Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జమ్ము లోని శేర్-ఎ-కశ్మీర్ వ్యవసాయ విజ్ఞాన శాస్త్రాల మరియు సాంకేతిక విశ్వవిద్యాలయం యొక్క స్నాతకోత్సవం సందర్భంగా 2018 మే 19వ తేదీన ప్రధాన మంత్రి ఉపన్యాసం

జమ్ము లోని శేర్-ఎ-కశ్మీర్ వ్యవసాయ విజ్ఞాన శాస్త్రాల మరియు సాంకేతిక విశ్వవిద్యాలయం యొక్క స్నాతకోత్సవం సందర్భంగా 2018 మే 19వ తేదీన ప్రధాన మంత్రి ఉపన్యాసం


 

నా యువ సహచరులు మరియు ఇక్కడకు విచ్చేసినటువంటి ప్రముఖులారా..

మిత్రులారా,

జ‌మ్ము & కశ్మీర్‌ లోని వివిధ ప్రాంతాలను సందర్శించే అవకాశం నాకు ఈ రోజు ఉదయం పూట లభించింది.  అందువల్ల నేను ఇక్కడకు చేరుకోవడంలో జాప్యం జరిగింది..  మేము దాదాపుగా ఒక గంట ఆలస్యంగా వచ్చాము.  ఇందుకుగాను ముందుగా మీ నుండి మన్నింపు కోరుతున్నాను.  ఇవాళ లేహ్ నుండి శ్రీనగర్ వరకు అనేక ప్రగతి పథకాలను దేశ ప్రజలకు అంకితం చేశాము.  కొన్ని కొత్త పథకాల పనులు మొదలయ్యాయి.  జమ్ము లోని వ్యవసాయ క్షేత్రాలు, కశ్మీర్‌ లోని పండ్ల తోటల సామర్థ్యం ఎలాంటిదో నాకు ఎప్పటినుండో తెలుసును.  అలాగే లేహ్- ల‌ద్దాఖ్‌ ల‌ ఆధ్యాత్మిక-సహజ శక్తి ని కూడా అనుభూతి చెందాను.  దేశం లో అభివృద్ధి పరంగా ముందుకు దూసుకువెళ్లే సామర్థ్యం గల ప్రాంతాలలో ఇదీ ఒకటన్న నా నమ్మకం నేను ఎప్పుడూ ఇక్కడకు వచ్చినా మరింత బలపడుతూ ఉంటుంది.  మనం ఇప్పుడు సరైన దిశలో సాగుతున్నాము.. కష్టించే తత్త్వం ఉన్నప్రజల అర్థవంతమైన కృషి తో, మీ వంటి యువతరం సామర్థ్యం తోడ్పాటు గా విజయాలను అందుకుంటున్నాము.

మిత్రులారా,

సుమారు ఇరవై ఏళ్ల ప్రాయం కలిగిన ఈ విశ్వవిద్యాలయంలో ఇప్పటి దాకా ఎందరో విద్యార్థులు కృతార్థులై ఉంటారు.  వారంతా ఏదో ఒక చోట సామాజిక జీవనంలో తమ వంతు పాత్రలను పోషిస్తున్నారు.

ఇది విశ్వవిద్యాలయం ఆరో స్నాతకోత్సవం జరుపుకొంటున్న రోజు. ఈ సందర్భంలో మీ మధ్యకు వచ్చే అవకాశాన్ని నేను దక్కించుకొన్నాను.  ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన విశ్వవిద్యాలయ పాలనాధికారులకు నేను నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు.  జమ్ము లోని కొన్ని పాఠశాలల విద్యార్థులు కూడా నేడిక్కడ హాజరు కావడం సంతోషదాయకం.  ఈ రోజున 400 మందికి పైగా విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు, పట్టాలు, పతకాలను ప్రదానం చేయడమైంది.  దేశంలోని ఈ విశిష్ట విద్యా సంస్థ లో ఓ భాగంగా మీరందరూ చేసిన కృషి యొక్క ఫలితమే ఇది. మీకు అందరికీ- ప్రత్యేకించి సఫలతను సాధించిన కుమార్తెలకు- నేను నా యొక్క శుభాకాంక్షలు అందిస్తున్నాను.

