Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఛ‌త్తీస్ గ‌ఢ్ లోని భిలాయి లో వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల ప్రారంభ కార్యక్రమంలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం


భార‌త్ మాతా కీ జయ్

దేశానికి ఛ‌త్తీస్ గ‌ఢ్ అందించిన అమూల్య‌ ర‌త్నం భిలాయి ఉక్కు క‌ర్మాగారం.  ఇది  రాష్ట్ర శ‌క్తి కి ప్ర‌తీక‌.  సుపరిచితుడు, ప్రజాదరణకు పాత్రుడైన ఛ‌త్తీస్ గ‌ఢ్ ముఖ్య‌మంత్రి మరియు నా పాత స‌హ‌చ‌రుడు డాక్ట‌ర్ ర‌మణ్ సింహ్ గారు, కేంద్రంలో నా స‌హ‌చ‌ర మంత్రి శ్రీ చౌధ‌రి బీరేంద‌ర్ సింహ్ గారు, మంత్రి శ్రీ మ‌నోజ్ సిన్హా గారు, ఈ భూమి పుత్రుడు, కేంద్రంలో నా స‌హ‌చ‌రుడు శ్రీ విష్ణు దేవ్ సహాయ్ గారు, ఛ‌త్తీస్ గ‌ఢ్ అసెంబ్లీ స్పీక‌ర్ శ్రీ గౌరీ శంక‌ర్ అగ‌ర్వాల్ గారు, రాష్ట్ర మంత్రులు, ఛత్తీస్ గ‌ఢ్ కు చెందిన నా సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా.

మీ ఆశీస్సులను పొందే అదృష్టం నాకు మ‌రోసారి లభించింది.  ఈ రోజు వలెనే ఆ రోజు కూడా 14వ తేదీ.  ఖ‌చ్చితంగా రెండు నెల‌ల క్రితం- ఏప్రిల్ 14వ తేదీన- ఇదే గ‌డ్డ‌ మీద‌ నుండి ఆయుష్మాన్ భార‌త్ కార్య‌క్ర‌మం ఒకటో ద‌శ‌ ను నేను ప్రారంభించాను.

ఈ రాష్ట్ర భ‌విష్య‌త్తు ను  సుస్థిరం చేయ‌డానికిగాను ఛ‌త్తీస్ గ‌ఢ్ చ‌రిత్ర‌ లోనే ఈ రోజున మ‌రొక సువ‌ర్ణ అధ్యాయం ఆరంభమైంది.  కొంత‌కాలం క్రితం భిలాయి ఉక్కు క‌ర్మాగారం విస్త‌ర‌ణ‌, ఆధునీక‌ర‌ణ‌, జ‌గ‌ద‌ల్ పుర్ కు రెండో విమానాశ్ర‌యం, రాయ్ పుర్ లో నూత‌న క‌మాండ్ కేంద్రం ప్రారంభం మొద‌లైన అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాలు మొదలయ్యాయి.  అంతే కాదు భిలాయి లో ఐఐటి క్యాంప‌స్ అభివృద్ధి కార్య‌క్ర‌మంతో పాటు భార‌త్ నెట్ రెండో ద‌శ కూడా ఇదే రాష్ట్రంలో ప్రారంభించ‌డం జ‌రిగింది.

నా ఛ‌త్తీస్ గ‌ఢ్ సోద‌రులకు మరియు సోద‌రీమ‌ణుల‌కు 22 వేల కోట్ల రూపాయ‌లు విలువ చేసే ఈ ప్రాజెక్టుల‌ను ఈ రోజు అంకితం చేస్తున్నాను.  ఈ ప్రాజెక్టుల కార‌ణంగా విద్య‌, ఉపాధి రంగాలలో నూత‌న అవ‌కాశాలు ఏర్ప‌డుతాయి.  ఈ ప్రాజెక్టుల కార‌ణంగా ఛ‌త్తీస్ గ‌ఢ్ లోని మారుమూల ప్రాంతాల‌కు ఆధునిక క‌మ్యూనికేశన్ సాంకేతిక‌ విజ్ఞానం అందుబాటులోకి వ‌సుంది.  గ‌తంలో చాలా సంవ‌త్స‌రాల‌ పాటు బ‌స్త‌ర్ అంటే తుపాకులు, పిస్తోళ్లు, హింస గుర్తుకు వచ్చేవి.  ఇవాళ జ‌గ‌ద‌ల్ పుర్ విమానాశ్ర‌యం తో బ‌స్త‌ర్ కు గుర్తింపు వ‌చ్చింది.

