ్యాంకింగ్ రంగంలోని ఉద్యోగుల కృషి గర్వకారణమని ప్రధాని అన్నారు. బ్యాంకింగ్ రంగంలో పని చేస్తున్నవారు తనను, తన దార్శనికతను ఎన్నడూ నిరాశపరచలేదని అన్నారు. 50 కోట్ల జన్ ధన్ ఖాతాలను తెరవడం ద్వారా జన్ ధన్ ఖాతా పథకాన్ని విజయవంతం చేయడంలో బ్యాంకింగ్ రంగం చేస్తున్న కృషిని ప్రధాన మంత్రి ప్రశంసించారు. మహమ్మారి సమయంలో కోట్లాది మంది మహిళల ఖాతాల్లోకి డబ్బు బదిలీ చేయడంలో ఇది చాలా సహాయ పడిందని అన్నారు.

ఎమ్ ఎస్ ఎమ్ ఇ రంగం అభ్యున్నతికి చేస్తున్న ప్రయత్నాల గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఔత్సాహిక

యువత కు పూచీకత్తు లేని రుణాలను అందించిన ముద్ర యోజన గురించి ప్రముఖంగా  ప్రస్తావించారు. ఈ పథకాన్ని విజయవంతం చేసిన బ్యాంకింగ్ రంగాన్ని ఆయన అభినందించారు. అదేవిధంగా ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణ మొత్తాన్ని రెట్టింపు చేసిన సందర్భం లోనూ, చిన్న పరిశ్రమలకు రక్షణ కల్పిస్తూ 1.5 కోట్ల ఉద్యోగాలను కాపాడేందుకు ఎంఎస్ఎంఇ రంగానికి రుణాలు అందించిన సందర్భం లోనూ బ్యాంకింగ్ రంగం ఎంతో సహకారం అందించిందని ఆయన అన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని విజయవంతం చేసినందుకు కూడా  బ్యాంకు ఉద్యోగులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. స్వనిధి పథకం కింద 50 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు సహాయం చేశారు. “బ్యాంకింగ్ ను పేదల సాధికారత సాధనంగా మార్చడానికి మీరు  ‘నియామక పత్రం’ తో పాటు సంకల్ప్ పత్ర (రిజల్యూషన్ లెటర్) కూడా ‘తీసుకుంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను” అని ప్రధానమంత్రి అన్నారు.

గడచిన ఐదేళ్లలో 13 కోట్ల మంది భారతీయులను దారిద్య్ర రేఖకు

ఎగువకు తీసుకువచ్చినట్లు ఇటీవలి నీతి అయోగ్ నివేదిక గుర్తించిందని ప్రధాని చెప్పారు.  ఇందులో ప్రభుత్వోద్యోగుల కృషిని గుర్తించి పక్కా ఇళ్లు, మరుగుదొడ్లు, విద్యుత్ కనెక్షన్ల పథకాలను ప్రస్తావించారు. “ఈ పథకాలు పేదలకు చేరడంతో వారిలో మనోధైర్యం కూడా పెరిగింది. భారతదేశం నుండి పేదరికాన్ని నిర్మూలించడానికి మనమందరం కలిసి ప్రయత్నాలను పెంచితే, భారతదేశం నుండి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించవచ్చనే వాస్తవానికి ఈ విజయం చిహ్నం. ఖచ్చితంగా, దేశంలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఇందులో పెద్ద పాత్ర ఉంది” అని ప్రధాన మంత్రి తన పేర్కొన్నారు.

దేశంలో పేదరికం తగ్గుముఖం పట్టిన మరో కోణాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఇది కొత్త  మధ్యతరగతి విస్తరణ, ఇది కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తోంది. పెరుగుతున్న డిమాండ్, కొత్త మధ్యతరగతి ఆకాంక్షలు తయారీ రంగాన్ని నడిపిస్తున్నాయి. భారత కర్మాగారాలు, పరిశ్రమల్లో ఉత్పత్తిని పెంచడం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందేది దేశ యువతేనని ఆయన పేర్కొన్నారు. మొబైల్ ఫోన్ ఎగుమతులు, 2023 మొదటి ఆరు నెలల్లో విక్రయించిన కార్ల సంఖ్య, ఎలక్ట్రిక్ వాహనాల రికార్డు అమ్మకాలు ఇలా భారతదేశం ప్రతిరోజూ కొత్త రికార్డులను సృష్టిస్తోందని ఆయన పేర్కొన్నారు.

