Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జమ్ముాకశ్మీర్‌లోని సోన్‌మార్గ్ టన్నెల్ ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

జమ్ముాకశ్మీర్‌లోని సోన్‌మార్గ్ టన్నెల్ ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం


లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గారు, నా మంత్రివర్గ సహచరులు నితిన్ గడ్కరీ గారు, జితేంద్ర సింగ్ గారు, అజయ్ తమ్తా గారు, ఉప ముఖ్యమంత్రి సురేందర్ కుమార్ చౌదరి గారు, ప్రతిపక్ష నేత సునీల్ శర్మ గారు, అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నా ప్రియమైన జమ్మూకశ్మీర్ సోదరసోదరీమణులారా…

అన్నింటికంటే ముందు దేశ, జమ్మూకశ్మీర్ పురోగతి కోసం, తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పని చేసిన వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన కార్మిక మిత్రులు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కానీ అది మన సంకల్పాన్ని ఆపలేదు. నా కార్మిక మిత్రులు వెనక్కి తగ్గలేదు. ఏ కార్మికుడు కూడా ఇంటికి తిరిగి వెళ్లలేదు. ఈ నా కార్మిక సోదరులు అన్ని సవాళ్లను అధిగమించడం ద్వారా ఈ పనిని పూర్తి చేశారు.  ఈ రోజు అన్నింటికంటే ముందు కోల్పోయిన మన ఏడుగురు కార్మికులకు నివాళులర్పిస్తున్నాను.

మిత్రులారా,

ఈ వాతావరణం, మంచు, అందమైన మంచుతో కప్పి ఉన్న పర్వతాలు ఇవన్నీ ఎంతో సంతోషాన్ని కలగజేస్తున్నాయి. రెండు రోజుల క్రితం మన ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి సంబంధించిన కొన్ని ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. వీటిని చూసిన తర్వాత ఇక్కడికి, మీ మధ్యకు రావాలనే నా ఆత్రుత మరింత పెరిగింది. మీ అందరితో నాకు చాలా కాలంగా అనుబంధం ఉందని ముఖ్యమంత్రి కొద్దిసేపటి ముందు చెప్పినట్లుగా  ఇక్కడికి వచ్చినప్పుడు కొన్నేళ్ల కిందటి రోజులు గుర్తుకు వస్తాయి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేసినప్పుడు తరచూ ఇక్కడికి వచ్చేవాడిని. ఈ ప్రాంతంలో చాలా కాలం గడిపాను. సోన్‌మార్గ్, గుల్మార్గ్, గందర్బల్, బారాముల్లా ఇలా ఎక్కడ చూసినా గంటల తరబడి, కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణించాను. అప్పుడు కూడా హిమపాతం చాలా భారీగా ఉండేది, కానీ జమ్మూకశ్మీర్ ప్రజల గొప్పతనం మాకు చలి తెలియకుండా చేసింది.

మిత్రులారా,

ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. ప్రస్తుతం దేశంలోని నలుమూలల పండుగ వాతావరణం నెలకొంది. ప్రయాగ్‌రాజ్‌లో నేటి నుంచి మహా కుంభమేళా ప్రారంభం కానుండటంతో కోట్లాది మంది పుణ్యస్నానాలు ఆచరించేందుకు అక్కడికి వెళ్తున్నారు. నేడు పంజాబ్‌తో సహా మొత్తం ఉత్తర భారతదేశం లోహ్రీ ఉత్సవం జరుపుకొంటోంది. ఇది ఉత్తరాయణం, మకర సంక్రాంతి, పొంగల్ వంటి అనేక పండుగల సమయం. దేశంలో, ప్రపంచంలో ఈ పండుగలను జరుపుకొంటోన్న ప్రజలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ లోయలో ప్రస్తుత సమయాన్ని చిల్లాయ్ కలాన్‌గా పరిగణిస్తారు. మీరు ఈ 40 రోజుల పాటు ఉండే చలి వాతావరణాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారు. దీనికి మరో వైపు కూడా ఉంది. ఈ వాతావరణం సోనామార్గ్ వంటి పర్యాటక ప్రదేశాలకు కొత్త అవకాశాలను కూడా తెస్తుంది. దేశం నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. కశ్మీర్ లోయల్లో ఉన్న అందాలను చూడటానికి ఇక్కడికి రావడం ద్వారా వారు మీ ఆతిథ్యాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నారు.