మిత్రులారా,

ఛ‌త్తీస్ గ‌ఢ్ ప్ర‌జ‌లు విరామ‌ం ఎరుగ‌కుండా చేసిన కృషి ఫలితంగా అట‌ల్ బిహారీ వాజ్ పేయీ గారి దార్శ‌నిక‌త కార‌ణంగా ఎంతో వేగంగా అభివృద్ధి చెందిన ఈ ప్రాంతం మ‌న‌కు ఎంతో ఆహ్లాద‌క‌ర‌మైన‌, స్ఫూర్తిదాయ‌క‌ర‌మైన అనుభూతి ని ఇస్తోంది.
అట‌ల్ గారు అందించిన దార్శ‌నిక‌త‌ ను నా స్నేహితుడు శ్రీ ర‌మ‌ణ్ సింహ్ గారు ముందుకు తీసుకుపోయారు.  మేము త‌ర‌చూ క‌లుస్తుంటాము, ఫోన్ లో మాట్లాడుకుంటూ వుంటాము.  ప్ర‌తి సారీ శ్రీ ర‌మ‌ణ్ సింహ్ గారు ఒక నూత‌న ఆలోచ‌న‌ తోనో, ఒక కొత్త ప‌థ‌కం తోనో, ఒక కొత్త ఆశ‌ తోనో, ఉత్సాహం తోనో వ‌స్తుంటారు.  వాటిని విజ‌య‌వంతంగా అమ‌లు చేసే విష‌యంలో ఆయ‌న ఎంతో ప‌ట్టుద‌ల‌ను క‌న‌బ‌రుస్తారు.

మిత్రులారా,

చ‌ట్టం, శాంతి అనేవి జీవితానికి సంబంధించిన‌ ప్రాథమిక అవ‌స‌రాలు.  అవి అభివృద్ధి సాధ‌న‌కు ముఖ్య‌మైన‌విగా ఉంటాయ‌నే విష‌యం మ‌నకు అంద‌రికీ బాగా తెలుసును.  శ్రీ ర‌మ‌ణ్ సింహ్ గారు ఒక వైపున శాంతి ని, సుస్థిర‌త‌ ను, శాంతి-భ‌ద్ర‌త‌లను కాపాడుతూనే మ‌రో వైపున నూత‌న ఆలోచ‌న‌లతో, ప‌థ‌కాల‌తో అభివృద్ధి లో రాష్ట్రం నూత‌న శిఖ‌రాలు చేరుకొనేటట్టు కృషి చేస్తున్నారు.  ఈ అభివృద్ధి ప్ర‌యాణం చ‌క్క‌గా సాగుతున్నందుకుగాను ఛ‌త్తీస్ గ‌ఢ్ సోద‌రులు మరియు సోద‌రీమ‌ణుల‌కు, శ్రీ ర‌మ‌ణ్ సింహ్ గారికి ఇవే నా అభినంద‌న‌లు.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

ఈ ప్రాంతం నాకు కొత్త కాదు.  ఛ‌త్తీస్ గ‌ఢ్ మ‌ధ్య‌ ప్ర‌దేశ్ రాష్ట్రంలో భాగంగా ఉన్న రోజుల్లో నేను ఇక్క‌డ‌కు ద్విచ‌క్ర వాహ‌నం మీద వ‌చ్చేవాడిని.  సంస్థాగ‌త‌మైన ప‌ని మీద నేను ఇక్క‌డ‌కు వ‌చ్చే వాడిని.  మేము ఇక్క‌డ యాభై మంది దాకా సమావేశ‌మ‌య్యేవాళ్లము.  జాతీయ విష‌యాల‌తో పాటు మ‌ధ్య‌ ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్ గ‌ఢ్‌, ఇంకా ఇత‌ర ప్రాంతాల‌కు సంబంధించిన సామాజిక విష‌యాలను గురించి మేము చ‌ర్చించుకునే వాళ్లము.  ఆ రోజుల్లో నాకు ఛ‌త్తీస్ గ‌ఢ్ తో చాలా ద‌గ్గ‌రగా బంధ‌ం ఉండేది.  ఇక్క‌డి ప్ర‌జ‌లు నా మీద ఎంతో ప్రేమ‌ను చూపే వారు.  మీతో నేను ఎల్ల‌ప్పుడూ క‌లిసిపోయి వుండే వాడిని.  గ‌త 20-25 సంవత్సరాలలో ఛ‌త్తీస్ గ‌ఢ్‌ ను సంద‌ర్శించ‌ని సంవత్సరం అంటూ నా జీవితంలో లేదు.  ఈ రాష్ట్రం లోని ప్ర‌తి జిల్లా ను నేను సంద‌ర్శించాను.  ఇక్క‌డి ప్ర‌జ‌ల అపారమైన‌ ప్రేమానురాగాల‌ను నేను పొందాను.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

ఇక్క‌డ‌కు రాక‌ముందు నేను భిలాయి ఉక్కు క‌ర్మాగారాన్ని సంద‌ర్శించాను.  ఈ కర్మాగారం ఆధునిక సాంకేతిక‌ విజ్ఞానంతో ప‌ని చేస్తోంది.  18 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా ఖ‌ర్చు చేసి దీనికి నూత‌న సామ‌ర్థ్యాన్ని అందించ‌డం జ‌రిగింది.  ఆధునికీక‌రించిన ఈ నూత‌న క‌ర్మాగారాన్ని ప్రారంభించే అదృష్టం నాకు దక్కింది.  దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చిన త‌రువాత కచ్ఛ్ నుండి క‌టక్ దాకా.. కార్గిల్ నుండి క‌న్యాకుమారి దాకా వేసిన రైల్వే ట్రాకుల‌న్నీ ఈ నేల మీద ప్ర‌జ‌ల క‌ష్టంతో వేసిన‌వనే విష‌యం చాలా కొద్ది మందికి మాత్ర‌మే తెలుసు.  ఇది వాస్త‌వం.  భిలాయి క‌ర్మాగారం ఉక్కు ను మాత్ర‌మే త‌యారు చేయ‌డం లేదు; ఇది దేశ ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాల‌ను మెరుగుప‌రుస్తోంది.  ఆధునికీక‌రించిన భిలాయి క‌ర్మాగారం బ‌లోపేత‌మైన ఉక్కు ను త‌యారు చేస్తున్న‌ట్టే దేశ పునాదుల‌ను బ‌లోపేతం చేస్తుంది.  ఉక్కు క‌ర్మాగారాల కార‌ణంగా భిలాయి, దుర్గాట్ స్వ‌రూప స్వ‌భావాలే మారిపోయాయ‌నే విష‌యం మీ అంద‌రికీ ఎరుకే.  బ‌స్త‌ర్‌ లో ఏర్పాటు చేసిన ఉక్కు క‌ర్మాగారం కూడా ఆ ప్రాంత ప్ర‌జ‌ల జీవితాల్లో మార్పును తీసుకు వస్తుంద‌ని నేను న‌మ్ముతున్నాను.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