ప్రస్తుతం మరు క్రీడారంగాన్ని చూసినా, విద్యారంగాన్ని చూసినా.. ప్రతి చోటా పుత్రికలు అద్భుతాలను చేసిచూపెడుతున్నారు.  నా ముందు వున్న మీ కళ్లలో ఓ మెరుపును నేను చూస్తున్నాను. మీ కళ్లలో ఓ విశ్వాసం తొణికిసలాడుతోంది.  కలలను పండించుకొంటూ భవిష్యత్తు సవాళ్ల ను అధిగమించడంలో ఈ మెరుపు వెల్లివిరుస్తోంది.

మిత్రులారా,

ఇప్పుడు మీ చేతులలో ఉన్నది ఓ పట్టానో లేదా ధ్రువపత్రమో కాదు.. అది ఈ దేశం లోని రైతులు మీపై పెట్టుకొన్న ఆశలకు ప్రతిరూపం.  మీరు పట్టుకున్న ధ్రువపత్రాలు ఈ దేశపు రైతుల ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిబింబాలు.  మనను పోషిస్తున్న ఈ దేశం లోని కోట్లాది రైతుల ఆశలు మీ మీద పెంచుకొన్న అంతు లేని ఆశల, అంచనాలను ధ్రువీకరించే పత్రాలవి.  కాలంతో పాటు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం తో అనేక అంశాలు మూలాల నుండి మారిపోతున్నాయి.  ఈ వాయు వేగాన్ని అందుకోగలిగింది మన దేశపు యువతరమే.  అందుకే నేను ఇవాళ మీ మధ్యకు వచ్చాను..  మీతో ముచ్చటించేందుకు లభించినటువంటి ఈ అవకాశాన్ని ఎంతో ముఖ్యమైందిగా నేను పరిగణిస్తున్నాను.

మిత్రులారా,

సాంకేతిక విజ్ఞానం ఉద్యోగాల స్వభావాన్ని మార్చేస్తున్నట్లుగానే కొత్త ఉపాధి అవకాశాలు పుట్టుకు వస్తున్న రీతి లోనే వ్యవసాయ రంగం లోనూ సరికొత్త పద్ధతులను ఆవిష్కరించడం ఎంతో అవసరం.  మన సంప్రదాయ విధానాలను సాంకేతికతతో ఎంత ఎక్కువగా మేళవిస్తే అంత కంటే ఎక్కువగా రైతులు లబ్ధిని పొందగలుగుతారు.  ఈ దార్శనికత కు అనుగుణంగా దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం తో ముడిపడిన ఆధునిక సాంకేతిక విజ్ఞానం యొక్క వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

దేశం లో ఇప్పటి దాకా 12 కోట్ల కు పైగా భూసార కార్డు లు పంపిణీ అయ్యాయి.  మొత్తం కార్డులలో జ‌మ్ము & కశ్మీర్‌ కు చెందిన 11 లక్షల మందికి పైగా రైతులు ఈ కార్డులను అందుకున్నారు.  ఈ కార్డుల తోడ్పాటు తో రైతులు వారి భూమి లోని సారాన్ని బట్టి తమ పొలానికి ఏవి అవసరమో.. ఏ రకం ఎరువును  ఎంత మేరకు వాడాలో తెలుసుకోగలుగుతారు.

అలాగే 100 శాతం వేప పూత యూరియా తో కూడా రైతులు ప్రయోజనాన్ని పొందారు.  ఇది ఉత్పాదకతను పెంచడానికే కాకుండా ప్రతి హెక్టారు కు యూరియా వినియోగ పరిమాణాన్ని తగ్గించడంలో దోహదపడింది.

నీటి పారుదలకై మరియు ప్రతి ఒక్క నీటి బొట్టును వినియోగించుకోవడానికై ఆధునిక సాంకేతిక విజ్ఞానపు వినియోగాన్ని దృష్టి లో పెట్టుకొని సూక్ష్మ నీటిపారుదల, తుంపర సేద్యం వంటి పద్ధతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.  ప్రతి ఒక్క నీటి చుక్కకు అధిక పంట.. ఇది మన ఉద్యమం కావాలి.