మిత్రులారా,

ఈ రోజు నేను మీ సేవకుడిగా ఒక పెద్ద బహుమతితో మీ ముందుకు వచ్చాను. కొద్ది రోజుల క్రితం, ముఖ్యమంత్రి చెప్పినట్లుగా 15 రోజుల క్రితం జమ్మూలో సొంత రైల్వే డివిజన్‌కు శంకుస్థాపన చేసే అవకాశం నాకు లభించింది. ఇది మీ పాత డిమాండ్. ఈ రోజు సోనామార్గ్ టన్నెల్‌ను దేశానికి, మీకు అప్పగించే అవకాశం నాకు లభించింది. అంటే జమ్ముాకశ్మీర్, లడఖ్‌ల మరో పాత డిమాండ్ నేడు నెరవేరింది. మోదీ హామీ ఇస్తే దానిని తప్పక నిలబెట్టుకుంటాడు.. ఇదీ మోదీ అని మీరు కచ్చితంగా చెప్పగలరు. ప్రతి పనికి ఒక సమయం ఉంటుంది. సరైన సమయంలో సరైన పని జరుగుతుంది.

మిత్రులారా,

నేను సోనామార్గ్ టన్నెల్ గురించి మాట్లాడుతున్నప్పుడు.. ఇది సోనామార్గ్‌తో పాటు కార్గిల్, లేహ్ ప్రజల జీవితాలను సులభతరం చేస్తుంది. ఇప్పుడు హిమపాతం, వర్షాల సమయంలో కొండచరియలు విరిగిపడటం వల్ల రోడ్లు మూసేసే సమస్య తగ్గుతుంది. రోడ్లు మూసుకుపోతే ఇక్కడి నుంచి పెద్దాసుపత్రికి వెళ్లడం కష్టంగా మారుతుంది. అంతేకాకుండా ఇక్కడికి నిత్యావసర సరుకులు తెచ్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. , ఇప్పుడు సోన్‌మార్గ్ టన్నెల్ నిర్మాణంతో ఈ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.

మిత్రులారా,

అసలు సోన్‌మార్గ్ టన్నెల్ నిర్మాణం 2015లో కేంద్రంలో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కూడా ఈ కాలాన్ని చాలా మంచి మాటల్లో వర్ణించారు. మా ప్రభుత్వ హయాంలోనే ఈ టన్నెల్ పనులు పూర్తైనందుకు సంతోషంగా ఉంది. నా దగ్గర ఎప్పుడూ ఒక మంత్రం ఉంటుంది.. మేం ఏ పని మొదలు పెట్టినా దాన్ని ప్రారంభిస్తాం. ఇది జరుగుతుంది, ఇది పని చేస్తుంది. అది జరిగినప్పుడు అందరికి తెలుస్తుంది.

మిత్రులారా,

ఈ సొరంగం ఈ శీతాకాలంలో సోనామార్గ్ అనుసంధానమై ఉండేలా చూసుకుంటుంది. ఇది సోన్‌మార్గ్‌తో సహా ఈ మొత్తం ప్రాంతంలో పర్యాటకానికి కొత్త రెక్కలను ఇస్తుంది. రాబోయే రోజుల్లో జమ్ముాకశ్మీర్‌లో రోడ్డు, రైలు అనుసంధానానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు పూర్తి కానున్నాయి. ఇక్కడికి సమీపంలోనే అనుసంధానానికి సంబంధించిన మరో భారీ ప్రాజెక్టు పనులు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు కశ్మీర్ లోయ కూడా రైలు మార్గం ద్వారా అనుసంధానం కాబోతుంది. దీనికి సంబంధించి ఇక్కడ చాలా సంతోషకరమైన వాతావరణం నెలకొనడం నేను చూస్తున్నాను. కొత్తగా నిర్మిస్తోన్న రోడ్లు, కశ్మీర్‌కు వస్తోన్న రైళ్లు, కాలేజీలు.. ఇది కొత్త జమ్ముాకశ్మీర్. ఈ టన్నెల్‌కు, ఈ కొత్త దశ అభివృద్ధికి సంబంధించి మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు.