ఛ‌త్తీస్ గ‌ఢ్‌లో ఇనుప గ‌నులు రాష్ట్ర అభివృద్ధి కార్య‌క్ర‌మాన్ని వేగ‌వంతం చేయ‌డంలో ముఖ్య‌మైన పాత్ర‌ను పోషించాయి.  మీకు ముఖ్యంగా నా గిరిజ‌న సోద‌ర సోద‌రీమ‌ణుల‌కు దానిపైన హ‌క్కు ఉంది.  అందుకే మా ప్ర‌భుత్వం వచ్చిన త‌రువాత చ‌ట్టంలో కీల‌క‌మైన మార్పు ను చేశాం.  మైనింగు ద్వారా వ‌చ్చే ఆదాయంలో కొంత భాగాన్ని స్థానిక ప్ర‌జ‌ల అభివృద్ధికి ఖ‌ర్చు చేయాల‌ని మేము నిర్ణ‌యం తీసుకున్నాము.  దీనికి సంబంధించి చ‌ట్టాన్ని రూపొందించాము. మైనింగు జిల్లాలో డిస్ట్రిక్ట్ మిన‌రల్ ఫౌండేశన్ ను ఏర్పాటు చేశాము.  త‌ద్వారా ఛ‌త్తీస్ గ‌ఢ్‌ కు 3 వేల  కోట్ల రూపాయలు ల‌భించాయి. ఈ డ‌బ్బుతో ఆయా ప్రాంతాలలో ఆసుప‌త్రులు, విద్యాల‌యాలు, ర‌హ‌దారులు, మ‌రుగుదొడ్లు నిర్మిస్తున్నాము.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

అభివృద్ధిని సాధించాలంటే దేశంలోనే త‌యారీ ఎంత ముఖ్య‌మో నైపుణ్యాల అభివృద్ధి కూడా అంతే అవ‌స‌రం.  దేశంలోనే గ‌ర్వించ‌ద‌గ్గ గొప్ప విద్యాసంస్థ‌ల కూడ‌లిగా ద‌శాబ్దాల త‌ర‌బ‌డి భిలాయి కి పేరు ప్ర‌ఖ్యాతులు ఉన్నాయి.  ఈ సౌక‌ర్యాల‌తో పాటు ఐఐటి ని స్థాపించవలసిన అవ‌స‌రం వ‌చ్చింది.  గ‌త ప్ర‌భుత్వ స‌మ‌యంలోనే  మీ ముఖ్య‌మంత్రి శ్రీ ర‌మ‌ణ్ సింహ్ గారు ఇక్క‌డ ఐఐటి ఏర్పాటుకై ఎంత‌గానో శ్ర‌మించారు.  ఆ స‌మ‌యంలో కేంద్రప్ర‌భుత్వ తీరు ఎలా ఉండేదో మీ అందరికీ బాగా తెలుసు.  మా ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే దేశంలో ఐదు ఐఐటి ల‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాము.  ఫ‌లితంగా  కోట్లాది రూపాయ‌లు వెచ్చించి ఏర్పాటు చేసిన భిలాయి ఐఐటి ని ఈ రోజున ప్రారంభించ‌డం జ‌రిగింది.  ఈ క్యాంప‌స్ ను 1100 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో నిర్మించ‌డమైంది.  ఈ విద్యాల‌యం ఛ‌త్తీస్ గ‌ఢ్‌తో పాటు దేశం లోని ఇత‌ర ప్రాంతాల ప్ర‌తిభాశాలి విద్యార్థుల‌కు అవ‌స‌ర‌మైన సాంకేతిక‌త‌ను, సాంకేతిక విద్య‌ ను అందుబాటులోకి తీసుకువచ్చే కేంద్ర‌ంగా త‌న‌ను తాను నిరూపించుకుంటుంద‌న‌డంలో సందేహం లేదు.