గడచిన నాలుగు సంవత్సరాలలో 24 లక్షల హెక్టార్లకు పైగా భూమి ని సూక్ష్మ నీటిపారుదల, తుంపర సేద్యం ల పరిధి లోకి తీసుకువచ్చాము.  సూక్ష్మ నీటి పారుదలకు 5,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేటాయించేందుకు కేంద్ర మంత్రివర్గం రెండు రోజుల కిందటే ఆమోదం తెలిపింది.  రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న మా లక్ష్యాన్ని ఈ విధానాలు, నిర్ణయాలన్నీ మరింత బలోపేతం చేస్తున్నాయి.  ఈ కృషి ద్వారా ఆవిష్కృతమయ్యే వ్యవస్థలో మీరంతా ఒక ముఖ్యమైన భాగమే.

ఇక్కడ మీ విద్యాభ్యాసం పూర్తయ్యాక వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం లో కీలక పాత్రను పోషించగలరని దేశం మీపైన ఆశలను పెంచుకొంది.  తదనుగుణంగా శాస్త్రీయ పద్ధతులు, సాంకేతిక ఆవిష్కరణలు, పరిశోధన- అభివృద్ధి తదితరాలతో ఇతోధిక తోడ్పాటును అందించగలరని అంచనాలు వేసుకుంది.  కాబట్టి ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకొంటూ వ్యవసాయ, పశుసంవర్ధక రంగాలతో పాటు వాటికి సంబంధించిన ఇతర కార్యకలాపాలను మెరుగుపరచడం యువతరం బాధ్యత.  ఇప్పటి దాకా మీరు చేసిన కృషి ని గురించి విన్నప్పుడు మీపై నా అంచనాలు పెరిగిపోయాయి.  ఈ ప్రాంత రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ఒక నమూనా ను మీరు రూపొందించారని కూడా నేను విన్నాను.  దీనికి మీరు ‘‘సమీకృత వ్యవసాయ విధానం’’ (ఐఎఫ్ ఎస్) అని పేరు పెట్టారు.  ఆహార ధాన్యాలు సహా పండ్లు, కాయగూరలు, పూలు, పశు సంవర్ధకం, మత్స్యసంవర్ధనం, కోళ్ల పెంపకం వంటివి ఇందులో అంతర్భాగంగా ఉన్నాయి.  అలాగే పుట్టగొడుగులు, పచ్చి ఎరువు, బయోగ్యాస్ తదితర అంశాలు కూడా దీని పరిధిలో ఉన్నాయి.  అంతేకాకుండా పొలం గట్ల మీద మొక్కలను నాటే యోచన కూడా ఉంది.  ఇది కచ్చితంగా ప్రతి నెలా అధికాదాయాన్ని తెచ్చిపెట్టడమే కాక ఒక సంవత్సరం వ్యవధి లో రెట్టింపు ఉపాధి ని కూడా కల్పిస్తుంది.

ఏడాది పొడవునా రైతు ఆదాయానికి భరోసానిచ్చే ఈ నమూనా ఎంతో ముఖ్యమైంది.  దీనితో పరిశుభ్ర ఇంధనం లభిస్తుంది.. వ్యర్థాల నుండి విముక్తి కలుగుతుంది.. గ్రామీణ పారిశుధ్యానికీ తోడ్పడుతుంది.  మొత్తంమీద సంప్రదాయ పద్ధతులలో సాగుతో పోలిస్తే ఈ నమూనా రైతు ఆదాయం రెట్టింపు అవుతుందన్న హామీని ఇస్తోంది.  ఈ ప్రాంత వాతావరణ పరిస్థితులకు అనువైందిగా ఈ నమూనా ను మీరు తీర్చిదిద్దినందుకు మీకు నా ప్రత్యేక ప్రశంసలు.  ఈ విధానాన్ని జమ్ము పరిసర ప్రాంతాలలోనూ విస్తృతంగా ప్రచారం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను.

మిత్రులారా,

రైతు ఒక్క పంట పైన మాత్రమే ఆధారపడే పరిస్థితి ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోంది.  అందుకే అదనపు ఆదాయ వనరు కాగల అన్ని పద్ధతులనూ ప్రోత్సహించేందుకు ప్రాముఖ్యమిస్తోంది.  వ్యవసాయంలో కొత్త భవిష్యత్ రంగాల అభివృద్ధి రైతు ప్రగతి లో అంతర్భాగంగా ఉంటూ అందుకు దోహదం చేస్తుంది.

