జాతీయ రాజధాని ఢిల్లీ ప్రాదేశికం (అనుమతిలేని ఆవాస నివాసితుల
ఆస్తి హక్కు గుర్తింపు) బిల్లు-2019ని ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ బిల్లు కు ఆమోదం లభిస్తే ఢిల్లీ అనధికార కాలనీల్లో నివసించేవారికి స్టాంపు రుసుము, రిజిస్ట్రేషన్ చార్జీల ఖర్చులేకుండా ఆస్తి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది.
తద్వారా ఢిల్లీ లోని ప్రభుత్వ, ప్రైవేటు భూముల లో గల అనధికార ఆవాసాల్లో నివసిస్తున్న సుమారు 40 లక్షల మంది కి ప్రయోజనం కలుగుతుంది. ఆ మేరకు ఇంటి స్థలం, లేదా నిర్ణీత స్థలం లో నిర్మించుకున్న ఇల్లు తదితరాలపై సర్వాధికార పత్రం (జిపిఎ), వీలునామా లేదా అమ్మకపు ఒప్పందం, చెల్లింపు-స్వాధీనం పత్రాల రూపం లో హక్కులుంటాయి. అయితే, సదరు ఆవాసాల ప్రాంతాలకు అనుమతులు లేనందువల్ల వీటిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అధికారులు అనుమతించడం లేదు. దీంతో అక్కడ నివసిస్తున్నవారికి ఆస్తి పై యాజమాన్య హక్కు లేకుండాపోయింది. అంతేకాకుండా, సదరు ఆస్తుల పై రుణ సదుపాయం కల్పించేందుకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సహాయ సంస్థలు అంగీకరించడం లేదు.
విక్రయ ఒప్పందాలు/సర్వాధికార పత్రం లేదా వీలునామా లావాదేవీలు, అన్యాక్రాంత పత్రాల వంటివాటిని సంపూర్ణ ‘హక్కు బదిలీ లేదా విక్రయం’గా పరిగణించే వీల్లేదని సూరజ్ ల్యాంప్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్; హర్యానా ప్రభుత్వం-తదితరుల మధ్య 2009నాటి సెలవుకాలీన ప్రత్యేక పిటిషన్ (సి) 13917 కేసులో సుప్రీం కోర్టు 2011 అక్టోబరు 11న తీర్పు ఇచ్చింది. ఆ మేరకు అవన్నీ విక్రయ ఒప్పందాలు గా మాత్రమే అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో సదరు అనధికార ఆవాస ప్రాంతాల్లో నివసించేవారి సామాజిక-ఆర్థిక పరిస్థితులు, క్షేత్రస్థాయి వాస్తవాల ను ప్రభుత్వం పరిగణన లోకి తీసుకుంది. తదనుగుణం గా సర్వాధికార పత్రం, విక్రయ ఒప్పందం, వీలునామా-స్వాధీన లేఖ తదితర పత్రాల తోపాటు ప్రతిఫలం చెల్లింపు రుజువుల ఆధారం గా స్థల యాజమాన్యం లేదా బదిలీ లేదా తాకట్టు హక్కులు సంక్రమింపజేసి, గుర్తింపు ప్రసాదించాలని నిర్ణయించింది. అంతేగాక ప్రస్తుత మౌలిక వసతులు, పౌర-సామాజిక సదుపాయాల మెరుగు, పునరాభివృద్ధిద్వారా అక్కడి ప్రజలకు నాణ్యమైన జీవన స్థితిగతులు కల్పించాలని నిశ్చయించింది.