మిత్రులారా,

కొన్ని నిమిషాల క్రితం ఈ వేదిక మీద కొంత‌మంది యువ‌కుల‌కు లాప్ టాప్ లు అందించే అవ‌కాశం నాకు ల‌భించింది.  సూచ‌న్ క్రాంతి యోజ‌న ద్వారా భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం ఇక్క‌డ కంప్యూట‌ర్ మ‌రియు సాంకేతిక విద్య కోసం శ్ర‌ద్ధ‌ వహించి నిరంత‌రం ప‌ని చేస్తోంది.  ప్ర‌జ‌ల‌కు ఎంత ఎక్కువ‌గా సాంకేతిక‌త‌ను ద‌గ్గ‌ర చేస్తామో, వారికి అన్ని ఎక్కువ ప్ర‌యోజ‌నాలు చేకూరుతాయి.  గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా ఈ దార్శ‌నిక‌త‌ తోనే డిజిట‌ల్ ఇండియా కార్య‌క్ర‌మాన్ని ముందుకు తీసుకుపోతున్నాము.  ఛ‌త్తీస్ గ‌ఢ్ ప్ర‌భుత్వం కూడా ఈ దార్శ‌నిక‌త‌ను ముందుకు తీసుకుపోయి రాష్ట్రంలో ప్ర‌తి ఇంటికి సాంకేతిక‌త‌ను అంద‌జేయ‌డంలో నిమ‌గ్న‌మై ఉంది.

మిత్రులారా,

చివ‌రిసారి ఇక్క‌డకు నేను బాబాసాహెబ్ ఆంబేడ్ కర్ జ‌యంతి ఉత్స‌వాల సంద‌ర్భంగా వ‌చ్చాను.  ఆ స‌మ‌యంలో బ‌స్త‌ర్ నెట్ పేరుతో ఇంట‌ర్ నెట్ క‌నెక్ష‌న్ కార్య‌క్ర‌మం ఒకటో ద‌శ‌ ను ప్రారంభించే అవ‌కాశం ల‌భించింది.  ఈ రోజున దీనికి సంబంధించిన రెండో ద‌శ కార్య‌క్ర‌మం భార‌త్ నెట్ 2 ను ప్రారంభించ‌డమైంది.  2500 కోట్ల‌ రూపాయలతో ఈ ప్రాజెక్టు ను వ‌చ్చే సంవత్సరం మార్చి నెల నాటికి  పూర్తి చేయ‌డానికిగాను ప్ర‌భుత్వం కృషి చేయ‌బోతోంది.  ఛ‌త్తీస్ గ‌ఢ్ లో ఇప్ప‌టికే దాదాపు 4 వేల పంచాయితీల‌కు ఇంట‌ర్ నెట్ సౌక‌ర్యాన్ని క‌ల్పించాము.  వ‌చ్చే సంవత్సరానిక‌ల్లా మిగ‌తా 6 వేల పంచాయితీల‌కు ఇంట‌ర్ నెట్ క‌నెక్ష‌న్ ల‌భిస్తుంది.

మిత్రులారా,

రాష్ట్రంలో డిజిట‌ల్ ఇండియా మిశన్, భార‌త్ నెట్ ప్రాజెక్టు , రాష్ట్ర ప్ర‌భుత్వ సంచార్ క్రాంతి యోజ‌న‌, 50 ల‌క్ష‌ల స్మార్ట్ ఫోన్ ల పంపిణీ, 1200 మొబైల్ ట‌వ‌ర్ ల ఏర్పాటు మొద‌లైన ప‌నుల ద్వారా పేదలను, గిరిజ‌న, అణ‌గారిన వ‌ర్గాల‌ను సాధికారులను చేయ‌డానికిగాను ఒక నూత‌న పునాదిని ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతోంది.  డిజిట‌ల్ క‌నెక్టివిటీ అనేది ప్రాంతాల‌ను మాత్ర‌మే క‌ల‌ప‌డం లేదు; ఇది ప్ర‌జ‌ల‌ను కూడా ద‌గ్గ‌ర చేస్తున్న‌ది.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

జ‌ల‌మార్గాల ద్వారా, భూమార్గాల ద్వారా దేశంలో అన్ని ప్రాంతాల‌ను క‌ల‌ప‌డానికిగాను బృహ‌త్త‌ర ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది.  గ‌త ప్ర‌భుత్వాలు కొన్ని ప్రాంతాల్లో రోడ్ల‌ను నిర్మించ‌డానికే సందేహించాయి.  మా ప్ర‌భుత్వం రోడ్ల‌తో పాటు ఆయా ప్రాంతాల‌కు విమానాశ్ర‌యాల‌ను నిర్మించ‌డం జ‌రిగింది.  మీకు ఈ విష‌యాన్ని ముందే చెప్పాను.  ఈ దేశంలో సాధార‌ణ పౌరుడు కూడా వాయు మార్గంలో ప్ర‌యాణం చేయాలనేది నా ఆకాంక్ష‌.  ఇందుకోసం ఉడాన్ ప‌థ‌కాన్ని ప్రారంభించాం.  దేశ వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో నూత‌న విమానాశ్ర‌యాల‌ను నిర్మించాము.  ఇందులో భాగంగా జ‌గ‌ద‌ల్ పుర్ విమానాశ్ర‌యాన్ని ఏర్పాటు చేస్తున్నాము.  ఇప్ప‌టికే జ‌గ‌ద‌ల్ పుర్, రాయ్ పుర్ ల‌కు మ‌ధ్య‌ విమాన‌యానం మొద‌లైంది.  ఇప్పుడు జ‌గ‌ద‌ల్ పుర్ నుండి రాయ్ పుర్‌ కు 6-7 గంట‌లు ప‌ట్టే ప్ర‌యాణం 40 నిమిషాలలో ముగుస్తుంది.

