Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జమ్మూ-కశ్మీర్ నివాసితులందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆయుష్మాన్ భారత్ పి.ఎమ్-జై సెహత్ ను ప్రారంభించిన – ప్రధానమంత్రి

జమ్మూ-కశ్మీర్ నివాసితులందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆయుష్మాన్ భారత్ పి.ఎమ్-జై సెహత్ ను ప్రారంభించిన – ప్రధానమంత్రి

 


జమ్మూ-కాశ్మీర్ నివాసితులందరూ లబ్ది పొందే విధంగాఆయుష్మాన్ భారత్ పి.ఎం-జై సెహత్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, ఈ రోజు, వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో – కేంద్ర మంత్రులు, శ్రీ అమిత్ షా, డాక్టర్ హర్ష వర్ధన్, డాక్టర్ జితేంద్ర సింగ్ తో పాటు జమ్మూ-కశ్మీర్, లెఫ్టనెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా కూడా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా, ఈ ప్రాంతానికి చెందిన లబ్ధిదారులతో కూడా ప్రధానమంత్రి సంభాషించారు. జమ్మూ-కశ్మీర్‌తో శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయికి ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని కూడా ప్రధానమంత్రి, ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, మాజీ ప్రధానమంత్రి ఇన్సానియత్, జంహూరియాత్, కాశ్మీరియత్సిద్ధాంతం మాకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తూ ఉంటుందని పేర్కొన్నారు.

జమ్మూ-కశ్మీర్ ఆయుష్మాన్ భారత్ పి.ఎమ్-జై సెహత్ పథకం గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, ఈ పథకం కింద 5 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స పొందడం వల్ల జీవన సౌలభ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు.  ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా రాష్ట్రంలోని 6 లక్షల కుటుంబాలు ప్రయోజనం పొందుతుండగా, సెహాత్ పథకం అందుబాటులోకి వచ్చిన తర్వాత మొత్తం 21 లక్షల కుటుంబాలకూ, అదే ప్రయోజనం లభిస్తుందని ఆయన చెప్పారు.  ఈ పథకం యొక్క మరో ప్రయోజనం ఏమిటంటే, జమ్మూ-కశ్మీర్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులతో పాటుదేశంలో, ఈ పథకం కింద గుర్తింపు పొందిన వేలాది ఆసుపత్రుల నుండి కూడా చికిత్స పొందవచ్చునని, ప్రధానమంత్రి వివరించారు.

ఆయుష్మాన్ యోజన ప్రయోజనాన్ని నివాసితులందరికీ విస్తరించడం చారిత్రాత్మకమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  జమ్మూ-కశ్మీర్ తన ప్రజల అభివృద్ధి కోసం ఈ చర్యలు తీసుకోవడం చూసి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. జమ్మూ-కశ్మీర్ ప్రజల అభివృద్ధి తన ప్రభుత్వానికి అతిపెద్ద ప్రాధాన్యత అని శ్రీ మోదీ పేర్కొన్నారు.  “మహిళా సాధికారత, యువతకు అవకాశాలు, దళితులు, దోపిడీకి, వంచనకు గురైనవారి అభ్యున్నతి గురించీ, అదేవిధంగా, ప్రజల రాజ్యాంగ మరియు ప్రాథమిక హక్కులకు సంబంధించీ, మన ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం, ఈ నిర్ణయాలు తీసుకుంటోంది.అని ప్రధానమంత్రి తెలియజేశారు.

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసినందుకు, ప్రధానమంత్రిజమ్మూ-కాశ్మీర్ ప్రజలను అభినందించారు.  జిల్లా అభివృద్ధి మండలి ఎన్నిక కొత్త అధ్యాయాన్ని రచించిందని ఆయన వ్యాఖ్యానించారు.  కరోనాతో పాటు, శీతల వాతావరణం నెలకొని ఉన్నప్పటికీ పోలింగు కేంద్రాలకు వచ్చి, ఓటు హక్కు వినియోగించుకున్నందుకు, ప్రధానమంత్రి, ప్రజలను అభినందించారు.  జమ్మూ-కాశ్మీర్‌లోని ప్రతి ఓటరు అభివృద్ధి కోసం నిరీక్షిస్తున్నారన్న విషయం స్పష్టమైందని, శ్రీ మోదీ పేర్కొన్నారు.  జమ్మూ-కాశ్మీర్ ‌లోని ప్రతి ఓటరు దృష్టిలో మంచి భవిష్యత్తు ఉందనే నమ్మకాన్ని చూశానని, ఆయన తెలిపారు.  జమ్మూ-కశ్మీర్‌లో జరిగిన ఈ ఎన్నికలు మన దేశంలో ప్రజాస్వామ్య బలాన్ని చూపించాయి.  మరోవైపు, పుదుచ్చేరిలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలు జరగడం లేదని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  ఇలా ఉండగా, అక్కడ, ఎన్నికైన వారి పదవీకాలం 2011 సంవత్సరంలోనే ముగిసిన విషయాన్ని, ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

మహమ్మారి సమయంలో జమ్మూ-కశ్మీర్‌లో సుమారు 18 లక్షల ఎల్.‌పి.జి. సిలిండర్లు రీఫిల్ చేసినట్లు ప్రధానమంత్రి చెప్పారు.  స్వచ్ఛ భారత్ అభియాన్ పధకం కింద జమ్మూ-కశ్మీర్‌లో 10 లక్షలకు పైగా మరుగుదొడ్లు నిర్మించారు.  దీని ఉద్దేశ్యం, కేవలం మరుగుదొడ్ల నిర్మాణానికి మాత్రమే పరిమితం కాదు, ఇది ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రయత్నం కూడా.  గ్రామీణ రహదారుల అనుసంధానంతో పాటు, వచ్చే రెండు, మూడు సంవత్సరాలలో పైపుల ద్వారా నీరు అందించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ప్రధానమంత్రి తెలియజేశారు.

జమ్మూ-కశ్మీర్‌ లో ఐ.ఐ.టి; ఐ.ఐ.ఎం. ఏర్పాటు ఇక్కడి విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించడంలో సహాయపడుతుందని, ప్రధానమంత్రి చెప్పారు.  జమ్మూ-కశ్మీర్‌లో రెండు ఎయిమ్స్, రెండు క్యాన్సర్ సంస్థలను కూడా నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.  పారామెడికల్ విద్యార్థులకు కూడా ఈ సంస్థలలో శిక్షణ లభిస్తుంది.

జమ్మూ-కశ్మీర్ యువత సులభంగా రుణాలు పొందుతూ, శాంతి మార్గంలో పయనిస్తున్నారని, ప్రధానమంత్రి పేర్కొన్నారు.  అనేక సంవత్సరాలుగా జమ్మూ-కశ్మీర్‌లో నివసిస్తున్న ప్రజలు ఇప్పుడు నివాస ధృవీకరణ పత్రాలను పొందుతున్నారు.  జనరల్ కేటగిరీలో ఆర్థికంగా బలహీన వర్గాల ప్రజలు, పర్వత, సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు, ఇప్పుడు రిజర్వేషన్లు పొందుతున్నారు.

*****