మిత్రులారా,

నేడు భారతదేశం ప్రగతిలో కొత్త శిఖరాల వైపు పయనిస్తోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో దేశంలోని ప్రతి పౌరుడు నిమగ్నమయ్యాడు. మన దేశంలో ఏ ప్రాంతమూ, ఏ కుటుంబమూ ప్రగతిలో, అభివృద్ధిలో వెనుకబడనప్పుడు మాత్రమే ఇది సాధ్యమౌతుంది. ఇందుకోసం సబ్ కా సాత్-సబ్ కా వికాస్ స్ఫూర్తితో మా ప్రభుత్వం రాత్రింబవళ్లు పూర్తి అంకితభావంతో పనిచేస్తోంది. గత పదేళ్లలో జమ్ముాకశ్మీర్ సహా దేశవ్యాప్తంగా 4 కోట్ల మందికి పైగా పేదలకు కాంక్రీట్ ఇళ్లు లభించాయి. రాబోయే కాలంలో మరో మూడు కోట్ల కొత్త ఇళ్లను పేదలకు ఇవ్వబోతున్నాం. నేడు భారత్‌లో కోట్లాది మందికి ఉచిత వైద్యం అందుతోంది. దీని వల్ల జమ్ముాకశ్మీర్ ప్రజలు కూడా ఎంతో ప్రయోజనం పొందారు. కొత్త ఐఐటీలు, కొత్త ఐఐఎంలు, కొత్త ఎయిమ్స్, కొత్త మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు దేశవ్యాప్తంగా యువత విద్య కోసం నిరంతరం నిర్మిస్తున్నాం. జమ్ముాకశ్మీర్‌లో కూడా గత పదేళ్లలో అనేక విద్యాసంస్థల నిర్మాణం జరిగింది. ఇది ఇక్కడి నా కుమారులు, కుమార్తెలు, యువతకు ప్రయోజనం చేకూర్చింది.

 

మిత్రులారా,

నేడు జమ్ముకశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఎన్ని గొప్ప రోడ్లు, సొరంగాలు, వంతెనలు నిర్మిస్తున్నారో చూస్తున్నారు. మన జమ్ముకశ్మీర్ ఇప్పుడు సొరంగాలు, ఎత్తైన వంతెనలు, రోప్ వే లకు  కేంద్రంగా మారుతోంది. ప్రపంచంలోనే ఎత్తైన సొరంగ మార్గాలను ఇక్కడ నిర్మిస్తున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన రైలు-రోడ్డు వంతెనలు, కేబుల్ బ్రిడ్జిలను ఇక్కడ నిర్మిస్తున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన రైలు మార్గాలను ఇక్కడ నిర్మిస్తున్నారు.

మన చీనాబ్ బ్రిడ్జి నిర్మాణ నైపుణ్యం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆశ్చర్యపరిచింది. గత వారమే ఈ వంతెనపై ప్యాసింజర్ రైలు ట్రయల్ పూర్తయింది. జమ్ము కాశ్మీర్‌లో రోడ్డు కనెక్టివిటీకి సంబంధించి రూ. 42 వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులపై ప్రస్తుతం పని కొనసాగుతోంది. కాశ్మీర్ రైల్వే కనెక్టివిటీని మెరుగుపరచే కేబుల్ బ్రిడ్జ్, జోజిలా, చెనాని నశ్రీ, సోనా మార్గ్ టన్నెల్‌లు, ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్టు, శంకరాచార్య ఆలయం, శివ ఖోరి, బల్తాల్-అమర్‌నాథ్ ఆలయ రోప్‌వే పథకం, కట్రా నుండి ఢిల్లీకి ఎక్స్‌ప్రెస్‌వే వంటి ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. నాలుగు జాతీయ రహదారుల ప్రాజెక్టులు, రెండు రింగ్ రోడ్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. సోనామార్గ్ వంటి 14 కి పైగా సొరంగాల పనులు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ జమ్ముకశ్మీర్ ను దేశంలోనే అత్యంత అనుసంధానిత రాష్ట్రాల్లో ఒకటిగా మార్చనున్నాయి.

మిత్రులారా,

అభివృద్ధి చెందిన భారతదేశ ప్రయాణంలో మన పర్యాటక రంగం ప్రాముఖ్యత ఎంతో ఉంది. ఇప్పుడు మెరుగైన కనెక్టివిటీతో, జమ్మూకశ్మీర్ లో పర్యాటకులు ఇప్పటివరకు వెళ్ళలేక పోయిన ప్రాంతాలకు చేరుకోగలుగుతారు. జమ్ముకశ్మీర్ లో గత పదేళ్లలో ఏర్పడిన శాంతి, ప్రగతి వాతావరణం వల్ల పర్యాటక రంగంలో చోటు చేసుకున్న అభివృద్ధిని మనం ఇప్పటికే చూస్తున్నాం. 2024 సంవత్సరంలో 2 కోట్లకు పైగా పర్యాటకులు జమ్మూకశ్మీర్ కు వచ్చారు. ఇక్కడ సోనామార్గ్ లో కూడా పర్యాటకుల సంఖ్య పదేళ్లలో 6 రెట్లు పెరిగింది. ప్రజలు, హోటళ్లు, హోమ్ స్టే యజమానులు, దాబా యజమానులు, బట్టల షాపు యజమానులు, ట్యాక్సీ డ్రైవర్లు ఇలా ప్రతి ఒక్కరూ దీని వల్ల ప్రయోజనం పొందారు.