మిత్రులారా,

ప్ర‌భుత్వ విధానాల కార‌ణంగా ప్ర‌జ‌లు ప్రస్తుతం రైల్వే ఏసీ కోచ్ లలో ప్ర‌యాణం చేయ‌డం కంటే విమాన‌ మార్గం ద్వారా ప్ర‌యాణించడానికే ప్రాధాన్య‌ం ఇస్తున్నారు.  రాయ్ పుర్‌ లో గ‌తంలో రోజుకు కేవ‌లం 6 విమానాలు దిగుతుండేవి.  ఇప్పుడు ప్ర‌తి రోజూ 50 విమానాలు ఇక్క‌డ దిగుతున్నాయి.  నూత‌న విమాన మార్గాల కార‌ణంగా రాజ‌ధాని నుండి రాయ్ పుర్ కు దూరం త‌గ్గ‌డ‌మే కాకుండా ప‌ర్యట‌క, వ్యాపార‌, ఉపాధి రంగాల‌కు ప్రోత్సాహం ల‌భిస్తుంది.

మిత్రులారా,

ఈ రోజున ఛ‌త్తీస్ గ‌ఢ్ ఒక నూత‌న మైలురాయి ని సాధించింది.  న‌యా రాయ్ పుర్ దేశంలో ఒకటో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా అవ‌త‌రించింది.  దీనికి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ క‌మాండ్ అండ్ కంట్రోల్ సెంట‌ర్ ను ప్రారంభించే అవ‌కాశం నాకు చిక్కింది.  ఇప్పుడు ఈ కేంద్రం నుండే న‌గ‌రానికి అవ‌స‌ర‌మ‌య్యే నీటిని, విద్యుత్తును, వీధి దీపాల‌ను, మురుగునీటి పారుద‌ల‌ను, ర‌వాణాను ప‌ర్య‌వేక్షించ‌వ‌చ్చు.  ఆధునిక సాంకేతిక‌త ఆధారంగా  వీటిని నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంది.  న‌యా రాయ్ పుర్ దేశం లోని ఇత‌ర ఆక‌ర్ష‌ణీయ న‌గ‌రాల‌కు ఉదాహ‌ర‌ణ‌గా నిలవ‌బోతోంది.  గ‌తంలో ఛ‌త్తీస్ గ‌ఢ్ అంటే  గిరిజ‌నులు, అడ‌వుల‌తో కూడిన వెన‌క‌బ‌డిన ప్రాంతంగా గుర్తింపు ఉండేది. ఇప్పుడు ఈ రాష్ట్రం.. ఇక్క‌డి ఆక‌ర్ష‌ణీయ న‌గ‌రం కార‌ణంగా కొత్త గుర్తింపును పొందుతోంది.  ఇది మ‌నంద‌రం గ‌ర్వించ‌ద‌గ్గ విష‌యం.

మిత్రులారా,

మా ప్ర‌తి ప‌థ‌కాన్ని దేశంలో ప్ర‌జ‌ల జీవితాల‌ను భ‌ద్రంగా ఉంచ‌డానికి, ప్ర‌జ‌లు గౌర‌వ‌ప్ర‌ద‌మైన జీవితాల‌ను గ‌డిపేందుకు రూపొందించాము.  గ‌త నాలుగు సంవ‌త్స‌రాలలో ఛ‌త్తీస్ గ‌ఢ్‌తో పాటు దేశం లోని ప‌లు ప్రాంతాలలోని యువ‌త రికార్డు స్థాయిలో ప్ర‌ధాన స్ర‌వంతి లోకి వ‌చ్చి దేశం లోని ప‌లు ప్రాంతాలలో అభివృద్ధి కార్య‌క్ర‌మాలలో పాలు పంచుకోవడానికి ప్ర‌ధాన‌మైన కార‌ణాలలో ఇది కూడా ఒక‌టి.
హింస లేకుండా పోవాలంటే ఒకే ఒక ప‌రిష్కారం ఉంద‌ని నేను న‌మ్ముతున్నాను.  అదే అభివృద్ది, అభివృద్ధి, అభివృద్ధి.  అభివృద్ధి ని సాధించ‌డం ద్వారా పొందిన ప్ర‌జ‌ల న‌మ్మ‌కంతో దేశంలో ఎలాంటి హింస‌నైనా నిర్మూలించ‌వ‌చ్చు.  దేశంలో ఎన్ డిఎ ప్ర‌భుత్వం, ఛ‌త్తీస్ గ‌ఢ్‌లో బిజెపి ప్ర‌భుత్వం అభివృద్ధి ద్వారానే ప్ర‌జ‌ల విశ్వాసాన్ని పొందే వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించాయి.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

