Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జనవరి 14న భారత వాతావరణ విభాగం 150వ వ్యవస్థాపక దినోత్సవానికి హాజరుకానున్న ప్రధానమంత్రి


భారత వాతావరణ విభాగం (ఐఎండి) 150వ వ్యవస్థాపక దినోత్సవం నేపథ్యంలో జనవరి 14న ఉదయం 10:30 గంటలకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించే కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన సభనుద్దేశించి ప్రసంగిస్తారు. భారత్‌ను ‘వాతావరణ సంసిద్ధ-వాతావరణ సాంకేతిక’ దేశంగా రూపొందించే ధ్యేయంతో రూపొందించిన ‘మిషన్‌ మౌసమ్‌’ను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. అత్యాధునిక వాతావరణ పరిశీలన సాంకేతిక పరిజ్ఞానాలు-వ్యవస్థలతోపాటు అధిక సాంద్రతగల వాతావరణ విశ్లేషణ చిత్రాలు, భవిష్యత్తరం రాడార్లు-ఉపగ్రహాల రూపకల్పన సహా అధిక సామర్థ్యంగల కంప్యూటర్ల తయారీ వంటి లక్ష్యాల సాధన ఈ కార్యక్రమంలో అంతర్భాగంగా ఉంటుంది. అలాగే వాతావరణం-సంబంధిత అంచనా ప్రక్రియలపై అవగాహన మెరుగుదల, దీర్ఘకాలిక వాతావరణ నిర్వహణ, కార్యకలాపాల వ్యూహాత్మక రూపకల్పనలో తోడ్పడే వాయు నాణ్యత సమాచార సేకరణపైనా ‘మిషన్‌ మౌసమ్‌’ దృష్టి సారిస్తుంది.

   ఈ వేడుకలలో భాగంగా వాతావరణ ప్రతిరోధకత, వాతావరణ మార్పులతో సంధానం దిశగా రూపొందించిన ‘ఐఎండి దార్శనిక పత్రం-2047ను కూడా ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు. వాతావరణ అంచనా, నిర్వహణ, శీతోష్ణస్థితి మార్పు సమస్యల ఉపశమన ప్రణాళికలు ఇందులో భాగంగా ఉంటాయి.

   ‘ఐఎండి’ 150వ వ్యవస్థాపక దినోత్సవంలో భాగంగా గత 150 ఏళ్లలో ఈ విభాగం సాధించిన విజయాలు, దేశాన్ని వాతావరణ ప్రతిరోధకంగా తీర్చిదిద్దడంలో దాని కృషి, వివిధ వాతావరణ-శీతోష్ణస్థితి సంబంధిత సేవల ప్రదానంలో ప్రభుత్వ సంస్థల పాత్ర వగైరాలను వివరిస్తూ అనేక కార్యక్రమాలు, కార్యకలాపాలు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు.

 

***