హరిత విప్లవానికి, శ్వేత విప్లవానికి తోడుగా ఇదే నిష్పత్తి లో రైతు ఆదాయాన్ని పెంచే సేంద్రియ విప్లవం, జల విప్లవం, నీలి విప్లవం, మధుర విప్లవం వంటి వాటికి మేం ప్రాముఖ్యమిస్తాం.  ఈ ఏడాది సమర్పించిన బ‌డ్జెటు లో ఈ దిశ‌గా ప్ర‌భుత్వ దృక్ప‌థాన్ని ప్ర‌స్ఫుటం చేశాం.  ఇంతకుముందు పాడి పరిశ్రమ ను ప్రోత్సహించేందుకు కొన్ని ఏర్పాట్లు చేశాము.  అయితే ఈసారి మత్స్య సంవర్ధక, పశు సంవర్ధక రంగాలకు రెండు ప్రత్యేక నిధి పథకాలను సృష్టించి 10000 కోట్ల రూపాయలను కేటాయించాము.  అంటే.. ఇక మీదట రైతులు వ్యవసాయంతో పాటు పశుపోషణకు కూడా సులభంగా మద్దతు పొందగలరు.  దీనికి తోడు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఇచ్చే రుణాన్ని మునుపటి వలె వ్యవసాయానికే పరిమితం చేయకుండా మత్స్య, పశు పోషణలకు కూడా విస్తరించాము.

వ్యవసాయ రంగాన్ని సంస్కరించడం ఒక పెద్ద పథకాన్ని కూడా కోసం ఇటీవలే ప్రకటించడమైంది. వ్యవసాయ రంగానికి సంబంధించిన 11 పథకాలను ‘హరిత క్రాంతి కృషి ఉన్నతి యోజన’ లో కలపడమైంది. దీనికోసం 33,000 కోట్ల రూపాయలను కేటాయించడమైంది. మరి 33000 కోట్ల రూపాయలంటే ఇది చిన్న మొత్తం ఏమీ కాదు కదా.

మిత్రులారా,

వ్యర్థాల నుండి భారీ స్థాయిలో సంపద సృష్టి పైన ప్రభుత్వం దృష్టి సారించింది.  ఆ మేరకు వ్యవసాయ వ్యర్థాలను సంపదగా మార్చే ఈ తరహా ఉద్యమం దేశం లోని వివిధ ప్రాంతాలలో జోరు అందుకొంటోంది.

ఈ ఏడాది బ‌డ్జెటు లో ‘గోబర్ ధన్ యోజన’ ను ప్రభుత్వం ప్రకటించింది. ఇది గ్రామీణ పారిశుధ్యాన్ని మెరుగుపరుస్తుంది.  అంతేకాదు గ్రామంలో పోగుపడే జీవ వ్యర్థాల వినియోగం ద్వారా రైతుల, పశుపోషణలో నిమగ్నమైన గ్రామీణుల ఆదాయం పెంచేందుకు తోడ్పడుతుంది. ఉప ఉత్పత్తులను వాడటంద్వారా సంపద సృష్టించడం ఒక్కటే కాకుండా కొన్ని సందర్భాల్లో ప్రధాన పంటనే విభిన్నంగా వినియోగించడంద్వారా కూడా రైతు ఆదాయాన్ని పెంచవచ్చు. అది కొబ్బరి పీచు వ్యర్థం కావచ్చు.. చిప్పలు కావచ్చు లేదా వెదురు వ్యర్థాలు లేదా పంట కోసిన తరువాత మిగిలిపోయే వ్యర్థాలు కావచ్చు.. ఇవన్నీ అనుబంధ ఆదాయార్జనకు తోడ్పడతాయి.

అలాగే వెదురుకు సంబంధించిన చట్టాన్ని సవరించడం ద్వారా వెదురు సాగు ను సైతం మేము సులభసాధ్యం చేశాము.  మన దేశం ఏటా 15000 కోట్ల రూపాయల విలువైన వెదురు ను దిగుమతి చేసుకుంటోందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.. ఇలా దిగుమతి చేసుకోవడం లో ఎటువంటి తర్కమూ లేదు.