నేను క్రితంసారి ఛత్తీస్ గ‌ఢ్‌లో ప‌ర్య‌టించిన‌ప్పుడు దేశ‌వ్యాప్తంగా గ్రామ్ స్వ‌రాజ్ అభియాన్ ను ప్రారంభించ‌డం జ‌రిగింది.  గ‌త రెండు నెల‌లుగా ఈ ప‌థ‌కం ప్ర‌భావం క‌నిపిస్తోంది. దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చిన త‌ర్వాత అభివృద్ధి ప‌రంగా వెన‌క‌బ‌డిన 115 జిల్లాల‌ కోస‌మ‌ని ఈ ప‌థ‌కాన్ని రూపొందించ‌డం జ‌రిగింది. ఇందులో ఛ‌త్తీస్ గ‌ఢ్‌కు చెందిన 12 జిల్లాలు ఉన్నాయి. అభివృద్ధికి సంబంధించిన అన్ని పార్శ్యాల‌ను దృష్టిలో పెట్టుకొని ఈ ప‌థ‌కం లో ప‌నుల‌ను నూత‌నోత్స‌హంతో కొన‌సాగిస్తున్నాము.  గ్రామాలలో ప్ర‌తి ఒక‌రికి బ్యాంకు ఖాతాలు, గ్యాస్ క‌నెక్ష‌న్ లు, ఎల్ ఇడి బ‌ల్బులు ఉండాలి.  అంద‌రూ టీకాలు వేయించుకోవాలి.  అంతే కాదు బీమా సౌక‌ర్యాన్ని క‌లిగి వుండాలి.

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యానికి సంబంధించి గ్రామ్ స్వరాజ్‌ అభియాన్ అనేది అద్భుత‌మైన అంశం.  ఈ ఉద్య‌మం ఛ‌త్తీస్ గ‌ఢ్ అభివృద్ధికి నూతన‌ పార్శ్యాన్ని అందిస్తుంది. న‌మ్మ‌కంతో కూడిన వాతావ‌ర‌ణం ఏర్ప‌డితే పేద‌, గిరిజ‌న వ‌ర్గాల‌కు చెందిన‌ వారు ఊహించ‌ని స్థాయిలో సాధికారితను పొందుతారు.

జ‌న్ ధ‌న్ యోజ‌న కార్య‌క్ర‌మంలో భాగంగా ఛ‌త్తీస్ గ‌ఢ్‌లో ఒక‌ కోటీ 30 ల‌క్ష‌ల మందికి పైగా పేద‌వారి బ్యాంకు ఖాతాలు ఆరంభం అయ్యాయి.  ఈ సంఖ్య కేవ‌లం ఛ‌త్తీస్ గ‌ఢ్‌కు సంబంధించిన‌దే గాని యావత్తు భార‌త‌దేశానిది కాదు.  ప‌లు ప్ర‌భుత్వ ప‌థ‌కాల కార‌ణంగా ఛ‌త్తీస్ గ‌ఢ్ అభివృద్ధి లో నూత‌న అధ్యాయం ప్రారంభ‌మైంది.  37 ల‌క్ష‌లకు పైగా మ‌రుగుదొడ్ల‌ను నిర్మించ‌డం జ‌రిగింది.  22 ల‌క్ష‌ల పేద కుటుంబాల‌కు ఉచితంగా గ్యాస్ క‌నెక్ష‌న్ లను ఇచ్చాం. ముద్రా యోజ‌న లో భాగంగా ఎలాంటి గ్యారంటీ లేకుండానే 26 ల‌క్ష‌ల మందికి రుణాలు ఇవ్వ‌డం జ‌రిగింది.  ఒక్కొక్క రోజుకు 90 పైస‌లు మరియు ఒక్కొక్క నెల కు ఒక రూపాయి ప్రీమియమ్ తో బీమా ప‌థ‌కాలను అమ‌లు చేస్తున్నాం.  అలాగే రాష్ట్రంలోని 13 ల‌క్ష‌ల మందికి పైగా రైతులు ప్ర‌ధాన మంత్రి ఫ‌స‌ల్ బీమా యోజ‌న ప‌ధ‌కం ద్వారా ల‌బ్ధి పొందుతున్నారు.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రంలో 7 ల‌క్ష‌ల కుటుంబాల‌కు విద్యుత్తు క‌నెక్ష‌న్ ఉండేది కాదు.  ప్ర‌ధాన మంత్రి సౌభాగ్య యోజ‌న లో భాగంగా ఛ‌త్తీస్ గ‌ఢ్‌ లోని స‌గం ఇళ్ల‌కు అంటే మూడున్న‌ర ల‌క్ష‌ల గృహాల‌కు విద్యుత్తు సౌక‌ర్యాన్ని ఒక సంవత్సరం లోనే క‌ల్పించాము.  దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చిన త‌రువాత ఇంత‌వ‌ర‌కూ విద్యుత్తు సౌక‌ర్యం లేని 1100 ఇళ్ల‌కు ఇప్పుడు విద్యుత్తు క‌నెక్ష‌న్ ను అందించాము.  ఈ విద్యుత్తు వెలుగులు ఇప్పుడు ప్ర‌తి ఇంటా అభివృద్ధి ని వెలిగిస్తున్నాయి.

