ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు జమ్మూకశ్మీర్ లో సోనామార్గ్ సొరంగ (టన్నెల్) మార్గాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జమ్ముకశ్మీర్, భారత్ అభివృద్ధి కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి శ్రమించిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. సవాళ్లు ఎదురైనా మన సంకల్పం ఏమాత్రం తగ్గలేదని శ్రీ మోదీ అన్నారు. కార్మికులు సంకల్పంతో, నిబద్ధతతో అన్ని అడ్డంకులను అధిగమించి పనులు పూర్తి చేశారని కొనియాడారు. ఏడుగురు కార్మికుల మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు.
మంచు కప్పుకున్న అందమైన పర్వతాలు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రశంసిస్తూ, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఇటీవల సోషల్ మీడియా ద్వారా పంచుకున్న చిత్రాలను చూసిన తర్వాత ఇక్కడికి రావాలన్న ఆసక్తి మరింత పెరిగిందని ప్రధాని తెలిపారు. తమ పార్టీ కోసం పనిచేస్తున్న సమయంలో తాను తరచూ ఈ ప్రాంతాన్ని సందర్శించిన రోజులను ప్రధాని గుర్తు చేసుకున్నారు. సోనామార్గ్, గుల్మార్గ్, గండేర్బల్, బారాముల్లా వంటి ప్రాంతాల్లో ఎక్కువ సమయం గడిపేవాడినని, తరచూ గంటల తరబడి నడుచుకుంటూ, కిలోమీటర్ల దూరం ప్రయాణించానని ఆయన పేర్కొన్నారు. భారీ హిమపాతం ఉన్నప్పటికీ, జమ్మూ కాశ్మీర్ ప్రజల వెచ్చదనం చలిని గుర్తించలేనిదిగా చేసిందని ఆయన అన్నారు.
పవిత్ర పుణ్య స్నానాల కోసం లక్షలాది మంది చేరుతున్న ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళా ఈ రోజు ప్రారంభం కావడాన్ని ప్రస్తావిస్తూ, ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు అని, దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందని ప్రధాని అన్నారు. పంజాబు, ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో లోహ్రీ వేడుకలను, అలాగే ఉత్తరాయణం, మకర సంక్రాంతి, పొంగల్ పండుగలను కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఈ పండుగలను జరుపుకునే ప్రతి ఒక్కరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. లోయలో 40 రోజుల కఠినమైన చిల్లైకాలన్ కాలంలో సాగడం సవాలుతో కూడుకున్నదని, ప్రజల ధైర్యం ప్రశంసనీయమని ప్రధాని కొనియాడారు. ఈ సీజన్ సోనామార్గ్ వంటి పర్యాటక ప్రాంతాలకు కొత్త అవకాశాలను తీసుకువస్తుందని, కాశ్మీర్ ప్రజల ఆతిథ్యాన్ని ఆస్వాదించడానికి దేశం నలుమూలల నుండి సందర్శకులను ఆకర్షిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జమ్మూ రైల్ డివిజన్ కు శంకుస్థాపన చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇది ప్రజలకు ఓ ప్రత్యేక కానుక అని అన్నారు. ఇది ప్రజల చిరకాల డిమాండ్ అని ఆయన వ్యాఖ్యానించారు. సోనామార్గ్ సొరంగ మార్గాన్ని ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన శ్రీ మోదీ, జమ్మూ, కాశ్మీర్, లడఖ్ ప్రజల చిరకాల కోరికను నెరవేరుస్తున్నట్లు తెలిపారు. ఈ సొరంగం సోనామార్గ్, కార్గిల్ , లే లోని ప్రజకు మెరుగైన జీవిత సౌలభ్యాన్ని అందిస్తుందని చెప్పారు. భారీ హిమపాతం, మంచుచరియలు, కొండచరియలు విరిగిపడినప్పుడు ఎదురయ్యే రహదారి మూసివేత ఇబ్బందులను ఈ సొరంగం తగ్గిస్తుందని ప్రధానమంత్రి తెలిపారు.ఈ సొరంగం వల్ల ప్రధాన ఆసుపత్రులకు చేరుకోవడం సులభమవుతుందని , నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉండేలా చేస్తుందని, తద్వారా స్థానికుల ఎదుర్కొనే కష్టాలు గణనీయంగా తగ్గుతాయని ప్రధాని చెప్పారు.