మిత్రులారా,

మీరు ఇక్కడ 12 రకాల కొత్త వంగడాలను అభివృద్ధి చేశారని నా దృష్టికి వచ్చింది.  రణవీర్ బాస్మతి బహుశా దేశవ్యాప్తంగా ఎంతగానో ఆదరణ కు నోచుకొంది.  మీ ప్రయాస అభినందనీయంగా ఉంది.

వ్యవసాయ రంగం ఈ రోజు ఎదుర్కొంటున్న సవాళ్లు ఒక్క విత్తన నాణ్యత కే పరిమితం కాదు.  వాతావరణానికి సంబంధించినటువంటి మార్పుల పరంగా కూడా సవాలు ఎదురవుతోంది.  మన రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రభుత్వ విధానకర్తల ఉమ్మడి కృషి ఫలితంగా గత ఏడాది దిగుబడులు రికార్డు స్థాయి లో  వచ్చాయి.  గోధుమ, వరి, పప్పులు.. అన్నీ దిగుబడులలో పాత రికార్డు లను బద్దలుకొట్టాయి.  వంటనూనెలలు, పత్తి ఉత్పాదకతలోనూ విశేషమైన వృద్ధి నమోదయింది.  కానీ గత కొద్ది సంవత్సరాల గణాంకాలను పరిశీలించినట్టయితే ఇప్పటికీ వ్యవసాయ దిగుబడులలో కొన్ని అస్థిరతలు ఉన్నాయి.  వ్యవసాయం వర్షాధారితం కావడమే ఈ తేడాలకు అతి పెద్ద కారణం.

జల వాయు పరివర్తన ప్రభావం వల్ల ఒక పక్క ఉష్ణోగ్రతలు పెరిగిపోతుంటే కొన్ని ప్రాంతాలలో వర్షాలు తక్కువగా కురుస్తున్నాయి.  జమ్ము & కశ్మీర్ లో కూడా దీని ప్రభావం ఉంది.  వరి పంట కావచ్చు, తోటల పెంపకం కావచ్చు, పర్యటకం కావచ్చు.. ఏ విభాగానికైనా తగినంత నీరు అందుబాటులో ఉండడం చాలా అవసరం.  జమ్ము & కశ్మీర్ లో నీటి అవసరాలను మంచుకొండలు తీర్చుతున్నాయి.  అయితే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతూ ఉండడం వల్ల మంచుకొండలు త్వరితంగా కరిగిపోతున్నాయి.  ఆ కారణంగా కొన్ని ప్రాంతాలలో నీటి ఎద్దడి ఏర్పడుతుంటే మరికొన్ని ప్రాంతాలను వరదలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

మిత్రులారా,

ఇక్కడకు వచ్చే ముందు మీ విశ్వవిద్యాలయాన్ని గురించి చదివిన సందర్భంగా మీ ఫసల్ ప్రాజెక్టు గురించి తెలిసింది. పంటలను వేయడానికి ముందే ఆ పంటల దిగుబడి ఎలా ఉంటుంది, సీజన్ మొత్తంమీద తేమ ఎలా ఉంటుంది అన్న అంశాలను మీరు అధ్యయనం చేస్తారని తెలిసింది.  కానీ ఇప్పుడు మీరు అది దాటి మరింత ముందుకు అడుగు వేయాలి.  కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు కొత్త సాంకేతికతలు అవసరం.  పంటల పరంగానే కాదు, సాంకేతిక విజ్ఞ‌ానం పరంగా కూడా వ్యూహాలను సిద్ధం చేసుకోవడం అవసరం.  అలాగే వ్యవసాయ ఉత్పత్తులకు విలువను ఎలా జోడించాలి అనే అంశం మీ ఆలోచనలలో నిరంతరం ఉండాలి.