మిత్రులారా,

21వ శతాబ్దపు జమ్ముకశ్మీర్ అభివృద్ధికి కొత్త కథ రాస్తోంది. మునుపటి క్లిష్టమైన రోజులను విడిచిపెట్టి, మన కాశ్మీర్ ఇప్పుడు భూమిపై స్వర్గంగా తన గుర్తింపును తిరిగి పొందుతోంది. ఈ రోజు ప్రజలు రాత్రిపూట లాల్ చౌక్ కు వెళ్లి ఐస్ క్రీం తింటారు, రాత్రిపూట కూడా అక్కడ చాలా సందడి. ఉంటోంది. కాశ్మీర్ కు చెందిన నా ఆర్టిస్ట్ స్నేహితులు పోలో వ్యూ మార్కెట్ ను కొత్త ఆవాస కేంద్రంగా మార్చారు. ఇక్కడి సంగీత విద్వాంసులు, కళాకారులు, గాయకులు అక్కడ ఎలా ప్రదర్శనలు ఇస్తారో నేను సోషల్ మీడియాలో చూస్తుంటాను. నేడు శ్రీనగర్ లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్చగా తమ పిల్లలతో కలిసి సినిమా హాళ్లకు వెళ్లి సినిమాలు చూస్తున్నారు. సరదాగా షాపింగ్ చేస్తుంటారు. పరిస్థితిని మార్చే ఇన్ని పనులు ఏ ప్రభుత్వమూ చేయదు. జమ్ముకశ్మీర్ లో పరిస్థితిని మార్చిన ఘనత ఇక్కడి ప్రజలకు, మీ అందరికీ దక్కుతుంది. మీరు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశారు, భవిష్యత్తును బలోపేతం చేశారు.

మిత్రులారా,

జమ్ముకశ్మీర్ యువతకు ఉజ్వల భవిష్యత్తును నేను స్పష్టంగా చూడగలను. క్రీడల్లో సృష్టిస్తున్న అవకాశాలను చూడండి. కొన్ని నెలల క్రితం శ్రీనగర్ లో తొలిసారిగా అంతర్జాతీయ మారథాన్ నిర్వహించారు. ఆ ఫోటోలను చూసిన ప్రతి ఒక్కరూ ఆనందంతో ఉప్పొంగిపోయారు, నాకు గుర్తుంది, ఈ రాష్ట్రముఖ్యమంత్రి కూడా ఆ మారథాన్ లో పాల్గొన్నారు, దాని వీడియో కూడా వైరల్ అయింది, నేను ఢిల్లీలో ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఆయనను ప్రత్యేకంగా అభినందించాను. ఈ సందర్భంగా ఆయన ఉత్సాహాన్ని, ఆసక్తిని నేను గమనించాను. మారథాన్ విశేషాలను ఆయన నాకు చాలా వివరంగా చెప్పారు.

మిత్రులారా,

నిజానికి ఇది కొత్త జమ్ముకశ్మీర్ లో కొత్త శకం. తాజాగా నలభై ఏళ్ల తర్వాత కశ్మీర్ లో అంతర్జాతీయ క్రికెట్ లీగ్ జరిగింది. అంతకు ముందు దాల్ లేక్ చుట్టూ కారు రేసింగ్ చేసే అందమైన దృశ్యాలను కూడా చూశాం. మన గుల్మార్గ్ ఒక రకంగా భారతదేశానికి శీతాకాలపు క్రీడల రాజధానిగా మారుతోంది. గుల్మార్గ్ లో నాలుగు ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ జరిగాయి. ఐదో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ కూడా వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. గత రెండేళ్లలో దేశం నలుమూలల నుంచి 2500 మంది క్రీడాకారులు వివిధ క్రీడా పోటీల కోసం జమ్ముకశ్మీర్ కు వచ్చారు. జమ్ముకశ్మీర్ లో తొంభైకి పైగా ఖేలో ఇండియా కేంద్రాలను నిర్మించారు. మా ఊరు నుంచి నాలుగున్నర వేల మంది యువకులు శిక్షణ తీసుకుంటున్నారు.