వాస్తవానికి సోనామార్గ్ సొరంగం నిర్మాణం తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2015లో మొదలైందని, ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలోనే సొరంగం నిర్మాణం పూర్తయిందని ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు
ఈ సొరంగం శీతాకాలంలో సోనామార్గ్ కు కనెక్టివిటీని కొనసాగిస్తుందని, మొత్తం ప్రాంతంలో పర్యాటకాన్ని పెంచుతుందని ఆయన పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్ లో అనేక రోడ్డు, రైల్వే సంబంధిత ప్రాజెక్టులు త్వరలో పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నాయని ప్రధాని తెలిపారు. సమీపంలో ప్రస్తుతం చేపట్టిన మరో భారీ కనెక్టివిటీ ప్రాజెక్టు గురించి ఆయన ప్రస్తావించారు. కాశ్మీర్ లోయకు రానున్న రైల్వే కనెక్షన్ పట్ల నెలకొన్న ఆసక్తిని ప్రత్యేకంగా ప్రస్తావించారు.కొత్త జమ్ముకశ్మీర్ లో భాగంగా కొత్త రోడ్లు, రైల్వేలు, ఆసుపత్రులు, కళాశాలల అభివృద్ధిని ఆయన ప్రస్తావించారు. టన్నెల్ కు, అభివృద్ధిలో నూతన శకానికి నాంది పలికిన ప్రతి ఒక్కరికీ ప్రధాని హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా పురోగతి సాధిస్తున్న నేపథ్యంలో, ఏ ప్రాంతం లేదా కుటుంబం వెనుకబడి ఉండకూడదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్” స్ఫూర్తితో ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొంటూ, గత 10 సంవత్సరాల్లో జమ్మూ కాశ్మీర్‌తో పాటు దేశవ్యాప్తంగా నాలుగు కోట్లకు పైగా పేద కుటుంబాలకు శాశ్వత గృహాలు అందించామని ఆయన వెల్లడించారు. రాబోయే సంవత్సరాల్లో పేదలకు మరో మూడు కోట్ల కొత్త ఇళ్లు అందిస్తామని చెప్పారు. భారత్‌లో కోట్లాది మంది ప్రజలు ఉచిత వైద్య సహాయం పొందుతున్నారని, దీని ప్రయోజనాలు జమ్మూ కాశ్మీర్ ప్రజలకు కూడా అందుతున్నాయని చెప్పారు. యువత విద్యకు ఊతమిచ్చేందుకు దేశవ్యాప్తంగా కొత్త ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీల ఏర్పాటు గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. జమ్ముకశ్మీర్ లో గత దశాబ్దకాలంలో అనేక అత్యున్నత విద్యాసంస్థలను స్థాపించామని, ఇవి స్థానిక యువతకు ఎంతో మేలు చేస్తున్నాయని ఆయన అన్నారు.
జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తృతమైన మౌలిక స దుపాయాల అభివృద్ధిని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, జమ్మూ కాశ్మీర్ సొరంగాలు, ఎత్తైన వంతెనలు, రోప్ వేల కేంద్రంగా మారుతోందని, ప్రపంచంలోనే ఎత్తైన సొరంగాలు, ఎత్తైన రైలు-రోడ్డు వంతెనలు ఇక్కడ నిర్మితమవుతున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. ఇటీవల ప్యాసింజర్ రైలు ట్రయల్ పూర్తయిన చీనాబ్ బ్రిడ్జి ఇంజనీరింగ్ అద్భుతాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. కాశ్మీర్ రైల్వే కనెక్టివిటీని పెంచే కేబుల్ బ్రిడ్జి, జోజిలా, చెనానీ నష్రి, సోనామార్గ్ టన్నెల్ ప్రాజెక్టులు, ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టుతో సహా పలు కీలక ప్రాజెక్టులను కూడా ఆయన ప్రస్తావించారు. శంకరాచార్య ఆలయం, శివఖోరి, బల్తాల్-అమర్ నాథ్ రోప్ వేలతో పాటు కత్రా-ఢిల్లీ ఎక్స్ ప్రెస్ వే పథకాలను కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. జమ్ముకశ్మీర్ లో రూ.42,000 కోట్ల విలువైన రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టులు అమలు జరుగుతున్నాయని, ఇందులో నాలుగు జాతీయ రహదారి ప్రాజెక్టులు, రెండు రింగ్ రోడ్లు ఉన్నాయని ఆయన తెలియచేశారు. సోనామార్గ్ వంటి 14 కి పైగా సొరంగ మార్గాలను నిర్మిస్తున్నామని, ఇది జమ్మూ కాశ్మీర్ ను దేశంలోని అత్యంత అనుసంధానిత ప్రాంతాలలో ఒకటిగా మారుస్తుందని ప్రధాన మంత్రి తెలిపారు.
భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారే ప్రయాణంలో పర్యాటక రంగం అందిస్తున్న విశేషమైన సహకారాన్ని ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మెరుగైన కనెక్టివిటీ ద్వారా జమ్మూ కాశ్మీర్‌లో ఇప్పటివరకు చేరుకోని , పరిశోధించని ప్రాంతాలకు పర్యాటకులు చేరుకోగలరని అన్నారు. గత దశాబ్దంలో ఈ ప్రాంతంలో నెలకొన్న శాంతి, జరుగుతున్న అభివృద్ధి పర్యాటక రంగానికి ఇప్పటికే ఎంతో మేలుచేసిందని ఆయన పేర్కొన్నారు. “2024 లో, 2 కోట్లకు పైగా పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ ను సందర్శించారు, సోనామార్గ్ కు గత పదేళ్లలో పర్యాటకుల సంఖ్య ఆరు రెట్లు పెరిగింది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ వృద్ధి హోటళ్లు, హోమ్ స్టేలు, దాబాలు, బట్టల దుకాణాలు, ట్యాక్సీ సర్వీసులతో సహా స్థానిక వ్యాపారాలకు ఎంతో ప్రయోజనం చేకూర్చిందని ఆయన చెప్పారు.
“21వ శతాబ్దపు జమ్ము కాశ్మీర్ అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది” అని శ్రీ మోదీ అన్నారు. గత కష్ట రోజులను వదిలేసి ఈ ప్రాంతం “భూమిపై స్వర్గం”గా తన గుర్తింపును తిరిగి పొందుతోందని ఆయన వ్యాఖ్యానించారు. లాల్ చౌక్ లో ప్రజలు ఇప్పుడు రాత్రిపూట కూడా ఐస్ క్రీంను ఆస్వాదిస్తున్నారని, ఈ ప్రాంతం ఉల్లాసంగా ఉందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. పోలో వ్యూ మార్కెట్ ను కొత్త ఆవాస కేంద్రంగా మార్చిన స్థానిక కళాకారులను ఆయన ప్రశంసించారు, సంగీతకారులు, కళాకారులు, గాయకులు తరచుగా అక్కడ ప్రదర్శనలు ఇస్తారు. శ్రీనగర్ లోని ప్రజలు ఇప్పుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి సినిమా హాళ్లలో హాయిగా సినిమాలు చూస్తున్నారని, సులభంగా షాపింగ్ చేస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు.ఇలాంటి గణనీయమైన మార్పులను ప్రభుత్వం మాత్రమే సాధించలేదని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసి, తమ భవిష్యత్తును సురక్షితపరుచుకున్న ఘనత జమ్ము కాశ్మీర్ ప్రజలకు దక్కుతుందన్నారు.