ఇలాంటి కార్యకలాపాలన్నీ దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచుతున్నాయని అన్నారు.

“యావత్ ప్రపంచం భారతదేశ ప్రతిభపై ఒక కన్నేసి ఉంచుతోంది” అని ప్రధాన మంత్రి అన్నారు, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో అధిక సగటు వయస్సు కారణంగా శ్రామిక జనాభా క్షీణిస్తున్న సమస్యను ఆయన ప్రస్తావించారు. అందువల్ల ఇది భారతదేశ యువత కష్టపడి తమ నైపుణ్యాలను, సామర్థ్యాలను పెంపొందించుకోవాల్సిన సమయమని ప్రధాన మంత్రి అన్నారు. భారత దేశంలో ఐటీ నిపుణులు  , డాక్టర్లు, నర్సులకు ఉన్న గొప్ప డిమాండ్ ను ప్రధానమంత్రి

ప్రస్తావిస్తూ, భారత టాలెంట్ కు ఉన్న గౌరవం ప్రతి దేశంలోనూ, ప్రతి రంగంలోనూ నిరంతరం పెరుగుతోందని అన్నారు. గత తొమ్మిదేళ్లలో ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించిందని, పీఎం కౌశల్ వికాస్ యోజన కింద 1.5 కోట్ల మంది యువతకు శిక్షణ ఇచ్చామని ప్రధాని వివరించారు. 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా యువతను అంతర్జాతీయ అవకాశాలకు సిద్ధం చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా కొత్త మెడికల్ కాలేజీలు, ఐటీఐలు, ఐఐటీలు, టెక్నికల్

ఇన్ స్టిట్యూట్ ల నిర్మాణం గురించి ప్రస్తావిస్తూ, 2014 వరకు మన దేశంలో కేవలం 380 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని, గత తొమ్మిదేళ్లలో ఈ సంఖ్య 700కు పైగా పెరిగిందని తెలిపారు. నర్సింగ్ కాలేజీల సంఖ్య గణనీయంగా పెరిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. “ప్రపంచ డిమాండ్ ను తీర్చే నైపుణ్యాలు భారతదేశ యువతకు లక్షలాది కొత్త అవకాశాలను సృష్టించబోతున్నాయి” అని శ్రీ మోదీ అన్నారు.

ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగిస్తూ,  ఉద్యోగాలకు నియమితులైన వారందరూ చాలా సానుకూల వాతావరణంలో ప్రభుత్వ సర్వీసులో చేరుతున్నారని, ఈ సానుకూల ఆలోచనను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇప్పుడు వారి భుజస్కంధాలపై ఉందని అన్నారు. అభ్యసన, స్వీయ అభివృద్ధి ప్రక్రియను కొనసాగించాలని, ప్రభుత్వం రూపొందించిన ఆన్ లైన్ లెర్నింగ్ ప్లాట్ ఫామ్ ఐ జి ఒ టి  కర్మయోగిని సద్వినియోగం చేసుకోవాలని ప్రధాన మంత్రి కోరారు.

నేపథ్యం

ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న ప్రధాని నిబద్ధతను నెరవేర్చే దిశగా రోజ్ గార్ మేళా ఒక ముందడుగు. ఉపాధి కల్పనను పెంపొందించడంలో, జాతీయాభివృద్ధిలో యువత సాధికారత, భాగస్వామ్యం కోసం అర్థవంతమైన అవకాశాలను కల్పించడంలో రోజ్ గార్ మేళా ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని భావిస్తున్నారు.

కొత్తగా నియమితులైన వారికి ఐ జి ఒ టి  కర్మయోగి పోర్టల్ లోని ఆన్ లైన్ మాడ్యూల్ కర్మయోగి ప్రాప్రంభ్ ద్వారా శిక్షణ పొందే అవకాశం లభిస్తుంది, ఇక్కడ 400కు పైగా ఇ-లెర్నింగ్ కోర్సులను ‘ఎక్కడైనా ఏదైనా పరికరం’ లెర్నింగ్ ఫార్మాట్ కోసం అందుబాటులో ఉంచారు.

 

*****

DS/TS