ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2017-18 నుండి మొదలయ్యే మూడు సంవత్సరాల కాలానికిగాను రూ. 9046.17 కోట్ల బడ్జెట్ తో జాతీయ పోషణ మిషన్ (ఎన్ఎన్ఎమ్) ను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది.
ముఖ్యాంశాలు :
పోషణ కు సంబంధించి వివిధ మంత్రిత్వ శాఖల తాలూకు కార్యక్రమాలను ఒక ఉన్నత సంఘంగా ఏర్పడే ఎన్ఎన్ఎమ్ పర్యవేక్షిస్తూ, లక్ష్యాలను నిర్ధారిస్తుంది.
ఇతర ప్రతిపాదనలలో:
• పోషణ లోపాన్ని పరిష్కరించేందుకు అమలు చేయాల్సిన వేరు వేరు పథకాలను రూపొందించడం;
• పటిష్టమైన కేంద్రీకరణ యంత్రాంగాన్ని ప్రవేశపెట్టడం;
• ఐసిటి ఆధారితమైన వాస్తవిక సమయ పర్యవేక్షణ ప్రణాళికను తీర్చిదిద్దడం;
• లక్ష్యాలను చేరుకొనే రాష్ట్రాలకు/ కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రోత్సాహకాలను అందించడం;
• ఐటి ఆధారిత పరికరాలను ఉపయోగించుకొనేందుకు ఆంగన్వాడీ వర్కర్లకు ప్రోత్సాహకాలను అందజేయడం;
• ఆంగన్వాడీ వర్కర్లు ఉపయోగించే రిజిస్టర్లను తొలగించడం;
• ఆంగన్వాడీ కేంద్రాలలో బాలల ఎత్తును కొలిచే పద్ధతిని ప్రవేశపెట్టడం;
• సామాజిక లెక్కల తనిఖీ;
• ప్రజలు పాలుపంచుకొనే విధంగా చూస్తూ, పోషణ తాలూకు విభిన్నమైన కార్యకలాపాలు, తదితర మార్గాల ద్వారా న్యూట్రిషన్ రిసోర్స్ సెంటర్ లను ఏర్పాటు చేయడం వంటివి..
ఈ కార్యక్రమంలో భాగంగా ఉంటాయి.
ప్రధాన ప్రభావం :
ఈ కార్యక్రమం నిర్దేశించుకొన్నటువంటి లక్ష్యాల ద్వారా వృద్ధిని ఆటంకపరచడాన్ని, తక్కువ స్థాయిలో పోషకాహార లభ్యత సమస్యను, రక్తహీనతను మరియు పిల్లలు తక్కువ బరువుతో పుట్టే ధోరణిని తగ్గించే దిశగా పాటుపడుతుంది. దీనితో చక్కని పర్యవేక్షణకు పూచీ పడడంతో పాటు సమన్వయాన్ని ఏర్పరచడం, సకాలంలో చర్యలు తీసుకోవడం కోసం నిర్ధారిత లక్ష్యాలను చేరుకోవడం కోసం మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు పనులు చేసేటట్లుగా, వాటికి మార్గదర్శనం మరియు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేటట్లు ప్రోత్సహించడం జరుగుతుంది.
ప్రయోజనాలు మరియు కవరేజి :
10 కోట్ల మందికి పైగా ప్రజలకు ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. ఎలాగంటే, అన్ని రాష్ట్రాలు మరియు జిల్లాలను దశలవారీగా.. 2017-18లో 315 జిల్లాలను, 2018-19లో 235 జిల్లాలను, 2019-20లో మిగిలిన జిల్లాలను.. ఈ పథకంలో చేర్చుకోవడం జరుగుతుంది.
ఆర్థిక వ్యయం:
2017-18 నుండి మొదలై మూడు సంవత్సరాల పాటు 9046.17 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేయడం జరుగుతుంది. దీనిలో 50 శాతం నిధులను గవర్నమెంట్ బడ్జెటరీ సపోర్ట్ రూపంలో కేటాయించనున్నారు. మరో 50 శాతం నిధులను ఐబిఆర్డి లేదా ఇతర ఎమ్డిబి సమకూర్చుతాయి. కేంద్రం మరియు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మధ్య 60:40 నిష్పత్తి లో, ఈశాన్య ప్రాంతాలు (ఎన్ఇఆర్) మరియు హిమాలయ ప్రాంత రాష్ట్రాలు 90:10 నిష్పత్తి లో, ఇంకా చట్టసభ సదుపాయం ఉండని కేంద్రపాలిత ప్రాంతాలకు 100 శాతం మేర నిధులను గవర్నమెంట్ బడ్జెటరీ సపోర్ట్ రూపంలో అందజేస్తారు. మూడు సంవత్సరాల లో భారత ప్రభుత్వం వాటా మొత్తం రూ. 2849.54 కోట్లుగా ఉంటుంది.
అమలు వ్యూహం మరియు లక్ష్యాలు:
అట్టడుగు స్థాయి వరకు పక్కా పర్యవేక్షణతో పాటు కన్వర్జెన్స్ యాక్షన్ ప్లాన్ ల ప్రాతిపదికన ఈ పథకాన్ని కూకటి వేళ్ల స్థాయి వరకు అమలు చేయడం జరుగుతుంది. 2017-18 నుండి 2019-10 మధ్య కాలంలో మూడు దశలలో ఎన్ఎన్ఎమ్ ను కొనసాగిస్తారు. వృద్ధిలో ఎదుగుదలకు ఆటంకాలను, అల్ప పోషణను, రక్తహీనతను (చిన్న పిల్లలు, మహిళలు, మరియు కిశోర బాలికలలో) క్రమానుగతంగా 2 శాతం, 2 శాతం, 3 శాతం మరియు 2 శాతం తగ్గించాలనేది జాతీయ పోషణ మిషన్ యొక్క లక్ష్యంగా ఉంది. గిడసబారుతనాన్ని (ఎన్ఎఫ్ హెచ్ ఎస్-4) 38.4 శాతం నుండి 2022 కల్లా 25 శాతానికి తగ్గించేందుకు ఈ మిషన్ కృషి చేయనుంది.
పూర్వరంగం:
ఆరేళ్ళ వయస్సు లోపు బాలల మరియు గర్భిణులకు పోషణ విషయంలో లోటుపాట్లను పరిష్కరించేందుకు అనేక పథకాలు అమలవుతున్నాయి. అయినప్పటికీ కూడా దేశంలో తక్కువ స్థాయి పోషక ఆహారం మాత్రమే అందుబాటులో ఉండటంతో పాటు సంబంధిత సమస్యలు అధిక స్థాయిలో ఉన్నాయి. పథకాల పరంగా చూస్తే ఎటువంటి లోటు లేకపోయినా ఆయా పథకాల మధ్య సమన్వయ లోపం ఒక సమస్యగా ఉంది. ఎన్ఎన్ఎమ్ ఒక పటిష్టమైన వ్యవస్థను నెలకొల్పి, ఆశించిన సమన్వయాన్ని నెలకొల్పనుంది.