జమ్మూ కాశ్మీర్ యువతకు గల ఉజ్వల భవిష్యత్తును ప్రస్తావిస్తూ, వారికి క్రీడలలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఆన్నారు. కొన్ని నెలల క్రితం శ్రీనగర్లో నిర్వహించిన తొలి అంతర్జాతీయ మారథాన్ గురించి ఆయన ప్రస్తావించారు. , అది చూసిన వారికి ఎంతో ఆనందం కలిగించింది. మారథాన్ లో ముఖ్యమంత్రి పాల్గొన్న వీడియో వైరల్ కావడం, ఢిల్లీలో జరిగిన సమావేశంలో దాని గురించి ఉత్సాహంగా చర్చించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఇది నిజంగా జమ్మూ కాశ్మీర్ కు కొత్త శకం అని అంటూ, నలభై సంవత్సరాల తరువాత ఈ ప్రాంతంలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ క్రికెట్ లీగ్, అందమైన దాల్ సరస్సు చుట్టూ కార్ రేసింగ్ దృశ్యాలను ప్రస్తావించారు. గుల్మార్గ్ భారతదేశానికి శీతాకాల క్రీడల రాజధానిగా మారుతోందని, నాలుగు ఖేలో ఇండియా శీతాకాల క్రీడలకు ఆతిథ్యమిస్తోందని, ఐదవ ఎడిషన్ వచ్చే నెలలో ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. గత రెండు సంవత్సరాలుగా జమ్ము కాశ్మీర్ లో జరిగిన వివిధ క్రీడా టోర్నమెంట్ లలో దేశ వ్యాప్తంగా 2,500 మంది అథ్లెట్లు పాల్గొన్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో 90కి పైగా ఖేలో ఇండియా కేంద్రాలను ఏర్పాటు చేసి, 4,500 మంది స్థానిక యువతకు శిక్షణ ఇస్తున్నట్లు ఆయన వివరించారు.
జమ్మూ కాశ్మీర్ యువతకు లభిస్తున్న కొత్త అవకాశాలు గురించి ప్రస్తావిస్తూ, జమ్మూ, అవంతిపొరాలో ఎయిమ్స్ నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, తద్వారా వైద్య చికిత్స కోసం దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని ప్రధానమంత్రి అన్నారు. జమ్ములోని ఐఐటీ, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ లు అద్భుతమైన విద్యను అందిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. పీఎం విశ్వకర్మ పథకం, జమ్మూకశ్మీర్ ప్రభుత్వం చేపట్టిన ఇతర కార్యక్రమాల మద్దతుతో స్థానిక హస్తకళాకారులు, చేతివృత్తుల వారికి లభిస్తున్న ప్రోత్సాహాన్ని వివరించారు. సుమారు రూ.13,000 కోట్ల పెట్టుబడులతో ఈ ప్రాంతానికి కొత్త పరిశ్రమలను ఆకర్షించడానికి, యువతకు వేలాది ఉద్యోగాలను కల్పించడానికి నిరంతరం చేస్తున్న ప్రయత్నాలను, ప్రధాన మంత్రి వివరించారు. గడచిన నాలుగేళ్లలో జమ్ముకశ్మీర్ బ్యాంక్ వ్యాపారం రూ.1.6 లక్షల కోట్ల నుంచి రూ.2.3 లక్షల కోట్లకు పెరిగిందని ప్రధాని ప్రశంసించారు. రుణాలు అందించే బ్యాంకు సామర్థ్యం పెరగడం వల్ల ఈ ప్రాంతంలోని యువత, రైతులు, పండ్ల తోటల పెంపకందారులు, దుకాణదారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూరుతోందని ఆన్నారు.
జమ్ము కాశ్మీర్ గతాన్ని అభివృద్ధి వర్తమానంగా మార్చడం గురించి ప్రస్తావిస్తూ, తన కిరీటమైన కాశ్మీర్ ను ప్రగతి ఆభరణాలతో అలంకరించినప్పుడు అభివృద్ధి చెందిన భారతదేశం కల సాకారమవుతుందని శ్రీ మోదీ అన్నారు. కశ్మీర్ మరింత సుందరంగా, సుభిక్షంగా మారాలని ఆకాంక్షించారు. ఈ ప్రయత్నానికి ఈ ప్రాంత యువత, పెద్దలు, పిల్లల నుంచి నిరంతర మద్దతు లభిస్తోందన్నారు.
జమ్మూ కాశ్మీర్ ప్రజలు తమ కలను సాకారం చేసుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని, ఈ ప్రాంతం, దేశ పురోభివృద్ధికి దోహదం చేస్తున్నారని ప్రధానమంత్రి అన్నారు. ప్రజలందరికీ వారి ప్రయత్నాలలో పూర్తి మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా జమ్మూ కాశ్మీర్‌లోని ప్రతి కుటుంబానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి శ్రీ ఒమర్ అబ్దుల్లా, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, కేంద్ర సహాయ మంత్రులు డాక్టర్ జితేంద్ర సింగ్, శ్రీ అజయ్ టమ్తా తదితరులు పాల్గొన్నారు.