మిత్రులారా,

గూడు లేని వారంద‌రికీ ఇళ్లు క‌ట్టించే దిశ‌గా మా ప్ర‌భుత్వం ప‌ని చేస్తోంది.  గ‌త నాలుగు సంవ‌త్స‌రాలలో గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాలలో ఒక కోటి 15ల‌క్ష‌ల‌కు పైగా గృహాల‌ను నిర్మించి ఇవ్వ‌డం జ‌రిగింది.  గ‌త ప్ర‌భుత్వాలు ప్రారంభించి మ‌ధ్య‌లోనే ఆపేసిన ఇళ్ల‌ను ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న లో పూర్తి చేయ‌డం జ‌రిగింది.  ఛ‌త్తీస్ గ‌ఢ్‌లో ఇప్ప‌టికే 6 ల‌క్ష‌ల ఇళ్ల‌ను నిర్మించ‌డమైంది.  ఛత్తీస్ గ‌ఢ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ లతో పాటు దేశంలోని ఇత‌ర ప్రాంతాల మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారి కోసం నేను ఒక ప్ర‌క‌ట‌నను చేయాల‌ని అనుకుంటున్నాను.  ఎందుకంటే మేము మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి ల‌బ్ధి చేకూర్చ‌డానికిగాను ఒక కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకున్నాము.  మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారి కోసం నిర్మించిన ఇళ్ల విష‌యంలో గ‌తంలో వ‌డ్డీరేట్ల‌ను స‌డ‌లించ‌డం జ‌రిగింది.  కానీ ఇంటి నిర్మాణ స్థ‌లం చాలా త‌క్కువ‌గా ఉండేది.  ఈ వైశాల్యాన్ని పెంచాల‌నే డిమాండ్ ఉంది.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

ప్ర‌జ‌ల డిమాండ్‌ను నెర‌వేర్చ‌డానికి ప్ర‌భుత్వం ముందుకు వచ్చింది.  ఎక్కువ వైశాల్యంలో గృహాల‌ను నిర్మించుకున్న‌ వారికి కూడా వ‌డ్డీ రేట్ల స‌డ‌లింపు వ‌ర్తిస్తుంది.  ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యం మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి వెంట‌నే ల‌బ్ధిని చేకూర్చుతుంది.  కేంద్ర ప్రభుత్వ పథకాల, రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌థకాల ల‌బ్ధిదారులకు చెక్కులను, స‌ర్టిఫికెట్లను అంద‌జేసే అవ‌కాశం ఈ రోజు నాకు ల‌భించింది.  ప్ర‌ధాన‌ మంత్రి మాతృ వంద‌న యోజ‌న‌, ఉజ్వ‌ల యోజ‌న‌, ముద్రా యోజ‌న‌, స్టాండ‌ప్ ఇండియా, ఇంకా బీమా ప‌థ‌కాల ల‌బ్ధి దారులకు వీటిని అంద‌జేయ‌డం జ‌రిగింది.  ల‌బ్ధిదారులంద‌రికీ నా శుభాకాంక్ష‌లు.  వారి భ‌విష్య‌త్తు బాగా ఉండాల‌ని ఆ ఈశ్వరుడిని  ప్రార్థిస్తున్నాను.

మిత్రులారా,

ఇవి ప‌థ‌కాలు మాత్ర‌మే కాదు. స‌మాజం లోని పేద‌ల, ఆదివాసీల, అణ‌గారిన వ‌ర్గాల‌ వ‌ర్త‌మానాన్ని, భ‌విష్య‌త్తు ను వెలిగించే కార్య‌క్ర‌మాలు.  ఆదివాసీలు, వెనుక‌బ‌డిన ప్రాంతాలలో నివ‌సించే ప్ర‌జ‌ల ఆదాయాల‌ను పెంచ‌డానికిగాను మా ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా శ్రద్ధ వహించింది.  రెండు నెల‌ల‌ క్రితం బీజాపూర్ లో నేను వ‌న్ ధ‌న్ యోజ‌నను ప్రారంభించాను.  ఇందుకోసం వ‌న్ ధ‌న్ వికాస కేంద్రాల‌ను ప్రారంభిస్తున్నాము.  వీటి ద్వారా అట‌వీ ఉత్ప‌త్తుల‌కు మార్కెట్ లో స‌రైన ధ‌ర ల‌భించేలా చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం జ‌రుగుతుంది.

22 వేల గ్రామీణ మార్కెట్ల‌ను అభివృద్ధి చేస్తామ‌ని ఈ ఏడాది బ‌డ్జెటులో ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.  ఒకటో ద‌శ‌ లో 5వేల మార్కెట్లు లేదా హాట్స్‌ ను అభివృద్ధి చేయ‌డం జ‌రుగుతుంది.  ఇందుకుగాను ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌డుతోంది.  త‌ద్వారా నా గిరిజ‌న సోద‌రులు, రైతులు త‌మ‌కు ఐదారు కిలోమీట‌ర్ల దూరం లోనే ఏర్పాటు చేసిన సాంకేతిక సౌక‌ర్యాల‌ ద్వారా దేశం లోని ఏ మార్కెట్ నైనా చేరుకోగ‌లుగుతారు.
ఆదివాసీ ప్ర‌జ‌ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అట‌వీ హ‌క్కుల చ‌ట్టాన్ని మ‌రింత క‌ఠినమైన రీతిలో అమ‌లు చేస్తాము.  గ‌త నాలుగు సంవత్సరాలలో 20 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు పైగా ప‌ట్టాల‌ను ఒక ల‌క్ష‌ గిరిజ‌న ప్ర‌జ‌ల‌కు, గిరిజ‌న సంఘాల‌కు ఇవ్వ‌డమైంది.  వెదురుకు సంబంధించిన చ‌ట్టంలో స‌వ‌ర‌ణ‌లను తీసుకువచ్చాము.  మీరు ఇప్పుడు మీ పొలాల్లో పండించిన వెదురు పంట‌ను చాలా సులువుగా అమ్ముకోవ‌చ్చు.  ఈ చ‌ట్టంకార‌ణంగా అడ‌వుల్లో నివ‌సిస్తున్న‌వారి ఆదాయాలు పెరుగుతాయి.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

ఆదివాసీ ప్ర‌జ‌ల విద్య‌ను, ఆత్మ‌గౌర‌వాన్ని దృష్టిలో పెట్టుకొని మా ప్ర‌భుత్వం ప‌ని చేస్తోంది.  ఆదివాసీ చిన్నారుల విద్య స్థాయి ని పెంచ‌డానికిగాను ఏక‌ల‌వ్య మోడ‌ల్ రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌లను దేశ‌వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నాము.