మీకు సముద్రపు బక్ థార్న్ అనే దాని ఉదాహరణ చెబుతాను.  దీని గురించి మీరు కూడా వినే ఉంటారు.  లద్దాఖ్ ప్రాంతం లో బాగా కనిపించే ఈ మొక్క మైనస్ 40 డిగ్రీలు, ప్లస్ 40 డిగ్రీల అతి దారుణమైన వాతావరణాన్ని కూడా తట్టుకుని పెరుగుతుంది.  వాతావరణం ఎంత పొడిగా ఉందన్న అంశంతో సంబంధం లేకుండా ఇది ఎదుగుతూనే ఉంటుంది.  క్రీస్తు శకం 8వ శతాబ్దపు టిబెట్ సాహిత్యంలో ఈ మొక్క ఔషధ విలువల ప్రస్తావన ఉంది.  దేశ విదేశాలకు చెందిన ఆధునిక సంస్థలు కూడా ఇది అత్యంత విలువైన ఔషధి అని గుర్తించాయి.  రక్తపోటు, జ్వరం, శరీర భాగాలలో కణుతులు, మూత్రాశయంలో రాళ్లు, అల్సర్, జలుబు, దగ్గు.. ఒక్కటేమిటి సర్వ బాధలు దీని ద్వారా ఉపశమిస్తాయి.

ప్రపంచం లో అందుబాటు లో ఉన్న ఈ ఓషధి ఒక్కటే ప్రపంచం యావత్తు విటమిన్ సి అవసరాలను తీర్చగలదని ఒక అధ్యయనంలో తేలింది.  ఈ వ్యవసాయ ఉత్పత్తి అందిస్తున్న అదనపు విలువ మొత్తం చిత్రాన్నే మార్చి వేసింది.  ఇప్పుడు దీనితో మూలికా తేనీరు, జామ్, ఓషధి నూనెలు, క్రీమ్ లు, హెల్త్ డ్రింక్ లు కూడా తయారుచేస్తున్నారు.  అత్యంత ఎత్తయిన ప్రదేశాలలో పని చేస్తున్న సాయుధ దళాల సిబ్బంది కి ఇది ఎంతో ఉపయోగకరం.  పలు రకాలైన యాంటి ఆక్సిడెంట్ లు దీనితో తయారవుతున్నాయి.

ఈ రోజున నేను ఈ వేదిక మీది నుండి మీకు ఈ ఉదాహరణ ను ఇస్తున్నాను.   దేశం లోని ఏ ప్రాంతానికి మీరు వెళ్లి పని చేసినా సరే, ఇలాంటివి మీకు అనేకం కనిపిస్తాయి.  వాటి ఆధారంగా మీరు కొత్త నమూనాలను అభివృద్ధిపరచవచ్చు.  విద్యార్థి దశ నుండి ఒక ఆధునిక శాస్త్రవేత్తగా మీరు పరివర్తన చెందిన తరువాత దేశంలో వ్యవసాయ విప్లవానికి మీరే నాయకులు కావచ్చు.

వ్యవసాయానికి సంబంధించిన మరో ముఖ్యమైన టాపిక్ కూడా ఉంది. అదే కృత్రిమ మేధస్సు (ఎఐ).  సమీప భవిష్యత్తులో ఇది వ్యవసాయ రంగం ముఖచిత్రాన్నే మార్చేయబోతోంది.  దేశం లోని కొన్ని ప్రాంతాల వ్యవసాయదారులు మాత్రమే దీనిని పరిమితంగా వినియోగిస్తున్నారు.  క్రిమి సంహారకాలు, ఇతర ఔషధాలు పంట చేలలో విరజిమ్మడానికి డ్రోన్ లను ఉపయోగించడం వంటి కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి.

సాయిల్ మ్యాపింగ్, కమ్యూనిటీ ప్రైసింగ్ విధానాలలో కూడా కొత్త సాంకేతికతలును వినియోగిస్తున్నారు.  వీటికి తోడు రానున్న రోజులలో బ్లాక్ చెయిన్ టెక్నాలజీ కూడా కీలక పాత్ర పోషించనుంది.  సరఫరాల వ్యవస్థ ను వాస్తవిక దృక్పథంతో పర్యవేక్షించడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. వ్యవసాయ రంగానికి సంబంధించిన లావాదేవీలలో ఇది పారదర్శకత ను తీసుకు వస్తుంది.  ప్రధానంగా మధ్యవర్తుల దుశ్చర్య లకు అడ్డుకట్ట పడడంతో పాటు వ్యవసాయ వస్తువుల వృథా ను కూడా అరికడుతుంది.