నేపథ్యం
సుమారు 12 కిలోమీటర్ల పొడవైన సోనామార్గ్ టన్నెల్ ప్రాజెక్టును రూ.2,700 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించారు. ఇందులో 6.4 కిలోమీటర్ల పొడవైన సోనామార్గ్ ప్రధాన సొరంగం, ఎగ్రెస్ టన్నెల్, అప్రోచ్ రోడ్లు ఉన్నాయి. సముద్ర మట్టానికి 8,650 అడుగుల ఎత్తులో ఉన్న ఇది లే కు వెళ్లే మార్గంలో శ్రీనగర్-సోనామార్గ్ మధ్య అన్ని వాతావరణ పరిస్థితులలో రాకపోకలకు అంతరాయం లేని సౌలభ్యాన్ని అందిస్తుంది. కొండచరియలు విరిగిపడే మార్గాలను, హిమపాత మార్గాలను అధిగమించడానికి వీలవుతుంది. వ్యూహాత్మకంగా కీలకమైన లడఖ్ ప్రాంతానికి సురక్షితమైన, అంతరాయం లేని ప్రవేశాన్ని సుగమం చేస్తుంది. ఇది సోనామార్గ్ ను ఏడాది పొడవునా పర్యాటక గమ్యస్థలంగా మారుస్తుంది. శీతాకాల పర్యాటకం, సాహస క్రీడలు, స్థానిక జీవనోపాధిని పెంచుతుంది.
2028 నాటికి పూర్తికానున్న జోజిలా టన్నెల్ తో పాటు, ఇది మార్గం పొడవును 49 కిలోమీటర్ల నుండి 43 కిలోమీటర్లకు తగ్గిస్తుంది. వాహనాల వేగాన్ని గంటకు 30 కిలోమీటర్ల నుండి 70 కిలోమీటర్లకు పెంచుతుంది, శ్రీనగర్ లోయ,లడఖ్ మధ్య అంతరాయం లేని ఎన్ హెచ్ -1 కనెక్టివిటీకి దోహదపడుతుంది. ఈ మెరుగైన కనెక్టివిటీ రక్షణ సంబంధ రవాణా సౌలభ్యాన్ని పెంచుతుంది, జమ్మూ కాశ్మీర్, లడఖ్ అంతటా ఆర్థిక వృద్ధి, సామాజిక-సాంస్కృతిక సమైక్యతను పెంచుతుంది.
అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ టన్నెల్ నిర్మాణానికి అహర్నిశలు శ్రమించిన భవన నిర్మాణ కార్మికులను ప్రధాని కలుసుకున్నారు. వారి నిర్మాణ నైపుణ్యాన్ని ప్రశంసించారు.
Delighted to be amongst the wonderful people of Sonamarg. With the opening of the tunnel here, connectivity will significantly improve and tourism will see a major boost in Jammu and Kashmir. https://t.co/NQnu19ywpi
— Narendra Modi (@narendramodi) January 13, 2025
The Sonamarg Tunnel will give a significant boost to connectivity and tourism. pic.twitter.com/AuIw5Kqla3
— PMO India (@PMOIndia) January 13, 2025
Improved connectivity will open doors for tourists to explore lesser-known regions of Jammu and Kashmir. pic.twitter.com/QCd4aCcMRA
— PMO India (@PMOIndia) January 13, 2025
Jammu and Kashmir of the 21st century is scripting a new chapter of development. pic.twitter.com/WddTnuNAxv
— PMO India (@PMOIndia) January 13, 2025
कश्मीर तो देश का मुकुट है…भारत का ताज है। इसलिए मैं चाहता हूं कि ये ताज और सुंदर हो... और समृद्ध हो: PM @narendramodi pic.twitter.com/HwvBJXhUxb
— PMO India (@PMOIndia) January 13, 2025
Inaugurated the Sonamarg Tunnel, which will be a game changer as far as infrastructure for Jammu and Kashmir is concerned. It will boost tourism and commercial activities, which is great for J&K. pic.twitter.com/B4fTTnIlNn
— Narendra Modi (@narendramodi) January 13, 2025