జనవరి 6 మధ్యాహ్నం 12.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ రైల్వే ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేస్తారు.
జమ్మూ ప్రాంతంలో రైల్వే అనుసంధానాన్ని మెరుగుపరిచే దిశగా చేపడుతున్న కీలక చర్యల్లో భాగంగా, కొత్త రైల్వే డివిజన్‌ను ప్రాంరభిస్తారు. అలాగే తెలంగాణలోని చర్లపల్లిలో కొత్త టెర్మినల్ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. ఈస్ట్ కోస్టు రైల్వేలో రాయగడ రైల్వే డివిజన్ భవనానికి శంకుస్థాపన చేస్తారు.
పఠాన్‌కోట్ – జమ్ము – ఉదంపూర్ – శ్రీనగర్ – బారాముల్లా, భోగ్పూర్ సిర్వాల్ – పఠాన్ కోట్, బటాలా – పఠాన్‌కోట్, పఠాన్‌కోట్ నుంచి జోగిందర్ నగర్ సెక్షన్ల వరకు 742.1 కి.మీ.ల దూరంతో జమ్ము రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేశారు. దీనివల్ల జమ్ము, కశ్మీర్ పరిసర ప్రాంతాలకు లబ్ధి చేకూరుతుంది. అలాగే దేశంలోని ఇతర ప్రాంతాలతో రవాణా సౌకర్యాలు మెరుగవ్వాలన్న ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయి. అలాగే ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. మౌలిక వసతుల అభివృద్ధి జరిగి పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది. తద్వారా ఈ ప్రాంతంలో సామాజిక ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది.
తెలంగాణలోని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో రూ.413 కోట్ల వ్యయంతో చర్లపల్లి కొత్త టెర్మినల్‌ను నూతన కోచింగ్ టెర్మినల్‌గా అభివృద్ధి చేశారు. ప్రయాణీకులకు సకల సౌకర్యాలు కల్పిస్తూ నిర్మించిన ఈ పర్యావరణ హిత టెర్మినల్ నగరంలో ఇప్పటికే ఉన్న కోచింగ్ టెర్మినళ్లు అయిన సికింద్రాబాద్, హైదరాబాద్, కాచీగూడ స్టేషన్లపై రద్దీ ప్రభావాన్ని తగ్గిస్తుంది.
ఈస్ట్ కోస్ట్ రైల్వేలో రాయగడ రైల్వే డివిజన్ భవనానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇది ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరచి, ఈ ప్రాంత సమగ్ర సామాజిక-ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది.
***