ప్రతిపాదిత జాతీయ రాజధాని ఢిల్లీ ప్రాదేశికం (అనుమతిలేని ఆవాస నివాసితుల ఆస్తి హక్కు గుర్తింపు) బిల్లు-2019 నిర్దేశం ప్రకారం:-
ఎ) సూరజ్ ల్యాంప్ కేసు పై తీర్పు నేపథ్యం లో ఢిల్లీ అనధికార ఆవాస ప్రాంతాలవారివద్దగల సర్వాధికార పత్రం (జిపిఎ), వీలునామా, విక్రయ ఒప్పందం, కొనుగోలు-స్వాధీన, అన్యాక్రాంత పత్రాల గుర్తింపు ను ప్రత్యేక ఊరట కింద ఒక్కసారి కి మాత్రమే ఆమోదించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
బి) అన్యాక్రాంత పత్రం లేదా అనుమతి చీటీలకు సంబంధించి చివరి లావాదేవీల లో మాత్రమే పేర్కొన్న విలువ ప్రకారం… రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంపు రుసుముతో రిజిస్ట్రేషన్ చేసేందుకు నిర్ణయించింది.
ఆ మేరకు 29.10.2019న జారీచేసిన ‘జాతీయ రాజధాని ఢిల్లీ ప్రాదేశికం (అనుమతిలేని ఆవాస నివాసితుల ఆస్తి హక్కు గుర్తింపు) బిల్లు-2019’ నిబంధనల ప్రకారం… ఢిల్లీలోని 1,731 అనధికార ఆవాసాల్లో నివసిస్తున్న 40 లక్షల మంది కి పైగా ప్రజల కు ఈ వెసులుబాటు వర్తిస్తుంది.
పూర్వరంగం :
ఢిల్లీ లోని అనధికార ఆవాసాల ప్రజల ఆస్తి యాజమాన్య, బదిలీ, తాకట్టు హక్కుల కు గుర్తింపునిచ్చే అంశం పై లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వం లో ఏర్పాటైన కమిటీ ఇచ్చిన నివేదిక ను కేంద్ర గృహ-పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిశీలించింది. అనంతరం దాని ప్రాతిపదిక గా సమర్పించిన ప్రతిపాదనల ను కేంద్ర మంత్రిమండలి 23.10.2019నాటి సమావేశం లో ఆమోదించింది. తదనుగుణం గా అనధికార ఆవాస ప్రాంతాల నివాసుల కు ఆస్తి యాజమాన్యం, బదిలీ, తాకట్టు హక్కులు సంక్రమింపజేసి, హక్కుల ను గుర్తించేందుకు వీలుగా 29.10.2019న మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
కాగా, ఈ అనధికార ఆవాసాల్లో రిజిస్ట్రేషన్ ద్వారా లేదా రిజిస్ట్రేషన్ లేకుండా లేదా నోటరీ ద్వారా సర్వాధికార పత్రం తో, విక్రయ ఒప్పందం లేదా వీలునామా లేదా చెల్లింపు లేఖ-స్వాధీన పత్రం తదితరాల రూపం లో ఆస్తి యాజమాన్య హక్కు పలుమార్లు బదిలీ అయింది. అయితే, ఇలాంటి లావాదేవీ లపై రిజిస్ట్రేషన్ చార్జీలు లేదా స్టాంపు రుసుము అంచనా వేయడం గానీ, చెల్లించడం గానీ జరగలేదు.
మంత్రిమండలి నిర్ణయం మేరకు మార్గదర్శకాల జారీ నేపథ్యంలో- జాతీయ రాజధాని ఢిల్లీ ప్రాదేశిక ప్రభుత్వం 2014 సెప్టెంబరు 22న జారీ చేసిన ‘ఎఫ్.1 (953) Regn.Br./Div.Com/HQ/2014 నోటిఫికేషన్ పేర్కొంటున్న మేరకు కనీస (సర్కిల్) శాతాల్లో అన్యాక్రాంత పత్రం లేదా అనుమతి చీటీల లో పేర్కొన్న మొత్తాల పై లేదా వాటిలో పేర్కొన్న విక్రయ ప్రతిఫలం మీద.. ఏది ఎక్కువగా ఉంటే దాని ప్రకారం మాత్రమే స్టాంపు రుసుము విధించాల్సి ఉంటుంది.