మిత్రులారా,

నాణ్యత లేని విత్తనాలు, ఎరువులు, ఔషధాలే వ్యవసాయ వ్యయాలు పెరిగిపోవడానికి కారణం అన్న విషయం మనందరికీ తెలుసు.  ఈ సమస్య ను కూడా బ్లాక్ చెయిన్ టెక్నాలజీ పరిష్కరిస్తుంది.  ఉత్పత్తి దశ నుండి రైతుల చేతికి చేరే వరకు ఉత్పత్తి నాణ్యత ను ఈ సాంకేతికత సహాయంతో పరిశీలించవచ్చు.  ప్రాసెసింగ్ యూనిట్ లు, పంపిణీదారులు, నియంత్రణ అధికారులు, వినియోగదారుల నెట్ వర్క్ ద్వారా కుదిరే స్మార్ట్ కాంట్రాక్టుల ఆధారంగా ఈ నెట్ వర్క్ ను అభివృద్ధి చేయవచ్చు.  దీనితో అనుసంధానం అయిన ప్రతి ఒక్కరు ఎక్కడ ఏమి జరుగుతోందో స్వయంగా పర్యవేక్షించే అవకాశం ఉండడం వల్ల వ్యవస్థ లో ఎక్కడా అవినీతికి తావు ఉండదు.  అలాగే ఆయా కమోడిటీ లకు సంబంధించి మారుతున్న ధరల విధానం కారణంగా రైతులు నష్టపోయే ఆస్కారం సైతం ఉండదు.  ఈ వ్యవస్థ తో అనుసంధానం అయిన ప్రతి ఒక్కరు వారికి అందుబాటులో ఉన్న సమాచారాన్ని వాస్తవిక విధానంలో అందరికీ అందచేయగలుగుతారు.  పరస్పర అవగాహనతోనే ప్రతి ఒక్క దశ లోనూ ధరలు నిర్ణయించగలుగుతారు.

మిత్రులారా,

ప్రభుత్వం ఇ-ఎన్ఎఎమ్ (e-NAM) విధానం లో భాగంగా ఇప్పటికే గ్రామీణ విపణులను అన్నింటిని అనుసంధానం చేస్తోంది.  22000కు పైగా గ్రామీణ, టోకు ధరల విపణులను ప్రపంచ విపణులతో అనుసంధానం చేసేందుకు కృషి జరుగుతోంది.  వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాల  (ఎఫ్ పిఓ) ఏర్పాటును కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. చిన్న చిన్న సంఘాలుగా ఏర్పడడం ద్వారా గ్రామీణులు తమంత తాముగానే ప్రపంచ విపణి తో అనుసంధానం కావచ్చు. ఇప్పుడు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వంటివి కూడా మా ప్రయత్నాలను మరింత అర్ధవంతం చేస్తున్నాయి.

మిత్రులారా,

స్థానిక అవసరాలకు దీటుగా భవిష్యత్తు సాంకేతికతలకు అనుగుణమైన నమూనాలను మీరే రూపొందించుకోవచ్చు.  వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలు, కొత్త స్టార్టప్ లపై మనందరం దృష్టి సారించాలి.  స్థానిక రైతులందరినీ కొత్త సాంకేతికత తో అనుసంధానం చేసేందుకు మీరు నిరంతరం కృషి చేయాలి.  స్థానికంగా రైతులను సేంద్రియ వ్యవసాయం తో అనుసంధానం చేసేందుకు మీ కోర్సులలో భాగంగా కృషి చేస్తున్నారన్న విషయం నాకు తెలిసింది.  సేంద్రియ వ్యవసాయానికి ఏయే పంటలు అనువైనవో కూడా మీరు పరిశోధన చేస్తున్నారు.  భిన్న స్థాయిలలో ఇలాంటి ప్రయత్నాల వల్ల రైతుల జీవితం తేలిక అవుతుంది.

