‘అందరికీ ఇళ్లు’ అనే తన ఆలోచనకు అనుగుణంగా ఢిల్లీలోని అశోక్ విహార్‌లో నిర్మించిన స్వాభిమాన్ గృహసముదాయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సందర్శిస్తారు. యథాస్థానంలో మురికివాడ పునరావాస ప్రాజెక్టులో భాగంగా జుగ్గీ జోప్రి (జేజే) క్లస్టర్ల నివాసితుల కోసం వీటిని నిర్మించారు. జనవరి 3, 2025న దాదాపుగా మధ్యాహ్నం 12.10 గంటలకు వీటిని ప్రధాని సందర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.45 గంటలకు ఢిల్లీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.
జేజే క్లస్టర్ల నివాసితుల కోసం ఢిల్లీలోని అశోక్ విహార్‌లో నూతనంగా నిర్మించిన స్వాభిమాన్ గృహసముదాయంలో 1,675 ప్లాట్లను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను అందజేస్తారు. కొత్తగా నిర్మించిన ఈ ఫ్లాట్లు, యథాస్థానంలో మురికివాడ పునరావాస ప్రాజెక్టులో భాగంగా ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) విజయవంతంగా పూర్తి చేసిన రెండో దశ ఇది. ఢిల్లీలోని జేజే క్లస్టర్ల నివాసితులకు అన్ని వసతులు, సౌకర్యాలతో కూడిన ఆరోగ్యకరమైన నివాస వాతావరణాన్ని కల్పించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.
ప్రతి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఖర్చు చేసిన ప్రతి రూ.25 లక్షల మొత్తంపై లబ్ధిదారులు 7 శాతం తక్కువ చెల్లిస్తారు. దీనిలోనే రూ.1.42 లక్షల నామమాత్రపు చెల్లింపుతో పాటు ఐదేళ్ల నిర్వహణ నిమిత్తం రూ. 30,000 భాగంగా ఉన్నాయి.
రెండు పట్టణ పునరాభివృద్ధి ప్రాజెక్టులు – నౌరోజీ నగర్లో నిర్మించిన అంతర్జాతీయ వ్యాపార కేంద్రం (డబ్ల్యూటీసీ), సరోజనీ నగర్‌లోని జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామడేషన్ (జీపీఆర్‌ఏ) టైప్ – II క్వార్టర్లను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.
నౌరోజీ నగర్లో శిథిలావస్థలో ఉన్న 600 క్వార్టర్లను తొలగించి అత్యాధునిక వసతులతో కూడిన వాణిజ్య టవర్లతో అంతర్జాతీయ వ్యాపార కేంద్రాన్ని నిర్మించారు. తద్వారా 34 లక్షల చదరపు గజాల విస్తీర్ణంలో అధునాతన వసతులతో వాణిజ్య స్థలం అందుబాటులోకి వచ్చింది. సున్నా వ్యర్థాల విధానం, సౌర విద్యుత్ ఉత్పత్తి, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థల వంటి హరిత భవన నిర్మాణ పద్ధతులతో ఈ ప్రాజెక్టును నిర్మించారు.
సరోజినీ నగర్‌లోని జీపీఆర్‌ఏ టైప్ – II క్వార్టర్లలో 28 టవర్లు నిర్మించారు. వీటిలో స్థలాన్ని సమర్థంగా ఉపయోగించి, ఆధునిక వసతులతో నిర్మించిన 2,500 నివాస యూనిట్లు ఉన్నాయి. వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ, మురుగు నీటి పారుదల, నీటి శుద్ధి వ్యవస్థలు, సౌరవిద్యుత్ ఆధారిత వ్యర్థ నిర్వహణ యంత్రాలు తదితర పర్యావరణ జీవన విధానాన్ని ప్రోత్సహించే పద్ధతులను ఈ ప్రాజెక్టులో భాగం చేశారు.
ఢిల్లీలోని ద్వారకలో సుమారుగా రూ. 300 కోట్ల రూపాయలతో నిర్మించిన సీబీఎస్ఈ సమీకృత కార్యాలయ సముదాయాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దీనిలో కార్యాలయాలు, ఆడిటోరియం, అధునాతన సమాచార కేంద్రం, సమగ్ర నీటి నిర్వహణ వ్యవస్థ తదితరమైని ఉన్నాయి. అత్యున్నత పర్యావరణ నిర్దేశాలు, భారత హరిత భవన మండలి (ఐజీబీసీ) నిర్దేశించిన ప్లాటినం రేటింగ్ ప్రమాణాలు ప్రకారం ఈ పర్యావరణహిత భవనాన్ని నిర్మించారు.
ఢిల్లీ యూనివర్సిటీలో రూ.600 కోట్లతో నిర్మించే మూడు కొత్త ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. వీటిలో తూర్పు ఢిల్లీలోని సూరజ్‌మల్ విహార్‌లో తూర్పు క్యాంపస్ లో అకడమిక్ బ్లాక్, ద్వారకలోని పశ్చిమ క్యాంపస్‌లో మరో అకడమిక్ బ్లాక్ ఉన్నాయి. నజఫ్గఢ్లోని రోషన్‌పురలో అత్యాధునిక వసతులతో వీర్ సావర్కర్ కళాశాలను నిర్మిస్తున్నారు.