ఏదైనా ప్రాంతంలోని జ‌నాభా లో ఆదివాసీల జ‌నాభా యాభై శాతాని కంటే ఎక్కువ ఉన్నా, లేదా ఒక ప్రాంతంలో 20 వేల‌ మంది ఆదివాసీలు జీవిస్తున్నా అక్క‌డ ఏక‌ల‌వ్య మోడ‌ల్ రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌లను ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంది.

అంతేకాదు, గిరిజ‌నుల‌కు సంబంధించి ఒక నూత‌న చైత‌న్య‌పూరిత కార్య‌క్ర‌మాన్ని మొద‌లుపెట్టాము.  1857 నుండి దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చే వ‌ర‌కు స్వాతంత్ర్యం కోసం గిరిజ‌నులు చేసిన పోరాటం పైన ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డం జ‌రుగుతుంది.  గొప్ప గొప్ప ఆదివాసీ స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల‌ను స్మ‌రించుకోవ‌డానికి వీలుగా ఆయా రాష్ట్రాలలో వస్తు ప్రదర్వన శాలలను ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతోంది.

ఈ ప‌థ‌కాల‌న్నీ ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్ర ఆర్ధిక‌, సామాజిక మౌలిక సౌక‌ర్యాల‌ను అధికం చేస్తాయి.  త‌ద్వారా బ‌స్త‌ర్‌ నుంబొ స‌ర్ గుజా దాకా రాయ్ గ‌ఢ్‌ నుండి రాజ్‌నంద్ గ్రామం దాకా ఆర్ధిక‌, సామాజిక అభివృద్ధి స‌మానంగా జ‌రుగుతుంది.  రాష్ట్రంలో ప్రాంతీయ అస‌మాన‌త‌ల‌ను రూపుమాప‌డానికిగాను చేప‌ట్టిన ఉద్య‌మం చాలా వేగంగా ముగుస్తుంది.

ఈ రోజ‌ను భిలాయి క‌ర్మాగారం వెళ్లే మార్గంలో ఛత్తీస్ గ‌ఢ్ ప్ర‌జ‌లు నాకు ప‌లికిన ఘ‌న స్వాగ‌తం, గౌర‌వ మ‌ర్యాద‌లను చూసి నాకు నోట మాట రాలేదు.  దేశమంతా ఛ‌త్తీస్ గ‌ఢ్ వీధుల్లోనే గుమికూడింద‌న్న‌ట్టుగా అనిపించింది.  దేశం లోని ప్ర‌తి మారుమూల ప్రాంతంలోను ప్ర‌జ‌లు నాకు ఆశీర్వాదాలు అందిస్తున్నారు.  ఇక్క‌డ బుల్లి భారతదేశంలో ఉన్న‌ట్టు అనిపిస్తోంది.  భిలాయిలో, దుర్గ్ లో స్థిర‌ప‌డిన ప్ర‌జ‌ల‌కు నిజంగా నేను కృత‌జ్ఞ‌ుడిని.  దేశం లోని ప‌లు ప్రాంతాల‌ నుండి వ‌చ్చిన వారు ఆయా రాష్ట్రాల సంప్ర‌దాయాల ప్ర‌కారం నాకు ఆశీర్వాదాలు తెలిపారు.  వారు వారి దేశ ఐక్య‌త‌కు ప్రతిరూపంగా నిలచారు.  నేను ఎప్పుడు ఛ‌త్తీస్ గ‌ఢ్‌కు వ‌చ్చినా ఇక్క‌డ ఏదో ఒక కొత్త నిర్మాణ ప‌ని జ‌రుగుతూనే ఉంటుంది.  ప్ర‌తి సారీ ఈ రాష్ట్రం త‌న‌కంటూ ఒక కొత్త ల‌క్ష్యాన్ని ఏర్ప‌రుచుకుంటూనే ఉంది.  కాబ‌ట్టి ఇక్క‌డ అభివృద్ధి ఎంతో వేగంగా జ‌రుగుతున్న‌ట్టే.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

నవీన ఛ‌త్తీస్ గ‌ఢ్ 2022లో న్యూ ఇండియా కు మార్గాన్ని చూపుతుంద‌ని నేను న‌మ్ముతున్నాను.  మీ ఆశీర్వాదాల‌తో ఓ న్యూ ఇండియా కోసం చేసిన తీర్మానం విజ‌య‌వంత‌ం తప్పక నెరవేరుతుంది.  ఈ ఆశాభావంతో, అంచ‌నాల‌తో మీ అంద‌రినీ, ఛ‌త్తీస్ గ‌ఢ్ ప్ర‌భుత్వాన్ని అభినందిస్తున్నాను.  నేను ఇక్క‌డితో నా ఉప‌న్యాసాన్ని ముగిస్తాను.

అనేకానేక ధన్యవాదాలు.

**