మిత్రులారా,

గత నాలుగు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం, జమ్ము & కశ్మీర్ రైతులు, తోటల పెంపకం దారుల కోసం పలు పథకాలను ఆమోదించింది.  వ్యవసాయం తో, తోటల పెంపకం తో సంబంధం ఉన్న పలు పథకాల కోసం 500 కోట్ల రూపాయలు మంజూరు చేయగా అందులో 150 కోట్ల రూపాయలు ఇప్పటికే విడుదల చేశారు.  లేహ్, కార్గిల్ లలో కోల్డ్ స్టోరేజ్ లు నిర్మాణంలో ఉన్నాయి.  ఇవి కాకుండా సోలర్ డ్రైయర్ల ఏర్పాటు కు 20 కోట్ల రూపాయల సబ్సిడీలు కూడా మంజూరు చేయడం జరిగింది.  విత్తనాల స్థాయి నుండి విపణి స్థాయి వరకు ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యల వల్ల రాష్ట్ర రైతులు మరింత శక్తివంతులవుతారు.

మిత్రులారా,

2022వ సంవత్సరంలో దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించుకొంటుంది.  అప్పటికి మీలో చాలా మంది వ్యవసాయ శాస్త్రవేత్తలుగా స్థిరపడతారు.  అందుకే 2022 ని దృష్టిలో పెట్టుకొని మీరు, మీ విశ్వవిద్యాలయం కూడా లక్ష్యాలను నిర్దేశించుకోవాలి.  దేశం లోని అత్యున్నత విశ్వవిద్యాలయాల సరసన చేరడమే కాదు, ప్రపంచంలోని 200 అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా ఎలా సిద్ధం కావాలో మీ విశ్వవిద్యాలయం ప్రణాళికలు రచించుకోవాలి. అలాగే విశ్వవిద్యాలయ విద్యార్థులైన మీరు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించుకుని రైతాంగం హెక్టారు దిగుబడులు ఎంతగా పెంచవచ్చునో నిర్ణయించి దానిని సాధించే దిశగా సంకల్పం తీసుకోవాలి.

మిత్రులారా,

మానవ వనరుల నాణ్యత ను పెంచడం కూడా ఒక సవాలే.  మీ విశ్వవిద్యాలయం సహా అన్ని విద్యా సంస్థల ఉమ్మడి బాధ్యత అది.  శిక్షణ, ప్రతిభ, సాంకేతిక విజ్ఞ‌ానం, కాలానుగుణమైన కార్యాచరణ, సంక్లిష్టతలు లేని విధానాలు అనే 5 ‘టి’ లు ఇందులో అత్యంత ప్రధానం అన్నది నా అభిప్రాయం.  అవి దేశ వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పు ను తీసుకువస్తాయి.  మీ సంకల్పాలు తీసుకునే సమయంలో ఈ అంశాలన్నింటినీ మీరు దృష్టిలో పెట్టుకొంటారని నేను ఆశిస్తున్నాను.

మిత్రులారా,

ఈ రోజు మీరంతా కట్టుబాటు లతో కూడిన నాలుగు గోడలకే పరిమితం అయిన తరగతి గది వాతావరణం నుండి బయటపడుతున్నారు.  మీ అందరికీ నా శుభాకాంక్షలు.  ఎందరో ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న సువిశాలపైన తరగతి లోకి మీరు ప్రవేశిస్తున్నారు.  ఇక్కడితో మీ అధ్యయన దశ ముగిసి అసలైన జీవిత పాఠాలను నేర్చుకొనే వాతావరణం ప్రారంభం అవుతుంది. అయినప్పటికీ మీలోని విద్యార్థి దశ ఆలోచనలు కొనసాగిస్తూనే ఉండాలి.  మీ లోని విద్యార్థి ని ఎప్పుడూ అంతరించిపోనీయకూడదు.  అప్పుడే మీరు మీ లోపలి సరికొత్త ఆలోచనలను జోడించి రైతన్నలకు ఉపయోగపడే మెరుగైన పరిజ్ఞానాలు తయారుచేయగలుగుతారు.

మీ తల్లితండ్రుల కలలు నిజం చేయాలనే సంకల్పం మీరంతా చేసుకోవాలి. జాతి నిర్మాణానికి మీ వంతు వాటా ను అందించాలి.  ఈ ఆశ తోనే మీ అందరికీ శుభాకాంక్షలు, నా సహచరులందరికీ అభినందనలు తెలియచేస్తూ నేను ముగిస్తున్నాను.  మీ తల్లితండ్రులకు కూడా నా అభినందనలు తెలియచేస్తున్నాను.

అనేకానేక ధన్యవాదాలు.