మిత్రులారా,

నేడు జమ్ముకశ్మీర్ యువతకు అన్ని చోట్లా కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. జమ్మూ, అవంతిపొరాలో ఎయిమ్స్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అంటే ఇప్పుడు చికిత్స కోసం దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. జమ్మూలోని ఐఐటీ-ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ లలో అధ్యయనాలు జరుగుతున్నాయి. మన విశ్వకర్మ మిత్రులు జమ్మూ కాశ్మీర్ లో తమ పనితనాన్ని, హస్తకళా నైపుణ్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, వారు పిఎం విశ్వకర్మ, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ఇతర పథకాల ద్వారా సహాయం పొందుతున్నారు. ఇక్కడికి కొత్త పరిశ్రమలు తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాం. వివిధ పరిశ్రమలకు చెందిన వ్యక్తులు ఇక్కడ సుమారు 13 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతున్నారు. దీనివల్ల ఇక్కడ వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుంది. జమ్ముకశ్మీర్ బ్యాంక్ కూడా ఇప్పుడు మరింత మెరుగ్గా పనిచేయడం ప్రారంభించింది. గత నాలుగేళ్లలో జమ్ముకశ్మీర్ బ్యాంక్ వ్యాపారం లక్షా 60 వేల కోట్ల నుంచి 2 లక్షల 30 వేల కోట్లకు పెరిగింది. అంటే ఈ బ్యాంకు వ్యాపారం పెరుగుతోంది, రుణాలు ఇచ్చే సామర్థ్యం కూడా పెరుగుతోంది. ఇక్కడి యువత, రైతులు-తోటమాలిలు, దుకాణదారులు-వ్యాపారులు ఇలా ప్రతి ఒక్కరూ దీని ద్వారా ప్రయోజనం పొందుతున్నారు.

మిత్రులారా,

జమ్ముకశ్మీర్ గతం ఇప్పుడు అభివృద్ధి వర్తమానంగా మారిపోయింది. ప్రగతి ముత్యాలతో నిండినప్పుడే అభివృద్ధి చెందిన భారతావని కల సాకారమవుతుంది. కశ్మీర్ దేశానికి కిరీటం, భారతదేశానికి కిరీటం. అందుకే ఈ కిరీటం మరింత అందంగా ఉండాలని, ఈ కిరీటం మరింత సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ పనిలో నాకు ఇక్కడి యువత, పెద్దలు, కొడుకులు, కుమార్తెల నిరంతర మద్దతు లభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. జమ్ముకశ్మీర్ పురోగతి కోసం, భారతదేశ పురోగతి కోసం మీ కలలను సాకారం చేసుకోవడానికి మీరు చాలా కష్టపడుతున్నారు. ఈ ప్రయత్నంలో నేను మీ వెంట నడుస్తానని నేను మీకు మరోసారి హామీ ఇస్తున్నాను. మీ కలలకు అడ్డంకిగా వచ్చే ప్రతి అవరోధాన్ని తొలగిస్తాను,

మిత్రులారా,

ఈ రోజు ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా జమ్ముకశ్మీర్ లోని ప్రతి కుటుంబానికి మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా మంత్రివర్గ సహచరులు నితిన్ గడ్కరీ , జమ్ముకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి శ్రీ ఒమర్ అబ్దుల్లా ప్రగతి వేగాన్ని, అభివృద్ధి వేగాన్ని, ప్రారంభించబోయే కొత్త ప్రాజెక్టులను గురించి సవివరంగా తెలిపారు. కాబట్టి, నేను ఆ వివరాలలోకి వెళ్ళను. ఇప్పుడు దూరం తొలగిపోయిందని, ఇప్పుడు మనం కలలను సాకారం చేసుకోవాలని, సంకల్పాలు తీర్మానాలు తీసుకోవాలని, విజయం సాధించాలని మాత్రమే నేను మీకు చెబుతున్నాను. మీ అందరికీ నా శుభాకాంక్షలు.

చాలా ధన్యవాదాలు.

గమనిక: ఇది ప్రధాన మంత్రి ప్రసంగానికి సుమారు అనువాదం. ఆయన అసలు ప్రసంగం హిందీలో చేశారు.